Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 7


    అప్పుడాగింది, నిర్జనంగా వున్న ఒకచోట.

 

    "కనీసం రెండుమూడు మైళ్ళు వచ్చి వుంటాం" అన్నాడు.

 

    "ఉండండి. దిగి ఇంజన్ దగ్గరకెళ్లి కనుక్కువస్తాను."

 

    "మీరు వెళ్ళకండి" అంది గాభరాగా. "మీరు దిగగానే మళ్ళీ కదిలి ఎటయినా తీసుకెళ్ళిపోతే?"

 

    "వెళ్ళిపోతే?"

 

    "ఒక్కదాన్నయిపోతాను."

 

    అతను నవ్వి "బహుశా అలా జరగదులెండి" అని పెట్టెలోంచి క్రిందకు దిగి ఇంజన్ వైపు నడిచివెళ్ళాడు.

 

    ఇంజన్ లో డ్రైవరూ, ఇంకో అతనూ వున్నారు.

 

    "ఇదేమిటయ్యా. సరదాకని ఖాళీగావున్న కంపార్టుమెంటులో కూర్చుంటే యిటు ఈడ్చుకొచ్చేశారు?" అన్నాడు.

 

    డ్రైవరు నవ్వాడు. "మరి కదులుతూంటే చూసుకోలేదా? లైను క్లియర్ కోసమని ఇలా దూరంగా తీసుకొచ్చేస్తూంటాం. క్లియరయ్యాక దీన్ని తీసుకెళ్ళి విజయవాడ వెళ్ళే ఫాస్టుపేసెంజరుకి ఎటాచ్ చెయ్యాలి."

 

    "చచ్చాం. మేము విశాఖపట్నం వెళ్లాలే."

 

    "ఎందులో?"

 

    చెప్పాడు.

 

    "అరే, టైము చాలదే. ఇదింకో గంటా గంటన్నరదాకా యిక్కడ్నుంచి కదలదు. దిగి వెనక్కి నడిచివెళ్ళండి"

 

    "నీ సలహా గొప్పగా వుంది" అనుకుంటూ వెనక్కితిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు.

 

    "ఏమయింది?"

 

    "ఇదింకో గంటన్నరదాకా కదలదట. ఈలోగా విశాఖపట్నం వెళ్ళే ట్రెయిన్ వచ్చేస్తోంది."

 

    "అయ్యో! నేనుకూడా విశాఖపట్నానికేనండీ!"

 

    "హమ్మయ్య! ఇప్పటికైనా చెప్పారు కదా" అనుకున్నాడు.

 

    "ఏం చేద్దాం?"

 

    "మీరేం చేస్తారో మరి? నేనుమాత్రం స్టేషనువైపు నడిచి వెడదామనుకుంటున్నాను."

 

    "నన్ను ఒక్కదాన్ని విడిచా?" అంటూ ఇంజన్ వైపు చూసింది. ఇంజను డ్రైవరూ, ప్రక్కనున్నతనూ ఒంగి వీళ్ళవైపు చూస్తున్నారు. గుండె దడదడ లాడింది.

 

    "నేనూ వస్తాను మీతో" అంది.

 

    "రండి."

 

    ఫ్లాట్ ఫారం మీద తప్పించి కంపార్టుమెంట్ లోంచి దిగటం అంత తేలికకాదు. మెట్లు భూమికి చాలా ఎత్తులో వుంటాయి. క్రింద కంకర రాళ్ళుంటాయి.

 

    ఆమె దిగలేక అవస్థ పడుతోంటే చేతులు చాచి ఆమె భుజాలు పట్టుకుని దిగటానికి సాయం చేశాడు.

 

    ఇద్దరూ నడవసాగారు.

 

    ఇప్పుడు చీకటికూడా పడుతుంది. రోడ్డు సమంగాలేదు. నిర్జనారణ్యంలా నిశ్శబ్దంగా వుంది.

