"నమస్తే డాక్టర్ గారూ! నాకు వంట్లో అసలు బావోటం లేదండీ, రెండ్రోజులనుంచీ దగ్గూ ఆయాసం..."
భార్గవ కారు తలుపు చప్పుడయ్యేలా వేసుకుని "నేను డాక్టర్ ను కాను. సారీ" అని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వసుమతి వస్తున్న నవ్వుని ఆపుకుంది. ప్రార్థన క్లాసుకి వెళ్ళిపోయింది. శారద వసుమతితో కలిసి నడుస్తూ "పరాయి మొగవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఇలాగే మన రోగాల గురించి మాట్లాడాలమ్మాయ్. అప్పుడు వాళ్ళకి మనమీద దృష్టి వుండదు" అంది. మగవాళ్ళ బారినుంచి తప్పించుకోవటానికి ఆవిడ కనుక్కున్న కొత్త థియరీ బాగానే వుంది కానీ, నల్లగా లావుగా పొట్టిగా వుండే ఆవిడకి ఈ ఆయుధపు అవసరం ఎందుకు వస్తుందో వసుమతికి అర్థంకాలేదు.
* * *
భార్గవ తన ఛాంబర్ కి వెళ్ళేసరికి ఎమ్.డి. నుంచి పిలుపు వచ్చిందని చెప్పారు. సాధారణంగా శంకర్ లాల్ ఎవరినీ పిలవడు ఎంతో పని వుంటే తప్ప. సైంటిస్టులు డిస్టర్బ్ కాకూడదు. ఇంత ప్రొద్దున్నే తనని పిలవటానికి కారణం ఏమై వుంటుందా అనుకుంటూనే భార్గవ అతడి గదిలోకి ప్రవేశించాడు.
లోపల చాలా చల్లగా వుంది. కాళ్ళ క్రింద తివాచీ మెత్తగా తగులుతూంది. శంకర్ లాల్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని వున్నాడు. భార్గవని చూడగానే "ప్లీజ్ కమిన్. రండి" అన్నాడు. భార్గవ వెళ్ళి కూర్చున్నాడు.
"ఎలా వుంది మీ పరిశోధన" ఇంగ్లీషులో అడిగాడు.
"నడుస్తూంది" అన్నాడు భార్గవ. ఎక్కువ మాట్లాడటం అతడికి అలవాటు లేదు. శంకర్ లాల్ ఎందుకు పిలిచాడా అని అతడు ఆలోచిస్తూనే వున్నాడు.
"మీకొక గుడ్ న్యూస్ భార్గవా! ఈ సంవత్సరం మీకు పద్మశ్రీ లభించబోతూంది. కానీ- ఈ విషయాన్ని కాస్త రహస్యంగా వుంచండి" అన్నాడు నవ్వుతూ. "మీ పేరు నేను రికమెండ్ చెయ్యబోతున్నాను- నూటికి తొంభైశాతం వచ్చేసినట్టే...."
తొంభైశాతం కాదు. అతడు రికమెండ్ చేస్తే నూటికి నూరుశాతం వచ్చేసినట్టే. సైన్సుకి సంబంధించినంత వరకూ దేశంలో కొందరు ప్రముఖులు 'ఎవరిని' రికమెండ్ చేస్తే వారికి ఈ బిరుదుల్ని ఇస్తుందీ ప్రభుత్వం.
"కానీ నేను కొత్తగా చేసిందికానీ, కనుక్కున్నది కానీ ఏమీలేదే" అన్నాడు భార్గవ. లాల్ వెంటనే - "అందుకే అడిగాను మిస్టర్ భార్గవా! మీరు ప్రస్తుతం చేస్తున్న పరిశోధన ఎంతవరకూ వచ్చిందీ- అని".
భార్గవ నవ్వి-
"జీవకణాన్ని వైరస్ ఎలా నాశనం చేస్తుందో చిన్న కథలాగా చెప్పుకోవచ్చు. వైరస్ వంట్లో ప్రవేశించగానే, దానికీ లోపలి జీవకణానికీ మధ్య యుద్ధం జరుగుతుంది వైరస్ గానీ, ఈ పోరాటంలో గెలిస్తే అది జీవకణాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ తానే స్వయంగా తన సైనికుల్ని ఉత్పత్తి చేయటం ప్రారంభించటం మొదలు పెడుతుంది. ఒక కణం రెండుగా చీలటానికి బదులు మూడొందల అపాయకరమైన కణాలుగా చీలిపోవటం ప్రారంభిస్తుంది.... అదే కేన్సర్ అని కొందరి భావం".
"శరీరంలో ఒక వైరస్ అణువు మూడువందల అపాయకరమైన కణాల్ని సృష్టించే సమయానికి ఒక యాంటీ బాడీని(వ్యతిరేకపదార్థాన్ని) అదే శరీరంలోకి ఇంజెక్టు చేస్తామనుకోండి. ఏమవుతుంది? ఏ శక్తి జీవాన్ని తయారు చేస్తుందో మనకు తెలియదుగాని- ఆ వున్నాడో లేడో తెలియని దేవుని ఫార్ములాని అనుసరించే ఆ వ్యతిరేక శక్తికూడా శరీరంలోకి అభివృద్ధి చెంది, వైరస్ తో పోరాడుతుంది. కేన్సర్ నిరోధానికి నేను కనుక్కోబోతున్న మందు అదే...."
