Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 8


    గిగావాట్.....ఇంకో నిముషంలో భూకక్షలోకి వెళ్ళకపోతే ఇంధనం సరిపోదు అని హెచ్చరిస్తోంది.

    రాయ్ అతడివైపు అయోమయంగా చూసి, "ఇటుకాదు మనం వెళ్ళాల్సింది" భూమివైపు చూపిస్తూ నిఖిల్, "అటు.....అటు వెళ్ళాలి" అన్నాడు.

    రాయ్ భూగోళంవైపు చూస్తూ "అదేమిటి సార్, సూర్యుడువైపు వెళ్దాం అంటారు" మీకేమైనా మతిపోయిందా అన్నట్టు అడిగాడు. వాళ్ళిద్దరి వాలకం చూస్తూంటే నిఖిల్ కి నిజంగానే మతిపోయేట్టు వుంది. యస్పీయస్ మాత్రం  వేగంగా  ఆ ప్లయింగ్ సాసర్ వైపు వెళ్ళిపోతూ భూమికి దూరంగా సాగిపోతోంది.

    గిగావాట్ ఇండికేటర్- ఇంకో నలభై అయిదు సెకన్లు మాత్రమే అన్నట్టు హెచ్చరించింది. ఎర్రలైటు వెలిగి ఆరుతోంది. వార్నింగ్ వినిపిస్తూంది. నిఖిల్ కి ఏ  చెయ్యాలో తోచలేదు.

    అతడు చప్పున ముందుకు వెళ్ళి రాయ్ పక్కనుంచి చెయ్యిసాచి, వాహనం దిశ మార్చబోయాడు. రాయ్ కోపాన్ని  అణచుకుంటూ- "మీరేం చేస్తున్నారో మీకు అర్థమావుతూందా?" అన్నాడు నిఖిల్ చెయ్యి బలవంతంగా పక్కకి తోయటానికి ప్రయత్నం చేస్తూ.

    "అర్థమవ్వాల్సింది నాకు కాదు, మీకు.....ఎటు తీసుకెళ్తున్నారో మీకేమైనా తెలుస్తోందా?" ఆ వాహనపు లోపలి గదులు పగిలిపోయేలా అరిచాడు నిఖిల్ వాళ్ళు అతడి మాటలు పట్టించుకోలేదు. అతడు పిచ్చివాడిలా చూశాడు. తను భ్రమలో వున్నాడో, వాళ్ళు భ్రమ పడుతున్నారో అర్థంకాలేదు.

    ఆపద ముంచుకొచ్చినపుడు మనిషి అనాలోచితంగా కొన్ని పనులు చేస్తాడు. అలాగే నిఖిల్ ఒక నిర్ణయానికొచ్చాడు. రెండో పైలెట్ మెడమీద చేతిని బాకులా  మార్చి బలంగా కొట్టాడు. సన్నని మూలుగుతో అతడు ముందుకు వంగిపోయాడు. ఇది చూసి రాయ్  అరిచాడు- "నీకేమైనా మతిపోయిందా?"

    నిఖిల్ ఆ మాటలు వినలేదు. ఇంకోలా చెప్పాలంటే అతడికి వినపడలేదు రాయ్  స్పేస్ సూట్ లోపల్నుంచి అరుస్తున్నాడు. ఈ లోపులో నిఖిల్ లేసర్ తుపాకీ తీసుకుని రాయ్ వైపు గురిపెట్టాడు.

    "ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? యూ పూల్" రాయ్  అరిచాడు.  నిఖిల్ తుపాకీ గురిపెట్టివుంచే అతడిని శూన్యపు గదిలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్తున్నంతసేపు రాయ్  తిడుతూనే వున్నాడు.
   
    "అతిధిగా నిన్ను మాతోపాటు తీసుకొస్తే మాకే ద్రోహం తలపెడ్తావా? భూమివైపు వెళ్ళనివ్వకుండా ఈ వాహనాన్ని ఇంకెటో తిప్పుతావా? నువ్వెవరి ఏజంట్ వి. ఇలా మా ప్రాణాలు తీయటం అన్యాయం?"

    నిఖిల్ తిరిగి మొదటి గదిలోకి వచ్చాడు. టైమ్ ఎక్కువ లేదు. అప్పటికే ప్రమాదస్థాయి దాటి మరో పది సెకన్లు అయిపోయాయి. నిఖిల్ చకచకా వాహనం దిశ మార్చాడు. అంత వేగంతో వాతావరణంలోకి ప్రవేశించటం ప్రమాదకరం. రాపిడికి మొత్తం వాహనమే అంటుకుని తగలబడవచ్చు. కానీ ప్రవేశించకపోతే మొదటికే ప్రమాదం వస్తుంది. అతడికి తెలుసు. పక్కనున్న పైలెట్ ఇంకా  స్పృహతప్పి అలాగే పడివున్నాడు.

