ఇరవై నాలుగ్గంటల్లోగా భూమిమీద నుంచి ఒక అంతరిక్షనౌక బయల్దేరే ఏర్పాట్లు జరిగాయి. ఆ నౌక ముందు అంతరిక్ష నగరంవైపు వెళ్తుంది. అక్కడ జరిగిన విధ్వంసకాండ పరిశీలిస్తుంది. అక్కడి నుంచే ఆ గాలి పళ్ళెంలో వున్న మాయాస్ తో సంబంధాలు పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది వీలుకాని పక్షంలో డైరెక్టుగా ఆ 'పళ్ళెం' దగ్గరకు వెళ్తుంది.
ఈ అంతరిక్ష నౌకలో ముగ్గురు వెళ్తారు.
అందులో యశ్వంత్ ఒకరు.
మొత్తం వెళ్ళి రావటానికి పదిహేను రోజులు పడుతుంది.
ఈ విధంగా నిర్ణయం జరిగాక,చకచకా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఆ మరుసటి రోజు అనుకున్న విధంగా నౌక బయల్దేరి అంతరిక్ష నగరంవేపు సాగిపోయింది.
6
అనూహ్య మనస్థితి అల్లకల్లోలంగా వుంది. ఒకవేపు వాయుపుత్ర కనుక్కున్న విషయానికీ, ఆ విషయాన్ని డీ - కోడ్ చేయటంలో అతడు చూపించిన తెలివితేటలకీ అతడికి పత్రికలు బ్రహ్మరథం పడుతున్నాయి. రాబోయే ప్రమాదం గురించి సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దానికన్నా ఎక్కువగా గ్రహాంతర వాసులున్నారన్న విషయం, ఎగిరే గాలిపళ్ళెం కనపడిందన్న విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది.
కాస్త శాస్త్ర పరిజ్ఞానం వున్నవారు కూడా, సూర్యశక్తి కొల్లగొట్టబడే విషయానికి అంత విలువ ఇవ్వలేదు. అయిదు వందల కోట్ల సంవత్సరాలకి సరిపోయే శక్తి సూర్యుడివద్ద వుంది. అందులో కాస్త ఎవరో తీసుకుంటే వచ్చే నష్టంలేదు.
ఈ విధంగా సాగినాయి వారి ఆలోచనలు. కేవలం పై లెవల్లోవున్న కొంతమందికి మాత్రమె ఏదో ప్రమాదం పొంచివున్న దన్న అనుమానం కలుగుతూంది.
ఆరోజు వాయుపుత్రకి అభినందన సభ జరిగింది. అనూహ్య మొదటి వరుసలో కూర్చుంది. ఎవరికీ కనిపించని విధంగా ఆమెకి కన్నుకొట్టి అతడు తన ఉపన్యాసం మొదలుపెట్టాడు.
చాలా అద్భుతమైన ఉపన్యాసం అది. అనూహ్య ముందుకు వంగి శ్రద్ధగా వింటూంది. ఆమెకి ఆశ్చర్యంగా వుంది. తన దగ్గర అంత అల్లరి చేసే శాస్త్రజ్ఞుడేనా ఇతడు అన్నంత గొప్పగా ఇస్తున్నాడా ఉపన్యాసం. ఏ విధమైన సంకేతాన్నైనా మాధ్ మాటిక్స్ లోకి ఎలా అనువదించవచ్చో అతడు వివరిస్తున్నాడు.
"ఐసోటోప్-5 ద్వారా ఈ విషయాన్ని కనుక్కోవచ్చనే సంగతి నాకు సూచించిన వ్యక్తి ఒకరున్నారు. అతడి పేరు.....యశ్వంత్."
వింటూన్న అనూహ్య ఉలిక్కిపడింది.
యశ్వంత్ ..... యశ్వంత్ .... యశ్వంత్......
