రాబోయే అతి సమీపకాలంలో మైండ్ హిప్నో మాగ్నో క్లినిక్ లక్షలమంది జనాల్ని ఆకర్షించబోతోందని శాస్త్రికి అర్థమైంది.
రాజు వెళ్ళిపోయాక, 'చేతి వాచిని' సద్దుకుంటూ తిరిగి తన పనిలో మునిగిపోయాడు.
* * *
పార్కులో అరగంట నుంచీ ఎదురుచూస్తోంది మధూహ. ఆరున్నరకి వచ్చాడు అతడు. అరగంట ఆలస్యంగా.
"సారీ"
"ఫర్వాలేదులే"
"ఇద్దరూ చెట్టుక్రింద కూర్చున్నారు. కొద్దిగా చీకటి పడింది. "ఈ రోజు మీ పత్రికాఫీసుకి వెళ్ళాను" అన్నాడు రాజు.
ఆమె ఆశ్చర్యంగా "ఎందుకు?" అని అడిగింది.
"మా క్లినిక్ ప్రకటన ఇవ్వటం కోసం.....నీకో మంచి వార్త"
"ఏమిటి?"
"మా డాక్టర్ గారు నాకు లాభాల్లో కాస్త షేర్ ఇస్తామన్నారు."
"ఏదీ?" ఆ మైండ్ హిప్నో మాగ్నో క్లినిక్కేనా? అసలు ఒక్క పేషెంట్ అయినా వస్తాడంటావా?
"వస్తారు"
"అంతకుముందు హిప్నాటిజం క్లినిక్ పెట్టినప్పుడూ అదే చెప్పావ్. అది మూతపడింది. ఇప్పుడు దాదాపు ఇదీ అలాంటిదే కదా. పోతే దానికి మరికొన్ని మిషన్లు కలిపావ్. జనం ఆ మాత్రం గ్రహించాలేరా?"
"ఈ రోజే అన్ని పేపర్లలో ప్రకటనలు ఇచ్చాంగా. చూస్తూ వుండు.....జనం ఎలా విరగబడతారో"
"ఏమో. నాకు నమ్మకం లేదు బాబూ"
"ఇంత మంచి వార్త చెపితే అలా డల్ గా వుంటావేటి?"
"నీకో చెడ్డవార్త"
"ఏమిటి?"
"నా వుద్యోగం పోయింది" అంటూ ఆమె జరిగినదంతా చెప్పింది.
అంతావిని, "ప్రయివేటు ఉద్యోగాల్లో వున్నప్పుడు అందరితో కాస్త మంచిగా వుండాలి. అందరికన్నా ముందు నిన్ను తీసేసారంటే అది నీ అసమర్థతే. నన్ను చూడు చేరిన కొద్ది నెలల్లోనే పార్టనర్ షిప్ కూడా ఇచ్చేలా చేసుకున్నాను" అన్నాడు.
"నీలా బ్రతకనేర్వటం అందరికీ చేతకాదులే" అందామె నిర్లిప్తంగా. ఆ క్షణం అతడు తనని ఓదార్చకపోయినా కనీసం ఒక ఉచిత సలహా ఇవ్వకుండా వుంటే బావుణ్ణు అనిపించింది.
"రేపట్నుంచీ ఏం చేస్తావ్?"
"అదే అర్థం కావటంలేదు. ముఖ్యంగా అమ్మకు తెలుస్తే అసలు తట్టుకోలేదు. ఉద్యోగం పోయిందని తెలియగానే ఇక సంసారం వీధిన పడిపోయిందన్నంతగా ఊహించుకుని బాధపడుతుంది".
"చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని, లేని ప్రమాదాన్ని ఊహించుకుని భయపడటాన్ని- 'ప్యూచరోఫోబియా' అంటారు. మీ అమ్మని మా క్లినిక్ కి పంపు. ట్రీట్ చేసి పంపుతాం....."
మధూహ విసుగ్గా, "ప్రతిదానికీ నీకు తెలిసిన రెండు మూడు ఇంగ్లీషు జబ్బుల పేర్లు చెప్పకు" అంది. అతడు నవ్వి "అసలు మా టెక్నిక్క్ అది. రోగి తన రోగ లక్షణం ఏదైనా చెప్పగానే, అది చాలా సామాన్యమైనదయినా దానికో ఇంగ్లీషు పేరు పెడతాం. మరో రకంగా చెప్పాలంటే జబ్బుల్ని మేమే సృ....ష్టి....స్తామన్న మాట" అంటూ కాస్త అటూ ఇటూ చూసి ఆమె వొళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. బాగా చీకటిపడటంతో జనం పల్చగా వున్నారు.
"రాజూ.....వచ్చేనెల ఒకటో తారీఖుకి నాకో రెండొందలు సర్దగలవా? ఈ నెల జీతం రాదు" అంది."
"రెండొందలా? కష్టం అనుకుంటాను. నా సంగతి తెలుసుగా. చాలా కాలిక్యులేటెడ్ గా వుంటాను? దాని లెక్క దానికి విడదీసి వుంచుకుంటాను."
