Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 7


    "మీ అమ్మగారికి నచ్చితేచాలా? మీ నాన్నగారి మాట?" అడిగింది.
    "మా నాన్న గారి అభిప్రాయాలు నాకు తెలుసు. బహుశా ఆయనకి నచ్చకపోవచ్చు... అయినా నేను చేసుకుంటాను. ఆ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది."
    యశోద "ఆశ" కొంతవరకూ చల్లబడింది "నాన్నగారికి ఇష్టం లేకపోయినా నేను చేసుకుంటాను" అనడం బాగుంది. "ఆ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది" అనటం బాగాలేదు.

    "ఒక విషయం అడుగుతాను. ఏమి అనుకోరుగా?"
    "అడగండి!"
    "కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీ మగవాడికి విడాకులిచ్చి మరొకరిని పెళ్ళి చేసుకోవడం మీ దృష్టిలో తప్పుకాదు కదా?"
    ఉలికిపడింది. పెళ్ళి ప్రస్తావన తెస్తూనే ఈ విడాకుల గురించి మాట్లాడటం ఏదో అపశకునంలా తోచింది. లోలోపల ఏదో గొంతు "పారిపో! పారిపో!" అంటున్నట్లు మనసులో ఏదో గందరగోళం.  
    యశోద మాట్లాడకపోవటం చూసి మళ్ళీ అన్నాడు వివేక్ "వారం కిందట మహిళా సంక్షేమసంఘంలో మీ ఉపన్యాసం విన్నాను. విడాకుల గురించీ వాటి అవసరాన్ని గురించీ. పూర్వకాలంలో సహితం పరాశరుడు, వశిష్టుడు, మొదలైనసంస్కృతి కర్తలందరూ ఏయే పరిస్థితులలో విడాకులు ఆమోదించాలో ఆ వివరాలూ... బ్రహ్మాండంగా ఉపన్యసించారు. ఇప్పుడేమిటీ మాట్లాడరు?"   
    తడబడింది యశోద... ఆమె తడబడటం చాలా అరుదు.
    "ఇప్పుడెందుకీ ఆలోచన? నాకు విడాకులిచ్చే ఉద్దేశంతో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా?" నవ్వటానికి ప్రయత్నించింది.
    "నా అంతట నేను ఏనాడు మిమ్మల్ని వొదలనుకానీ. ఏ కారణం వల్లనైనా ఎప్పుడైనా మీరే నన్ను వదలవల్సిన పరిస్థితి ఎదురైతే. మామూలు ఆడవాళ్లలాగా సిల్లీ సెంటిమెంట్లతో మీ జీవితం నాశనం చేసుకోరుకదా అని"

    ఏమిటీ వింత ధోరణి? పెళ్ళికాబోయే ముందు పెళ్ళికొడుకు కాబోయే భార్యతో మాట్లాడే మాటలేనా  ఇవి?

