మరి తనకి ముందు ఎందుకంత కోపం వచ్చింది ?
రీజనింగ్ ఆలోచించే శక్తిలేక...
ఇతడు విడమరచి చెప్పేదాకా-
"మీరెవరు?" అంది చప్పున తలెత్తి.
"అనుదీప్."
"అదికాదు. మీరేం చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు!"
"పెద్దగా చదువుకోలేదు. ఆరేడు సంవత్సరాల క్రితం ఒకమ్మాని ప్రేమించాను. దాంతో చదువు ఆగిపోయింది."
ఆమె నవ్వుతూ "మరింతకాలం ఏం చేశారు?" అని అడిగింది.
"ప్రేమ ఎందుకు ఉద్భవిస్తుంది.... అన్న విషయం మీద రీసెర్చి చేశాను."
ఆమె పకాలున నవ్వేసింది. "తెలుసుకున్నారా మరి?"
"తెలుసుకున్నాను."
"ఏమిటి?"
"ఇల్లొచ్చింది. తాళం తీయండి చెపుతాను".
ఆమె గది తాళం తీసింది. ఇద్దరూ లోపలికి ప్రవేశించాక "అలా తీరిగ్గా కూర్చుని ఇప్పుడు చెప్పండి" అంది కుర్చీ చూపిస్తూ.
"చెప్పను, వ్రాస్తాను."
"ఎక్కడ?"
"గత రెండ్రోజులుగా మీరు థ్రిల్లర్ పుస్తకంలో ఏమీ వ్రాయటం లేదు. అదివ్వండి వ్రాసి చూపిస్తాను".
ఆమె ఆ మాటలకి నిశ్చేష్టురాలై "ఆ పుస్తకం గురించి మీకెలా తెలుసు?" అని అడిగింది. అతడామె మాటలకి సమాధానం చెప్పకుండా చొరవగా ఆమె పుస్తకాల రాక్ లోంచి ఆ పుస్తకాన్ని తీసి, కలంతో వ్రాశాడు-మే 5 అన్న తారీఖు వేసి-
"ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది అన్నాడో కవి. నేను కనుక్కున్నది ఏమిటంటే అది కూడా అబద్దమూ, స్వార్థమేనని...! నిజమైన ప్రేమ అవతలివైపు నుంచి ప్రేమ లేకపోయినా ప్రేమించటం ఆపదని....!"
"కలం బాగా వ్రాస్తూంది సుమా" అన్నాడు అతడు వ్రాయటం పూర్తిచేసి.... "నేను మరణించిన మరుక్షణం నా రక్తమంతా నీ పెన్నులో ఇంకుగా మారనీ మోడరన్ సాకీ.... అని నేనో గేయం వ్రాస్తే ఎలా వుంటుంది?" నవ్వేడు.
ఆమె మాట్లాడలేదు.
"తధాస్తు... అనండి, నిజంగా అలాగే అవుతుంది."
"మీరెవరు?"
"మళ్ళీ అదే ప్రశ్న?"
"నాక్కావాలి సమాధానం... చెప్పండి మీరు చెప్పకపోతే వదిలిపెట్టనీ రోజు. నాకు భయంగా వుంది. ఆందోళనగా కూడా వుంది. మీకు నా విషయాలన్నీ ఎలా తెలిసినయ్? మీరు "ష్" అనగానే ఫోను ఎలా ఆగిపోయింది? అసలెవరు మీరు..."
"నేను వివరంగా చెప్తాను. కానీ అలా చెప్పటం కూడా నీ నుంచి ఏదో పొందాలన్న స్వార్థమే కదా..."
"ఫిలాసఫీ వద్దు. అసలు మీరెవరు?"
"ఆరేడు సంవత్సరాల క్రితం మీరు స్టెల్లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గుర్తుందా? రోజూ బస్ లో కాలేజీకి వెళ్ళేవారు."
"అవును, అయితే..."
"ఒకరోజు మిమ్మల్ని బస్ లో చూశాను. ఏడు సంవత్సరాల క్రితం నేనొక అమ్మాయిని ప్రేమించి, ఆ కారణంగా చదువు ఆపుచేశానని చెప్పానే... అది మిమ్మల్నే విద్యాధరీ..."
ఆమె స్థబ్దురాలై.... చాలాసేపటి వరకూ మాట్లాడలేక, చివరికెలాగో నోరు పెగల్చుకుని, "మిమ్మల్ని ... మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదే" అంది. కాలేజీలో చదివేరోజుల్లో ఆమె వెనుక చాలామంది బాడీగార్డులు వుండేవారు. కానీ ఇతన్ని నిజంగానే ఎప్పుడూ చూడలేదు. బహుశా పోలికలు బాగా మారిపోయి వుండాలి లేదా తనే మర్చిపోయి వుండాలి.
అతనన్నాడు... "రియల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మీకు తెలుసా?"
అతడేం చెప్పబోతున్నాడో ఊహించి, ఆమె కాస్త తేలిగ్గా "తొలిచూపులో ప్రేమ" అంది.
"నేను అడుగుతున్నది ఇన్ ఫాట్యుయేషన్ గురించి కాదు. 'రియల్ లవ్' గురించి."
