ఆ తర్వాత ఓసారి ఆయనకు నా 'కె. ఆర్. కె. మోహన్ కథలు' పుస్తకం ఇచ్చాను.
మూడు రోజుల తర్వాత ఆటనంతట ఆయనే నాకు ఫోన్ చేశారు -
"మోహన్ గారూ... మీ పుస్తకంలో చాలా కథలు ఇంతకుముందే పత్రికల్లో చదివాను. ఇప్పుడు మళ్ళీ చదివాను. నాకు కొన్ని బాగా నచ్చాయి. కొన్నిటిని మనం డిటైల్డ్ గా చేయాలి. మనం ఓసారి కూర్చుందాం" అన్నాడు.
అయితే అది జరగకుండానే ఆయన వెళ్ళిపోయాడు. కాని, తమంతట తామే ఫోన్ చేసేంతటి సహృదయత ఎందరికీ వుంటుంది...!
ఆ తర్వాత గత సంవత్సరం మే లోనో, జూన్ లోనో ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మిగారి 'కథామందారం' పుస్తక ఆవిష్కరణ సభలో మేం కలుసుకున్నాం. ఆ సభకి నేను అధ్యక్షుడిని, ఆయన ముఖ్య అతిథి. అప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడే ఈ 'హాస్య కథల సంపుటి' తీసుకువస్తున్నట్లు , దాని ఆవిష్కరణ ఆయన చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాను.
"అంతకంటేనా.... ఇట్ విల్ బి మై ప్రివిలేజ్!" అన్నారాయన.
కాని, నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆయన అంటుండేవారు -
"నవ్వించడం ఒకయోగం - నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒకరోగం!" అని. ఈ పుస్తకానికి ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగే యోగం లేకుండా పోయింది. ఏం చేస్తాం - ఆయన మరీ తొందరపడి అడ్డాదారిలో పరలోకానికి పారిపోతే....!
జోక్స్ కి నవభాష్యాన్ని , నూతన రూపాన్ని, అపూర్వ గౌరవాన్ని కల్పించినవాడు జంధ్యాల. ఒక జోక్ కి సార్దకత ఎప్పుడు వస్తుందంటే. ... అన్నవారూస విన్నవారూ కూడా అందులోని స్వారస్వాన్ని అర్దంచేసుకుని, ఆనందించగల నేర్పరులైనప్పుడే వస్తుంది. మనం వేసిన జోక్ ని ఎదుటివాడు అర్దంచేసుకోలేక వెర్రిచూపులు చూసినా, ఏడవలేక నవ్వినా, 'ఎందుకు చెప్పాంరా.....' అని మనకు ఏడుపు వస్తుంది. జోక్స్ ని అర్దంచేసుకోగల, చెప్పగల కంపెనీ వుండడం సుకృతం.
తనమీద తాను జోక్ వేసుకుని నవ్వుకుని ఆనందించే వాళ్లనగానే నాకు మాజీ ముఖ్యమంత్రి అంజయ్యగారే గుర్తుకి వస్తారు. ఆయన మీద వచ్చినన్ని జోక్ లు ఇంకెవరిమీదా రాలేదు. వీటిలో అధిక భాగం కల్పితాలే! (సర్దార్జీల మీద కల్పించినట్లు).
అంజయ్యగారి పి. ఏ. ఒకాయనతో నాకు మంచి పరిచయం వుండేది.
రోజూ ఆఫీసుకి వెళ్లగానే ఆయన్ని పిలిచి "పి. ఏ. సాబ్.... నా మీద ఈరోజు కొత్త జోకులు ఏమి వచ్చాయి?" అని అడిగిమరీ చెప్పించుకుని విని ఆనందిస్తూ పగలబడి నవ్వేవాడట. అన్నీ విని "వీళ్లు బలే ఖతర్ నాక్ గాళ్లోయ్!" అనేవాడట.
అంజయ్యగారింటికి నేను మిత్రులతో కలిసి రెండు మూడుసార్లు వెళ్లడం జరిగింది.
ఆయన బొత్తిగా కల్మషం లేని వ్యక్తి. మనస్పూర్తిగా నవ్వేవాడు. ఆ నవ్వులో పసిపిల్లల అమాయకత్వం కనిపించేది. నేను నిర్వహించిన ఒక సభకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చాడు. అప్పుడు కూడా ఎంతో ఉల్లాసంగా నలుగురినీ నవ్విస్తూ, తాను కూడా నవ్వుతూ మాట్లాడాడు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశంగారు సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్యగారు వున్న ఇల్లు మాత్రం నిలుపుకోగలిగారుత. అంతే తేడా! ఇద్దరూ అవినీతికి ఆమడదూరాన వున్నవారే! కావాలనుకుంటే కోట్లకు పడగలెత్త గలిగినవారే! అవినీతిపరుడు కానందుకే అంజయ్యగారి నవ్వులో అంతటి నిర్మలత్వం గోచరించేది.