    నిఖిల్ మరోసారి భూమితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. కాంటాక్ట్ రాలేదు. ఇంధనం ముల్లు క్రమంగా దిగిపోతూ వుంది అతడింకా అయోమయం నుంచి పూర్తిగా తేరుకోలేదు. తను భ్రమలో వున్నాడు అనుకుందామంటే దూరంగా భూమి నారింజ పండు రంగులో కనబడుతూనే వుంది. దాన్ని చూసి అది భూమి కాదని వాళ్ళిద్దరూ ఎందుకనుకుంటున్నారో  అతనికి అర్థం కాలేదు.

    ఇక తను చేసేదేమీ లేదు. వాహనం ప్రమాదం లేకుండా భూమి కక్ష్యలోకి ప్రవేశిస్తే తను  బ్రతుకుతాడు. లేకపోతే లేదంటే. ఆ నిశ్శబ్దాన్ని భరింపలేక కంప్యూటర్ తో సంభాషించాడు.

    "హలో..."

    "హలో..."

    "హౌ ఆర్ యు నిఖిల్"

    "నిజంగానే భూమివైపే వెళ్తున్నామా?" నిఖిల్ అడిగాడు.

    "భూమివైపా? కాదే"

    నిఖిల్ అదిరిపడ్డాడు. అంత చల్లటి వాతావరణంలోనూ మొహమంతా చెమట పట్టింది. వణికే కాళ్ళతో తడబడుతూ కంప్యూటర్ దగ్గిరకి వెళ్ళాడు. "ఏ_ఏమిటి నువ్వు చెప్తున్నది? ఎటువైపు వెళ్తుంది?"

    "సూర్యుడివైపు. నువ్వే కదా వాహనాన్ని ఇటు తిప్పావు?"

    "నో.....నో...నో.." గట్టిగా అరిచాడు. కంప్యూటర్ చెప్పేది నిజమైతే తనే ఏదో భ్రమకు లోనయ్యాడు. మిగతా ఇద్దరినీ అపార్థం చేసుకొని ఒకరికి స్పృహ తప్పించి, మరొకరిని వాక్యూమ్ ఛేంబర్ లోకి తోసేసి తను స్వయంగా వాహనాన్ని మంటలవైపు తీసువెళ్తున్నాడు. తనకి మతిభ్రమించింది. తనేం చేస్తున్నాడో తనకే తెలియటంలేదు. తనకి నారింజపండు రంగులో కనబడుతున్నది సూర్యుడా. తన  కళ్ళే తనని మోసం చేస్తున్నాయా? అతడు కంప్యూటర్ ని తిరిగి ప్రశ్నించబోతూ వుండగా 'రిలీజ్' బటన్ దగ్గర ఎర్రలైటు వెలిగింది.

    వాహనం తలుపు  తె.....ర.....వ....బ....డు....తోం.....ది......... "ఏమిటిది ఏమి జరుగుతోంది?" అతడు కంగారుగా అనుకున్నాడు. ఎవరో వాక్యూమ్ ఛేంబర్  తలుపు తెరుస్తున్నారు. "ఎ.... ఎవరు?"

    నిఖిల్ కి పిచ్చెక్కుతోంది. అన్ని వైపులనుంచి ఇన్ని వత్తిడులను అతడు తట్టుకోలేకపోతున్నాడు. యశ్వంత్ వేరు. అతడు ఏ పరిస్థితుల్లోను తొణకడు. నిఖిల్ కి. అంత దిటవులేదు. ముఖ్యంగా తను మరణించబోతున్నాననే భయంకన్నా. తన పొరపాటువల్ల మిగతా యిద్దరినీ బలి చేస్తున్నాననే దిగులు ఎక్కువయింది. ఒకవేళ  తనది  పొరపాటయితే, ఈ వాహనపు కంట్రోల్ ని తిరిగి రాయ్ కి అప్పగిద్దామనే ఉద్దేశ్యంతో అతడు వాక్యూమ్ ఛాంబర్ వైపు వెళ్ళబోయాడు. చిన్న చప్పుడుతో  అది 'బ్లాక్' అయింది.