"నిజమైన ప్రేమ" అందామె అనువాదకురాలిలా. "... అందరికీ తెలిసిందే అది."
"కాదు. తొలిచూపులో నిజమైన ప్రేమ ఉద్భవించటం అనేది అంత సులభంగా జరగదు. కొద్దిమందికే జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా మనం ఎవరికోసమైతే వెతుకుతున్నామో, ఆ తెలియని వ్యక్తి హఠాత్తుగా మనకి కనపడినప్పుడు హఠాత్తుగా ప్రేమ ఉద్భవిస్తుంది. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే హృదయం స్పందించటంతోపాటు మనిషి ఫిజియాలజీలో కూడా మార్పొస్తుంది. ప్యూపిల్స్ అంటే తెలుసుగా, కనుపాపలు అవి బ్రైట్ అవుతాయి. అలా వచ్చిన వెలుగు వల్ల ఆ మనిషి మొహంలో అంతవరకూ లేని అందమూ, తేజస్సూ కొత్తగా వస్తాయి. అదీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే..."
"నేను నమ్మను."
"మీరేకాదు, తొంభైశాతం నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఏ స్టేజిలోనూ అలాంటి అనుభవం వచ్చి వుండదు కాబట్టి-"
ఆమెకు ఇదంతా గమ్మత్తుగా తోచింది. అతనిని ఏడిపించాలని కూడా బుద్ధి పుట్టింది. ముందుకువంగి, "మొదటిసారి బస్ లో చూశారు. మరి తరువాతేం చేశారు?" అని అడిగింది.
"నాల్రోజులపాటు మనిషి మనిషిగా లేను. ఎప్పుడూ మీ ఆలోచనే. అప్పటికే మీ చుట్టూ చాలామంది అబ్బాయిలు తిరుగుతున్నారని నాకు తెలుసు. వాళ్ళందరికీ మీరు "రోమియో..." "తూనీగలు" "బాడీగార్డులు" అని బిరుదులిచ్చారని కూడా నాకు తెలుసు. నేనూ వాళ్ళలో ఒకడిని అవటం నాకిష్టం లేకపోయింది."
"మరేం చేశారు?" అంది నవ్వు ఆపుకుంటూ.
"ఏం చేశానో చెప్పటానికి ముందు నేనో ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి. ఆ రోజే నేను నా ప్రేమ గురించి చెప్పివుంటే మీరేం చేసేవారు?"
"నాకీ ప్రేమ దోమల మీద నమ్మకం లేదు".
"కరెక్టు. ఎవడో వచ్చి- బస్ లో మిమ్మల్ని చూశాను. ప్రేమిస్తున్నాను అంటే ఏ అమ్మాయికి అంత గొప్ప అభిప్రాయం కలగదు. ఇంక రెండో దారి ఏమిటంటే- ఈ ప్రేమనీ దోమనీ మనసులోనే దాచుకుని మామూలుగా పరిచయం ప్రారంభించి మనసులో కోర్కె మనసులోనే దాచుకుని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకున్నట్లు కొంతకాలానికి- 'మనం పెళ్ళి చేసుకుందాం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను' అని చెప్పాలి. అది కూడా ఒకరకంగా ఆత్మవంచనే కదా! నిజమైన ప్రేమంటే అవతలివాళ్ళ బలహీనతల్ని కూడా ప్రేమించాలి. మరోరకంగా చెప్పాలంటే ఒకసారి ప్రేమంటూ కలిగితే, జీవితాంతం కలసి వుండాలి. లేకపోతే చచ్చిపోవాలి. మరి ఆ మాట నిజమా కాదా అని తేల్చుకోవటానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది విద్యాధరీ - మీరు లేకుండా నేను బ్రతకలేను."
ఆమెకి వెంటనే వచ్చిన అనుమానం -ఇతడు పిచ్చాసుపత్రి నుంచి వచ్చాడేమో అని.
"మరి నేను లేకుండానే ఈ ఆరేడేళ్ళూ బ్రతికారు కదా" అంది.
"లేదని ఎవరన్నారు? ఇంతకాలమూ మీరు నాతోనే- నా ఊహల్లోనే వున్నారు. నా ప్రేమ నిజమని నమ్మకం కుదిరాకే నేనిలా మీ దగ్గరికి వచ్చి చెపుతున్నాను."
"మరి నేను కాదంటే?"
"చెప్పానుగా, చచ్చిపోతాను."
ఆమె లేచి "చాలా రాత్రయింది. మీరింక వెళతారా? నా గదిలో ఇంతరాత్రి వరకూ వుంటే ఎవరైనా చూస్తే బావోదు" అంది.
అతడు లేవలేదు. "నాకు తెలుసు. మీకు ప్రేమపట్ల లక్ష అనుమానాలున్నాయని. ఇందులో మీ తప్పుకూడా లేదు. మీ చుట్టూ వున్న పరిసరాలూ, మీ బాల్యమూ మీ మీద అలాటి ముద్రవేశాయి" అన్నాడు.