"ఆర్నెల్ల క్రితం ఇలాగే ఒకసారి అడిగితే, పదిరోజుల ముందు చెప్తే అడ్జెస్టు చేసేవాడిని అన్నావుగా" అంది.
"అన్నాను. నీకు మోరల్ సరోర్ట్ ఇవ్వటానికి! చూడు మధూ....ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి. ప్రేమంటే.....తలవాల్చుకోవటానికి భుజం వెతుక్కోవటం కాదు....."
"మరి నా బాధలు నీతో కాకపోతే ఎవరితో చెప్పుకోను?"
"అది ప్రేమ కాదు. స్వార్థం. నా బాధ నీతో ఎప్పుడైనా చెప్పానా?"
"ఏమో బాబూ. నీ థియరీలు నా కర్థం కావు. నేను చాలా సామాన్యమైన అమ్మాయిని" అంటూ అలసటగా చెట్టుకి అనుకుని కళ్ళుమూసుకుంది మధూహ.
2
మరుసటిరోజు-
ప్రొద్దున్నే పదింటికి ఆఫీసుకొచ్చిన శాస్త్రికి ఆ రోజు వ్రాయవలసిన ఎడిటోరియల్ పూర్తి చేయటానికి మూడ్ రాలేదు.
సిగరెట వెలిగిస్తూ బల్లమీద ఉన్న కాగితాలు చూసాడు. అన్నిటికన్నా పైన క్రితం రోజు మధూహ ఇచ్చిన స్క్రిప్టు కనపడింది. నిరాసక్తంగా తీసుకుని చదవసాగాడు.
"ఎడిటర్ గారికి - ఇది నా మొదటి రచన. నాకు తోచినదేదో వ్రాసాను మీకు నచ్చిన ప్రచురించగలరు"
శాస్త్రి ఆ వుత్తరం మీద అడ్రసు చూసాడు.
అడ్రసు లేదు.
మొత్తం వ్రాతప్రతి అంతా అటూ ఇటూ తిప్పిచూసాడు. ఎక్కడా అడ్రసు లేదు. అతడికి చాలా కొత్తగా అనిపించింది.
అతడు మొత్తం వ్రాతప్రతి చూసాడు. సంపూర్ణంగా లేదు. '.......ఇది నచ్చితే మిగతాది పంపిస్తాను' అని వుంది.
అతడికి విసుగేసింది. అడ్రసు లేకుండా సగం వ్రాసి మిగతాది తరువాత పంపిస్తాను' అని వుంది.
వెనక్కివాలి, ఆ కాగితాలు చేతుల్లోకి తీసుకున్నాడు.
చాలా అందమైన అక్షరాలు..... పొందిగ్గా వున్నాయి. మొదటిపేజీలో కథాంశం (సినాప్సిస్) వుంది.
ఒకమ్మాయికి పెళ్ళయి ఆరేడేళ్ళు కావొస్తున్నా పిల్లలు పుట్టరు. భర్త ఆమెపట్ల నిరాసక్తంగా వుంటాడు. ఆమె మనసులోని దిగులునంతా ఒక డైరీ రూపంలో వ్రాసుకుంటుంది. పిల్లలు పుడితే జీవితానికి ఒక సంపూర్ణత్వం ఏర్పడుతుందని ఒక డాక్టరు దగ్గరకి వెళుతుంది. పదమూడోరోజు రమ్మంటాడు ఆ డాక్టరు. ఆర్నెల్లపాటు ప్రతిసారీ ఆ తేదీల్లో వెళ్ళినా సంతానం కలుగదు. లోపం భర్తదే అని చెపుతాడు డాక్టరు. కానీ తనలో ఏలోటూ లేదని నిరూపించుకోవటం కోసం భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. భార్య ముందు ఆ 'విజయాన్ని' చూపించి ఆమెని హేళన చేస్తాడు. ఆమె కూడా అదే విషయాన్ని అతనికి నిరూపించినట్టు ఆ రాత్రి ఆమెకి కళ వస్తుంది. తొమ్మిది నెలలపాటు ప్రతిరోజూ అదే ఆమెకు ప్రతిరాత్రి వస్తూ వుంటుంది. చివరిరోజు డెలివరీ అయినట్టు కూడా వస్తుంది. ఆ మరుసటి రోజు ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది.
అదీ కథ.
పేరు 'ది డైరీ ఆఫ్ మిసెస్ లక్ష్మి'
ఎడిటర్ శాస్త్రి నిరాశగా కుర్చీ వెనక్కివాలేడు. ఈ రోజుల్లో ఇంత అబ్ స్ట్రాక్టు సబ్జెక్టు ఎవరు చదువుతారనుకుంటూ వ్రాతప్రతి పక్కన పడేసాడు. అంతలో ఇంటర్ కమ్ మ్రోగింది. అట్నుంచి పత్రిక ప్రోప్రైటర్.
"ఎడిటోరియల్ ఏం వ్రాస్తున్నారు?" అని అడిగాడు.
"ఫైనల్స్ ఆడనని టెన్నీస్ ప్లేయర్ ప్రహసిత్ ప్రకటన ఇచ్చాడు కదా. దాని గురించి వ్రాద్దామనుకుంటున్నాను"
"ఎందుకాడటం లేదట?"
