Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 8


     నిజానికి - ఏ ఇంట్లో మాత్రం భార్యాభర్తలు కీచులాడుకోకుండా వుంటారు? ఆయన పేరున్న రచయిత కనుక, అందులోనూ హాస్య రచయిత అయినందువల్ల బయటపడ్డాడు. ఇంటి గుట్టు రచ్చకెక్కింది. తమాషా ఏమిటంటే... ఆ కీచులాటలు చాటునుంచి కూడా హాస్యం తొంగిచూసేది.  ఇందుకు తార్కాణంగా ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మగారు ఒకసారి ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని పేర్కొంటాను -


     మునిమాణిక్యంగారికి రాత్రి తిరుగుళ్లు ఎక్కువ. (చెడు తిరుగుళ్ళు కాదండోయ్!) ఆ స్నేహితుడి దగ్గరికీ, ఈ మిత్రుడి కాడకూ వెళ్లి - కొందర్ని వదల్లేక, మరికొందర్ని వదిలించుకోలేక కబుర్లు చెప్పి, కాలక్షేపం చేసి రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు.  ఆలస్యంగా వచ్చినందుకు ఇంట్లో అక్షింతలు తప్పవనీ, యుద్ద సన్నాహాలు జరుగుతున్నాయనీ తెలిసి ఇల్లాలిని శాంతపరచడానికి రోజుకో కథ అల్లి చెప్పేవారు. (ఎంతైనా ...కథా రచయిత కదా!)


    ఒకరోజు రాత్రి ఆన కుడికాలి బొటవేలుకి గుడ్డ కట్టుకుని కుంటుకుంటూ  ఇంటికి వచ్చారు.

"ఏమైందీ...." అంటే - దారిలో కాలికి దెబ్బ తగిలి రక్తం వచ్చిందని చెప్పారు.


    అమ్మగారేమీ మాట్లాడలేదు. మామూలుగా అన్నం పెట్టింది. అది తిని ఆయన ఆదమరచి నిద్రపోయారు.

 
    'తల్లి పుట్టిల్లు మేనమామకి తెలీదా...' అన్నట్లు - పంతులుగారి వేషాలు ఆవిడకి తెలియవా! నెమ్మదిగా ఆయన కుడికాలి బొటనవ్రేలికున్న గుడ్డ విప్పింది. అక్కడ గాయమూ లేదు, పాడూ లేదు. దొంగ దొరికిపోయాడు.


     ఏమీ ఎరగనట్లు ఆ గుడ్డని కావాలని ఎడమకాలి బొటనవ్రేలికి కట్టింది. మర్నాడు ఆయన నిద్రలేచి ఎడమ కాలితో కుంటడం మొదలుపెట్టాడట.


     "మీకు గాయం అయింది కుడికాలి బొటనవ్రేలికి కదండీ..... ఇప్పుడు ఎడమకాలు కుంటుతున్నారేమిటి?"అనేసరికి ఇంక ఏం సమాధానం చెప్తాడు ఆ మానవుడు....!


     మల్లెల పరిమళం, మొగలిరేకుల పరిమళం - రెండూ మత్తెక్కించేవే. కాని, మల్లెలు మనసుని  చల్లబరిస్తే, మొగలి - మైకం కమ్మిస్తుంది. (ఎంత ఘాటు ప్రేమయో.... బ్రాండ్) మునిమాణిక్యం గారి హాస్యం మల్లెల పరిమళం వంటిది.  ఆయనకి తగిన గుర్తింపు రాలేదేమో,  ఆయన్ని మనవారు సముచిత రీతిలో గౌరవించలేదేమోనని నాకు అనిపిస్తూంటుంది. అందుకే ఈ హాస్యకథల సంపుటిని ఆయనకు 'గురదక్షిణ ' గా సమర్పిస్తున్నాను.


     ఈ సంకలనంలో పెద్దకథలతోపాటు 'మెనీ' మినీకథలు వున్నాయి. పెద్దకథలన్నీ కూడా హాస్య ప్రధానమైనవే.  వీటిలో 'ఊరగాయ నవ్వింది, వ్రతం అయింది కానీ... , దశమగ్రహ గ్రహణం' వంటి బహుమతి పొందన  కథలూ వున్నాయి. 'ఓ ధృతరాష్ట్రుడి కథ' వంటి ప్రత్యేక సంచికలలో వచ్చిన కథలూ వున్నాయి.

