Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 7


    "అదేనండీ: నిన్న సాయంత్రం వచ్చిన తలనొప్పి...."
    "అదా: అది తగ్గిపోయింది. చూశారా? నాకు తలనొప్పి అని కూడా గుర్తులేనంతగా తగ్గిపోయింది-"
    అతణ్ణి తప్పించుకుంటూ చకచక మెట్లుదిగింది జ్యోత్స్న....
    తన గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ భాస్కర్ కి వెళుతున్న జ్యోత్స్న కనపడింది. జ్యోత్స్ననే చూస్తూ అలా నిలబడిపోయాడు.   
    జ్యోత్స్న గేటుదాటాక వెనక్కు తిరిగిన భాస్కర్ కి తననే చూస్తున్న వెంకట్రావు కనిపించాడు. దొరికిపోయిన దొంగలాగ సిగ్గుపడిపోయాడు భాస్కర్.   
    భాస్కర్ కే ఆశ్చర్యం కలిగేలాగ వెంకట్రావు అర్థం చేసుకుంటున్నట్లుగా నవ్వి సానుభూతిగా భాస్కర్ భుజం తట్టాడు. ఆయన ముందు నిలబడలేక తప్పించుకుని వెళ్ళిపోయాడు భాస్కర్.
    సుశీల వంట పూర్తిచేసింది. ఎదురుగా తండ్రి కనిపించాడు. సాధించాలనుకున్నది గుర్తుకొచ్చింది. "అదేమిటి నాన్నా: నాకు మామూలు కాటన్ చీర తీసుకొచ్చావు? కంచిపట్టు చీర తేకపొయ్యావా:" అంటూ ప్రారంభించింది.
    ఏ చీర తెచ్చినా, సుశీలకు సాధించనిదే సంతృప్తి ఉండదని వెంకట్రావుకు తెలుసు....
    "కాటన్ దయితేనేమమ్మా: ఎంతో అందంగా లేదూ?"
    "ఉందిలే మహా: ఇలాంటి చవకరకం చీర మా నాన్న కొన్నారని ఎలా చెప్పుకోను?"   
    "అలా చెప్పుకోవద్దులే: నీ మొగుడే ప్రేమగా కొన్నాడని చెప్పుకో:" ఆఁ మొగుడు.... ప్రేమ.... కట్నం ఇవ్వబడుతుందని ఈయనను అంటగట్టావు. ఎప్పటికప్పుడు కాస్త జీతం కట్టి, తిండి ఖర్చు పెడితే సరిపోతుందనుకున్నావు - చస్తున్నాను. ఎటుకాని గొర్రితోక పట్టుకుని...."  
    ఛ: భాస్కర్ మీద విసుక్కోకు సుశీలా: అతడు చాలా మంచివాడు...."
    "ఆ! అందరూ మంచివాళ్ళే! నేనొక్కదాన్నే చెడ్డదాన్ని- కన్న తండ్రే ఇలా అంటుంటే...."
    ఏడుపు మొదలుపెట్టింది సుశీల. అక్కణ్ణించి చల్లగా జారుకుని గదిలో పడ్డాడు వెంకట్రావు. అతనికి తల తిరుగుతున్నట్లుగా అనిపించసాగింది. ఏం జరగబోతోందో అర్థమయింది అతనికీ జబ్బు కొత్తగా వచ్చింది.
    ముందు తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో అతడు వెలుగును ఏమాత్రమూ భరించలేడు. పగటివేళ అయితే గది తలుపులూ, కిటికీ తలుపులూ అన్నీ వేసేస్తాడు. రాత్రివేళ అయినా దీపాలన్నీ ఆర్పేస్తాడు. ఆ తరవాత వంటిమీద తెలివి లేకుండా మంచం మీద పడిపోతాడు. అలా తెలివి లేకుండా ఒక్కొక్కసారి అరగంట ఉంటాడు, ఒక్కక్కసారి గంటవరకు ఉండిపోతాడు.
