ఆంటీ అంగీకరించటంతో స్విమ్మింగ్ ఫూల్ వైపు పరుగుదీయబోయాడు టింకూ.
"టింకూ...కమ్ హియర్ ..."
కృష్ణప్రియ కొంచెం కోపంతోనే పిలిచింది.
టింకూ బిక్క ముఖంతో దగ్గరకు వచ్చాడు.
తన మాటలకు చిన్న బుచ్చుకున్నాడని టింకూను వడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నది డాక్టర్ కృష్ణప్రియ.
ఇప్పుడు ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యమాడింది.
"టింకూ...నీకు అంత ఖంగారు అయితే ఎలా? యిప్పుడు టైమ్ నాలుగున్నర. నీది అయిందుబావు బ్యాచ్ అవునా...?"
"కానీ ఆంటీ...ఇవాళ సన్ డే కదా. కాస్త ఎర్లీగా చేస్తే ఏం పోతుంది?"
"యూ నాటీ...పంక్చువల్ గా వుండాలని ఎన్నిసార్లు చెప్పాను?"
నిరుత్సాహంతో, దూరంగా కన్పిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ వైపే చూస్తూ కూర్చున్నాడు టింకూ.
"టింకూ...ఇలా రా...ఇక్కడ కూర్చుందాం."
పొగడ చెట్టు దగ్గరకు దారితీస్తూ పిలిచింది కృష్ణప్రియ.
"ఆంటీ...అక్కడ వద్దు...అతను..." పదిరోజుల క్రితం జరిగిన సంఘటనను ఇంకా మరచిపోలేక అన్నాడు టింకూ.
టింకూ భయం అర్ధం చేసుకుంటున్నట్టు... "ఛ...భయందేనికి...నేను వున్నానుగా. అయినా యిక్కడ ఎవరూ లేరుగా, రా!" కృష్ణప్రియ ధైర్యం చెప్పింది.
అక్కడ నుంచి స్విమ్మింగ్ ఫూల్ కనపడదు అని తెలిసినా మారు మాట్లాడలేక టింకూ ఆమెను అనుసరించాడు.
ప్లాస్క్ లో నుంచి సెగలు కక్కుతున్న బోర్నవిటా రెండు కప్పుల్లో పోసి...టింకూకు ఒకటి అందించి తను ఒకటి తీసుకుంది.
యాపిల్ కట్ చేసి టింకూకు యిచ్చి ఖాళీ అయిన కప్పులను కడగడానికి లేచింది కృష్ణప్రియ.
"ఆంటీ...నేను కడుక్కువస్తాను. స్లిప్ అయితే నీకు ఈత రాదుగా!"
టింకూ జాగ్రత్తకు నవ్వొచ్చిందామెకు.
"ఓ మై స్వీట్ బోయ్...చెరువు మధ్యకు వెళ్ళినా నేను మునగను. ఈ చెరువు దాదాపు ఎండిపోయింది. నువ్వు మాత్రం ఇందులో ఈదగలవా? చెరువు నిండా తామర ఆకులు వున్నాయి. అవి అన్నీ నీ ఒంటిని పట్టివేస్తాయి."
కృష్ణప్రియ కప్పుల్ని కడుక్కు వచ్చి టింకూ ప్రక్కనే కూర్చున్నది.
ఒడ్డున వున్న బోటును చూస్తూ బోటు షికారు గురించి ఆలోచిస్తున్న టింకూ...ఆంటీ తనను తట్టి పిలవడంతో వులిక్కిపడ్డాడు.
తన ఆలోచనలకు అంతరాయం కలిగించినందుకు ఆంటీ మీద చిరు కూపం వచ్చింది.
టింకూకు మరు క్షణంలోనే ఆ కోపం పటాపంచలై పోయింది.
వాచీ చూపించగానే స్విమ్మింగ్ కు టైమ్ అయిందని గుర్తు చేసినందుకు థాంక్స్ చెప్పి స్విమ్మింగ్ ఫూల్ కు బయలుదేరాడు టింకూ.
విజిటర్స్ బెంచ్ మీద కూర్చున్న కృష్ణప్రియ స్విమ్మింగ్ డ్రెస్ లోని టింకూను దగ్గరకు పిలిచి జాగ్రత్త అని హెచ్చరించింది.
కృష్ణప్రియ స్విమ్మింగ్ ఫూల్ వైపే చూస్తూ కూర్చున్నది.
ఆ బీచ్ లో ఎక్కువమంది పిల్లలు లేరు.
అందరూ వుంటే వాళ్ళ హుషారు, కేరింతలు చూస్తూ కూర్చోవచ్చు. ఒకవైపు స్విమ్మింగ్ అయిపోయిన వాళ్ళు డ్రస్ మార్చుకుని వెళ్ళిపోతున్నారు.
టింకూ నేర్పుగా స్విమ్ చేస్తున్నాడు...
వాటర్ లెవెల్ నడుమువరకేవున్నది., అప్పుడప్పుడూ లోతు సరిపోనట్టు అటూ ఇటూ నడుస్తున్నాడు టింకు.
స్విమ్మింగ్ ఫూల్ లో హడావుడి ఏమీ లేకపోవడంతో చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నది ప్రియకు ...