అరుంధతి సానుభూతిగా వింటోంది.
"ఆ గొడవ వదిలింది అని ఊపిరి తీసుకుంటుంటే, మళ్ళీ ఇదొకటి తెచ్చింది. ఈ అభినవ్ ఎవడో? ఎలాంటి వాడో? వీడెం చేయ్యబోతున్నాడో?" అతను స్వగతంలో అనుకున్నాడు.
* * *
'అబ్బ! ఎవరు తలచుకుంటూన్నారా బాబూ!" అంటూ తన అరచేత్తో సున్నితంగా అభినవ్ తల మీద కొట్టింది జానకి.
అన్నం తింటున్న అభినవ్ కి అప్రయత్నంగా మంజీర కళ్ళల్లో మెదిలింది. పెదవుల మీదకి చిన్న చిరునవ్వు చేరుకుంది.
"నా గురించి ఏమనుకుందో? ఛీ, ఛీ అలా చేసానేమిటీ! తర్వాతైనా సారీ చెప్పెయాల్సింది. అంతలోనే తనని ఆమె కొట్టడం గుర్తొచ్చింది. " ఆడపిల్ల కాస్త కూడా జంకు లేకుండా ఎంత పొగరుగా ఉందీ?" అనుకున్నాడు.
"అమ్మ నన్ను చాలా కష్టపడి చదివిస్తోంది. రాత్రనకా, పగలనకా , శ్రమ పడి, మిషన్ కుట్టి , పచ్చళ్ళూ , అవకాయలూ పెట్టీ ఉన్న కాస్త పొలం కౌలు కిచ్చి చదిస్తోంది. తను పెద్ద ఉద్యోగం చేసి సుఖ పడిపోవాలని పాపం. ఆశ. అలా అనుకోగానే, తల్లి మీద వాత్సల్యం పొంగుకొచ్చింది. కాలేజిలో జరిగిన విషయం అమ్మకి తెలిస్తే .... అమ్మో! గొప్పవాళ్ళతో గొడవలోద్దు జాగ్రత్తరా" అంటూ తెగ కంగారు పడిపోతుంది. ఊహూ చెప్పను." అనుకున్నాడు.
"ఇంక కొంచెం అన్నం పెట్టనా?" అడిగింది జానకి.
"వొద్దు" చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాడు.
"సరిగ్గా తినలేదు, పిచ్చి వెధవ! మొదటి రోజుగా, అలాగే ఉంటుంది. అనుకుంది జానకి.
అభినవ్ గదిలోకి వెళ్ళి మంచం వాల్చుకుని పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. అందులోంచి , విసురుగా కార్లోంచి దిగుతూ మంజీర కనిపించసాగింది!
* * *
'అయ్యయ్యో! అదేమిటలా వంటింట్లో వచ్చేస్తున్నావూ? అసింటా అసింటా" అని అరుస్తోంది అరుంధతి.
"ఏందయ్యా! ఇల్లు తుడవద్దా? నేను వస్తేనే నీ ఇల్లు మైల పడిపోతుందా? ఇంకా గట్టిగా అరిచింది పనిమనిషి.
సుమిత్రకి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి కానీ, లేవాలంటే బద్దకంగా ఉంది.
"చూడు! ఆ గోలేమిటో" అన్నాడు పక్కకి వొత్తిగిల్లుతూ నారాయణమూర్తి.
ఇంక తప్పేటట్లులేదని, నిద్ర మత్తులోనే తూలుకుంటూ వంటింట్లోకి వచ్చిన సుమిత్ర.
పనిమనిషి మంచి తారస్థాయిలో ఉంది.
అరుంధతి కూడా ఏం తీసిపోకుండా, "అంట్లదానివి నీకెంత పొగరే! మడి కట్టుకుని పూజ చేసుకుంటుంటే వంటింట్లోకి కొస్తావా? ఇదిక్కడ అనాచారం బాబూ!" అని గొంతు చించుకుని అరుస్తున్నదల్లా, సుమిత్ర కనబడగానే "చూసావుటే అమ్మాయ్!" అంది.
