కోపం ఎక్కువై మయూర దుఖం ఎగిరిపోయింది.
"యతీ! అతి తెలివి చూపించకు - ఇంతవరకూ వేణు మీద ప్రిన్సిపాల్ కి అనేక రిపోర్టులు చేరాయి. అవన్నీ ఏ చెత్త బుట్టలో చేరాయో , ఇవీ అక్కడికే చేరుకుంటాయి. నిష్కారణంగా మేము అల్లరిపడటం మాత్రమే మిగులుతుంది. రావణుడు - రాముడుగా మరిపోవటానికి, మొగపిల్లలతో, అల్లరిపడ్డ ఆడపిల్ల హీరోయిన్ గా చెలామణి కావటానికీ ఇది తెలుగు సినిమా కధ కాదు. శరత్ బాబు నవల అసలే కాదు. నా సంగతి వదిలేయ్? మీరంతా ఏం చేస్తున్నారూ? ఒక్క రౌడీకి బుద్ది చెప్పలేరా?"
ఛాలెంజ్ చేస్తున్నట్లు అడిగింది.
"అవకాశం వచ్చినప్పుడల్లా బుద్ది చెప్తూనే ఉన్నాను."
"అది చాలదు .....వాడిని ఈ కాలేజిలో నుంచి, ఈ టౌన్ లోంచి వెళ్ళగొట్టాలి."
"పాపం నిష్కారణంగా చదువు పాడు కాదూ?"
"ఆ! ఇప్పుడు మహా చదివి వెలగ బెట్టేస్తున్నాడు, వాడుపోతే , మిగిలిన వాళ్ళ చదువులన్నా బాగుపడతాయి."
మయూర మాటలు యతి మనసు మీద బాగా పనిచేశాయి. అతడు ఈ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
యతి నాయకత్వంలో విద్యార్ధుల ఆందోళన ప్రారంభమైంది -----" వేణును తొలగించాలి ! " " డిస్ మిస్ వేణూ!" "దౌర్జన్యం నశించాలి!" అంటూ రకరకాల స్లోగన్లు గొంతు చించుకొని అరుస్తున్నారు విద్యార్దులు. అయితే ఈ ఆందోళనలో విద్యార్ధులంతా పాల్గొనలేదు. వేణు గ్రూప్ కూడా తక్కువ లేదు. వాళ్ళంతా "యతి డౌన్ దౌన్!" ఒకరు మరొకరి పేర హక్కులు తొలగించలేరు." "నో బడి కెన్ డిస్ మిస్ వేణు" అని అరుస్తూ యతి బృందాన్ని ప్రతిఘటించారు.
రెండు బృందాలకూ ఘర్షణలు కూడా ప్రారంభమయ్యాయి. కొందరు గాయపడ్డారు.
విద్యార్ధులలోనూ రకరకాలు, కొందరు వుత్సాహంగా ఈ గలాటాలో ఏదో ఒక వైపుకి చేరిపోయారు. కేవలం సరదాకి! మరికొందరు బయట నిలబడి వింత చూస్తున్నారు. మరికొందరు బుద్దిమంతులు అనవసరంగా చదువులు పాడయి నందుకు మధనపడుతున్నారు. విద్యార్దునులెవరూ ఇళ్ళలోంచి బయటకు రావటం లేదు. కాలేజీ మూతపడింది. కాలేజి గేటు ముందు తిరునాళ్ళలా తయారయింది. పల్లి, బటానీలు సోడాలూ, అమ్ముకునేవాళ్ళ గిరాకీ పెరిగింది. ఘర్షణ తీవ్రమయింది. ఇక పరిస్థితి అదుపు తప్పిందని మేనేజ్ మెంట్ పోలీసులను రంగంలోకి పిలిపించింది. భాష్పవాయువు ప్రయోగాలు, లాఠీ చార్జీలు మొదలైనవి ప్రారంభమయ్యాయి. విద్యార్ధులలో చాలా మందిని అరెస్టు చేసారు - వాళ్ళలో యతి కూడా వున్నాడు. అంతవరకూ విద్యార్ధులలో ఉన్నా ఉత్సాహం , ఉద్రేకం , అరెస్టు కాగానే చప్పబడిపోయాయి. అందరిలోనూ ఏదో పిరికి తనం బయలుదేరింది. యతి తప్ప మిగిలిన అందరూ క్షమాపణ పత్రాలు రాసిచ్చేసి విడుదలయి పోయారు. తన చుట్టూ వున్న మనుష్యులనూ, సంఘాన్నీ చూసి నివ్వెరపోయాడు యతి- చివరకు యతి ఒక్కడే లాకప్ లో మిగిలాడు. వేణు ప్రత్యేకంగా పనికట్టుకుని లాకప్ లో వున్న యతిని చూడటానికి వెళ్ళాడు. గుబురుగా వున్న జుట్టును చేత్తో పైకి తీసుకుంటూ గర్వంగా నవ్వి "హలో మిస్టర్! ఎలా వున్నారు? అన్నాడు. వెటకారంగా..యతి మనసు రగిలిపోయింది- దుర్మార్గుడు. ఆడపిల్లలను ఏడిపించే రౌడి, చదువు సంధ్యల్లో ఏ మాత్రమూ శ్రద్ధ లేని తిరుగుబోతు, దర్జాగా గర్వంగా నిలబడి తననిలా ప్రశ్నిస్తున్నాడు- ఏ తప్పూ చేయక న్యాయం కోసం పోరాడిన తను కటకటాల వెనుక వున్నాడు! కటకటాలను కసిగా గట్టిగా పట్టుకుని "తొందరపడకు మిస్టర్! నేనూ నీ దగ్గరకి వచ్చి "ఎలా వున్నావు?" అని కుశల ప్రశ్నలు వేసే రోజూ వస్తుందిలే" అన్నాడు - వేణు మరింత గర్వంగా నవ్వి "ఆఫ్ కోర్స్ అసలు నువ్వు ప్రాణాలతో జైలు నుండి బయటికి వస్తే" అని విలాసంగా గిర్రున తిరిగి చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు.