 

    "ఎంత పాడు పని జరిగింది?" అని ఆమె విసుక్కుంది.

 

    "మీరా కంపార్టుమెంటులోకి ఎక్కకుండా ఉండాల్సింది" అని అతను సానుభూతి చూపించాడు.

 

    "నేనేక్కితే ఎక్కాను, మీరెందుకెక్కారూ?"

 

    "నేనెందుకెక్కినా అది మీకు మేలే అయిందని సంతోషించరేం?"

 

    "మేలు..." అందామె చిన్నగా తనలో తాను గొణుక్కుంటున్నట్టు.

 

    "మీరిలా నింపాదిగా నడిస్తే లాభంలేదు. మనం ఎక్కవలసిన రైలు వెళ్ళిపోతుంది."

 

    "మీరు రన్నింగ్ ఛాంపియన్ లా పరిగెత్తుతోంటే మీతో నేనెక్కడ రాగలనండి?"

 

    బాగా చీకటి పడిపోయింది.

 

    దూరంగా స్టేషన్లోని లైట్లు మిలమిలా మెరుస్తున్నాయి.

 

    "జాగ్రత్త, చీకట్లో స్లిప్ అయి పడిపోతారు. నా చెయ్యి పట్టుకోండి" అందించాడు.

 

    ఆమె అతని చెయ్యిపట్టుకుని ఆపసోపాలు పడుతూ నడవసాగింది.

 

    మొత్తంమీద చెమటలు క్రక్కుకుంటూ స్టేషన్ చేరుకున్నారు.

 

    ఎప్పుడొచ్చిందోగాని వాళ్ళ ట్రయిన్ బయల్దేరటానికి సిద్ధంగా ఉంది. ఇద్దరూ విడిపోయారు. ఆదరాబాదరగా వెయిటింగ్ రూమ్ లవైపు పరిగెత్తి ఎవరిదారిన వాళ్ళు లగేజి తీసుకుని రిజర్వ్ అయిన కంపార్టుమెంటులోకి వచ్చి పడ్డారు.

 

    అది త్రీటైర్ కంపార్ట్ మెంట్. ఫణికి మధ్యబెర్తు వచ్చింది. విసుక్కున్నాడు. పైనయినా వచ్చిందికాదు, క్రిందయినా వచ్చిందికాదు. అసలు క్రిందబెర్తు ఎవరిదో మెల్లిగా మేనేజ్ చేద్దాం అనుకుంటుండగా అటునుంచి ఆమె సీటునెంబర్లు చూసుకుంటూ వస్తోంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని దగ్గరకే వచ్చి ఆగింది.

 

    "అరె! మీరా?" ఆమె ముఖంలో సంతోషం కనిపించింది.

 

    "ఈ క్రిందిబెర్తు మీదా?"

 

    నంబరు చూసుకుంది "అవును, మీది?"

 

    "మీకు కొంచెం పైన."

 

    రైలు కదిలింది.

 

                                                           *    *    *

 

    అప్పటికి ఏడూ ఏడున్నర అయివుంటుంది. రైలు కనీసం రెండున్నర గంటలన్నా లేటుగా బయల్దేరింది.

 

    ప్రయాణీకులంతా ఎవరిగొడవల్లో వాళ్ళున్నారు. ఇద్దరూ ప్రక్కప్రక్కన కూర్చున్నారు.

 

    "చూడండి మిస్....."

 

    "శైలజ."

 

    "హమ్మయ్య! ఇప్పటికన్నా చెప్పారు కదా!"

 

    ఆమె నవ్వింది.

 

    అతను తన పేరు చెప్పాడు.

 

    ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అన్నిటికన్నా ఆశ్చర్యమేమిటంటే ఆమెకూడా ఎమ్.ఎస్.సి.లో చేరటానికే వస్తోంది. అంతకన్నా వింత ఏమిటంటే అతనిలాగానే ఆమెదికూడా కెమిస్ట్రీ మెయిన్.

 Previous Page Next Page