 
    మినీకథల్లో సగం వరకు హాస్యకథలే. ముఖ్యంగా కొసమెరుపులో. మిగిలినవి హాస్యేతర కథలు. మొత్తం తీపే తింటే మొహం మొత్తేటట్లు - మొత్తం హాస్యం వున్నా వెగటు కలగవచ్చునన్న శంకతో వీటిని చేర్చడం జరిగింది.

 
    మామూలుగా ఏ పుస్తకానికీ ఇంత పెద్ద ఉపోధ్ఘాతం నేను రాయలేదు. కాని దీనికి రాయడం అవసరమనిపించింది. పైగా... .ఇతర రసాల గురించి సుదీర్ఘంగా రాస్తే నీరసం పాలు ఎక్కువై నవ్వులపాలు కావచ్చు. కాని, ఇది హాస్యరసం కనుక రామరసం లాగా ఆస్వాదించేటట్లే వుంటుంది అనిపించింది. చ్యూయింగ్ గమ్ లా ఉషారెక్కిస్తుందనే నా నమ్మకం.


     ఈ హాస్యకథా సంకలనానికి అభిప్రాయాలు రాసిన డా: రాజశేఖర పాండేగారు, హాస్యబ్రహ్మ శంకరనారాయణగారు, డా: వేదగిరి రాంబాబు గార్లు తమ తమ రంగాల్లో జగజ్జట్టీల వంటివారు. త్రిమూర్తులవంటి ఈ ముగ్గురూ వారి అభిప్రాయాలను రాయడం నా అదృష్టంగా  భావిస్తారు. వారు వెలిబుచ్చిన మంచిమాటలు నన్ను మరిన్ని  మంచి కథలు రాసేటందుకు ప్రేరేపిస్తాయి.


     'నవ్వుతూ నాలుగు మాటలు' చెప్పిన డా: రాజశేఖర పాండేగారు హాస్య ప్రసంగాలకి, మిమిక్రీకి, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కి, ఇంకా ఎన్నింటికో సిలబస్ వంటివారు. పలు రంగాలలో పేరు పొందిన  ఆయన శిష్యగణం సంఖ్య వందలలో  వుంటుందంటే అది ఆశ్చర్యకరమే కాదు,  అభినందనీయం కూడా! మిమిక్రీ శ్రీనివాస్  వంటి   అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన  కళాకారుని మలచింది ఆయనే. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి నా మీద అభినందన వర్షం కురిపిచడం,  నన్ను ఆర్ . కె. నారాయణ్ తో పోల్చడం నా పూర్వపుణ్య విశేషం. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


     హాస్యబ్రహ్మ శంకరనారాయణగారి గురించి చెప్పేముందు అంతకు కొంచెంముందు తెలుగునాట  నెలకొని  వున్న హాస్య పరిస్థితుల గురించి కొంచెం ముచ్చటించుకోవాలి.


     పత్రికలలో హాస్య రచనలు పలచబడ్డాయి. హాస్య నాటకాలు తెరమరుగు అవుతున్నాయి.  పోతుకూచి సాంబశివరావుగారు 'హాస్య సంధ్య' లనీ, ఇంకెవరో ఇంకేవో హాస్య కార్యక్రమాలనీ  పెట్టినా,  నవ్వే శ్రోతలు కరువైపోయారు. అప్పటినుంచే తెలుగువారిలో హాస్య ప్రియత్వం తగ్గిపోతోంది అన్న విమర్శలు వినపడజొచ్చాయి.

 
     ఒకసారి ఒక హాస్య సమ్మేళనానికి వెళ్లాను. చక్కని జోక్ లు చెప్పగలవారు ఎందరో కమ్మని జోక్ లు కర్ణపేయంగా, జనరంజకంగా  చెప్తున్నారు. అయినా ఘనత వహించిన మన శ్రోతలు నవ్వరే...! కాన్ స్టిపేషన్ తో బాధపడ్తున్నట్లు ముఖాలు బిగదీసుకుకూర్చున్నారు.  ఇంక ఇది పని కాదని అప్పటికప్పుడు ఒక చిన్న కవిత చెప్పా.


    'నవ్వనివాడు, నవ్వించని వాడు
     ఇతరుల్ నవ్విన తానేడ్చెడివాడు '


    ఎవడురా వాడు? - ఇంకెవడు... మన తెలుగువాడు


     కాదు - కాదు - వట్టి తెలుగుగాడు!'.... అని.


     ఇంక నవ్వక చస్తారా? వాళ్ల తెగులు అలా వదిలించాను.

