Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 7

   
    "మన కులాలు కలవనంమాత్రాన నువ్వు నాకు దూరమైపోతావా, స్వప్నా? వాళ్లని కాదని నా దగ్గరికి వచ్చెయ్యలేవా?"

    స్వరూప్ అర్దస్వరానికి విచలితంగా చూసింది స్వప్న. "వచ్చేస్తాను స్వరూప్! వచ్చేయక చేసేదిలేదు! వెనుదిరిగి వెళ్లలేనంత దూరం వచ్చేశాను నీతో!"

           
                                                                      2

    "పిల్ల ఎద్దులా ఎదిగిపోయిందని నా బాద నాకుండగా పులిమీద పుట్రలా ఇరుగు పొరుగు సాదింపు లొకటి! పిల్ల సంపాదనకు మరిగి పెళ్లిపెటాకులేమీ అనుకోవడం లేనట్టుందేమిటమ్మా అని! ఏం మనుషులో? ఏ తల్లిదండ్రులైనా పిల్ల అత్తారిల్లు మెట్టి పిల్లా పాపలతో కల కలలాడుతోంటే చూడాలనుకొంటారు గాని సంపాదించిపెడితే చాలుననుకొంటారా? ఆ వెంకమ్మ పొద్దున ఆ మాట అన్నప్పటి నుండి నా మనసు మరిగిపోతూంది. మీకు చీమ కుట్టినట్టయినా లేదు కదా?"

    స్వప్న తల్లి కమలమ్మ భర్తను సాధించసాగింది ముక్కు చీదుతూ.

    "ఆ గడియ రాకముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభమే?" విశ్వేశ్వరయ్య అన్నాడు వేదాంతిలా.

    "మనం చేసే ప్రయత్నాలు చేస్తే దైవం అనుకూలపడతాడండీ!"

    "అమ్మాయి పెళ్లికని నేనేం కట్నం మూటగట్టి పెట్టలేదు. నాకొచ్చే బడిపంతులు జీతం పిల్లకి బట్టాపొట్టా గడిపి  చదువులు చెప్పించింది. వేలకు వేలు కట్నం గుమ్మరించి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే నావల్ల కాదు. పిల్ల ఉద్యోగం చేస్తుందికదా దాని ఎవడైనా కట్నం లేకుండా చేసుకొంటాడా అంటే అదీ లేదు. అవ్వా కావాలి, బువ్వా కావాలి అన్నట్టుంటారు మగపిల్లాడివాళ్లు!"

    "మొన్న సుభద్రమ్మవాళ్లు వాళ్ళక్క కూతుర్ని మన పురుషోత్తానికి అడిగారు. పదివేల కట్నమిచ్చి లాంఛనాలవీ మరో పదివేలదాకా ముట్టజెప్పగల మన్నారు. పురుషోత్తంతో చెబితే వాడు ఊఁ అనడు. మీరోమాటు కదిపి చూడండి!" భర్తకి సలహా ఇచ్చింది. "పురుషోత్తానికి కుదిరితే ఆ కట్నం తీసి స్వప్నకివ్వొచ్చు!"

    వీలు చూచుకొని కొడుకుని కదిపాడు విశ్వేశ్వరయ్య.

     "నేను సుజాతను చేసుకోవాలనుకొంటున్నాను, నాన్నా! నా ఒక్కడి జీతం ఏ మూల  కవుతుంది? ఇద్దరు సంపాదించే సంసారాలే కుంటినడక నడుస్తున్నాయి!" పురుషోత్తం తన మనసులో మాట బయట పెట్టాడు. సుజాత ఈ ఊరు పిల్లే. పైగా బంధుత్వం కూడా వుంది!

    "సుజాతను చేసుకొంటావా?వాళ్ల దగ్గరేముందిరా ఇవ్వడానికి బొచ్చెతప్ప? "ఎగిరాడు విశ్వేశ్వరయ్య.
    "కట్నం తీసుకురాలేకపోవచ్చు సుజాత. కాని, బి. ఏ. చదివింది.  టైప్, షార్ట్ హాండ్ నేరుస్తోంది. అది పాసైతే  స్టెనోగా ఉద్యోగం ఖాయం! ఉద్యోగం చేసే పిల్లయితే వేణ్ణీళ్లకు చన్నీళ్లున్నట్టుగా వుంటుంది! మరోపిల్ల పదివేలో, పన్నెండువేలో కట్నం తెస్తే మీకు మిగిలేదెంత? కట్నానికి తగ్గట్టు నగలూ, బట్టలూ పెట్టాలి పిల్లకు. బంధువులకు పొట్టనిండా మేపి చీరసారెలు సమర్పించాలి! మన గడువు అయ్యేసరికి చేతిలో మిగిలేది పూజ్యం.!"

    "ఓహో! పెద్ద ప్లానే వేశావే! ఎంత స్వార్దపరుడివిరా? ఉద్యోగం చేసే పిల్లయితే కట్నం లేకుండా పెళ్లి చేసుకొంటావు! కట్నం లేకుండా పెళ్లాడిన ఆదర్శ యువకుడివన్న పేరుకొట్టేస్తావు. పెళ్లయిన మరురోజు మరో ఊరు  ట్రాన్సఫర్ చేయించుకొని మీ కాపురం మీరు చూచుకొంటారు. ఇద్దరు సంపాదించుకొంటున్నారు కదాని అవసరం  పడి పదో పాతికో అడిగామనుకో. "మా ఖర్చులు మాకున్నాయి నాన్నా!" అని జవాబిస్తావు! అంతేగా? పక్షి పిల్ల్లల్లా రెక్కలొచ్చి ఎగిరిపోతే, రెక్కలుడిగాక ఆసరా అని కనిపించిన మా గతేం కావాలిరా?" అరవసాగాడు విశ్వేశ్వరయ్య.

    "కట్నం తెచ్చే పిల్లను చేసుక1న్నా మనకు మిగిలేదముంటుంది, నాన్నా?" విసుగు వ్యక్తం చేశాడు పురుషోత్తం.

 Previous Page Next Page