మయూర అవస్థ వర్ణనాతీతం - అనవసరంగా యతిని రెచ్చగొట్టినందుకు తనను తాను ఎన్ని రకాలుగానో తిట్టుకుంది. విషయం ఇలా చిలికి చిలికి గాలివాన అయినందుకు ఆందోళనతో ఆమెకు తిండి సహించటం లేదు. కంటికీ కునుకు రావటం లేదు. అరెస్టు చేసిన వెంటనే రాజ్యలక్ష్మి వద్దు వద్దంటున్నా వినకుండా యతిని చూడటానికి వెళ్ళింది. అతడిని చూస్తున్నంత సేపూ ఏడుపు నిగ్రహించుకోవటమే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. మయూరకు ఎన్నో కొన్ని ఓదార్పు ,మాటలు చెప్పగలిగే శక్తి ఆ సమయంలో యతికి లేకపోయింది.
"నాన్న! ఎలా అయినా యతిని విడిపించు నాన్నా! లేకపోతే ఆ పాపమంతా నన్ను చుట్టుకొంటుంది' అని తండ్రి దగ్గర పసిపిల్లలా బావురుమంది ...." అలాగేనమ్మా! నేను మాత్రం ఊరుకుంటానా?" అన్నాడు వేదాంతయ్య. అనటమే కాదు కోర్టుల చుట్టూ ప్లీడర్ల చుట్టూ కాలుగాలిన పిల్లిలా తిరిగాడు? కానీ రోజులు గడిచిపోతున్నా కేసు విచారణకూ రాలేదు. ఈ విషయం యతి తల్లి దండ్రులకూ తెలిసింది. వాళ్ళు గుండె బాదుకుంటూ వచ్చేశారు. అసలే లేక లేక కలిగిన పిల్లవాడు. యతి తల్లి సుబ్బాయమ్మ గుండె బాదుకుంటూ "ఏదో మీ ఇంట్లో వుండి చదువుకుంటాడని ఇక్కడుంచితె వాడిని జైలుకి పంపారా?" అని శోకాలు పెడుతూనే పోట్లాటకి దిగింది. రాజ్యలక్ష్మి సుబ్బాయమ్మ వచ్చేవరకూ ఆవిడకు ఏం సమాధానం చెప్పాలా అని భయపడుతోంది . తీరా సుబ్బాయమ్మ వచ్చి శోకాలు తీస్తూ పోటాటకు దిగేసరికి ఆత్మ రక్షణార్ధం తనూ ఎదురుతిరిగింది.
"ఏదో ఇంట్లో ఉండి చదువుకుంటాడనుకున్నాం కాని ఇలా అల్లర్లకు దిగుతాడను కున్నామా?" అని ఆవిడ సాగదీసింది.
