అంతే.
షాక్ తగిలినట్టు వెనక్కి వాలాడు. ఆమె కళ్ళు విప్పింది.
"ఏమిటిది?' అడిగాడు.
"షాగాను" అంది. "సిగరెట్ కూడా షాగాను"
అతడి నిద్ర మత్తు వదిలిపోయింది. లేచి పక్కమీద కూర్చున్నాడు. నమ్మశక్యం కానట్టు చూస్తూ, కోపగించుకోవాలో, అయోమయంలో పడాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు.
ఆమె కూడా లేచి కూర్చోవటానికి ప్రయత్నించింది.
"ఈరోజే ఎక్కడో షిదివానండీ. భూదేవి అని ఆడదాన్నంటార్ట కదా"
"అవును. అంటారు. అయితే దానికీ నువ్వు మందుకొట్టటానికీ ఏమిటి సంబంధం?"
"షంబంధం? అవును శంబంధం ఏమిటి? భూదేవి ఎక్కడా మందుకొట్టినట్టు దాఖలాలు లేవు కదా....." అంటూ ఆమె ఏడవటం ప్రారంభించింది. ఉన్నట్టుండి భార్య అలా ఏడుపు మొదలుపెట్టేసరికి అతను కంగారు పడ్డాడు. అసలు మందు వ్యవహారంతోనే సగం నిర్వీర్యమయివున్నాడు.
"ఏడవకు వసుంధరా! అసలు విషయం చెప్పు"
"ఇంతమంది పాపుల్ని దివారాత్రాలు ఘోషే భూదేవి మందు కొట్టటం లేదండీ. పాపం ఇంత కష్టాన్ని ఎలా భరిస్తోంది?"
"నీకు మతిపోయింది. భూదేవి మందు కొట్టటం ఏమిటి?అయినా కష్టాన్ని భరించటం కోసం మందుకొట్టటం ఏమిటి? చిరాగ్గా అన్నాడు. "మరి మీరే చెప్పారు కదండీ. మొగాడన్నాక బోలెడు కష్టాలూ టెన్షన్లూ వుంటాయి. అందుకే రిలా.... రిలా... రిలా..."
"రిలాక్స్"
"అదే..... రిలాక్స్ అవటం కోసం మందుకొడ్తారని"
అతడు గతుక్కుమన్నాడు. ఆమె కొనసాగించింది. "ఒక్క కష్టానికే మీరు మందు కొడ్తుంటే, ఇన్ని కష్టాలున్న మనుషుల్ని మోస్తున్న భూదేవి ఎలా రిలాక్స్ అవుతుందో ఏమో.....పాపం ఆవిడకి మందుకొట్టే ఛాన్షు లేదే అని ఏడుస్తున్నానండీ. అవునూ....ఛాన్సు కరెక్టా? ఛాన్షు కరెక్టా?"
"ఛాన్సే కరెక్టు. ఇక చెప్పు"
"ఛాన్షు కాదు. ఛాన్సు"
"నీ మొహం ఛాన్సు. ఛాన్సు"
"నేను అదే అంటున్నా కదండీ.....ఛాన్షు....ఛా....న్షు"
"నాలుక్కోస్తా. ఛాన్షుకాదే. ఛాన్సు"
"అయ్యో. నాలుకేం చేసిందండి. ఛాన్షు. ఛాన్షు"
"సర్లే. సుత్తికొట్టకు....."
"మీరు మందుకొట్టొచ్చి సుత్తికొడ్తే నేను భరించటం లేదా. మందు కొట్టినవాడు మొగుడయినా సరే. ఆ సుత్తి భరించటం కష్టమని ఒప్పుకుంటున్నాను కదా"
"నీ లాజిక్కు తగలెయ్య. అసలు విషయం చెప్పు"
"నన్ను ముద్దుపెట్టుకుంటే చెప్తా"
"ఏమిటీ?"
"అదంతే"
"అతడామెని అలాగే చేసి".....చెప్పు" అన్నాడు.
"అలాకాదు. నోటి మీద"
"నీకు నిజంగా మతిభ్రమించింది"
"మీ ఇష్టం" అని వెనక్కి విరుచుకుపడిపోబోయింది. అతడామెని పట్టుకుని ముద్దు పెట్టుకోవటానికి వంగి చప్పున వెనక్కి జరిగి, "ఏమిటీ సిగరెట్ వాసనొస్తుంది" అన్నాడు.
"షెప్పాగా తాగానని"
"నిన్ను చంపేస్తాం"
"ఇప్పుడు మాత్రం బ్రతికున్నానా ఏమిటి?"
"ఏమిటే ఇందతా?"
"ముద్దు పెట్టుకుంటే చెప్తా"
అతడు అతి కష్టంమీద దగ్గిరకొచ్చి వంగి ఇక సాధ్యం కానట్టు దూరంగా జరిగి, "కాల్చిన పొగాకు వాసన. కడుపులో దేవేస్తోంది" అన్నాడు. అతడి మాటలు పూర్తిగా కాకుండా ఆమె అతడిని కదలకుండా పట్టుకుని నోట్లో నాలుకపెట్టి గట్టిగా బింగించింది. అతడు విలవిలలాడాడు. గింజుకున్నాడు. ఆమె వదల్లేదు! ఆ తరువాత అతడిని వదిలిపెడ్తూ"......కరెక్టే....కరెక్టే" అని చిన్న పిల్లలా కేరింతలూ కొట్టసాగింది. ఆమెని పీకపిసికి చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. అయినా దానికన్నా ఎక్కువగా ఆమె ప్రవర్తన కంగారు పెట్టటంతో ఏమైంది? "ఏది కరెక్టు" అన్నాడు పెదాలు బలంగా తుడుచుకుంటూ.
"మధ్యాహ్నం మేగ్ జైన్ లో చదివానండీ.....స్త్రీకి భూదేవి అని పేరొచ్చింది. పిల్లల్ని కన్నందుకూ, సహనంతో అత్తామామల్ని చూసినందుకూ కాదట. సిగరెట్ తాగే మొగుడిని ముద్దు పెట్టుకోగలిగేటంత సహనం ఏర్పర్చుకున్నందుకట. తాగి వొచ్చినప్పుడు భరించగలిగినందుకట....."
-సశేషం.
ఆ వారం సీరియల్ చదివి మధూహ నవ్వు ఆపిలేకపోయింది. పత్రిక పక్కన పెట్టి బయటకొచ్చి ఎడిటర్ కి ఫోన్ చేసింది.
"శాస్త్రిని మాట్లాడుతున్నాను"
"నేను సర్. మదూహని మాట్లాడుతున్నాను. థాంక్స్."
"ఇందులో నేను చేసింది ఏముందమ్మాయ్. స్క్రిప్టు బావుంది. వేస్తున్నాను"
"ఇంతకీ ఆ రచయిత్రి ఎవరో తెలిసిందాండీ"
"లేదమ్మా, తరువాత స్క్రిప్టు కూడా పంపింది కానీ అడ్రసు మాత్రం ఇవ్వలేదు. రచయిత్రి పేరు 'లక్ష్మి' అని వ్రాసింది కానీ అది కూడా కలం పేరు అనుకుంటాను" అన్నాడు ఎడిటరు.
ఆ రచయిత్రి తన స్నేహితురాలు 'లక్ష్మే' నని మధూహ వూహించలేక పోయింది. సాదాగా కనపడే లక్ష్మిలో అంత లోతయిన భావాలుంటాయని ఆమె కలలో కూడా అనుకోలేదు. అదీగాక ఆమె దృష్టిలో లక్ష్మి.....విష్ణులది చాలా మంచి దాంపత్యం.
తన నిరాసక్తతని లక్ష్మి ఎన్నడూ బయటవాళ్లముందు బయటపెట్టదు.
ఈ ప్రపంచంలో చాలామంది ఆడవాళ్ళలాగే.
పైకి చాలా హుషారుగా, తమది అన్ని సంసారాల్లాగే మామూలుగా గడిచిపోతూందన్నట్టు వుంటుంది.
"అన్నట్టు ఈ మధ్య పత్రికాఫీసుకి రావటం మానేసావేమిటమ్మాయ్"
"ఉద్యోగం లోంచి తీసేసారు కదండీ" నిష్ఠూరంగా అంది.
"ఉద్యోగం అంటే గుర్తొచ్చింది. నీకో వుద్యోగం ఇస్తాను చేస్తావా?"
ఆమెలో లోపల్నుంచి హుషారు తన్నుకొచ్చింది.
"ఏ ఉద్యోగం?"
"ఫ్రీలాన్సు జర్నలిస్టు. సంచలనం వార్తలని సేకరించి పత్రికకి ఇవ్వటం...ఎప్పుడొస్తావ్?"
"ఇప్పుడే బయల్దేరుతున్నానండి" ఫోన్ పెట్టేసి ఇంటికొచ్చి తయారైంది.
బయల్దేరుతుండగా కుడికన్ను అదిరింది. ఆమెకి ఇలాటి వాటిమీద నమ్మకం లేదు. అసలు ఏ కన్ను అదిరితే శుభమో, ఏది అదిరితే అశుభమో కూడా తెలీదు.
అరగంట ప్రయాణం చేసి ఆమె పత్రికాఫీసుకి వెళ్లింది.
కొంచెంసేపు యోగక్షేమాలు మాట్లాడాక "నీకు తిరిగి ఎలాగూ వుద్యోగం ఇప్పించలేను. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచెయ్యి. నీ ఆర్టికల్స్ నెలకు రెండు మూడు వేస్తాను. అయిదారు వందలొచ్చినా మంచిదేగా......" అన్నాడు శాస్త్రి.
ఆమె కళ్ళలొ నీళ్ళు చిప్పిల్లాయి "......థాంక్స్" అంది కృతజ్ఞతగా.
ఆ తరువాత టాపిక్ కొత్త సీరియల్ మీదికి మళ్లింది. ఎడిటర్ బల్లమీదే వుంది ఆ స్క్రిప్టు. ఆమె తీసుకుని అక్కడక్కడా చూసింది.
"ఈ నవల రచయిత్రి స్వంత కథలాగే వుంది సర్....."
"ఎలా చెప్పగలవు?"
మధూహ నవ్వి "గ్రాఫాలజీ" అంది. "ఓత్వాన్ని వెనక్కీ తిప్పి వ్రాసేవారు సాధారణంగా జీవితంపట్ల అసంతృప్తులై వుంటారని ఈ మధ్యనే విడుదలైన గ్రాఫాలజీ పుస్తకంలో చదివాను. ఈ స్క్రిప్టులో మొ, వొ, తొ, కొ అన్న అక్షరాలు గమనించండి. గుణింతాలు వెనక్కి తిరిగి వున్నాయి."
"గొప్ప పరిశీలనే. గ్రాఫాలజీతో మనస్తత్వాన్ని ఇంత చక్కగా పట్టుకోవచ్చని నాకు తెలీదు" అన్నాడు శాస్త్రి.
"ఈ రచయిత్రి అడ్రసు ఇవ్వలేదుగా"
"లేదు! ఇష్టం లేదేమో....."
"ఇస్తే వెళ్ళి ఇంటర్వ్యూ చేసేదాన్ని"
"ఇంటర్వ్యూ అంటే గుర్తొచ్చింది. టెన్నీస్ ప్లేయర్ ప్రహసిత్ తెలుసుగా"
"విన్నాను. డాక్టర్ ప్రహసిత్. మీరో విషయం గమనించారా? నవలలో హీరో పేరు కూడా ప్రహసితే....."
ఎడిటర్ దాని గురించి అంతగా పట్టించుకోలేదు. "టెన్నీస్ నుంచి దాదాపు తను విరమించుకున్నట్టే.... అని ప్రహసిత్ ప్రకటించాడు. కారణం మాత్రం ఎవరికీ చెప్పలేదు. అతడిని ఇంటర్వ్యూ చేసి ఆ కారణం పట్టుకోగలిగితే అది సెన్సేషన్ అవుతుంది"
మదూహకి అర్థమైంది. తను విజయవంతంగా ఈ పని పూర్తిచేయగలిగితే జర్నలిస్ట్ గా గొప్ప విజయం! ఆమె కుర్చీలోంచి లేచి, "ప్రయత్నిస్తాను సర్" అంది.
5
"ఇప్పటికి లక్షమంది అడిగారు ఆ ప్రశ్న. నేను చెప్పను. అది నా వ్యక్తిగత కారణం....." అన్నాడు ప్రహసిత్. అప్పటికి ఇంటర్వ్యూ ప్రారంభమై అయిదు నిముషాలు గడిచింది.
"కానీ దేశం మొత్తం ఆ కారణం గురించి దిగులు చెందుతోంది."
"దానికి నేనేం చేయలేను. ఐ యామ్ సారీ....."
"ఒక దేశపు గౌరవాన్ని కూడా బలిపెట్టగల పెద్ద కారణం ఏమైవుంటుంది?" అతన్నించి ఎలాగైనా దాన్ని రాబట్టాలన్న ప్రయత్నంతో...... అతడిని ఇరిటేట్ చేస్తున్నట్టు అడిగింది.
అయితే అతనికి కోపం రాలేదు. "నేను ఆడలేను. పూర్తిగా అశక్తుడిని" అన్నాడు.
"ఆరోగ్యం బావోలేదా?"
"అదేం లేదు"
"బయటకు చెప్పుకోలేని అనారోగ్యం ఏమైనా....?"
"అంటే?" మొహం చిట్లిస్తూ అడిగాడు.
"......ఎయిడ్స్"
అతడు నవ్వేడు. ".....మీరెంత ఇరిటేట్ చేసిన నేను చెప్పను"