Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 7

    
    "ఒంట్లో ఏమీ బాగాలేదు. డాక్టరు దగ్గర కెడుతున్నాడు."


    "అబ్బో! నెలలతరబడి నాకు నీరసం, గుండెదడా వున్నా డాక్టరు దగ్గర కెళ్లలేదుగానీ, యీవిడగారికి కాస్త వంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ అవసరమొచ్చిందట'అనుకొని "ఏమిటి సుస్తీ?" అనడిగింది వెటకారంగా.


    "గుండెల్లో నొప్పిగా  వుంది" ముక్తసరిగా జవాబిచ్చి బయటకు వచ్చేసింది.


    లేడీ డాక్టరుకు నలభై అయిదు యాభై ఏళ్లమధ్య వుంటాయి. లావుగా, ఎత్తుగా వుంది.


    ఆవిడ దగ్గరకు వచ్చే కేసులన్నీ అలాంటివే. పెళ్లయిన వాళ్లు, పెళ్లి కానివాళ్లు, మరీ చిన్న చిన్న లేతపిల్లలు, ప్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ మధ్యలో ఫెయిలయి కడుపులు తెచ్చుకున్న వాళ్లు, భర్తలు ఆపరేషన్ భయంతో, లేకపోతే మొండి తనంతో సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదాలు వేస్తూ, శరీరాన్ని పీల్చుకుతింటూంటే కడుపులు తెచ్చుకొన్నవాళ్లు, పెళ్లి కాకుండా 'తప్పు' చేసి కడుపులు తెచ్చుకొన్నవాళ్లు.....


    లేడీ డాక్టరు ముప్పయి రూపాయలు తీసుకొని శకుంతలని పరీక్ష చేసింది.

 
    "మూడోనెల వచ్చింది."


    శకుంతల ఎదురుచూస్తోన్న జవాబే అయినా కడుపులో త్రిప్పినట్లయి, కళ్లు చీకట్లు క్రమ్మాయి.


    బయటికొచ్చి సిస్టర్స్ ని ఖర్చుల గురించి వివరాలడిగింది.


    "డాక్టరమ్మగారు రెండొందల యాభయి రూపాయలు తీసుకొంటారు. మా నలుగురి సిస్టర్స్ కు కలిపి యాభైరూపాయలు. హాస్పిటల్లో మూడు నాలుగు గంటలసేపుంటే చాలు. తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు."


    శకుంతల తన దగ్గరున్న డబ్బులు లెక్క చూసుకొంది. చాలవు.


    ఒంటిమీద ఎంతో బంగారంలేదు. భర్త వుండగానే అవసరాన్నిబట్టి అప్పుడప్పుడూ తాకట్టులో పెడుతూ వుండేవాడు. ఆ తాకట్టు విడిపించుకోలేక, వడ్డీలు కట్టలేక వాటిని వొదిలేసుకొని వూరుకొనేవాడు.

 
    భర్త పోయాక తీసేసి భద్రంగా దాచిన మంగళ సూత్రాలున్నాయి. అవి అమ్మేసి ఉద్యోగం వెదకటానికి పోతున్నానని అబద్దం చెప్పి మూడో కంటికి తెలీకుండా ఎబార్షన్ చేయించేసుకుంది.


                                           5

    
    సాయంత్రం అయిదవగానే పాపతన దగ్గరునన సరుకులన్నీ అయిపోవటం గమనించింది పాప.

 
    డబ్బులు లెక్క చూసుకొంది.

 
    ముప్పయి రూపాయలదాకా వున్నాయి.

 
    సంతోషంతో ఆమె మొహం వికసించింది. ఇది తన కష్టార్జితం. పదిహేను, పదహారేళ్ల వయస్సులో - మిగతా ఆడపిల్లల్లా హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ సినిమాలు చూసుకుంటూ, స్వేచ్చగా గడపాల్సిన వయసులో ప్రతిక్షణం డబ్బు గురించి ఆలోచిస్తూ డబ్బు కూడబెడుతూ, భవిష్యత్తు గురించి తాపత్రయపడుతూరోజులు గడుపుతోంది.


