"ఏ సందర్భంలో పోట్లాడారు?"
"ఒక గ్రామంలో సర్పంచ్ 'చతుత్సముద్ర వేలావలయిత భూమండలాదిపతిలా ' పెత్తనం చేలాయిస్తుంటే , అతని అధికారానికి వ్యతిరేకంగా గ్రామోద్యోగులందరి చేత ముఖ్యంగా హైస్కూల్ విద్యార్ధుల చేత ఆందోళన జరిపించాను - ఫలితం ....."
"ఆ సర్పంచ్ ఏమయ్యాడు?"
"సర్పంచ్ గానే వున్నాడు. మన ఆందోళనలు అంత త్వరగా ఫలిస్తే ఇక లేనిదేముంది నాయనా! కానీ అంత మాత్రాన ఇవి వ్యర్ధమనుకోకూడదు - గాంధీ మహాత్ముని సత్యాగ్రహ సమరమే ఏనాటికయినా మనకాదర్శం!"
వేదాంతిలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. నిజంగానే అతడికి జైలులో అంతటా తిరిగే స్వాతంత్ర్యం వున్నట్లుంది. ఎలా సంపాదించాడో ? సమాజంలో ఎటు తల తిప్పినా, దానికదే పద్మవ్యూహం లా కనిపిస్తుంది.
జైలులోనే యతికి ఒక యువకుడితో పరిచయమయింది. పాపం వెనుకబడ్డ జాతులకు చెందినా యువకుడు. చదువూ, సంస్కారాలు లేనివాడు. నల్లగా కండలు తిరిగిన శరీరం. సరిగా మాట్లాడటం కూడా చేతకాని అమాయకుడు. అలాంటివాడు నేరం చేసాడని అనుకోలేకపోయాడు యతి. అతన్ని మాటలలోకి దింపాడు మొదట. మొదట అతడు యతిని బెదురుగా చూస్తూ ఏం మాట్లాడలేదు. యతి నెమ్మదిగా లాలించి స్నేహం చేసుకున్న మీదట మాట్లాడటం మొదలు పెట్టాడు.
"నానండీ, రాదని పెమించానండీ! అదీ నన్ను పేమించిందండీ. అల్లు చాకల్లండి. అల్లేమో నాకియ్యమన్నారండి. ఇద్దరం ఎటైనా పోయి బతుకుదారని ఎల్లిపోయామండి. ఆల్లేమో నేను దాన్ని లేవదీసుకు పోయినా నని కేసెట్టారండి. నన్ను జైల్లో తోసారండీ. దాన్ని లాక్కు పోయారండీ. దాన్ని ఎవడికైనా కట్టబెట్టాస్తారేమో నండీ.
ఇంచుమించు ఏడ్చినంత పనిచేసాడు వాడు, వాడినేలా ఓదార్చాలో అర్ధం కాలేదు యతికి. ఏమిటీ సాంఘీకాచారాలు ఈనాడు చదువుకున్న వాళ్లలోనూ చదువుకొని వాళ్లలోనూ కూడా నానాటికీ ఎందుకింత సంకుచిత్వం ఏర్పడుతోంది? ఒకరి నొకరు కోరుకున్న యువతి యువకులను విడదీసి తలిదండ్రులు పొందేదేమిటి?
యతి లేతమనసు ఇలా అనేక ఆలోచనలతో సతమతమయి పోతోంటే , వెంకటయ్య అతడిని వదిలిపెట్టలేదు -- మళ్ళా వచ్చాడు. "ఒక్కసారి కళ్ళు తెరచి చుట్టూ చూడు నాయనా? అవినీతి లేనిదేక్కడా? అడుగడుగునా, స్వార్ధంతో, ధనకాంక్షతో కుళ్ళి పోతుంది సమాజం. ఎక్కడి కక్కడ బల్లలూ కుర్చీలు చేతులు జాచేస్తున్నాయి చదువులతో చెలగాటం ----ప్రాణాలతో చెలగాటం. అన్నిటితోనూ చేలగాటమే. నైతిక విలువలు లేవు - బాధ్యతలు లేవు. కర్తవ్య దీక్ష లేదు. డబ్బు! డబ్బు! డబ్బు! ----అదొక్కటే కనిపిస్తోంది. అందరి కంటికి. అందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ సర్వం మరచి దాని వెనుక పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవలసిన బాధ్యత - మార్చవలసిన బాధ్యత - సమాజాన్ని చైతన్యవంతం చెయ్యవలసిన బాధ్యత మనమీద లేదంటావా?
తనకు జరిగిన అన్యాయానికి ఏదో ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న యతి మనసు ఈ మాటల ప్రభావానికి అతి తేలికగా లొంగిపోయింది.
"ఏం చెయ్యగలమంటారు మనం? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలం?"
"నేను మొదట చెప్పిందే? ఎక్కడ ఏ చిన్న అన్యాయం కనిపించినా దాన్ని సమాజం అంతటికి తెలియజేస్తూ తీవ్రమయిన ఆందోళన జరిపించాలి!"
'ఆందోళన జరిపించటం ఒకరిద్దరి వల్ల అవుతుందా? అందరూ కలిసి రావద్దా? ఇప్పుడు చూడండి , నాతో పాటు ఆందోళనలో పాల్గొన్న విద్యార్ధులందరూ క్షమాపణ పత్రాలు రాసిచ్చేసి బయట పడ్డారు. ఎందుకూ, ఇలాంటి ఆందోళనలు?"
వెంకటయ్య నవ్వాడు.