శబ్దం స్థాయిని డెసిబుల్స్ లో కొలుస్తారు. నవ్వులో రకాలని కూడా మనం వర్గీకరించవచ్చు. మందహాసం లేక చిరుహాసం (ఇది దుస్సమానం.) దీనినే'చిరునవ్వు' అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఇది మునిమాణిక్యంగారి కథల్లోలాగా సంసార పక్షంగా వుండి మనసుకి కితకితలు పెట్తుంది. ఇందులో నోరు వెడల్పు అవుతుందే కాని, శబ్దం వుండదు. దీని పైది హాసం. దీనిలో నోరు వెడల్పు కావడంతోపాటు కళ్లు కూడా పెద్దవి కావడమో, కుంచించుకుపోవడమో జరుగుతుంది. శబ్దం కూడా వినిపిస్తుంది. మందహాసాన్ని 'మూకీ' అనుకుంటే, హాసాన్ని 'టాకీ' అనవచ్చు.
హాసంలో ముదురుపాకం వస్తే అది 'దరహాసం' అవుతుంది. దీని తర్వాతది 'అట్టహాసం' దీన్లో నోరు, కళ్లు కాకుండా ఒళ్ళు కూడా కదిలిపోతుంది. శబ్దం తారాస్థాయిని చేరుతుంది. దీని తీవ్రత ఎక్కువైతే పగలబడి నవ్వడం, పొట్ట చేత్తో పట్టుకోడం, కడుపులో పేగులు మెలికలు తిరిగిపోవడం, నేలమీద పడి గిరికీలు కొట్టడం వంటి వివిధ భంగిమలు చోటు చేసుకుంటాయి.
మునిమాణిక్యం గారిది మందహాసం అనుకుంటే, భమిడిపాటి వారిదీ, ముళ్ళపూడివారిదీ దరహాసం అవుతుంది. లారెల్ - హర్డీ, త్రీ స్టూజెస్ వంటి వారి హాస్యచం అట్టహాసం అవుతుంది.
నవ్వు అనేది చక్కిలిగింతలు పెట్టినా వస్తుంది. అరికాలు గోకినా వస్తుంది. కాని, మనిషిని ముట్టుకోకుండా మాటలతో మనసుని కవ్వించి నవ్వించగలిగినదే అసలైన హాస్యం. ఈ పుస్తకాన్ని నేను మునిమాణిక్యం నరసింహారావుగారి దివ్యస్మృతికి అంకితం ఇయ్యడంలో ఎంతో ఔచిత్యం వుంది. ఆయన మాకు బందరు హిందూ హైస్కూల్ లో టెన్త్ లోనూ, యస్. యస్. యల్. సి. లోనూ హిస్టరీ, ఇంగ్లీషు నేర్పేవారు.
ఆయన కొన్నిసార్లు అర్జంటుగా తన కథని ఏదో పేపర్ కి పంపాల్సివచ్చేది. వెంటనే ఆ కథని క్లాసుకు తీసుకు వచ్చేవారు. కొందరు కుర్రాళ్లను ఎంపికచేసి, వాళ్లకి తలో కాగితం ఇచ్చి, కాపీ చేయమనేవారు. అలా మేము కాపీ చేసిన కాగితాలను తన కాపీగా వుంచుకొని, తాను రాసిన ప్రతిని పోస్టు చేసేవారు. ఆయన ఎంపిక చేసిన కుర్రాళ్లలో నేనూ ఒకడిగా వుండడం నా అదృష్టం. అప్పుడ నా రాత ఇప్పటిలాగా కోళ్ళు కెక్కరించినట్లుండేది కాదు. ముత్యాల్లా కాకపోయినా ముచ్చటగానే వుండేది.
మునిమాణిక్యం గారు కాగితాల మీద ఎం హాస్యాన్ని పండించినా, బయట మాత్రం సీరియస్ గా వుండేవారు. ఎప్పుడూ ముఖం మటమటలాడుతుండేది. విసుగూ, చిరాకు ఎక్కువ. ఆయన నవ్వుతుండగా చూసిన జ్ఞాపకం లేదు. ఆయన దగ్గర నాకు చనువుండేది. ఓసారి నేను ఆయన్ని అడిగాను -
"మాష్టారూ .. మీ పేరు మునిమాణిక్యం. మీరేమిటి - మునిలాగా శాంతంగా వుండకుండా కస్సూబుస్సూ అంటుంటారు?" అని.
"మునిమాణిక్యం నా పేరు కాదురా... అది మా ఇంటిపేరు. నా పేరు నరసింహారావు. అందుకే ఉగ్రంగా వుంటాను" అన్నారు.
అప్పుడూ ఆయన నవ్వలేదు కాని, ఆ సమాధానం లోనే చక్కని హాస్యాన్ని చిలికించారు.
మునిమాణిక్యం గారి ఇంటి దగ్గర్లో వుండే కొందరు మా క్లాసు కుర్రాళ్లు అంటుండేవారు - "ఆయనా, భార్యా ఎప్పుడూ కీచులాడుకుంటుంటారు. ఇంట్లో కోపం వీధిలోకి వచ్చినా చల్లారకే - క్లాసులో ధుమధుమలాడుతుంటారూ.... " అని.