వాయుపుత్ర చెప్పుకుపోతున్నాడు. "యశ్వంత్ అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ నాకీ సూచన ఇవ్వకపోయివుంటే నేనెప్పటికీ ఈ విషయాన్ని కనుక్కోగలిగి వుండేవాణ్ణి కాదు. సూర్యశక్తి, మాయాస్, విచ్చిన్నం..... లాటి పదాల్ని ఈ సంకేతాల్లో ఇమడ్చమని చెప్పింది కూడా అతడే. ఈ ఖ్యాతి అంతా అతడికే దక్కాలి. ఇప్పుడతను ఇక్కడలేడు. మాయాస్ విషయం కనుక్కోవటానికి మనకి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో అంతరిక్ష నగరంవైపు ప్రయాణం చేస్తున్నాడు......"
ఆమె వినటంలేదు. నిర్మలమైన సాగరంలో తుఫాను చెలరేగినట్టుంది ఆమె మనసు. యశ్వంత్ ఇక్కడికి వచ్చాడు! వాయుపుత్రా అతడూ మాట్లాడుకున్నారు!!
నాల్గు రోజుల క్రితం సంఘటన ఆమె మనసులో తళుక్కున మెరిసింది. వాయుపుత్ర గుండెనొప్పి నాటకంతో పడిపోయినప్పుడు తను అతడి మీదకు వంగింది. అప్పుడో వ్యక్తి గుమ్మం దగ్గరకు రాగానే తను కంప్యూటర్ వెనక్కు పరుగెత్తింది. ఆ వ్యక్తి వాయుపుత్రని సున్నితంగా మందలించాడు.
ఆ కంఠం.....
యశ్వంత్ ది!!
అవును. ఇప్పుడు బాగా గుర్తొస్తుంది. యశ్వంతే!
అతను తనని చూశాడా?
ఆమె మనసు వికలమైంది. ఎవరినైతే మర్చిపోదామని ఆమె శతవిధాలా ప్రయత్నం చేస్తుందో, ఎవరినైతే కలుసుకోకూడదని ఒకవేపు, కలుసుకోవాలని మరొకవైపు పరస్పర విరుద్ధ భావాలతో ఆమె ఇంతకాలం కొట్టుమిట్టులాడిందో అతడు తన సామీప్యానికి వచ్చాడు. వచ్చి వెళ్ళిపోయాడు.
ఆమెకి మానసిక శాస్త్ర నిపుణుడు చెప్పిన మాటలు గుర్తొచ్చినయ్. తనను తాను కూడగట్టుకోవాలి.
ఆమె అక్కణ్ణుంచి లేచిపోయింది. ఉత్సాహంగా ఉపన్యసిస్తూన్న వాయుపుత్ర ఆమె అలా లేచిపోవటంతో అవక్కాయి చూశాడు. ఆమె ప్రవర్తన అతడికి అర్థంకాలేదు. క్షణంపాటు ఉపన్యాసం ఆపి తిరిగి కొనసాగించాడు.
సరిగ్గా ఇక్కడ ఇది జరుగుతున్న సమయానికి, అక్కడ గ్రౌండ్ బేస్ లో నిపుణులు ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతరిక్ష నగరం వైపు వెళ్తున్న నౌకలో, ఎవరో ద్రోహం చేసినట్టు ప్రమాదం జరిగింది.
అంతలో కంప్యూటర్ హెచ్చరిక వినిపించింది. "అయిదు నిముషాల్లో రాకెట్ పేలిపోతూంది. వెకేట్....వెకేట్ వెకేట్ వెకేట్...." అన్న పదాల మీద లైట్ వెలుగుతూంది.
యశ్వంత్ కి మతిపోయింది. అంతరిక్షంలో.....శూన్యంలో-ఖాళీ చేయమంటే ఎక్కడికని వెళ్ళటం- అసలేం జరిగింది? భార రహితస్థితిలో వున్న శరీరాలు అంత వేగంగా అటూ ఇటూ ఎలా వెళ్ళినయ్? అడుగు భాగాన ఉన్న కృత్రిమ ఆకర్షణ గోడలకీ పై కప్పుకీ అంతవేగంగా ఎలా పాకింది? ఆలోచించడానికి వ్యవధి లేదు.
రాకెట్ నుంచి బయటపడాలి. పడీ?