    వెంకట్రావు డాక్టర్ కి చూపించుకున్నాడు. ఆయన జబ్బు  లవణాలన్నీ వివరంగా తెలుసుకుని "మీకు తల తిరగటానికి కారణం హైబ్లడ్ ప్రెషర్ - కానీ మీ జబ్బు కేవలం శారీరకమే కాదనిపిస్తోంది. కొంత సైకలాజికల్ కారణం కూడా ఉందనిపిస్తోంది. మీ మనసులో మీకు తెలియకుండానే ఏదో భయం నిగూఢంగా అడుగుపొరల్లో ఉండి ఉండాలి. మీకు తల తిరగటం ప్రారంభం కాగానే ఏమాత్రం వెలుగు భరించలేకపోవటానికి అదే కారణం కావచ్చు. మీరు ఒక సైక్రియాట్రిస్ట్ ని కలవటం ఎందుకయినా మంచిది." అన్నాడు.   
    కానీ, వెంకట్రావు సైక్రియాట్రిస్ట్ ని కలుసుకోలేదు. తన మనసులో ఎక్కడో, దేనికో, ఏదో భయం ఉందని అనుకోవటం అతనికి మనస్కరించలేదు. ఆ విషయం మరొకరి ముందు.... సైక్రియాట్రిస్ట్ ముందయినా సరే, ఒప్పుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేడు. "ఈ జబ్బు ప్రమాదకరమా?" అని అడిగాడు డాక్టర్ ని.    
    "ఏంకాదు- కొద్దిగా నీరసపడతారు. అంతే, అయినా, వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోవటమే మంచిది. ఏ జబ్బైనా ఎందుకు ముదరనివ్వాలి?" అన్నాడు డాక్టర్.    
    డాక్టర్ తన జబ్బు ప్రమాదకరమైంది కాదనటంతో సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే ఆలోచన పూర్తిగా వదిలేశాడు వెంకట్రావు. డాక్టర్ దగ్గర మందు మాత్రం రెగ్యులర్ గా తీసుకుంటున్నాడు.  
    అతనికి తల తిరుగుతున్నట్లుగా అనిపించగానే గదిలోకి వచ్చేసి తలుపులన్నీ వేసేసుకుంటాడు. అంచేత అతని కీ జబ్బు ఉన్నట్లుగా కూడా ఎవరికీ తెలియదు.    
                                            4
    కమలా నెహ్రూ పార్క్ అందమైనదే! ఆ పార్క్ లో రకరకాల పూల మొక్కలున్నాయి. చిన్నపిల్లలకు ఉయ్యాలలూ. జారుడుబండలూ మొదలైనవి ఉన్నాయి. అందమైన లాన్స్ ఉన్నాయి. చిన్న కేంటిన్ కూడా ఉంది. సాయంత్రం అయ్యేసరికి చిన్నా, పెద్దా జనంతో కళ కళలాడుతూ ఉంటుంది పార్క్.     
    ఆ పార్క్ లోనే ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువులో తామర పద్మాలూ, కలువలూ ఉంటాయి. ఆ చెరువు గట్టున సాధారణమైన పచ్చికబయలు మాత్రమే ఉంది. పార్క్ కి వచ్చేవాళ్ళు ఎవరూ ఆ ప్రాంతానికి రారు - అక్కడ ఏ విధమయిన ఆకర్షణా లేదు గనుక.
    కానీ ఆరుబయలు ప్రదేశం కావటంవల్ల అక్కడ సూర్యాస్తమయం మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఏకాంతంగా ఆ పచ్చికలో కూర్చుని అస్తమయ సూర్యుని అరుణకాంతులు చెరువు నీళ్లలో ప్రతి ఫలిస్తోంటే చూడటం జ్యోత్స్న కి చాలా ఇష్టం. ప్రతిరోజూ అక్కడికి వస్తుంది.
    ఆరోజు జ్యోత్స్న వచ్చేసరికి భాస్కర్ అక్కడ ఉన్నాడు. జ్యోత్స్న సంకోచపడి తను వెళ్ళి పోదామనుకుంది. రెండు చేతులూ నేలమీద ఆనించి, ఆ చేతుల మీదుగా వెనక్కు ఒరిగి తల ఒక పక్కకు వంచి ఎటో చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు భాస్కర్.                        

 Previous Page Next Page