Previous Page Next Page 
13... 14.... 15 పేజి 8


    కానీ మధూహ అంతగా  ఎందుకు చెప్పింది? అన్నా ఉత్సుకతతో మొదటి పేజీ చదవటం ప్రాంభించాడు.

    "కొండల వెనుక పగలు నేను పారేసుకున్న జ్ఞాపకాల మూటని భుజాన వేసుకుని, ప్రతిరాత్రీ నన్ను బాధపెట్టటానికి లోయల్లోంచి చంద్రుడు బయటకొస్తాడు".

    మొదటి వాక్యానికే ఉలిక్కిపడి, ముందుకువంగి, తిరిగి చదవటం ప్రారంభించాడు.

    "నీ జ్ఞాపకాల వీధుల్లో నా మనసు పచార్లు చేస్తూ వుంటుంది.

  నా పాదం రోదిస్తూనే వుంటుంది. రుధిరం స్రవిస్తూనే వుంటుంది. నీ మజిలీ మాత్రం కనపడదు."

    "నేను నా దాన్ని

    నన్ను మీటు. నీకు అనురాగాన్ని ఇస్తాను.

    నేను స్వేదాన్ని.

    నన్ను గుర్తించు. నీకు సేవలందిస్తాను.

    నేను  వేదాన్ని.

    నన్ను చదువు. నీకు పరిపూర్ణత్వాన్నిస్తాను."


    వణికే చేతివేళ్ళతో సిగరెట్ తీసుకుని వెలిగించాడు.

    ఏమిటిది?  కవిత్వమా? హృదయమా?

    అతడి  కంటిచూపు అక్షరాల వెంట పరుగెడుతోంది.

    "నీకు తెలుసా? అర్థరాత్రి సముద్రం మాట్లాడుతుందని? ఆ సాగర ఘోషలో నా హృదయం నాకు కనపడుతుంది. నాలాగే సముద్రం కూడా ఒంటరిది ఆకాశంలా నువ్వు దూరంగా వున్నంతసేపూ!...

    గంట పట్టిందతడికి చదవటం పూర్తి చేయటానికి.

    ఆ తరువాత స్థబ్దుగా అలాగే వుండిపోయాడు. తలుపు చప్పుడయ్యే వరకూ ఈ ప్రపంచంలోనే లేడు.

    స్టాఫ్ ఆర్టిస్ లోపలికి వచ్చాడు. ఆ రోజు ప్రింటింగ్ కి వెళ్ళాల్సిన పేజ్ తయారుచేసి తీసుకొచ్చాడు. "ఎడిటోరియల్ ఇస్తారా సార్" అని అడిగాడు.

    "వ్రాయలేదు" అన్నాడు శాస్త్రి "అది అవసరం లేడు కానీ, ఆ ఖాళీ స్థలంలో కొత్త సీరియల్ ప్రకటన వెయ్యి. 'వచ్చేవారమే ప్రారంభం' అని పెద్ద అక్షరాల్తో ప్రకటించు".
   
    ఆర్టిస్టు ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ "టైటిల్ ఏమిటి సార్" అని అడిగాడు.
   
    శాస్త్రి ఆమె పెట్టిన టైటిల్ వైపు చూసాడు.

   
                    ది డైరీ ఆఫ్ మిసెస్ లక్ష్మి

    శాస్త్రికి నచ్చలేదు. లక్ష్మి అనే రచయిత్రి నవల  వ్రాస్తూ దానికి ఆ పేరే పెడ్తే బాగోదు. అదీగాక అలాంటి పేరు మీదే ఇంకో నవల ఇదివరకే వచ్చింది.

    సినాప్సిస్ చూసాడు.

    దంపతులకి చాలారోజులుగా సంతానం కలగదు.... ఆమె జీవితం నిరాసక్తం అవుతుంది. డాక్టర్ కలుసుకుంటుంది. ఆ డాక్టరు ఆమెని పదమూడోరోజు రమ్మంటాడు.

    ఎడిటర్ శాస్త్రికి అంతకుముందు చదివిన అడ్వర్టయిజ్ మెంట్ గుర్తొచ్చింది.

    ఆ నవలకి పెట్టదగే పేరు స్ఫురించింది.

    పెన్ తీసుకుని వ్రాతప్రతిమీద పెద్ద  అక్షరాల్తో టైటిల్ వ్రాసేడు.


                                                 13... 14... 15...

                                            3

    పదిరోజులయ్యాక ఒక సాయంత్రం రాజుని కలుసుకోవటానికి డాక్టర్ విశాల్ క్లినిక్ కి వెళ్ళింది మధూహ.

    అక్కడి జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది.

    దాదాపు యాభైమంది దాకా  వున్నారు పేషెంట్లు. రాజు వాళ్ళందరితో బిజీగా వున్నాడు. మదూహని చూసి నవ్వుతూ, "చూసేవా మా ప్రకటన చూసి ఎవరూ రారన్నావు. ఎంతమంది వస్తున్నారో" అన్నాడు.

