అతనంటే ఎందుకంత ఇష్టమో తనకు తెలియదు.
అతనికీ తనకూ ఎంతో అంతరమున్న సంగతి తెలుసు.
అతనికి రోజూ ఓ గులాబీ పువ్వివ్వకుండా ఆమె వుండలేదు.
అలా పువ్వతనికి అందిస్తోంటే సంతోషంతో ఆమె హృదయం పులకించిపోతుంది.
* * * *
పాప డబ్బుల లెక్కచూసుకొంది. ముప్పై రూపాయలున్నాయి.
చిన్న పర్సులో భద్రంగా పెట్టుకొని , దాట్లో మార్కెట్ దగ్గర యింట్లోకి కావల్సిన కూరలు కొనుక్కొని చేతిసంచీలో వేసుకొని బయల్దేరింది.
ఇంటికి చేరేసరికి చీకటిపడింది.
తండ్రి రోగిష్ఠివాడు. మంచంమిద నుంచి లేవలేడు. కూతురికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
కూతుర్ని చూడగానే అతని మొహం సంతోషంతో వికసించింది.
"ఆకలేస్తోందా నాన్నా?" అనడిగింది పాప.
" లేదులే అమ్మా!" అన్నాడు నిజంగా ఆకలిగానే వుంది.
" మొద టీ కాచిస్తాను వుండు నాన్నా. అన్నమయ్యే సరికి ఆలశ్యమౌతూంది కదా " అంటూ పాపటీ కాచే ప్రయత్నంలో మునిగిపోయింది.
అతని పేరు వరదరాజు. పాప ఒక్కతే కూతురు. భార్య పోయాక కూతుర్ని చాలా గారాబంగా , అల్లారు ముద్దుగా పెంచాడు. కూతురికి పెద్దయాక మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఎన్నో కలలుకనేవాడు. కాని పాప పదేళ్ళ వయసులో వుండగానే దురదృష్టవశాత్తూ ఆరోగ్యాన్ని కోల్పోయి పొట్టగడవటంకోసం కూతుర్ని చిన్న చిన్న పనుల్లో పెట్టాల్సివచ్చింది. ఆ వయసులో కల్లోకూడా వూహించని విధంగా కూతురు కష్టపడాల్సి రావటం చూస్తే కడుపు తరుక్కుపోయేది. అయినా ఏమి చెయ్యలేని నిస్సహాయస్థితిలో పడిపోయాడు. ఇంట్లో లేచి నాలుగడుగులు అటూ యిటూ వెయ్యగలగటం తప్పిస్తే యింకో పనిచేసే శక్తి లేదు.
పాపకు యుక్త వయసొచ్చి నలుగురి దృష్టీ ఆమెమిద పడి, వాళ్ళ చూపులు ఆమెను చీల్చేస్తోన్నా కూడా, దిగమ్రింగి వూరుకోవటం తప్పిస్తే ఏమి చెయ్యలేకపోయేవాడు.
పాప తండ్రి టీ కాచి ఓ గ్లాసులో తీసుకొచ్చింది. తాను కూడా ఓ కప్పులో తెచ్చుకుంది.
టీ తాగుతూ కిరసనాయిల్ బుడ్డి దీపం వెలుగులో కూతురి ముఖంవంక పరీక్షగా చూస్తున్నాడు.
" ఏమిటి నాన్నా అలా చూస్తున్నావు?" అనడిగింది పాప.
" నీకు...."
" చెప్ప నాన్నా."
" పెళ్ళి చెయ్యాలమ్మా!"
" పాప నవ్వింది. "అప్పుడే తొందరేముది నాన్నా."
" ఈ సమాజం గురించి నీకు తెలీదమ్మా. నీకు గానూ నువ్వు ఓ రక్షణ కల్సించుకోకపోతే సజావుగా బతకనివ్వదు, ఊపిరాడనివ్వదు."
" మనం ధైర్యంగా, నలకడగా వుంటే యీ సమాజం ఏం చేస్తోంది నాన్నా?"
" అలా అనకమ్మా .మనం ఎంత ధైర్యంగా , మనోనిబ్బరంతో వున్నా, సమాజం ముందు బలహీనులమే అవుతాం!
పెళ్ళి!
పాప కపోలాలు సిగ్గుతో ,ఓ రకం అర్థ్ర్రభావంతో ఎర్రబారినట్లయినాయి.
మనిషి జీవితంలో పెళ్ళి ఓసుందర స్వప్నం మధురాతి మధురమైన ఘట్టం.
ఇన్నాళ్లూ పదిలంగా దాచుకున్న వయస్సు. పవిత్రంగా కాపాడుకున్న మనసు ఎంతో ప్రేమగా , పరిపూర్ణంగా అర్పణ చేసుకునే మహత్త ర ఆధ్యాయం.
" చూద్దాంలే నాన్నా" అని వూరుకుంది.
ఆ రాత్రామెకు ఎంతకూ నిద్రపట్టలేదు.పెళ్ళి తలపులు వెంట తరుముతూంటే ఓ రకం భయం, గగుర్పాటు అంతలోనే సంతోషం..
తనకు కాబోయే పెళ్ళికొడుకు ఎలా వుంటాడు!
అందంగా ,. హుందాగా,యువరాజులా...
ఎవరతను?
రూపం తెలియటం లేదు.
ఏ అర్ధరాత్రికో నిద్ర పట్టింది.
ఆ కలత నిద్రలోనే చిన్న కల.
తను పెళ్ళి బట్టల్లో వుంది. పెళ్ళి షామియానా అంతా చుట్టప్రక్కాలతో కలకల్లాడిపోతోంది.
పెళ్ళికొడుకు కోసం ఆతృతగా వెదుకుతోంది తన పెద్ద పెద్ద కళ్ళను అటూ ఇటూ త్రిప్పుతూ.
చివర కతన్ని వేదికమిదకు తీసుకొచ్చారు.
ఒక్క సారిగా ఉలికిపడింది. సంతోషంతో వొళ్ళాంతా జలదరించింది.
చంద్రి! సూర్యచంద్ర.
నిజమా? తనకంత అదృష్టమా? తన అరాధ్యదైమైన అతన్తో తనకు వివాహమా?
బాజాలు జోరుగా మ్రోగుతున్నాయి. పురోహితులు మంత్రాలు వుచ్ఛరిస్తున్నారు.
మంగళసూత్రం కట్టటానికి అతను లేచి నిలబడ్డాడు. ఎవరో జడఎత్తి పట్టుకున్నారు.
భజంత్రీలు తారస్థాయిలో మ్రోగుతున్నాయి.
ఉన్నట్లుండి మెలకువ వచ్చేసింది. కల విరిగిపోయింది.
" అయ్యే!" అనుకుంది. మనసు చివుక్కుమనగా.
ఎంత పిచ్చికల! ఇలా జరిగేదా? అది సంభవమా?
ఆ తర్వాత ఎంతకూ నిద్రపట్టలేదు. ఎందుకో.... ఎందుకో మరి.... ఆమె కళ్ళవెంట నీళ్ళు కూరుతున్నాయి.
6
మంజరి పేరులలో సూర్యచంద్ర రాసిన కధ ఒక ప్రముఖ వారపత్రికలో అచ్చయింది.
ప్రస్తుతం అసంఖ్యాకంగావున్న కొత్త రచనా సరళుల మత్తుమందులో వున్న పాఠకులు దాన్ని గురించి పట్టించుకోక పోయినా, కొంతమంది సాహిత్యవేత్తలకది నచ్చింది.