"కారణం తెలీదు"
"మీరు వీలైతే కనుక్కోండి. అతడు మీకు తెలుసనుకుంటాను."
"అతని సెక్రటరీతో దూరపు బంధుత్వం వుంది" అంటూ ఆ ఫోన్ పెట్టేసి సెక్రటరీ నెంబర్ వెతకటం కోసం టెలిఫోన్ డైరెక్టరీ తీసుకున్నాడు శాస్త్రి. పత్రిక ఉద్యోగమంటే ఇవన్నీ తప్పవు.
సవ్యసాచిలా అన్నీ చేసుకుంటూ పోవాలి.
ప్రహసిత్ నెంబర్ వెతికి పట్టుకుని, దానికి డయల్ చేయబోతూ వుండగా మళ్ళీ ఇంటర్ కమ్ మ్రోగింది. ఈసారి అడ్వర్టయిజ్ మెంట్ డిపార్ట్ మెంటునుంచి.
"నిన్న ఆ రాజు అనే కుర్రాడు ఇచ్చిన ప్రకటనల్లో ఒకటి పొరపాటున మీ దగ్గిర వుండిపోయిందా?"
"ఉంది. ఏం?"
"అట్నుంచి అడ్వర్టయిజ్ మెంట్ మేనేజర్ గాఢంగా విశ్వసించి, "చంపేసారు. నిన్నటి నుంచి దానికోసం వెతుకుతున్నాం......" అన్నాడు తేలిగ్గా.
"పొరపాట్లు ఏమన్నా వుంటే చూడమని ఇచ్చాడు....."
"అది మన పని కాదని చెప్పలేకపోయారా?"
"నిన్నటి ప్రకటనలో ..... నత్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఇచ్చారు సరిచేస్తాను"
"ఏదీ? ఆ మైండ్ హిప్నో మేగ్నోక్లినిక్కేనా? ఈ ప్రకటన కూడ ఆ డాక్టర్ దే. మార్పులెమైనా చేయవలసివస్తే కాస్త చూసి ఈ వారం వేసెయ్యండి. పార్టీ మా వాడే. తప్పులుంటే దిద్దండి"
ఇంటర్ కమ్ పెట్టేసి శాస్త్రి ఆ ప్రకటన కోసం చూసాడు. కాగితాల అడుగున కనపడింది.
డాక్టర్ విశాల్ సంతానోత్పత్తి కేంద్రం
"మీకు వివాహం జరిగి సంవత్సరం దాటిందా? పిల్లలు పుట్టటంలేదని చింతిస్తున్నారా? మమ్మల్ని సంప్రదించండి.13, 14, 15 రోజుల్లో డాక్టర్ గార్ని కలిసేలా స్త్రీలు చూసుకోవాలెను. డాక్టర్ విశాల్స్ క్లినిక్ ఫర్ ఫెర్టిలైజేషన్.."
'వీడి తెలుగు శ్రాద్ధంపెట్ట. ఏం తెలుగిది? స్త్రీలు చూసుకోవలెనట?' అని తిట్టుకుంటూ దాన్ని సరిచేయబోయాడు. మరో అనుమానం వచ్చింది.
మొదటిరోజు నుంచి 13 వ రోజా? అయిదోరోజు నుంచి 13వ రోజా?
'మనకెందుకొచ్చిందిలే, అనుకుంటూ..."డాక్టర్ గారిని కలిసేలా స్త్రీలు చూసుకోవలెను" అన్నది కొట్టేసి. "డాక్టర్ గారిని కలవవలెను" అని సరిదిద్డాడు.
తరువాత బాయ్ ని పిల్చి ఆ ప్రకటన ప్రచురణకి ఇచ్చేసి ఎడిటోరియల్ వ్రాయబోయాడు.
వ్రాయబుద్ది కాలేదు.
ప్రహసిత్ ఎందుకు టెన్నీస్ నుంచి విరమించుకోవాలకుంటున్నాడో కారణం కూడా వ్రాస్తేనే అది సెన్సేషన్ అవుతుంది.
అతడికి మధూహ గుర్తొచ్చింది. ఇటువంటి విషయాల్లో ఆమె వుంటే ఏదోలా అసలు విషయం రాబడుతుంది.
పూర్తి చేయవలసిన ఎడిటోరియల్ పక్కనపెట్టి కుర్చీ వెనక్కి వాలేడు.
ఏ పని చేయాలో తోచలేదు. టేబిల్ మీద స్క్రిప్టు కనపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మధూహ ఇచ్చిన స్క్రిప్టు అది. సాధారణంగా ఎడిటర్లు మొదటిపేజీ చదవగానే అందులో శైలీ శిల్పమూ చూసి, మిగతాది చదవటం టైమ్ వేస్టా కాదా అని తెలుసుకుంటారు. సినాప్పిస్ చదవగానే ఇది పాఠకులకు నచ్చదు అని తెలిసిపోయింది. బావుండటం వేరు, పాఠకులకు నచ్చటం వేరు. ముఖ్యంగా సెక్సూ, వయొలెన్సూ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.....