రాత్రి ఏడు గంటలు దాటుతుందేమో _ ఆన్ డ్యూటీ పూర్తి చేసుకున్న డే టైమ్ సిస్టర్స్, తమని రిలీవ్ చెయ్యటానికి వచ్చిన నైట్ సిస్టర్స్ కు చార్జి అప్పగించి వెళ్ళిపోతున్నారు. రాత్రి సమయంలో, మసగ్గా వెలుగుతూన్న ఆ దీపాల వెల్తుర్లో హాస్పటల్ వాతావరణం కొత్తగా కనబడింది.
ఫిమేల్ వార్డులోకి అడుగు పెట్టాక, మొదట, గబగబ ఉదయం గ్లూకోజ్ పెట్టిన హార్టు పేషెంటు దగ్గరకు పరుగెత్తాను. గ్లూకోజ్ డిస్ కనెక్ట్ చెయ్యబడి వుంది. పల్సు చూశాను. అందటం లేదు. ఊపిరితిత్తులు పరీక్షచేసేసరికి బాగా నెమ్ముచేరి క్రెపిటేషన్స్ గుర్రు గుర్రుమంటున్నాయి. పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఇహ లాభం లేదనిపించింది. ప్రక్కన ఓ నడి వయస్సు స్త్రీ నిలబడి వుంది. కళ్ళు ఒత్తుకుంటూ "ఎలా వుంది నాయనా ?" అనడిగింది. ఆవిడ తాలూకు పురుషుడు కాబోలు, గోడవతల నిలబడి చువ్వల మధ్య నుండి తొంగి తొంగి చూస్తున్నాడు.
"ఈ రాత్రి గడవాలమ్మా" అని చెబుతూండగా, ఆమెకు కార్టిసోన్ యిస్తే బాగుండు ననిపించింది. ఎందుకైనా మంచిదని లోపలకు వెళ్ళి సిస్టర్ని అడిగి, ఆమెకు ఓ కార్టిసోన్ యింజక్షన్ యిచ్చి, మిగతా యింజక్షన్ లు కూడా పూర్తి చేసుకున్నాడు.
అప్పటికి పేషెంట్లంతా భోజనాలు ముగించేసినట్లున్నారు. పడుకుని ప్రక్క మంచాలవాళ్ళతో బాతాఖానీ కొడ్తున్నారు. కొంతమంది అప్పుడే నిద్ర పోతున్నారు కూడా.
సిస్టర్ని పిలిచి ఆ హార్టు పేషెంట్ ని జాగ్రత్తగా చూస్తూండమనీ, అవసరమైతే కబురు చెయ్యమనీ చెప్పాను.
"మీరు రాత్రికి ఎక్కడ వుంటారు ? డ్యూటీ రూమ్ లో వుంటారా ?" అనడిగింది.
"ఉంటాను."
బయటకు వచ్చాక, మృదుల, "ఒక్క నిమిషం. ఐసోలేషన్ వార్డు దాకా పోయివద్దా ముండు" అని అటుకేసి దారితీసింది.
అక్కడ యింజక్షన్ రూమ్ దగ్గర స్టాపూ, సిస్టరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.
మృదుల, సిస్టర్ని, "టెటనస్ కేసు లెన్ని వున్నాయి ?" అనడిగింది.
"మూడున్నాయండీ. పెరాల్డిహైడ్ చెయ్యటానికి రాత్రికి మొత్తం రెండుసార్లు రావలసి వుంటుంది."
"చూడు సిస్టర్ !" అంది మృదుల, ఆమె దగ్గరకు వెళ్ళి, నెమ్మదిగా. "కేవలం యింజక్షన్ లు చెయ్యడం కోసం అంత దూరం నుంచి అర్దరాత్రిపూట రావటం ఎంత కష్టమో చూడండి. మీరు చేసెయ్యండి. రేపు ఉదయం వచ్చి నేను సంతకం పెడతాను"
"అలాగే లెండి" అంది సిస్టర్ నవ్వుతూ.
ఇవతలకు వచ్చాక మృదుల "సరేకాని యీ పూట నువ్వెక్కడ భోజనం చేస్తావు ? అంతదూరం పోయివస్తావా ?" అనడిగింది.
అప్పటికి నాకు మంచి ఆకలిగా వుంది. ఉదయం నుంచి భోజనం చేయలేదన్న విషయం ఆమెకు చెప్పలేదు. చెబుతే పెద్ద గొడవ లేవదీస్తుంది.
నేను కొంచెం మాలోచించి 'రూమ్ దాకా వెళ్ళట మిప్పుడు కుదరదు. ఇక్కడనే హోటల్ లో తీసుకోవాలి" అన్నాను.
"అయితే పద. నీతో నేను కూడా హోటల్ లోనే తింటాను."
"వద్దు మృదులా, బాగుండదు."
"ఏమిటి బాగుండదు ? ఎవరికి బాగుండదు ? నీకా ? ఈ రెండింటినీ నేను యిగ్ నోర్ చేసాను,"
నేను విధిలేక "సరే, నీ యిష్టం. ఒక్క నిముషం యిక్కడే నిల్చో. నేను రామదాసుగారికి చెప్పివస్తాను, అన్నట్లు మీ డి.ఎ.ఎస్. ఎవరు ?" అనడిగాను.
"డాక్టర్ మూర్తిగారు. ఫర్వాలేదులే. ఆయనకు చెప్పనక్కర్లేదు, అసలాయన ఎక్కడ వుంటాడో యిప్పుడు పట్టుకోవటం కూడా కష్టం. నువ్వెళ్ళి చెప్పిరా. ఈ లోపల నేను క్యాజుయాలిటీ నుంచి యింటికి ఫోన్ చేసి వస్తాను. భోజనానికి రావటంలేదని" అంది మృదుల.
నేను డ్యూటీరూమ్ కు వెళ్ళేసరికి రామదాసుగారూ, మూర్తిగారూ చదరంగ మాడుకుంటున్నారు. నేను చెప్పిన విషయం విని ఆయన "ఓ అరగంటలో వచ్చెయ్యండి. మీరు వచ్చాక నేనూ వెళ్ళివస్తాను. ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోతే బాగుండదు" అన్నాడు.
'అలాగే' అని చెప్పి యివతలకు రాగానే చిన్నపిల్లల వార్డులో, వడదెబ్బ కేసు గుర్తు వచ్చింది. "ఒక్కసారి చూసివచ్చేద్దాం, లేకపోతే చాలా ఆలస్యమైపోతుంది" అనుకుని అటుకేసి వెళ్ళాను.
రాత్రి అయినా కూడా వార్డంతా పిల్లల ఏడుపులతో, తల్లుల లోకాభిరామాయణాలతో గోలగోలగా వుంది. స్టాఫ్ కూర్చొని ఏదో రికార్డు చూసుకొంటోంది. సిస్టర్ "ఉష్, గొడవ చెయ్యకండయ్యా" అంటూ ఆడవాళ్ళని హెచ్చరిస్తూ, టెంపరేచర్ నోట్ చేసి ఛార్జ్ లలో నోట్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.
నేను యిందాకటి పిల్లవాడి దగ్గరకు వెళ్ళగానే తల్లి తలకి ఐస్ పెడుతూ కనిపించింది. నన్ను చూసి సిస్టర్ దగ్గరకు వచ్చింది.
"సిస్టర్! టెంపరేచర్ చూశారా ?" అనడిగాను.
"చూశానండీ. తొంభయితొమ్మిది వుంది" అంది.
"జ్వరం అంత దిగజారిపోతే తలకింకా ఐస్ ఎందుకు ?"
ఆమె నాలిక కొరుక్కుని "సారీ డాక్టర్" అని, "యింక చాలమ్మా" అంటూ తల్లి దగ్గర నుంచి ఐస్ బ్యాగ్ తీసుకుంది.
నేను పిల్లవాడిని ఒకసారి పరీక్షచేశాను. హాయిగా నిద్రపోతున్నాడు. వాడి స్థితి నా కెంతో సంతృప్తినిచ్చింది.
"ఫర్వాలేదమ్మా. ఇందాకటి కంటే ఎంతో మెరుగ్గా వుంది పరిస్థితి. నువ్వు చాలా అదృష్టవంతురాలవు" అన్నాను, తల్లితో.
ఆమె తన విశాల నేత్రాలు కృతజ్ఞతాభరితాలై భరిణలవలె మెరుస్తూ వుండగా "మీ చేతి చలవ బాబుగారూ" అంది.
"బాబు సుఖంగా నిద్రపోతున్నాడుగా, కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా" అని చెప్పి బయటకు వస్తున్నాను.
సిస్టర్ నా వెనకాలే వచ్చి, "డాక్టర్ ! మీకు మెమో పంపించాలంటే ఎక్కడ వుంటారు ? డ్యూటీరూంలో వుంటారా ?" అని ప్రశ్నించింది.
"ఉంటానండీ సిస్టర్."
నేను వెళ్ళేసరికి క్యాజుయాలిటీకి కొద్దిదూరంలో, చీకట్లో చెట్లక్రింద అటూ యిటూ అస్తిమితంగా తిరుగుతోంది మృదుల.
నేను కనిపించగానే, కోపంగా "చాల్లే, గొప్పపని చేశావు ! చెప్పకుండా వెళ్ళిపోయావేమో ననుకున్నాను. నిన్నసలు...." అని మాట పూర్తి చెయ్యలేకపోయింది.
"సారీ మేడమ్ !" అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి "పిడియాట్రిక్ వార్డులో ఓ కేసు సీరియస్ గా వుంటే చూడటానికి వెళ్ళేసరికి అయిదు నిమిషాలు ఆలస్యమైపోయింది" అన్నాను, క్షమాపణ చెప్పుకుంటూన్నట్లుగా.
"ఒకరు నీకోసం రాజీపడాలి గాని. ఒకరికోసం నువ్వు రాజీపడవు. నా జీవితానికిది తప్పదు" అని నిట్టూర్చి "సరే పద" అంటూ ముందుకు కదిలింది.
ఆమె మాటలకు అర్ధం, అన్వయం రెండూ ఆలోచించకుండా వుండటానికి ప్రయత్నిస్తూ ఆమె ప్రక్కనే నడవసాగాను.
కాసేపటిలోనే ఆమె కోపం మరిచిపోయి నవ్వుతూ మాట్లాడసాగింది. అది ఆమె స్వభావం. అది ఆమె సహజ పరిమళం. ఏ అదృష్టవంతుడు, ఎక్కడ పెట్టిపుట్టి, ఆమె కోసం నివస్తిస్తున్నాడో గాని, అతన్ని చూసి లోకం యీర్ష్యతో భగ్గుమనక తప్పదు.
కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ యిద్దరం హోటల్ లో భోజనాలు ముగించాం.
"కోరి కష్టాలు తెచ్చుకోవటమంటే యిదే. ఇంతకీ నీకు సుఖపడే యోగ్యత లేదు. అష్టైక్వర్యాలతో తులతూగే యింటిలో గోముగా అమ్మ పట్టే అన్నం తినకుండా...."
"మా అమ్మ యింత మధురాన్నం ఎప్పుడూ పెట్టలేదు" ఆమె ముఖం పరవశత్వంతో వికసించింది. "గ్రహచారం అంటే యిదే."
మృదుల ఫక్కుమని నవ్వింది. ఇంకేమీ మాట్లాడలేదు.
ఇద్దరం బయటకు వచ్చి హాస్పటల్ కేసి అడుగులు వేస్తున్నాము. గేటు బయట సోడాల వాళ్ళూ, పుణుగులు, పెసగట్లు అమ్ముకునే ముసలమ్మలూ, పిడత క్రింద పప్పుబళ్ళవాళ్ళూ ముమ్మరంగా వ్యాపారం సాగించేస్తున్నారు. గేటు దగ్గర ఘూర్ఖాలోపలకు పోతానని పేచీ పెడుతూన్న రిక్షావాడితో పోట్లాడుతున్నాడు. ఈ సందడిలో కుక్క ఒకటి తెలివిగా లోపలకు దూరి, చీకట్లో ఎటో తుర్రుమన్నది.
"ఎంత అన్యాయం జరిగిందో చూశారా ? అంది మృదుల. ఎందుకో యీ మాటలు చిలిపిగా ధ్వనించి, ఆమె ముఖంలోకి చూశాను.
"ఒక కుక్క లోపలకు ప్రవేశం సంపాదించింది. అందరూ సుఖనిద్రలో వుండగా అది ఏ అఘాయిత్యానికో తల పెడుతుంది. అంటే ఏ చంటిబిడ్డనో ఎత్తుకుపోవటం, యిలాంటివి. మరునాడు పేపర్లో తాటికాయంత అక్షరాలతో యీ వార్త ప్రచురిత మవుతుంది."
సరిగా ఆమె యీ మాట లంటూడగానే ఓ పదిహేనేళ్ళ కుర్రవాడు చేతిలో పేపర్ల కట్ట పట్టుకుని ఆ రోడ్డంతా పోతూ యిలా అరుస్తున్నాడు. "కొరడా, చెళ్ళు చెళ్ళు మనిపించే వార్తలతో మిమ్మల్ని మురిపించే మేటైన దినపత్రిక బెడ్ యిస్తానని వందరూపాయలు లంచం తీసుకున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ వికృతచర్య. ధర్మాసుపత్రిలో ధర్మంలేక అలమటించే మూగ ప్రజల గోడు....హోటలు సర్వరుని కొట్టిన కారణంగా హోటలు వర్కర్ల సమ్మె, నవజీవన కేఫ్ ముందు గలబా...."
ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాము. నా మనసులో తృళ్ళిన దిగులే ఆమె ముఖం మీద ముద్రపడినట్లుగా, ఆ వీధి వెల్తుర్లో నాకు కనిపించింది.
"చూశావా ?" అన్నది కంపితస్వరంతో. ఆసుపత్రి ముందే ఎంత అసభ్యంగా కేకలు పెడుతున్నాడో! ఇలా అసత్యాలను ప్రచారం చేసే వాళ్ళని ఏం చేయాలంటావు ?"
"ఈ కృత్రిమయుగంలో, కంటకాలే సత్యాలై విరాజిల్లుతున్న యీ రోజుల్లో, ఆ కంటిక సత్యాల మహావృక్షంలో ఒక సత్యం ఏ కొమ్మనో, రెమ్మనో అంటి పెట్టుకుని వున్నా, దాని వెలుగు మిగతా కొమ్మలమాటున, ఆకుల చాటున మరుగుపడిపోతుంది గాని, భూమిపై పడదు."