సుమిత్ర విసుగ్గా చూస్తూ , "అంటూ వింటూనే ఉన్నాను , దాన్ని ఇల్లు తుడవనివ్వకపోతే ఎలా? మరీ చాదస్తం కాకపోతేనూ!" అంది.
అరుంధతి దెబ్బతిన్నట్లు చూసింది.
పనిమనిషి విజయ గర్వంతో , చీపురు తీసుకుని వంటింట్లోకి ప్రవేశించింది.
పెరట్లోకి వెళ్ళి కూర్చున్న అరుంధతికి చాలా దిగులుగా అన్పించింది. "మడీ ఆచారాలు అస్సలు సాగట్లేదు , అనవసరంగా వచ్చాను" అనుకుంది.
"హాయ్ గ్రానీ, గుడ్ మాణింగ్" అంటూ వచ్చింది మంజీర.
అరుంధతి నిరాసక్తంగా చూసింది.
మంజీరకి అరుంధతిని చూస్తుంటే ఒక చిలిపి ఊహ మదిలో మెదిలి, చిరునవ్వు తొణికిసలాడింది పెదవుల పైన.
* * *
అభినవ్ బస్ దిగి రెండు అడుగులు వేసేసరికి విన్పించింది "సార్" అన్న పిలుపు, వెనక్కి తిరిగి చూసాడు.
ఓ పదేళ్ళ కుర్రాడు, "మీకు ఉత్తరం ఇమ్మన్నారు" అంటూ ఓ కవర్ అందించాడు.
"ఎవరిచ్చారూ?" అడిగాడు అభినవ్.
"ఒక అమ్మాయి గారూ, మిమ్మల్ని చూపించి , మీకు ఇమ్మని చెప్పి, నాకు ఓ రూపాయి ఇచ్చి వెళ్ళిపోయారు. " అన్నాడు ఆ కుర్రాడు.
అభినవ్ సంశాయంగానే అందుకున్నాడు. కవర్ చిమ్పగానే లోపల తెల్లకాగితం మీద ఒక వాక్యం ముంది. "ఐ లవ్ యూ" క్రింద అరుంధతి" అన్న సంతకం. ఎవరబ్బా, ఈ అరుంధతి? ఆ పేరు కలవాళ్ళు ఎవరూ నాకు తెలీదే అనుకున్నాడు .
లంచ్ టైం లో మంజీర కన్పించింది.
చిరునవ్వు నవ్వబోయాడు. విసురుగా తల తిప్పుకుని వెళ్ళిపోయింది.
ఆ తర్వాత అభినవ్ ఆ ఉత్తరం సంగతి పెద్దగా ఆలోచించలేదు.
మరునాడు మళ్ళీ నిన్నటి కుర్రాడు ఉత్తరంతో నిలబడి ఉన్నాడు.
"ఎవరిచ్చారు?" మళ్ళీ అడిగాడు అభినవ్.
వాడు దూరంగా చెయ్యి జాపి చూపించాడు. వాడితో లాభం లేదని తెలుసుకుని అభినవ్ ఉత్తరం తీసుకున్నాడు.
"మా ఇంటికి రండి, క్రింద అడ్రస్ ఉంది."
అరుంధతి.
ఎవరీ అరుంధతి? తన క్లాసులో ఎవరూ ఆ పేరు కలవాళ్ళు లేరు. కాలేజిలో ఉన్నారేమో! అయినా ఎందుకొచ్చినా తలనొప్పి? ఉట్టి టైం వేస్టు అని మనసు తిప్పుకునే ప్రయత్నం చేసాడు.
మరునాడు బస్సు దిగగానే, ఆ కుర్రాడి కోసం అభినవ్ తనే వెతికాడు. రాయి మీద కుర్చుని 'ఐస్ క్రీం ' తింటూ కనిపించాడు వాడు. అభినవ్ వాడి దగ్గరకు వెళ్ళగానే జేబులోంచి ఉత్తరం తీసి అందించాడు వాడు.
"నిన్న ఎదురు చూసాను. ఈరోజు తప్పకుండా రావాలి." - అరుంధతి.