    "నా జీవితం ఎవరికోసమూ, దేనికోసమూ నాశనం చేసుకోను. పూర్తిగా నాకోసమే జీవిస్తాను!"
    "వెరీగుడ్!"
    దారికి అడ్డు తొలిగి నిలబడ్డాడు. "ఇక వెళ్ళవచ్చు!" అన్నట్లుంది అతని ధోరణి. ఏదో నిరుత్సాహం నిండింది మనసునిండా!
    "వస్తాను!" అని కదలబోయింది. అప్పుడు వెనుక నుండి ఎవరో తోసేసినట్లు వివేక్ ముందుకు వచ్చాడు. యశోద చేతిని అందుకుని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు.
    నిలువెల్లా వణుకుతున్నాడు. పెదవులు వేడిగాకాక చల్లగా ఉన్నాయి స్వేదంతో! అయితేనేం?
    అతడు వదిలిన వేడి ఊపిరి ఆమెను నిలువెల్లా విద్యుత్తరంగాలతో నింపింది. బెదురుగా, భయంగా నాజూగ్గా ఉన్న ఆ చుంబనం ఆమెకి చాలా చాలా చెప్పింది. మనసులో సంకోచాలూ భయాలూ మాయమై అతడి కళ్లలో మెరిసిన ఆరాధనా భావమే మనసంతా నిండింది.  
                                           3  
    కాలేజీ ఆవరణలో బిక్కచచ్చిన ముఖంతో నిలబడింది అరుణ. చూసీ చూడనట్లు ఆమెని దాటుకుంటూ పోవడానికి ప్రయత్నించింది యశోద!
    "యశూ!" అని పిలిచింది అరుణ ప్రాధేయపడుతున్నట్లు.
    యశోద ఆగకుండా వెళ్ళిపోయింది.
    "యశూ! ప్లీజ్! ఆగవే! కొంచెం నా మాట విను!"
    యశోద ఎదుటికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని ఆపటానికి ప్రయత్నించింది.  
    "ఛీ! దూరంగా ఉండు!" విదిలించింది యశోద.
    "ఉంటానులే! చెప్పేది విను!"
    "తొందరంగా చెప్పి ఏడు!"
    "రెండు రోజులుగా ఏడుస్తూనే ఉన్నాను. కావాలంటే చెప్పాక మరోసారి ఏడుస్తాను!"
    "చమత్కారం ఏడిసినట్టు ఉంది. చెప్పేదేమైనా ఉంటే తొందరగా కానీ! నేనుపోవాలి" అంది.
    "నన్నిలా ఆపమని కూడా ఎవడైనా చెప్పాడా నీకు?"
    "ఛ! ఛ! అంత మాటలనకే!" కళ్ళలో నీళ్ళుగిర్రున తిరిగాయి అరుణకి.
    "సరేచెప్పు!" లాన్ చుట్టూ ఉన్న సిమెంట్ గచ్చు మీద కూర్చుంది యశోద. కోపంతో ముడి చినకనుబొమలు అలాగే ఉంచి. 
    "కాస్తనువ్వు!" ఇచ్చకాలుగా అంది అరుణ.
    "ఏడిశావ్ లే! నీకు తోడు అదొకటి తక్కువయింది. తొందరగా చెప్తావా లేదా?"
    "నాకు అతని దగ్గరి నుంచి డబ్బు కావలసివచ్చింది. అంచేత విధి లేక అతనిమాట విని పిలిచాను. అంతే! నిన్ను అవమానించాలనికాదు! అతడితో స్నేహం కలిగించాలనీ కాదు!"
    "ఓహో! ఎందుకట డబ్బు? కొత్త రకం చీరలకా? చైనీస్ రెస్టారెంట్లో డిన్నర్లకా?"
    "అబార్షన్ కి!"
    "వాట్?"
    "అవును! ఈ నెల పీరియడ్స్ మిస్సయ్యాను. తొందరగా చేయించుకొనకపోతే ప్రమాదం!"
    "ఛ! మరీ అంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించావ్?"
    "ప్రేమించి చేసుకుంటే కట్నాల బాధ లేకుండా పెళ్లవుతుందనుకున్నాను. రూట్ తప్పింది!"
    "ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడూ చెయ్యకు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు!"
    "హమ్మయ్య! నీ కోపం పోయినట్లేకదా!" గభాలున యశోద బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది అరుణ.
    "ఛీ!" అని బుగ్గ రుమాలుతో తుడుచుకుంది యశోద.
    "పాపం! జానీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా తెలివి రాలేదు. నీ హీరో భలే కొట్టాడు!"
    మాట్లాడలేదు యశోద.
    "ఎంత అదృష్టమే నీది! ఎవరివంకా కన్నెత్తి చూడని వివేక్ నీ స్నేహం కోరుతున్నాడు. అందంగా ఉన్న ప్రతి ఆడపిల్లనీ తన వెంట తిప్పుకునే జానీ కూడా నిన్నే కలవరిస్తున్నాడు.

 Previous Page Next Page