...... అతడికి రాయ్ గుర్తొచ్చాడు. అతడిలా శూన్యంలో కొంతకాలం పరిభ్రమించి, ప్రాణవాయువుని అంతరిక్షంలో కలిపేసుకోవాలా? అంతకన్నా వేరే మార్గంలేదు. రాకెట్ లో పేలిపోవటం మంచిదా? అంతరిక్షంలో తిరుగుతూ, భూమినీ చందమామనీ నక్షత్రాల్నీ చూస్తూ నెమ్మదిగా ప్రాణాలువదలటం మంచిదా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి?
రెండోదే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు అతడు. గ్రౌండ్ కంట్రోల్ కి ఫోన్ చేసి, "రాకెట్ ని వదిలేస్తున్నాను" అని చెప్పాడు. చంద్రుడి పక్కనుంచి వెళ్తోంది.
భూమినుంచి ఇంజనీర్ స్వరం భారంగా వినిపించింది. 'వియ్ ఆర్ సారీ '
"ఇట్సాల్ రైట్-"
కంప్యూటర్ మీద ఎర్ర అక్షరాలు..... వెకేట్ - వెకేట్-వెకేట్ ....అతడు ఎయిర్ లాక్ రిలీజ్ చేశాడు.
భూమ్మీద కొన్ని కోట్ల మంది టీ.వి.ల్లో తన మరణాన్ని చూస్తూ వుంటారని అతడికి తెలుసు.
అనూహ్య కూడా చూస్తూ వుంటుందా?
అతడు లేచాడు.
* * *
మరణాన్ని ముందుగా తెలుసుకున్న వాళ్ళు కొద్దిమందే వుంటారు. వాళ్ళు యోగులైనా కావచ్చు. ఉరిశిక్ష పడిన ఖైదీలైనా కావచ్చు. ఇప్పుడా లిస్టులోకి రోదసీ యాత్రికులు కూడా చేరారు. ఉరిశిక్ష పడిన ఖైదీలైనా కావచ్చు. ఇప్పుడా లిస్టులోకి రోదసీ యాత్రికులు కూడా చేరారు ఉరిశిక్ష పడిన వారికైనా చివరి క్షణంలో రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష లభించవచ్చునేమోగానీ, భూమికి లక్షమైళ్ళ దూరంలో రాకెట్ పేలిపోతే ఏ శక్తి రక్షించగలదు?
కంప్యూటర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయింది. 275 సెకన్లు. దాదాపు. నాలుగున్నర నిమిషాలు.
అతడికి భయం వెయ్యలేదు. ఒక రకమైన స్తబ్దత ఆవరించింది. ఎలాగూ మరణం ఖాయమని తెలిసినప్పుడు భయం వెయ్యదు అంతకన్నా అతీతమైన భావం ఏదో కలుగుతుంది.
ఈ లోపులో లాంచ్ కంట్రోలర్ స్వరం వినిపించింది. "హలో.....హలో."
యశ్వంత్ 'హలో' అని జవాబిచ్చాడు. రాకెట్ పేలిపోవటానికి ఇంకా 240 సెకన్లు వుంది.
"....సారీ యశ్వంత్."
"ఆ మాట నిముషం క్రితం చెప్పినట్టు గుర్తు."
"మేము......ఐమీన్....నీకేమయినా కావాలంటే-"
యశ్వంత్ నవ్వి, "ఉరికి ముందు కూడా ఇలా ఆఖరి కోరిక అడుగుతారు" అన్నాడు.
"ఎగతాళి వద్దు మిస్టర్ యశ్వంత్-"
"నా కొకటే కోరిక."
"ఏమిటి?"
"ఉన్నట్టుండి ఈ అంతరిక్ష నౌక ఎందుకిలా అయింది? ఆ విషయం ఒక్కటే తెలుసుకోవాలనుకుంటున్నాను.'
'సారీ యశ్వంత్. మేము ఇంకా చూస్తునే వున్నాము. కారణం దొరకలేదు' అని ఆగి- "నువ్వెవరితోనైనా మాట్లాడదల్చుకుంటే కనెక్షన్ ఇస్తాను" అన్నాడు.