    రిక్షావాళ్లు, సైకిలు షాపులవాళ్లు, కాలేజి కుర్రాళ్లు తన దగ్గరకొచ్చి వెటకారంగా మాట్లాడుతూంటారు. ద్వందార్ధాలతో ప్రశ్నలువేస్తూ వుంటారు. వినిపించీ వినిపించుకోనట్లు నటించి, తేలిగ్గా నవ్వేసి వూరుకొనేది. అవన్నీ సీరియస్ గా తీసుకొంటే యీ సమాజంలో బ్రతకటం కష్టమని ఆ లేత వయసులోనే ఆమె అర్దం చేసుకొంది.


    ఆడపిల్ల వంటరిగా కనబడితే పదహారేళ్ల పిల్లాడి దగ్గర్నుంచీ, అరవై ఏళ్ల ముసలాడిదాకా పెర పెరలాడిపోతూ వుండటం ఆమె గమనించింది.

 
    ముఖ్యంగాకాలేజి కుర్రాళ్లు క్లాసులకు ఏటైములో వెడతారోగానీ,  ఎప్పుడు చూసినా రోడ్లమీద గుంపులు గుంపులుగా నిలబడి కనబడతారు. ఒక్కడికి కన్ను ముక్కు తీరు సరిగ్గా వుండదు. కాని ప్రతివాడూ తానో సినిమా హీరో ననీ, చాలా స్మార్ట్ గాఅనీ, తన్లో ఏదోఅతీత ఆకర్షణలున్నా యనీ అనుకొంటూ వచ్చిపోయే వాళ్లకి ఏవేవో పేర్లు పెడుతూ, వ్యాఖ్యానిస్తూ వెకిలి కళలేస్తూ వుంటారు. ఈ హీరోల ప్రతాపమంతా నలుగురితో కలసి గుంపుగా వున్నప్పుడే ఎప్పుడయినా వంటరిగా వుండటం తటస్థిస్తే - ఎదురుగా నలుగురయిదుగురు ఆడపిల్లలు కలిసికట్టుగా వస్తే కాళ్లు గజగజ వొణుకుతాయి. వొళ్ళంతా చెమట పడుతుంది.


    తలిదండ్రులు కష్టపడి సంపాదించి డబ్బు పంపిస్తూంటే - ఆ డబ్బు విలువ తెలీక సిగిరెట్లకీ, సినిమాలకూ తగలేసి, గంటకోసారి కాకాహోటళ్ల దగ్గర పోజుగా నిలబడి టీలుతాగి ఫ్యాంట్ లూ, బుష్ షర్టులూ, టీషర్టులూ  - బూతులతో కాలం గడిపే యీ కుర్రాళ్లకి చదువులు పూర్తిచేసుకుని జీవితంలోకి అడుగుపెట్టేసరికి - సరయైన ఉద్యోగాలు దొరక్క, చదివిన  చదువులకూ, చేసే ఉద్యోగాలకూ పొంతనలేక, ఘోరంగా రాజీపడుతూ, ముందు ముందు ఎలాంటి భయంకరమైన జీవితాలు గడపాలో వూహకు కూడాఅందదు.


    పాప బాబుగార్ని గురించి ఆలోచిస్తోంది.


    బాబుగారంటే సూర్యచంద్ర.


    అతని పేరామెకు తెలుసు. అయినా ముద్దుగా బాబుగారని తనలోతాను పిల్చుకొంటూ వుంటుంది.


    అలా పిల్చుకుంటే ఆమెకు సరదా.


    అతనంటే ఆమెకెంతో ముచ్చట.


    ఆమె వంటరిగా వున్నప్పుడల్లా అతన్ని గురించి ఆలోచన్లతోనే మునిగిపోయి వుంటుంది. అతని రూపంతో ఆమె గుండె నిండిపోయి వుంటుంది.


    అతని స్మృతులతో ఆమె కళ్లు అప్పుడప్పుడూ అనుభూతులను వొలికించి విషాద స్రవంతులు అలుముకున్నట్లు - తడితో నిండిపోతాయి.   

 Previous Page Next Page