"నేను కాదన్నానా! కేవలం ఉద్రేకాల వల్ల ఏ పనులు జరగవు.
క్రమబద్దంగా కొంత శిక్షణలో జరిగినప్పుడే ఆందోళనలు జయప్రదమవుతాయి. మన ధ్యేయం నెరవేరుతుంది. ఈ ఆశయంతోనే నేను రామదండు స్థాపించాను సమాజంలో అవినీతిని రూపుమాపటానికి కంకణం కట్టుకున్న అనేకమంది వీర యువకులు నా దండులో వున్నారు. నువ్వూ చేరతావా?"
"చేరతాను- " వెంటనే అంగీకరించాడు యతి. వెంకటయ్య చెయ్యి జాపాడు - ఆ చేతిలో చేయి కలిపాడు యతి.
7
విధి లేక కాలేజికి వెళ్ళి వస్తోంది మయూర. తోటి పిల్లలు మయూరను పలకరించడానికి ప్రయత్నించారు. కానీ మయూర ముభావంగానే అడిగిన దానికి సమాధానాలు చెప్పి ఊరుకోవటంతో వాళ్ళూ తమపని తాము చూసుకోవటం మొదలుపెట్టారు. మయూర ఇంటికి వెళ్తుండగా మళ్ళీ వేనుకటిలాగా వేణు మోటారు సైకిల్ తో అడ్డుగా వచ్చాడు.
"పిల్లా, ఒంటిగా వున్నావా? జోడు కావాలా?" అని పాడుకుంటూ.
ఎప్పటిలా మయూర తప్పించుకు పోవటానికి ప్రయత్నించలేదు - నిలబడిపోయింది. అది చూసి మోటారు సైకిల్ దిగి మరింత హుషారుగా పాడుకుంటూ దగ్గిరగా వచ్చాడు వేణు. అప్పుడు కాలి చెప్పు తీసి ఆ చెంపా, ఈ చెంపా టపటప వాయించేసి, చకచక ముందుకు సాగిపోయింది .ఏం చెయ్యాలో కూడా అర్ధం కాక దిమ్మెర పోయి నిలబడి పొయాడు వేణు. తరువాత ఏది ఎలా అయినా జరగనీ, వేణునీ అలా చెంప దెబ్బలు కొట్టటంతో మనసు శాంతించినట్లయింది.
క్షణాల మీద ఈ వార్తా కాలేజి అంతా వ్యాపించింది. అంతకు ముందు వేణుని చూసి భయపడిన ఆడపిల్లలు అతడిని చూసి ఒకరి వంక మరొకరు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకో సాగారు. కొందరు అతడిని చూడగానే తమ చెప్పులు చూసుకోసాగారు. మొగపిల్లలు ఏదో ఓదారుస్తూన్నట్లు "ఏమిటి గురూ ఆడపిల్ల ముందు ఓడిపోయావే? అందమైన ఆడదాన్ని చూడగానే నువ్వే అబలవై పోయావా , ఏమిటీ?" అని మరింత వెక్కిరించసాగారు. వేణు అభిమానం తీవ్రంగా దెబ్బ తినింది. అతడు కాలేజికి రావటం మానేశాడు. "పీడా వదిలిపోయింది" అనుకున్నారు చాలామంది. "ఈపని మొదటే చేసివుంటే ఎంత బాగుండేది?" అనుకుంది మయూర. ఇంటికి రాగానే పుస్తకాలు షెల్ప్ లో పడేసి కాలెండర్ చూస్తూ కుచునేది. రెండు నెలల్లోనూ పదిరోజులు మాత్రమే గడిచాయి. ఇంకా యాభై రోజులు గడవాలి! కాలం అసలు కదులుతుందా అనిపించసాగింది. సుబ్బాయమ్మ పరిస్థితి ఇంతకంటే ఘోరంగా వుంది - ఆవిడ మంచం ఎక్కేసింది. ఒక్కసారి తనను చూడటానికి మయూరకు కబురు చేసింది. టౌన్ పక్కనే వున్న పల్లెటూరు - ప్రొద్దున్నే బండి ఎక్కితే మద్యాహ్నని కల్లా ఆ ఊళ్ళో వుంటారు - బండితోలె సాంబయ్య చాలా నమ్మకమైన మనిషి. సెలవులకు యతి ఊళ్ళో వుండి పొలం వ్యవహారాలూ చూసుకుంటున్నప్పుడు యతిని చూడకుండా వుండలేక బండిలో ఆ ఊరికి వెళ్ళి వచ్చేది మయూర ఇదివరలో. ఆ అలవాటు చొప్పున సాంబయ్యను బండి కట్టమని ప్రొద్దున్నే బయలుదేరింది. గోపాలరావు ఊళ్ళో లేడు. పాపం, అతడు కొడుకుని విడిపించుకోవాలని లాయర్ల చుట్టూ , తెలిసిన వాళ్ళ చుట్టూ తిరిగుతున్నాడు. ఒక్కటే ఉండటంతో మరింత బెంగ పడిపోయింది సుబ్బాయమ్మా. మయూరను చూడగానే దీనంగా వచ్చావా! తల్లి! నీకోసమే చూస్తున్నాను అంది. మయూర మందం దగ్గరగా వచ్చి ఆవిడా రెండు చేతులూ తన రెండు చేతులలోకి తీసుకుని కూచుంది. ఇద్దరికీ కళ్ళు నిండుకొస్తున్నాయి. మాట పెగాలటం లేదు. సుబ్బాయమ్మే ముందు మాట్లాడింది.