Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 7

"చేత వెన్న ముద్ద...అను తల్లీ!" అంది మంగమాంబ
"చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ బంగాలు మొలతాలు పత్తుదత్తి
సందె తాయెత్తులును సలిమువ్వగజ్జెలును, చిన్ని కిట్నా నిన్ను నేచేలి కొలుతు" వింటున్న మంగమాంబ ఆశ్చర్యంతో తెరిచిన నోరు అలానే ఉండిపోయింది. ఎప్పుడు నేర్చుకుంది? తను నేర్పలేదే?...
"అమ్మా! సలిగా చెప్పానా?" వెంకమాంబ పద్యం పూర్తిచేసి, తల్లి ఏమీ మాటాడక పోవటంతో తనే తిరిగి అడిగింది. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది మంగమాంబ. రెండుచేతులనూ కూతురిముఖం చుట్టూ తిప్పి తన థలకుహ్ రెండువైపులా ఉంచుకుని మెటికలు విరిచింది.
"చాలా బాగా చెప్పావు తల్లీ! ఈ పద్యం ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్పించలేదే?" అంది మంగమాంబ.
"అప్పులు నువ్వు పాలావుగా!" అంది కళ్ళింత పెద్దవిచేసి వెంకమాంబ.
"ఎప్పుడు?"
"అప్పులూ!" అంది చెయ్యిపెట్టి వెనక్కి చూపిస్తూ.
సుమారుగా 3,4 నెలల క్రితం పక్కింటికి చుట్టంచూపుగా వచ్చిన వారి అబ్బాయిని కూర్చోపెట్టి నేర్పింది. అంతే! ఇన్నాళ్ళు గుర్తు పెట్టుకుందా? మంగమాంబకి అదొక అద్భుతంగా అనిపించింది.
"మలి! నాకూ వెన్న, బంగాలు మొలతాలు, గజ్జెలు....అన్నీ కావాలి" గారాబంగా అడిగింది.
"తప్పమ్మా! అలా అడగకూడదు. అవన్నీ మనలాంటి వాళ్ళకి కాదు జేజికి" మంగమ్మ  నెమ్మదిగా అర్ధం అయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేసింది. ఇంతవరకు అడిగిందేదీ కాదనలేదు. అడగకుండానే అమర్చటం అలవాటు.
"మలి! నాతో ఆలుకుంటాలే వాలికున్నాయి..."
"ఎవరమ్మా అతను నీతో ఆడుకునేది. నే నెప్పుడూ చూడలేదే!"
"అదో! వాలే! ఎప్పుడూ నాతోనే ఉంటాలు" -అంటూ గోడపైన తగిలించి ఉన్న బాలకృష్ణుని చిత్రాన్ని చూపించింది.
ఆశ్చర్యాన్నించి ఇంకా కోలుకోని మంగమాంబ అయోమయంలో పడింది.
"ఎవరమ్మా?..." అంది.
"అదిగో! చూలు! నవ్వుతూ చూత్తున్నాలు కిట్న"
మంగమాంబకి భయంవేసింది. పిల్లకి గాలిసోకిందో ఏమో! సంధి ప్రేలాపనల లాగా ఉన్నాయి. నుదుటి మీద చెయ్యివేసి చూచింది. పొట్ట, పక్కలు తడిమి చూచింది. ఏమాత్రం వేడిగా అనిపించలేదు. ఇప్పటికి ఊరుకో పెట్టటం మంచిదేమో అనిపించింది.
"సరే! అట్లాగేలే! నీ స్నేహితుడికి మల్లే నిన్ను కూడ తయారు చేస్తాను. కాని ఎవరికీ కృష్ణుడు నీ స్నేహితుడని చెప్పకు. తెలిసిందా!"
"ఎందుకు?" అమాయకంగా అడిగింది.
మంగమాంబ ఏం చెప్పగలదు? ఒక్క క్షణం ఆలోచించింది.
"కృష్ణుడికి ఇష్టముండదు. చెపితే అందరూ వాళ్ళతో ఆడుకోమంటారు. అప్పుడు నీతో ఆడటానికి సమయముండదు కదా!"
"అయితే సరే నీకు కూడా చెప్పద్దా?"
"నాకు చెప్పచ్చులే!"