    ఎవరో కొట్టినట్లు నిఖిల్ స్థాణువై నిలబడిపోయాడు. ఈ గది తలుపు తాళం పడిందంటే, వాహనం నుంచి ఎవరో బయటికి వెళ్ళిపోవటానికి ఆయత్తమవుతున్నారు. బయట శూన్యం నిస్తేజంగా వుంది. గంటకి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో వాహనం సాగిపోతున్నా ప్రక్కన ప్రామాణికం లేదు కాబట్టి ఆ విషయం తెలియడంలేదు.

    "రాయ్..... రాయ్...." నిఖిల్ కంఠం రుద్ధమైంది. "నేను  పొరపాటు చేశాను. రాయ్ వెళ్ళిపోకు. తలుపు మూసెయ్యి! వద్దు రాయ్. నువ్వొక  ఉపగ్రహంగా మారిపోతావు. వాహనాన్ని వదిలి పెట్టకు. నువ్వు  భూమిని చేరుకోవాలి" ఎంత అరిచినా అతడికి వినపడదని తెలిసీ నిఖిల్ మైక్ లో అరుస్తున్నాడు. అంతలో  లైట్ ఆరిపోయింది. రాయ్ వాహనాన్ని వదలి శూన్యం లోకి అడుగుపెట్టాడు. వాహనం నుంచి విదివడగానే అతడు కూడా  ఆ వేగానికి దానితోపాటు కొంతదూరం ప్రయాణంచేసి, వేగంలో వచ్చిన తేడావల్ల దానికి దూరమయ్యాడు.

    న్యూటన్ చలన సూత్రాన్ననుసరించి, ఏ విధమైన అడ్డు (ఫిక్షన్) లేకపోవటంవల్ల అతడు ఆ శూన్యంలో తిరుగుతూనే వుంటాడు. ఏదైనా అయస్కాంత క్షేత్రంలో ప్రవేశించేవరకు అలా పరిభ్రమించి తరువాత బూడిదగా మారిపోతాడు. ఈ లోపులో ఆక్సజన్ అయిపోతే దానికి ముందే మరణిస్తాడు. అతడిలా ఎందుకు చేశాడు అని ఆలోచించటం లేదు నిఖిల్. ప్రాణాలు ఎలాగూ పోయేటప్పుడు వాక్యూమ్ ఛాంబర్ లో చేతులు ముడుచుకు చావటం కన్నా బయటపడి ఏదో విధంగా ఆఖరి అవకాశం కోసం వెతుక్కోవటం మంచిదని భావించి వుంటాడు రాయ్.

    కంటికి అడ్డుపడిన నీటిపోరాగుండా అతడు టి.వి. వైపు చూశాడు. తెల్లటి కాగితంమీద సన్నటి చుక్కలా కనిపిస్తున్నాడురాయ్. దూరం ఎక్కువయ్యేకొద్దీ అతడు మరింత చిన్నగా గోచరం అవుతున్నాడు. క్రమక్రమంగా తెరమీదనుంచి అతడి ఆకారం అదృశ్యమయింది. నిఖిల్ తన జుట్టులో వేళ్ళు జొనిపి తల పట్టుక్కూర్చున్నాడు. ఏదో భూతం ఆవహించినట్లు గతి మార్చి ఇద్దరి ప్రాణాలు తీసుకున్నాడు. దేశానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం కలిగించాడు.

    అతడికి శ్రీజ గుర్తొచ్చింది. తను చేసిన తప్పు ఆమెకి తెలీదు. ఆమెకే కాదు, ప్రపంచానికీ తెలీదు. శూన్యంలోకి ప్రవేశించి అంతరిక్ష నౌక, అక్కడ ఏదో ప్రమాదం జరిగి సూర్యుడి దిశగా వెళ్ళిపోయిందని భూలోకవాసులు అనుకుంటారు.

    అతడు మృత్యువుని ఆహ్వానిస్తూ, క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. పక్కనున్న పైలెట్ ఇంకా స్పృహతప్పి పడివున్నాడు. అతడికి తెలివి తెప్పించే ప్రయత్నమేమీ చేయలేదు నిఖిల్. మరణం ఎలాగూ తప్పదని తెలిసినప్పుడు స్పృహలో లేకుండా వున్న సమయంలో ప్రాణం పోవటమే మంచిది.