"నా చివరి క్షణాల్లో అంత ఆఖరిసారి మాట్లాడాలనుకునే వాళ్ళు నా జీవితంలో ఎవరూ లేరు-" అనుకున్నాడు మనసులో. కానీ అంతలోనే మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
అనూహ్య!
తన ఒకప్పటి భార్య! ఇప్పటికీ తన ఆలోచన్లలో సజీవంగా నిలిచిపోయిన మూర్తి! చివరిసారి ఆమెతో మాట్లాడగల్గితే....
అతడింకా పునరాలోచించలేదు. ఆలోచించటానికి సమయం కూడా ఎక్కువలేదు. 200 సెకన్లు కౌంట్ చూపిస్తూంది.
"అనూహ్య అని బయోకెమిస్ట్ వుండాలి. ఆమె ఎక్కడుందో నాకు తెలీదు. వీలైతే. ఆమెతో మాట్లాడగల్గితే...." అర్థోక్తిగా ఆపుచేశాడు-ఆనందంగా మరణిస్తాను- అన్న మాటలు పూర్తిచేయకుండా.
"సైన్స్ సిటీలోగానీ ఆమె వున్న పక్షంలో నీ కోరిక నెరవేరే ఛాన్స్ వుంది యశ్వంత్." కంట్రోలర్ చేతులు వేగంగా టెర్మినల్స్ ని వెతికినయ్. రెండు సెకన్లలో "అనూహ్య-బయోకెమిస్ట్" అన్న పదాలు వెలుగులోకి వచ్చాయి.
అనూహ్య ఫోన్ తీసుకుని "హల్లో" అంది. ఇట్నుంచి లాంచ్ కంట్రోలర్ స్వరం వినిపించింది -చాలా తక్కువ వాక్యాల్లో, సమయం వృధా పర్చకుండా "మిస్ అనూహ్యా! అంతరిక్ష నౌకనుంచి యశ్వంత్ అనే వ్యోమగామి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నౌక పేలిపోవటానికి మూడు నిముషాల వ్యవధి వుంది. క్విక్-" అని చివర్లో"2 సెకన్ల కాలపు దూరాన్ని గుర్తుంచుకోండి." అని పూర్తిచేశాడు.
(భూమినుంచి బయల్దేరిన ధ్వని తరంగాలు అంతరిక్ష నౌకని చేరుకోవటానికి రెండు సెకన్ల కాలం పడుతుంది. అందువల్ల ఇక్కడినుంచి ఎవరైనా అక్కడున్న వారితో మాట్లాడాలంటే ఈవ్యవధి ఇస్తూ జవాబు ఆశించాలి.)
తను వింటున్నది అనూహ్యకి క్షణంపాటు అర్థంకాలేదు. యశ్వంత్ పేరు వినగానే ఆమె మనసంతా ఐస్ లో పెట్టినట్టు అయిపోయింది. అప్పుడే ఆమె వాయుపుత్ర ఉపన్యాసం వింటూ, అందులో యశ్వంత్ ప్రసక్తి రావడంతో మనసు వికలమై మధ్యలో లేచి వచ్చింది. మీటింగ్ హాల్ నుంచి రాగానే ఈ వార్త.....ఆమె ఫోన్ అందుకోబోతూ వుంటే పక్కనున్న వేదప్రియ, "అంతరిక్షంలోకి బయలుదేరిన నౌక ప్రమాదంలో ఇరుక్కుంది. జెట్టీసన్ జరుగుతూంది" అని చెప్పింది, (నౌకతో పాటు పేలిపోవటం ఇష్టంలేని వ్యోమగాములు అంతరిక్షంలోకి దిగి, అక్కడ మరణించడాన్ని జెట్టీసన్ అంటారు) ఆమె 'పాపం' అనుకుంది. అంతలోనే ఈ వార్త....యశ్వంతే ఆ వ్యోమగామి అని. షాక్....
ఒకేసారి రెండు వార్తలు.....
ఇన్నేళ్ళ తరువాత అతడి కంఠం.