సుబ్బాయమ్మ భర్త గోపాలరావు రాజ్యలక్ష్మినేమి అనలేక "నోరుమూసుకో" అని భార్యను కసిరాడు. అది చూసి వేదాంతయ్య కూడా "బిడ్డ జైల్లో వున్నాడని ఆవిడ కుమిలిపోతుంటే . ఓదార్చటానికి బదులు పిచ్చిగా వాగుతావేం? అని కసిరాడు అక్కడితో వాళ్ళిద్దరూ "వదినా!" అంటే "వదినా" అని ఒకరినొకరు కౌగలించుకుని బావురుమన్నారు. మయూర గది వదిలి బయటికి రాలేదు. తనకు తెలిసిన దేవుళ్లనందరినీ పిచ్చిగా ప్రార్ధిస్తోంది. యతిని విడుదల చెయ్యమని --------
రెండు నెలలు గడిచాక కాని యతి కేసు విచారణకు రాలేదు. అనవసరంగా విద్యార్ధులలో అల్లర్లు రెచ్చగొడుతున్న నేరం ఆరోపించబడింది యతి మీద. క్షమాపణ చెప్పుకొంటే విడుదల చేస్తామన్నారు. కానీ ఎవరెన్ని విధాల నచ్చజెప్పినా యతి క్షమాపణ చెప్పుకోనన్నాడు. మయూర యతి దగ్గరకు వచ్చి "నా ముఖం చూసయినా క్షమాపణ చెప్పుకో యతి." అని ఏడ్చింది. కళ్ళు చెమ్మగిల్లుతున్నా గంభీరమైన స్వరంతో "నువ్వలా అనకూడదు మయూర! చెయ్యని నేరానికి క్షమాపణ కోరుకోవటం కంటే ధైర్యంగా శిక్ష అనుభవించడమే మేలు."
"పాపిష్టిదానిని ఛండాలపు దానిని. నా మూలంగానే నీకి దశ కలిగింది.
"కాదు - నువ్వెంతో మంచిదానివి. నా కళ్ళు తెరిపించావు. ఒక ధ్యేయం నా ముందుంచావు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది కష్ట డశే! కాదనను. కానీ ఒక ధ్యేయంలో నడుస్తున్నప్పుడు, మార్గంలో అన్నీ పూలే ఉండవు-"
మయూర కళ్ళు తుడుచుకుంది.
"ఊహ తెలిసినప్పటి నుండీ బడికి, కాలేజీకి ఇద్దరమూ కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడీ మార్గంలోనూ ఇద్దరమూ కలిసే వెళ్దాం! నేనూ జైల్లో వుంటాను!"
ఆ మాటలకూ చెలించి పోయాడు యతి.
"పిచ్చి మయూరా! నువ్వు జైలుకు వచ్చినా మనిద్దరినీ ఒకచోట ఉంచరు. జైల్లో ఇంకా ఎన్నెన్ని అవినీతి మృగాలు దాక్కుని వున్నాయో ' మనకి తెలియదు. నిన్ను నా మార్గంలో రావద్దన్నానా ? అందుకోసం జైల్లోకి రానక్కరలేదు . ఇంటి దగ్గరే వుండి ప్రయత్నించవచ్చు. ముందు కళ్ళు తుడుచుకో! నా మార్గంలో పయనించటానికి ఇది మొదటి మెట్టు. ఇది సుదీర్ఘ ప్రయాణం మయూరా!"
మయూర కళ్ళు తుడుచుకుంది. మబ్బులు కమ్మిన పగటి వేలుతురులా నవ్వింది.
"యతీ! ఏ మర్గామయినా, ఎంత దీర్ఘ ప్రయాణమయినా , నేను నీతోనే ఉంటాను. నాకేం భయం లేదు" కటకటాలకు ముఖం ఆన్చి అంది.
"మయూర ! నాకొక మాట ఇయ్యగలవా?"
"చెప్పు!"
"నువ్వు కాలేజీ మానకు"
"యతీ!"
"నేను చెప్పేది విను! నేను లేనని వాడు ఏదైనా వెధవ వేషాలు వెయ్యబోతే గట్టిగా బుద్ది చెప్పు- జరిగినదానికి అదే ప్రతీకారం!"
మయూర తల వూపింది.
"ఎవరు బాబూ నువ్వు?" ముందుంచిన ఆహారాన్ని కూడా తినకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న యతిని అడిగాడు ఆ గదిలోకి వచ్చిన ఒక పెద్దమనిషి. యతి చురుగ్గా చూస్తూ "మీరెవరు?" అన్నాడు. అతని పెదవుల మీద ప్రశంసా పూర్వకమైన చిరునవ్వు కనిపించింది.
"ఎవరిలా కనిపిస్తున్నానో చెప్పు!"
ఖద్దరు పంచె, వేయిస్ట్ కోటు , గాందీ టోపీ - ఒక మోస్తరు పొడుగ్గా, కొంచెం లావుగా .........
"రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నారూ" పరిహాస ధోరణిలో అన్నాడు.
"చాలా వరకు కరెక్టే. ఇప్పుడు చెప్పు నువ్వెవరో అవకాశముంటే ఉపకారం చేస్తానే కాని, అపకారం చెయ్యను. చూస్తున్నావుగా కాస్త ఇక్కడ నాకు ఫ్రీగా తిరిగే అవకాశం వుంది. అందుకే కాస్త మిమ్మల్నందరిని పలకరించ గలుగుతున్నాను."
"మీ రెందు కొచ్చారు జైల్లోకి?"
"ఏముంది ? న్యాయం జరగాలని పోట్లాడాను. న్యాయ స్థానం ఇక్కడికి చేర్చింది.
యతిలో కుతూహలం పెరిగింది.