ప్రధాని భౌతిక కాయంతో వున్న ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగీదిగడమే మరొక సంచలనాన్ని సృష్టించింది.
పి.ఎస్.ఓ. రాణాప్రతాప్ అతని సీటులో విగత జీవుడై వాలివున్నాడు...!
నేర చరిత్రలో మరొక మిష్టరి...
కథనం
ఆధునిక భారత రాజకీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం ప్రారంభమయింది.
ప్రపంచ దేశాలలో అమెరికా ప్రెసిడెంటు ,రష్యా అధినేత, బ్రిటీష్ ప్రధాని, ఫ్రాన్స్ చాన్సలర్ విశిష్ట వ్యక్తులే కాక, బలమైన శక్తీ సంపన్నులుగా కూడా పేరు వుంది. ఆ కోవకు చెందినదే భారత ప్రధాని పదవి కూడా.
వారెవరికీ తీసిపోని శక్తి-సామర్ధ్యాలు గల రాజకీయ వేత్తగా విశిష్ట వ్యక్తిగా భారత ప్రధాని సమతుల్య అధినాయక స్థానాన్ని సంపాదించగలగడం జాతి గర్వించదగిన విషయం.
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి మన ప్రధానుల చరిత్రను తెరచిచూస్తే, వారిలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత రాజకీయ వారసత్వ సబంధం కనిపిస్తుంది.
కొందరికి తాత-తండ్రుల త్యాగమయ కీర్తి-ప్రతిష్టల వలన పదవి సంక్రమిస్తే, మరికొందరు ప్రత్యక్షంగా రాజకీయాలలో రాణించి ప్రధాని పదవికి ఎదగగలిగారు.
ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వము త్రోసిరాజన్నవారు వున్నారు. గతమెంతో ఘనకీర్తి కలవారున్నారు.
అయితే, కడిచిన రెండు దశాబ్దాలుగా భారత ప్రధానిగా ఎవరిని ఎన్నుకున్నా - ఏ కారణాలచేత అయినాగాని - వారు పూర్తి పదవీకాలం పరిపాలించలేకపోతున్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకని?
కొందరు 'అసమర్ధత' ముద్రతో; మరికొందరు అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత జన పక్షపాతం నిందల నెదుర్కోలేక, అవిశ్వాస తీర్మానాలతో గద్దె దిగిపోయారు.
ఇంకొందరు హేయతిహేయంగా జుగుప్సాకరంగా జరిగిన పార్టీ ఫిరాయింపుల చట్రంతో రాచరిక విష సంస్కృతికి బలయ్యారు.
వేరొక కొందరు స్తోత్ర పాఠాలకు, నీలాపనిందలకు అతీతంగా ధైర్యంగా నిలువరించుకోగలిగినా, దుందుడుకు హింసావాదుల ఘోర కలికి ఎరయ్యారు.
ప్రస్తుతం ఈ దేశానికి బాపూజి అహింసా సిద్దాంతం కావలెనో, గాడ్సే హత్యా విధానం కావలెనో తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో భారతీయులు కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు 'ధర్మంచర' అవుతుందో ధర్మం చెరిగిపోతుందో ఎవరూ జోస్యం చెప్పలేని స్థితి!
ప్రస్తుతం ఈ దేశానికి ప్రధానిగా వుండవలెనంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా మారగలిగే వ్యక్తి అయినా వుండాలి, కాదా, పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు తన విధానాలకు అనుకూలంగా మార్చుకోగల గుండె దిటవుగల మొనగాడైనా అయి వుండాలి!
ఇందుకుగాను పార్లమెంటు మెంబర్లందరూ ఏకమై ఒక వినూత్న ప్రయోగానికి అంకురార్పణ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒక విశిష్టతకు అది రూపకల్పన.
ఇప్పటి వరకు క్రియాశీలక రాజకీయాలలో అసలు ఓనమాలే తెలియని వ్యక్తిని; ఆగర్భ శ్రీమంతుని; విద్య, సాంస్కృతిక, సాంఘిక రంగాలలో వేత్తను, ఆధునిక తత్వవేత్తను, ఆర్ధిక శాస్త్ర నిపుణుని, మించి, నిగర్విని - ఒక్క మాటలో - ఈ శతాబ్దపు విశిష్ట వ్యక్తిని ప్రధానిని చేయవలెనని పార్లమెంటేరియన్ లు అందరు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇదొక సరికొత్త సంప్రదాయం. ఒక ఒరవడి. అదొక సదాశయం - ఒక ధ్యేయం.
తమ తమ పార్టీలలో భీష్మాచార్యులు వంటి నాయకులు వున్నా, వేత్తలు వున్నా, ప్రధాని పదవికి అర్హులైనవారు వున్నా- తామంతా కలిసి రూపొందించిన మార్గదర్శక సూత్రాల మేరకు అన్ని అర్హతలూ వున్న విశిష్ట వ్యక్తినే ప్రధానిగా చేయవలెనని ఏకగ్రీవ తీర్మానానికి వచ్చారు.
ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇది నిస్సంకోచంగా కొంగ్రొత్త అధ్యాయానికి శ్రీకారం. ప్రాచ్య - పాశ్చాత్య రాజనీతి సమ్మిశ్రమం!
ఆ వ్యక్తే శ్రీ చక్రవర్తి.
చక్రవర్తి అర్హతలను అంచనాలు వేయడం కంటే, - ఆయనలో అసలు చెడ్డగుణాలు లేవనే నిర్దిష్టమైన సత్యానికి అంతా ప్రభావితులయారు. చంద్రునికి మచ్చవుండవచ్చునేమో కాని, చక్రవర్తికి అదీలేదు!
యావత్తు ప్రపంచ దేశాలు అచ్చెరువొందే రీతిలో, భారత పౌరులందరు ప్రభావితులయ్యే తీరులో చక్రవర్తిని దేశ ప్రధానిని చేశారు.
దాన ధర్మాలు చేసి, కళా పోషణ చేసి, ఇతర విధాల పేరు ప్రఖ్యాతులు గడించిన ఉన్నత సంజాతుడు చక్రవర్తి. స్వీయ వంశానికి ఏకైక నిజ వారసుడే భారత ప్రధాని పదవికి రాజకీయ వారసుడయాడు.