    "మంచిదేగా" అంది మధూహ. "....నాక్కూడా నీ దగ్గిర ఉద్యోగం ఇవ్వరాదూ?"

    "ఇంకొంచెం బిజినెస్ పెరగనీ, డాక్టర్ గారికి చెప్పి ఇప్పిస్తాను"

    "అవునూ. మీ డాక్టర్ గారు కనపడం లేదేమిటి?"

    "సంతానోత్పత్తి కేంద్రాన్ని ఆయన చూసుకుంటారు. దీన్ని నేను చూసుకుంటాను. నేనిప్పుడు కేవలం ఉద్యోగస్థుడిని కాననీ, నాకూ షేర్ ఇచ్చారనీ చెప్పాగా" అంటూండగా ఫోన్ మ్రోగింది.

    రాజు రిసీవర్ తీసి మాట్లాడసాగాడు. అతడు  మాట్లాడే విధానాన్ని బట్టి అట్నుంచి డాక్టర్ విశాల్ అని తెలుస్తోంది.

    ".........అలాగే సార్. అయిదు నిమిషాల్లో పంపుతాను" అని ఫోన్ పెట్టేశాడు.

    మధూహ అక్కడే బల్లమీదవున్న పత్రిక చేతుల్లోకి తీసుకుంది.

    "నువ్వు పత్రిక చదువుతూ వుండు. నేనిప్పుడే వస్తాను" అంటూ టాయిలెట్ లోకి వెళ్ళాడు రాజు.

    జనం అంతా కుర్చీల్లో  కూర్చుని వున్నారు. వాళ్ళ తలలకి ఇనుపచట్రాల్లా ఏవో బిగించి వున్నాయి. బహుశ మాగ్నెట్స్ అయి వుండొచ్చు. మైండ్ మాగ్నో థెరపీ...

    అందరూ కళ్ళు మూసుకుని నిద్రలో వున్నట్టున్నారు.

    ఏం చెయ్యాలో తోచక పత్రిక తిరగవేయటం ప్రారంభించింది.

    ఒక చోట ఆగిపోయింది.

    13... 14.... 15...

    ఆమె తన కళ్ళని తానే నమ్మలేనట్టు మళ్ళీ  చూసింది. ఉద్యోగం పోవటానికి ముందు తను అందజేసిన స్క్రిప్టే! అప్పుడే  ప్రింటింగ్ లోకి వచ్చేసింది!

    తను రికమెండ్ చేసిన నవల  వేసినందుకు ఆమె మనసులో ఎడిటర్ కి కృతజ్ఞత చెప్పుకుంది.

    ఆమె ఆ వారం  సీరియల్  చదవబోయే సమయానికి రాజు లోపల్నుంచి వచ్చాడు. మనిషి కాస్త అలిసినట్టున్నాడు. నుదుటి మీద చెమట పట్టి వుంది.

    "అలా వున్నావేం?" అడిగింది.

    "ఏం లేదు. బాగానే  వున్నానే" హాల్లో పేషెంట్లు ఇంకా మెగ్నేట్ థెరపీలోనే వున్నారు.

    దూరం నుంచి ఒక కుర్రాడు రావటం చూసి గుర్తు పట్టింది. వారం రోజుల క్రితం అతడిని ఇదే క్లినిక్ లో చూసింది. అంతకు ముందు నెలరోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు. అప్పటికి క్లినిక్ ఇంకా అంత పేరు తెచ్చుకోలేదు. అయిదుగురో.... పదిమందో వుండేవారు. వాళ్ళంతా ఆమెకు తెలుసు.

    ఆ సంభాషణ ఇప్పటికీ జ్ఞాపకం వుంది.

    "నీ పేరు?"

    "నా......నా..... నాగభూషణం"

    "ఈ క్లినిక్ కి దేనికోసం వచ్చావు?"

    "న....న....నత్తి తగ్గించుకోవటం కోసం."

    "ఎన్ని రోజులైంది చేరి?"

    "న్నె....న్నె.... నెలర్రో.....ర్రో.....ర్రోజులు"

    "మరింకెన్ని రోజులుండాలి"

    "వా......వా....."

    "వారామా"

    "అవును"

    "నెలరోజుల్లో తగ్గనిది ఇంకో వారంలో ఎలా తగ్గుతుంది?"

    ఆ రోజు ఆ కుర్రాడు చెప్పింది ఆశ్చర్యమనిపించింది. "......మొత్తం వంట్లో వున్న శక్తినంతా ఈ నెలరోజుల్లో మేగ్నెట్ ద్వారా  మెదడులోకి తెచ్చారు. ఇప్పుడిక దాన్ని నాలుకలోకి పంపుతారు. దానికి వారం పడుతుంది. అంతే...."

    "ఇంకో వారంలో నీ నత్తి తగ్గిపోతుందంటావ్"

    "తప్పకుండా"

    వారం తరువాత మళ్ళీ ఇప్పుడే ఈ కుర్రాడిని చూడటం. అతడు దగ్గరికి వచ్చాడు. "ఈ రోజుకు అ... అ... అయిదు వారాల కోర్సు అయిపోయింది" అన్నాడు.

    "వెళ్ళిరా బాబూ" అన్నాడు రాజు.

    "నా..... న.... నత్తి తగ్గలేదు"

    "చెప్పాగా. నూటికి ఒకరికి హిప్నాటిజం ఎక్కదు. అలాటి కేసుల్లో నువ్వొకడివన్నమాట. ఏం చేస్తాం. మా ప్రయత్నాలన్నీ మేము చేసాము...."

    అప్పుడా చిన్న కుర్రాడి కనపడిన నైరాశ్యాన్ని. తరువాత చాలాకాలం వరకూ మర్చిపోలేకపోయింది మధూహ.

    అతడు నిరాశగా వెనుతిరిగి, భారంగా అడుగుల వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె అటే  చూస్తూ "హిప్నాటిజం పట్టకపోవటమేమిటి రాజూ" అని అడిగింది.

    "స్ట్రాంగ్ గా విల్  పవర్ వున్న  వాళ్ళకి ఇది పట్టదు"

    "తనకి దృఢమైన మనస్సున్నందుకు ఆ కుర్రాడు సంతోషించాలా? నత్తి తగ్గనందుకు విచారించాలా?"

    సమాధానం రాకపోయేసరికి తలతిప్పి చూసింది. రాజు అక్కడ లేడు. పేషెంట్లు తలల్నుంచి చట్రాలు తీస్తున్నాడు.

                                                                             4

    సాయంత్రం ఇంటికొచ్చాక మధూహ ఈ సీరియల్ చదవటం ప్రారంభించింది.


                               *    *    *

    రాత్రి పదకొండయింది. అతడు అయిదు నిముషాల నుంచీ కాలింగ్ బెల్ కొడుతున్నాడు. భార్యవచ్చి తలుపు తీయలేదు. అతడికి ఆశ్చర్యంగా అనిపించింది.

    సాధారణంగా తనొచ్చే వరకూ ఆమె ఎంతరాత్రయినా మేల్కొనే వుంటుంది.

    అటువంటిది ఈ రోజు తలుపు తీయటానికి రాలేదేమిటి?

    మామూలుగా తను ఇంటికి వచ్చేసరికి ప్రతిరోజూ పన్నెండు దాటుతుంది.

    ఈ రోజు తొందరగా రావటంవల్ల తలుపు తీయలేదా? అనుకున్నాడు.

    అంతలో తలుపుల మధ్యలో సందు కనపడింది.

    లోపల గడియ వేసి లేదు.

    అతడికి ఆశ్చర్యం వేసింది. భార్యకేమయినా అయిందేమోనని భయం కూడా కలిగింది. తలుపు తోసుకుని లోపల ప్రవేశించాడు. లోపల బెడ్ రూంలో భార్య పడుకుని వుండటం చూసి తేలిగ్గా వూపిరి పీల్చుకుని,

    "ఒంట్లో బావోలేదా?" అని అడిగాడు.

    "భోంచేసారా?"

    "లేదు. నే చేస్తాలే. పడుకో...."

    అతడు  మరో పావుగంటలో భోజనం ముగించి, వచ్చి ఆమె ప్రక్కన చేరాడు.

    సన్నటి నడుము, ఎత్తయిన వంపు..... ఆమె పక్కకి తిరిగి పడుకుంటే చాలా అందంగా వుంటుంది. అందులోనూ, ఇంకా పిల్లలు కలగకపోవటం వాళ్ళ ఆమె వయసు ఇరవై ఎనిమిది అంటే ఎవరూ నమ్మరు.

    అతడు  ఒక క్షణం మామూలుగా పడుకుని ఆమెవైపు తిరిగాడు. అతడికి ఆమె దాదాపు ప్రతిరోజూ కావాలి.

    దగ్గిరగా జరిగాడు.

    ఆమె అటు పక్కకి తిరిగి పడుకుని వుంది. అతడి చేతులు ఆమెనెక్కడో స్పృశిస్తున్నాయి. ఆ విషయంలో అతడు ఒకప్పుడు నేర్పరి. పెళ్ళయిన కొత్తలో ఆమెని బాగా మచ్చిక చేసుకునేవాడు. ఆమెకు చాలా నేర్పాడు. తరువాత ఉత్సాహం తగ్గిపోయింది. ఉద్యోగమూ, వ్యాపారమూ, స్నేహితులూ, పార్టీలూ....రాత్రి ఎప్పుడో వచ్చాక......ఓ అరగంట. తరువాత నిద్ర. ఆ రోజు కూడా అలాగే  అతడామెని తనవైపుకి తిప్పుకుని మీదకు వంగాడు.

 Previous Page Next Page