    అతడు ఇంధనంవైపు చూశాడు. ముల్లు క్రమంగా క్రిందికి దిగుతోంది. అప్పుడు వినిపించింది. అతడికి సన్నటి బీమింగ్ శబ్దం. అతడు ముందు దాన్ని పట్టించుకోలేదు. ఎదురుగా కనిపిస్తున్న నారింజపండు ఆకారాన్ని చూస్తున్నాడు. మరింత దగ్గరవటంతో అది ఇప్పుడు పుట్ బాల్ లా కనిపిస్తోంది. అతడికి అదేమిటో అర్థంకావటంలేదు. రాయ్ చెప్పిన పద్ధతిలో అది సూర్యుడై వుండాలి. అసంభవం. పైగా ఇంత సమీపం వరకూ వెళ్ళినా మండిపోకుండా వుండగలగటం - అసాధ్యం. బీమింగ్ శబ్దం ఎక్కువయింది. సన్నగా వినిపిస్తోంది ఇప్పుడు. "హలో, హలో" అని అరిచాడు.

    "రిసీవింగ్-ఎర్త్, రిసీవింగ్-ఏమయ్యారు! ఇంతసేపూ సంబంధాలు తెగిపోయాయా? ఆర్ యూ ఆల్ రైట్?"

    ఆకస్మాత్తుగా వాహనం భూమికక్ష్యలో ప్రవేశిస్తున్నట్టు కంప్యూటర్ తెలిపింది. అప్పటివరకు ఆగిపోయినట్టు వున్న పరికరాలు అన్నీ తిరిగి పని ప్రారంభించినట్టు అక్కడ వాతావరణం ఒక్కసారిగా చైతన్యవంతమయింది.

    తనే నమ్మలేనట్టు తల విదిలించాడు నిఖిల్. ఎదురుగా కనిపిస్తున్నది. సూర్యుడు కాదు భూమి! అంటే...తన వాదనే కరెక్టు. భ్రమలో  పడింది వాళ్ళిద్దరే. అదే భ్రమలో వాహనాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయిన రాయ్ ఆత్మశాంతి కోసం అతడు ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. తరువాత చకచకా తను నిర్వర్తించవలసిన పనులు చేయడం మొదలుపెట్టాడు. మరో రెండు నిముషాలు గడిచేసరికల్లా భూమి వాతావరణంలోకి ప్రవేశించినది. ఒకసారి భూమిచుట్టూ ప్రదక్షిణం చేసి రాస్ (RAS) వైపు దిగటం  ప్రారంభించింది. ఒకసారి రాకెట్  ఎరైవింగ్ స్టేషన్ వారి కంట్రోల్ లోకి వెళ్ళాక ఇక చెయ్యవలసిన పనేమీ లేదు. నిఖిల్  వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. "చెప్పు. ఎందుకు నన్ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించావు?"

    "తప్పుదారా? ఏం మాట్లాడుతున్నావ్ నిఖిల్ నువ్వు?"

    "భూమివైపు సవ్యంగా వెళ్తున్న వాహనం పొరపాటు దారిలో వెళుతోందని ఎందుకు చెప్పావు?"

    "నేను చెప్పానా?"

    "నిశ్చయంగా నువ్వే?"

    "సర్లే, నువ్వు సరిగ్గా విని వుండవు-"

    "డామిట్" అరిచాడు. కంప్యూటర్ మౌనం వహించింది. మరో పది నిముషాల్లో సూర్య భూమి మీదకు దిగింది. RAS అధికారులు ఆందోళనగా  చుట్టూ చేరారు. నిఖిల్ కిందికి రాగానే "అంతా  సవ్యంగా వుంది కదా" అని ప్రశ్నించారు. అతడి మొహంలో అలసట కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గాఢంగా విశ్వసిస్తూ "రాయ్ ని కోల్పోయాం" అన్నాడు. అతడు చెప్పింది వారికి  అర్థం కాలేదు. అతడు క్లుప్తంగా జరిగింది వివరించాడు. వింటున్న అందరి ముఖాలు పాలిపోయాయి.

    సరిగ్గా  అరగంటలో అత్యవసర సమావేశం మొదలైంది యశ్వంత్ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. నిఖిల్ వాటికి సమాధానాలు చెప్పసాగాడు. తమని వాళ్ళు ఆహ్వానించటం, అనుమతి తీసుకొని తను వాళ్ళతో బయల్దేరటం,ఇంధనం అయిపోతూ వుండగా తమ మధ్య బేదాభిప్రాయాలు రావటం, రాయ్  వాహనాన్ని వదిలేసి ప్రాణాలు రక్షించుకోవడం కోసం శూన్యంలోకి వెళ్ళిపోవడం- అంతా వివరించాడు. అందరూ దీర్ఘాలోచనలో పడ్డారు. ఎవరికీ నమ్మశక్యం కాని కథ రాయ్ మరణం అందర్నీ విషాదంలో ముంచింది. "ఆ రెండో పైలెట్ కి మెలకువ వచ్చిందా?" 

 Previous Page Next Page