లేచివెళ్ళి వెంకమాంబ కోరినట్టుగా పావడా కోసం ప్రత్యేకంగా కంచినుంచి తెప్పించిన పట్టుబట్టని పంచెలాగా కట్టింది. జుట్టుదువ్వి ముందువైపుగా జడఅల్లి కొండెముడి వేసింది. వెనకజుట్టు గిరజాలుగా వదిలింది. పూలచెండు కొండెముడి చుట్టూపెట్టింది. స్వామి సేవకు వినియోగించే నెమలీకల విసనకర్రలోనుండి ఒక ఈక తీసి దానిమధ్యలో కలికితురాయిలాగా అలంకరించింది. అమ్మమ్మముద్దుగా చేయించిన మామిడిపిందెల మొలతాడు నడుముకి చుట్టింది. చేతులకి వంకీలు, దండకడియాలు పెట్టింది. కాలికి ఎప్పుడు ఉండే కడియాలు, మువ్వలు సరిచేసింది. చేతులకి ఉన్న మురుగులని సరిచేసింది. లక్కగాజులు కొత్తవి సందుగాయ పెట్టెలోంచి తీసివేసింది. చివరగా నుదుట కస్తూరి తిలకం, గోపీచందనం తిరునామాలుగా తీర్చింది. ముక్కాలిపీట మీద నిలబెట్టి, వంటింట్లోకి వెళ్ళి వెన్నతెచ్చి వెంకమాంబ చేతిలో పెట్టింది.
"తిను!" అంది.
ఆ బాలిక ముఖమంతా సంతోషం. కళ్ళనిండా ఆనందం, సంతృప్తి మంగమాంబకి. ఈ పనులు చేస్తూ ఎనలేని సంతోషాన్ని అనుభవించింది. "యశోద ఎప్పుడూ ఇటువంటి ఆనందాన్నే పొందేదికాబోలు. ఎంత అదృష్టవంతురాలు? ఒక్కరోజుకే తనకింత ఆనందం లభించిందే! రోజూ అయితే....!"
ఆ ఆలోచనకే శరీరం పులకించింది.
"రోజూమాత్రం ఎందుకు లభించధు? ఇకనుంచి తనబిడ్డకి చేసే సేవలన్నీ కృష్ణార్పణం! ఎంతైనా కృష్ణసఖికదా!"
అపుడు మంగమాంబ మనస్సులో పురిటింటి దృశ్యం కదలాడింది. వెంకమాంబ పుట్టిన క్షణంలో బొడ్డుకోయకముందే ఆ నెత్తురు గుడ్డు బాలకృష్ణుని చూచి కేరింతలతో ఆడిన దృశ్యం అంటే బాలకృష్ణుడు తనతో ఆడుతున్నాడని వెంకమాంబ చెప్పినమాట అసత్యం కాదన్నమాట ఆనాటి ఘట్టం దర్శించిన తర్వాత కూడా తాను ధృతరాష్ట్రుడిలా ప్రవర్తించిందే అమ్మో! ఇప్పటికైనా భగవదనుగ్రహం వల్ల తన కళ్ళు తెరుచుకున్నాయి. కారకురాలు మాత్రం తన గర్భశుక్తి ముక్తా ఫలమే. అటువంటి బిడ్డకు జన్మనిచ్చే అదృష్టాన్ని కలిగించినందుకు ఏడుకొండల వెంకన్నకు సదాకృతజ్ఞురాలై ఉండాల్సిందే!
"వేంకటేశా! నమోనమః ఏడుకొండలవాడా! వెంకట రమణా! శతకోతి వందనాలు" అంటూ ఎత్తుపీటమీద నిలబడ్డ వెంకమాంబ పాదాలపై తలమోపి కూర్చుండిపోయింది తలెత్తిచూస్తే...
వెంకమాంబ తన కుడిచేతిఒని ముందుకుచాపి వెన్నచూపిస్తోంది. బుంగమూతిపెట్టి గారాలు పోతోంది"తినూ!" అంటూ.
మంగమాంబ తలగిర్రున తిరిగినట్లయ్యింది. మిడిగుడ్లేసుకుని చలనంలేకుండా ఉండిపోయింది.
వెంకమాంబ చేతిలో వెన్నముద్ద ఎవరో తీసుకున్న జాడలు ఇంకెవరు?....ఆ లీలా మానుష విగ్రహుడు తన చర్మచక్షువులకి కనిపించడు కదా! అయినా అపురూపమైన ఆ దివ్య ఘట్టాన్ని చూడగలగటం అనే గొప్ప అదృష్టం కలిగింది తనకి. అదీ ఒక్కక్షణమాత్రం. ఆ పరమ భక్తాగ్రణి తన గర్భాన ఉదయించిన కారణంగా, లభించింది. దీనిని ఉపమానంగా తీసుకుని ఈ మిగిలిన ఘట్టాలని అర్ధంచేసుకోవాలి.
బిడ్డని ఎత్తుకుని ముద్దాడాలని ఎంతో కోరిక కలిగినా, సంభాళించుకుంది - బాలకృష్ణుడు వెంకమాంబలు ఆడుకొంటుంటే మధ్యలో పానకంలో పుడకలా ఎందుకని.
    
                                                             * * *

 Previous Page Next Page