 
     సందర్భం వచ్చింది కనుక మరో చిన్న సంఘటన చెప్తాను - 1962లో పోతుకూచి వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో అఖిల భారత తెలుగు మహాసభలు జరిగాయి. అప్పుడు ఒక కవి మిత్రుడు మరో కవిని ఈ విధంగా పరిచయం చేశాడు....

 
    "వీరి కవిత్వంలో "కమ్మ' దనం ఎక్కువగా వుంటుంది" అన్నాడు - ఆయన కులాన్ని దృష్టిలో పెట్టుకుని.


     వెంటనే నేను ఈ కవిగారి కులాన్ని దృష్టిలో పెట్టుకుని "మీ కవిత్వంలో " కాపు' దనం ఎక్కువగా వున్నట్లు!" అన్నాను.

 
     ఇద్దరూ నవ్వారు. ఆ నవ్వు పైపూత నవ్వో, లోపల్నుంచి వచ్చిందో ఊహకి అందదు.

 
     అవధాన ప్రక్రియలను పండితులేకాక...., పామరులు కూడా ఆస్వాదించగలిగేట్టు చేసి చరిత్ర సృష్టించిన వారు బ్రహ్మ శ్రీ మాడుగుల నాగఫణి  శర్మగారు. ఆ ఒరవడిలో  ఎన్నొకొత్త కొత్త  అవధానాలు వచ్చాయి. వాటిలో అత్యంత ప్రచారం పొందింది -  శంకరనారాయణగారి హాస్యావధానం.  అప్పటికే ఆయన 'ఫన్ చాయతీ, ఫన్ దేహాలు' వంటి వ్యంగ్య శీర్షికలద్వారా సుప్రసిద్దులు. ఆయన  మొదలుపెట్టిన హాస్యావధానాలు 'ఇన్ స్టెంట్ హిట్' అయ్యాయి.  ఏ సభకైనా ఆయన హాస్యావధానం ప్రధాన  ఆకర్షణ అయింది. అంతటి క్రౌడ్ పుల్లర్ ఈ మధ్య కాలంలో రాలేదు.  అందుకే ఆయనకు తెలుగువారు 'హాస్యబ్రహ్మ' అని బిరుదు  ఇచ్చి తమ హాస్య ప్రియత్వం ఇంకిపోలేదని  నిరూపించుకున్నారు. నిజానికి భమిడిపాటి కామేశ్వరరావుగారికి 'హాస్యబ్రహ్మ' అన్న బిరుదు వుండేది. కాని, అది కాలంపుటలలో కలిసిపోయింది. ఈనాడు 'హాస్యబ్రహ్మ'  అంటే శంకరనారాయణగారే.  అటువంటి హాస్యబ్రహ్మ - 'హాస్యకథా మోహనుడు'  అంటూ నా రాత రాయడం నా అదృష్టం.  ఆయన రాసినది చదివితే ఆయన వేదిక మీదే కాదు - కాగితం మీద కూడా అవలీలగా  అవధానం  చేయగలడని  అర్దం అవుతుంది.  ఆయనకి  నా మనఃపూర్వక ధన్యవాదాలు.


     త్రిమూర్తులలో మూడవవాడైన డా: వేదగిరి  రాంబాబు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు. మనసులోని  మాటను మర్మం లేకుండా ఎదుటే అనేసి మనసును స్వచ్చంగా, నిష్కపటంగా  వుంచుకునే సచ్చీలుడు. అడిగినవారికి,  అడగనివారికి కూడా అవసరమైన సహాయాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే  ఉదార హృదయుడు. అసలు - నాలుగు దశాబ్దాలపైనుంచి వేల సంఖ్యలో ప్రచురితమైన నా రచనలు ఇప్పుడు ఇంత తరచుగా పుస్తకాల రూపంలో  వస్తున్నాయంటే  అందుకు ప్రేరణ ఆయనే.  కేవలం ప్రేరణే కాదు. .., ప్రతి విషయంలోనూ నావెంట వుండి పలురకాలుగా సహాయపడ్తూ, పుస్తకాలు బయటకు రావడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఆయనకి  కృతజ్ఞత చెప్పడం అంటే అది మా ఆత్మీయతను కించపరచినట్లు. మరి, ఆయన పట్ల నా మనసులో వున్న భావాలను చెప్పడానికి నాకు మాటలు దొరకడం లేదు.

 Previous Page Next Page