* * *
ఆ అమ్మాయి ఎందుకో నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు విప్పింది. గదిలో అమ్మ ఒక్కతే నిద్రపోతూంది. నాన్నలేడు. రాత్రి పన్నెండు దాటి వుంటుంది. ఆ పాప పక్కమీద నుంచి ముందు గదివైపు నడిచింది.
ఆ గదిలో కూడా ఎవరూ లేరు.
ఆ పాప వయసు ఎనిమిదీ... పదీ మధ్య వుంటుంది.
ముందుగది పక్కనే పైకి మెట్లున్నాయి. పాత సామానులు పడేస్తారు అక్కడ. అక్కణ్ణుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కుతూహలంతో ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆమెని చీకట్లో గమనించలేదు.
ఆగిపోయింది.
ఎదుటి దృశ్యం అంత చిన్నపిల్లకి అర్థం అయిందో లేదో కానీ - భయంతో అరిచింది. ఒకటి.... రెండు .... మూడుసార్లు.
నాన్న క్రిందనుంచి పనిమనిషి లేవబోతోంది. ఈ లోపులో వెనుకనుంచి తల్లి వచ్చింది. చీకటి రహస్యం అర్థం చేసుకోవటానికి ఆవిడకి క్షణంకన్నా ఎక్కువసేపు పట్టలేదు. చీపిరికట్ట తీసుకుని ఇష్టమొచ్చినట్టు ఇద్దర్నీ కొట్టింది. ఎన్నో సంవత్సరాలుగా ఆమెలో భర్తపట్ల పేరుకుపోయిన కసి ఇంకా తీరలేదు. కత్తిపీట తీసుకు వచ్చింది. పనిమనిషి అరుస్తోంది. ఆమె భర్త ఆమెని ఎదుర్కొన్నాడు. ఆమె తిరగబడింది. ఆమె చేతుల్లోంచి కత్తిపీట అతడి చేతుల్లోకి మారింది. మెరుపుకన్నా వేగంగా ఆమె మెడ తెగింది.
ఆ పాప కళ్ళప్పగించి చూస్తోంది.
ఒక్కసారిగా ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది.
క్రింద తల్లి శరీరం నేలమీద కొంచెంసేపు గిల గిలా కొట్టుకుని ఆగిపోయింది.
కేసు జరగలేదు. చీకట్లో కాలుజారి కత్తిపీటమీద పడ్డట్టు వాస్తవం రూపుదిద్దుకుంది. భయంతో ఆ పాప నిజాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ అది ఆమె మనసులో వికృతంగా పెరిగి చెట్టులా ఊడలు పరుచుకుంది. మనుష్యులు గుసగుసలాడుతున్నారు. సత్యం బయటకు పొక్కింది. ఎవరూ చెప్పలేదు. సమాజాన్ని బాగుపర్చే రచయితలూ, నైతిక బాధ్యతల్ని తమ మీద వేసుకున్న రచయిత్రులూ... న్యాయం గురించి మాట్లాడే మేధావులూ అంతా తండ్రిచుట్టూ మామూలుగానే గుమిగూడుతున్నారు. ఆ పాపలో మాత్రం అందరిమీదా కసీ....
హ్యూమన్ రిలేషన్స్ మీదే కసీ!!!
* * *
"ఏమిటీ ఆలోచిస్తున్నారు?"
ఉలిక్కిపడి "ఏమీలేదు" అంది విద్యాధరి.
"మీ తల్లిదండ్రుల ప్రవర్తన మీ బాల్యంలోనూ, మీ చుట్టూ వున్న మొగవాళ్ళ ప్రవర్తన మీ యవ్వన కాలంలోనూ చాలా పెద్ద ప్రభావాన్ని చూపించాయి కదూ?"
"మీకెలా తెలుసు?"
"మిమ్మల్ని చూసినప్పుడు తెలియలేదు. తర్వాత తెలిసింది."
"ఎలా? ఎప్పుడు?"
"అది చెప్పటానికి ముందు, మళ్ళీ మొదటికి వెళ్ళాలి. నా గురించి కొంచెం చెప్పాలి. నేను కూడా మీలాగే అనుక్షణం చాలా అనుమానాల్తో బాధపడుతూ వుంటాను. ఇళా అయితే ఎలా? అలా అయితే ఎలా? లాంటి ప్రశ్నలు నన్నే ప్రశ్నించుకుంటూ వుంటాను. నేను మిమ్మల్ని చూడగానే ప్రేమించానని చెప్పాను కదా. ఆ విషయం మీకు డైరెక్టుగా చెపితే- మీరు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. నీ ఉద్దేశ్యం ఏమిటి అంటారు? నన్ను ప్రేమించటానికి నీకున్న అర్హతలేమిటి అంటారు!! నేనేదో చెపుతాను. అన్నీ 'ప్లస్'లే చెపుతున్నావు. 'మైనస్' లేమిటి అని అడుగుతారు." అతడు నవ్వి తిరిగి అన్నాడు- "అందుకే విషయం చెప్పకుండా, నా ప్రేమ నిజమయినదా కాదా అని తెలుసుకోవటం కోసం నేనొకపని చేశాను."