శంకర్ లాల్ బిగ్గరగా నవ్వుతూ, "భలే బావుంది భార్గవా! ఈ కథ ఏ చందమామకైనా పంపండి. చాలా బావుంటుంది" అన్నాడు.
విజయభార్గవ మొహం ఎర్రగా కందిపోయింది. అతికష్టంమీద తనని తాను నిగ్రహించుకున్నాడు. ఈ లోపులో లాల్ అన్నాడు.
"డాక్టర్ భార్గవా! నేను మిమ్మల్ని పిలిచిన విషయం సూటిగా చెప్తాను వినండి. కాన్స్-క్యూర్ మందు కనిపెట్టబడి పది సంవత్సరాలు కావొస్తూంది. పోటీ ఉత్పత్తిదారులు దీనిమీదకు నెమ్మదిగా వస్తున్నారు. మన ఇన్ స్టిట్యూట్ ఇంకో మందు తొందర్లో సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీకి ఇవ్వాలి. దాన్ని మీరు కనుక్కోవాలి. కనుక్కోగలరు కూడా- వెంటనే ప్రయత్నించండి".
అన్యాపదేశంగా అతను చెపుతున్నది అర్థమయింది. "మీరు కనుక్కోండి - మీకూ పద్మశ్రీ ఇప్పించే బాధ్యత నాది" అంటున్నాడు.
భార్గవ నవ్వి "నేనూ ఆ ప్రయత్నం మీదే వున్నాను. కానీ అదంత సులభం కాదు" అన్నాడు.
"మీరనే యాంటీ-మాటర్ థియరీ గురించి కాదు నేను అడుగుతున్నది. మీరు కనుక్కోవలసింది కేవలం సల్ఫా-3ని మాత్రమే" అంటూ నవ్వాడు.
సల్ఫా-2 పాతబడింది కాబట్టి ఇంకో పేరుతో అదే మందు తన పరిశోధన ఫలితంగా మార్కెట్ లోకి రిలీజ్ చెయ్యాలి. దీనికి మోహన్ లాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాన్సర్ రిసెర్చి కొత్త ముద్ర వేస్తుంది. దాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది.
అతడు లేచి నిలబడి, "మీరు చెప్పవలసింది ఇంకేమైనా వుందా?" అని అడిగాడు.
"అదికాదు భార్గవా..."
"మీరు చెప్పవలసింది ఇంకేమైనా వుందా" తాపీగా అన్నాడు. శంకర్ లాల్ మాట్లాడలేదు. భార్గవ లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు. శంకర్ లాల్ వాడిపోయిన మొహంతో అతడివేపే చూడసాగాడు. భార్గవ బైటి కొచ్చేసేక, ఇంటర్ కమ్ నొక్కి సెక్రటరీతో, "డాక్టర్ భార్గవ పెర్సనల్ ఫైలు ఒకసారి పంపించు" అన్నాడు.
భార్గవ తన హాల్లోకి వచ్చేశాడు. అతడి మనసు చికాగ్గా వుంది. కానీ మరుక్షణమే అతడు తన పరిశోధనలో మునిగిపోయాడు. ఒకసారి ఆ లోకంలోకి వెళ్తే అతడు మాములు మనిషి కాదు. ఈసారి ఎలుకలు మరీ వెంటనే చచ్చిపోయాయి. ఇన్ స్టిట్యూట్ చేసే కుందేళ్ళ సప్లయ్ తక్కువ. అదో చికాకు.
అతడు ఆ రోజు పని కట్టేసేసరికి అయిదయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది మరియమ్మ చెప్పిన సంగతి. ఆస్పత్రికి ఫోన్ చేసి పాత మిత్రుడిని పలకరించి, అబ్బాయి విషయం అడిగాడు. "చాలా పెద్దపని పెడుతున్నాననుకో. కానీ ఆ ముసలావిడని చూస్తే జాలేసింది. కాస్త ఎంక్వయిరీ చేసి చెప్పు, పన్నెండేళ్ళ కుర్రవాడు. పేరు ఏసుపాదం-ముందు ఓ.పి. చూడాలనుకుంటా. రేపు మళ్ళీ ఫోన్ చెయ్యనా-".
"పేరు ఏసుపాదం కదూ".
"అవును".
"కొద్దిగా కుంటుతూ వుంటాడు".
"అనుకుంటా".
"చూడక్కర్లేదు. అతడు నా వార్డులోనే వున్నాడు".
"ఏమిటీ కంప్లెయింట్?"
"సారీ భార్గవా! అతడిది ఎడ్వాన్స్ డ్ స్టేజీ ఆఫ్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా".