Previous Page Next Page 
అంకితం పేజి 7


    "ఏం లేదు. మళ్ళీ బట్టలు సర్దు. రేప్రోద్దున్నే తిరిగి హైద్రాబాద్ వెళ్ళాలి".

    అప్పుడామెకి గుర్తొచ్చినట్టుంది. "అయ్యో! మిమ్మల్ని చాలా కంగారు పెట్టేసినట్టున్నాను కదూ. రాత్రి నాకు కాళ్ళు , చేతులూ ఆడలేదంటే నమ్మండి. ఇంట్లో ఒక్కదాన్నాయె. మీరు ఫోన్ చేసి, వస్తున్నానని చెప్పాక ధైర్యమొచ్చింది. దేవుడికి మొక్కుకున్నాను. అదేదో మంత్రం వేసినట్టు తగ్గిపోయింది....." ఆమె చెప్పుకుపోతోంది.

    నాకు జాన్ గుర్తొచ్చాడు.

   
                         *    *    *

    "ఈ రోజు నువ్వు స్కూల్ కి వెళ్ళకుండా వుండాల్సింది. జ్వరం తిరగబెడ్తే ఏం చేసేవాడివి?" ఆ రాత్రి డిన్నర్ చేస్తూ అంకిత్ తో అన్నాను.

    "నేను చెప్తే వినలేదు. పెద్దవాడవుతున్నాడుగా" ఫిర్యాదు చేస్తున్నట్టు అంది అరుంధతి.

    "నాకీరోజు పరీక్ష వుందని చెప్పానుగా మమ్మీ......"

    "రాయకపోతే కొంపలేం మునిగిపోవు" కోపంగా అంది. వాడు అదోలా గమ్మత్తుగా తలెగరేసాడు. నేను మాత్రం నవ్వుతూ వాళ్ళ సంభాషణ వింటున్నాను.

    ఆ రాత్రి నాకెందుకో చాలా ఫ్రెష్ గా అనిపించింది. మనసంతా తేలిగ్గా హాయిగా వుంది. నిన్నరాత్రి ఇదే సమయానికి ఎంతో టెన్షన్ తో డ్రయివ్ చేస్తున్నాను. ఈ రోజు నా కుంటుంబంతో వున్నాను.

    నాకు నా బెడ్ రూమ్ అంటే చాలా ఇష్టం. వినేవాళ్ళకి ఇది చిత్రంగా వుండొచ్చు. డబ్బున్న వాళ్ళ ఇళ్ళలాగా, మా పడగ్గది కిటికీలకి తెరలుండవు. తలుపులు మూసుకుని పడుకోం.

    ఒక అర్థరాత్రి మెలకువ వస్తుంది నాకు. కిటికీ అవతల క్రోటన్ మొక్కలు గాలికి వూగుతూ వుంటాయి స్వచ్ఛమైన గాలి పలకరిస్తూ వుంటుంది. వెన్నెల  లోపలి విస్తరిస్తుంది. బయటి ప్రశాంతత లోపల పరుచుకుని ఆ గదిని ఒక అరవిందాశ్రమం చేస్తుంది. అవన్నీ కాదు. వాటికన్నా అద్భుతంగా నచ్చే దక్కడ మరొకటి వుంది.

    అరుంధతి.

    చిన్నపిల్లలా ముడుచుకుని పడుకుని వుంటుంది తను. తల్లి కడుపు మెలికలో వెచ్చగా పడుకున్న కుందేలు పిల్లలా సెక్యూరిటీ ఫీలింగ్ పరాకాష్ట చెందిన సంతృప్తిని ఆస్వాదిస్తూ నిశ్చింతగా నిద్రపోతూ వుంటుంది. బహుశ నా మేల్ ఈగోని అది బాగా సంతృప్తి పరుస్తూంటుందనుకుంటాను.

    అప్పుడప్పుడు అంకిత్ మా గదిలో పడుకోవాలన్న అభిలాషని వ్యక్తం చేస్తూంటాడు. అప్పుడు  మాత్రం మేం కాస్త సభ్యతాయుతంగా నిద్రపోతాం.


                         *    *    *

    మరుసటిరోజు ప్రొద్దున్నే నేను తిరిగి హైద్రాబాద్ బయల్దేరాను. ఇంకా రెండ్రోజుల పని వుందక్కడ.

    "తొందరగా వచ్చెయ్యి డాడీ".

    "ష్యూర్. నీకేం కావాలి అక్కణ్ణుంచి?"

    "టెండూల్కర్ ఆటో బయోగ్రఫీ".

    "తప్పకుండా....."

    వాడు నవ్వేసి, "టెండూల్కర్ ఇంకా వ్రాయలేదు డాడీ" అన్నాడు. నేనూ ఆ విషయం తెలియనట్టు నటిస్తూ ".....అవునా" అంటూ వాడి నుదుట ముద్దు పెట్టుకుని బయల్దేరాను.

    జాన్ కారు అతడికి అప్పగించటం బాధ్యతగా భావించాను. అందుకే బాగా అలసటగా వున్నాకూడా విజయవాడలో దిగి కారు తీసుకున్నాను. మరుసటిరోజు యాధావిధిగా రెస్టారెంట్ లో కలుసుకున్నాం ఇద్దరం.

    "చాలా కంగారు పడ్డట్టున్నావ్ కదూ" అన్నాడు.

    "అవును, కాదు".

    "అదేమిటి?"

    "ఒక విధంగా చెప్పాలంటే డానికి నువ్వే కారణం జాన్....."

    "నా కర్థం కావటంలేదు"

    "నేనంత టెన్షన్ లో వుంటే నువ్వు మామూలుగా మాట్లాడటం నాక్కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. బాధగా కూడా..... అయితే తరువాత ఆలోచించాను. నీ థియరీ అర్థం చేసుకోవటం చాలా కష్టం జాన్! చేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఉదాహరణకి నిన్నటి సంఘటనే తీసుకో- నేను వెళ్ళేసరికే అంకిత్  స్కూల్ కి వెళ్ళిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. అంత హడావుడిచేసి నన్ను  ఆగమేఘాల పిలిపించి నందుకు అరుంధతిని తిట్టాలి! అదుగో..... అప్పుడే నీ పుస్తకం గుర్తొచ్చింది. ఆమె తరపునుంచి ఆలోచిస్తే ఆ కంగారు సహజమే అనిపించింది. నవ్వేసాను. అంతే ......వాతావరణం తేలికైపోయింది! నేనేమని ఆలోచంచానో తెలుసా? నేను వెళ్ళేసరికి నిజంగా అంకిత్ కి సీరియస్ గా వుందనుకో. నేను వెళ్ళి అండగా నిలబడేవాడిని. అదినా "ఈగో" ని సంతృప్తిపర్చి వుండేదేమో! అలా కాకుండా, అక్కడంతా సవ్యంగా వుండేసరికి నాక్కోపం వచ్చింది. ఎంత  హాస్యాస్పదమైన విషయమో చూడు" అని ఆగి..... "ఈ పాజిటివ్ థింకింగ్ నీకెలా వచ్చింది డేవిడ్...." అని అడిగాను.

    బహుశా మరణం దగ్గర పడటం వల్లనేమో" జాన్ డేవిడ్ నవ్వేడు.

    "నా వుద్దేశ్యం అది కాదు" నొచ్చుకుంటున్నట్టు అన్నాను.

    అతడు చాలాసేపు మౌనంగా వుండి అన్నాడు. "చిరాకులన్నిటికీ కారణం మన అసంతృప్తులే అని నేను భావిస్తాను?"

    "నీకేం అసంతృప్తి లేదా?"

    "......లేదు" అతడు చాలా నిశ్చయంగా స్ఫుటంగా అన్నాడు.

    "మరణం కూడా?"

    "మరణం కూడా!"

    నేనుతలెత్తి అతడివైపు చూసాను. బీర్ గ్లాసులో పైకివస్తున్న బుడగలకేసి చూస్తూ అన్నాడు. "దయతో వివాహం జరిగిన కొన్నాళ్ళకి నాకు తెలిసింది- తను వైవాహిక జీవితానికి పనికిరాదని..... కిడ్నీ ట్రబుల్ ఏదో వుంది తనకి! అంటే మాల్ ఫంక్షన్ కాదు. వెన్నెముకలో ఏదో ట్రబుల్.......సెక్స్ కి పనికిరాదు. ఈ విషయం నీకే  చెప్తున్నాను...... ఇంత కాలం మూడో వ్యక్తికి తెలీదు. ఇన్ని దశాబ్దాల సంసారంలో తనతో నేనెప్పుడూ అసంతృప్తి ఫీలవ్వలేదు. తను ఇప్పటికీ కన్యే. కానీ ఆ సమస్య మమ్మల్నెప్పుడూ బాధించలేదు".

    "నేనో అద్భుతాన్ని చూస్తున్నట్టు అతడివైపు చూస్తూ వుండి పోయాను. తరువాత చాలాసేపు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అతడెందుకో చాలా రిలాక్స్ డ్ గా కనిపించాడు. మనసు విప్పి మాట్లాడుతున్నట్టు అనిపించింది ఎన్నో విషయాల గురించి చెప్పాడు.

    హైదరాబాద్ లో నా పని పూర్తయ్యింది. ట్రయిన్ లో కూసా అతడు చెప్పిన మాటలే చెవుల్లో మార్మోగుతున్నట్టు అనిపించింది. ఒకటే అనిపించింది.

    దేవుడో పెద్ద సాడిస్ట్.

    కొద్దిగంటల్లో అది మరోసారి నిరూపణకాబోతుందని నాకా క్షణం తెలీదు.


                          *    *    *

    ఎప్పుడు నేను క్యాంప్ నుంచి మా వూరికి (ఇంటికి) వెళుతున్నా, నాకు ఏదో తెలియని సంతోషంగా వుంటుంది. అప్పుడూ అలాగే వుంది. అదే నాల్రోజుల క్రితం -ఎంత ఆందోళనతో ప్రయాణం చేసానో తలచుకుంటే నవ్వు వస్తోంది.

    నేనా విషయం తల్చుకుంటూండగానే విశాఖపట్టణం వచ్చేసింది.

    ట్రయిన్ దిగి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి వుంది!

    నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేనారోజు వస్తున్నానని అరుంధతికి తెలుసు. అయినా అంత ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా అనుకున్నాను. అంకిత్ ని స్కూలు దగ్గర దింపటానికి ప్రత్యేకంగా ఆటోవుంది. అది పాడైన పక్షంలో అప్పుడప్పుడు అరుంధతే బస్ లో దింపుతూండేది. అదీ- అంకిత్ చిన్నప్పుడు! అలా చేయడం మానేసి చాలా కాలం అయింది.

    గేటు దగ్గర నిలబడ్డాన్నేను. ఆలోచన్లలో వుండగానే పక్కింటిపాప పరుగెత్తుకు వచ్చి, "ఆంటీ నీకిమ్మంది" అంటూ ఉత్తరమూ తాళంచెవీ ఇచ్చింది.

    ఆశ్చర్యంగా వాటిని అందుకుంటూ, ఉత్తరం విప్పి చదివాను.

    "అంకిత్ కి వంట్లో బావోలేదు. వెంటనే ఆస్పత్రికి రండి....!" అని మాత్రమే వుంది. మిగతా వివరాలు లేవు. నేను ఆందోళనగా..... "ఆంటీ ఎప్పుడు బయల్దేరింది?" అని అడిగాను.

    "ప్రొద్దున్నే..."

    "అంకిత్ ర్లా వున్నాడు?" నా మనసంతా అప్పటికే టెన్షన్ తో నిండివుంది. కంగారుగా వెళ్లిపోయింది. మరి ఆటోలో అంకిత్ వున్నాడేమో..... ఇంటిముందు ఆటో వుండటం మాత్రం చూసాను".

    నేనింక ప్రశ్నలు వేయలేదు. ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. ఆటోఎక్కి ఆస్పత్రి పేరు చెప్పాను. నా కంఠం నాకే బలహీనంగా వినిపించింది.

    ఆటో కదిలింది.

    సీటు వెనక్కివాలి నిస్సత్తువగా కళ్ళు మూసుకున్నాను.

    కొన్ని రోజుల క్రితం ప్రత్యూష వేళలో సముద్రతీరపు జాగింగ్ చేస్తూ ఇసుకలో ఫిరంగి పక్కన అంకిత్ కుప్పకూలిపోయిన దృశ్యం నాకళ్ళముందు కదలాడింది.

    ఆ రోజు ఏం జరిగిందంటే.....
   
           
                                2

    నిన్ను నువ్వు కోల్పోకుండా చేసుకోగలిగేది నువ్వే!

                          *    *    *

    "కన్నా, ఎలా వుందిప్పుడు?" అంకిత్ తల్లోకి చేతులు పోనిచ్చి దువ్వుతూ అడిగాను.

    అంకిత్ - నేనే నిద్రలేపాలని పట్టుబట్టేవాడు. రాత్రిళ్ళు నేను ఎంత ఆలస్యంగా క్యాంప్ నుంచి వచ్చినాసరే- జాగింగ్ వెళ్ళటానికి బద్ధకమేసినా సరే... వాడిని నిద్రలేపటం అనేది నా దినచర్యలో భాగమైపోయింది. అది నాకూ ఆనందకరమైన విషయమే!

    అంకిత్ మెల్లగా కళ్లు తెరిచాడు. నన్ను చూడగానే వాడి మోహంలో ఆనందం కనపడింది. కొంచెం తేరుకున్నట్టు కనిపించాడు.

    వాడిలో ఒక విషయం నేను గమనించాను. నిద్రలేకపోయినా ఆ అలసట  వాడి మొహంలో కనిపించదు. అది మాత్రం నా లక్షణమే వచ్చిందని నాకు కాస్త గర్వంగా కూడా వుంటుంది!

    "ఇవాళ కాస్త ఫర్వాలేదనుకుంటాను....." అన్నాను.

    "అవును. డాక్టర్ అంకుల్ కూడా సోమవారం నుంచి స్కూల్ కి వెళ్ళొచ్చని చెప్పాడు డాడీ! మీతో కలిసి జాగింగ్ కూడా చెయ్యొచ్చని అన్నాడు".

    ".......గుడ్".

    ఆ తర్వాత, స్నానంచేసి నా గదిలోకి వచ్చాను.

    తను చదివిన పుస్తకాలన్నీ అంకిత్ నాకు చూపించాడు. నేను ఆసక్తిగా వినసాగాను. తాము తెలుసుకున్న విషయాలు తల్లితండ్రులు కుతూహలంగా విన్నప్పుడే- మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవటానికి పిల్లలు ఆసక్తి చూపుతారని జాన్ డేవిడ్ ఒక పుస్తకంలో వ్రాసాడు. ఆ విషయం నాకెప్పుడూ గుర్తొస్తూ వుంటుంది. 

 Previous Page Next Page