Previous Page Next Page 
పర్ణశాల పేజి 7


    మెయిన్ గేటుదగ్గర లేడు. రెండు ఫర్లాంగుల దూరంలో వున్న టీ కొట్టు దగ్గరకు వెళ్ళివుంటాడు. యజమాని వెళ్ళిపోవటం చూసి వాడూ వెళ్ళిపోయి వుంటాడు.

    ప్రహరీ తలుపు దగ్గరగా వేసి గొళ్ళెం పెట్టేడు.

    నెమ్మదిగా ఊరివేపు నడవసాగాడు.

    చుట్టూ గడ్డిమొక్కలు ...... దుబ్బుల్లా పెరిగిన పొదలు..... దూరంగా సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ ఉప్పుగాలి..... కీచురాళ్ళ చప్పుడు.

    చిన్న కాలిబాటలో నడుస్తూ వుంటే కాలి క్రిందనుంచి మెత్తగా పాకి 'బుస్' అన్న శబ్దం వినిపించింది.

    మసక చీకట్లో పాము పొడలమధ్య అదృశ్యమయింది.

    రంగయ్య అంతగా పట్టించుకోలేదు.

    పారేసిన రొయ్యల తలల్ని తినటానికి నీటిపాములు ఫ్యాక్టరీ చుట్టూ చేరటం అక్కడి వారికి తెలిసిందే. రంగయ్య ముందుకు సాగిపోయేడు. పాములు స్టోరేజి లోపలికి రాలేవని, వచ్చినా వెంటనే చలికి చచ్చిపోతాయని తెలుసతనికి.

    కానీ అది త్రాచుపామనీ- తన మీద పగబట్టిందనీ మాత్రం తెలీదు.

                               *    *    *

    విశాలమైన రోడ్ మీద పాములా జారిపోతోంది కారు. పది నిమిషాలు ప్రయాణం చేసి కొండ ఎక్కటం ప్రారంభించింది.

    "మీకు దేముడిమీద నమ్మకం వుందా?" కిరణ్మయి అడిగింది.

    ముందు సీట్ లో  కూర్చున్న చైతన్య మాట్లాడలేదు. కాంతిమతే జవాబిచ్చింది. సంవత్సరానికి ఒకసారి కొండకొచ్చి దర్శనం చేసుకోకపోతే నా మనసు ఊరుకోదు."

    కాంతిమతి వళ్ళో కూర్చున్న బాబు ఎత్తయిన కొండల్నీ- కొండల మధ్య మెలికలు తిరిగిన రోడ్ ని చూస్తున్నాడు. కారు మంచి కండిషన్ లో ఉన్నట్లు చప్పుడు చేయకుండా షూట్ రోడ్ లా  వెళుతోంది.

    "సాధారణంగా డబ్బున్న వాళ్ళకి దేముడిమీద నమ్మకం ఎక్కువగా వుంటుంది" అన్నాడు చైతన్య.

    "అది నేననాల్సిన మాట" అంది కిరణ్మయి.

    శారద ఇబ్బందిగా కదిలింది. అక్క అంత నిర్మొహమాటంగా మాట్లాడ్డం ఆమెకు నచ్చదు. కానీ చైతన్య వెనక్కి తిరిగి "కాంతీ, నాకు కిరణ్మయిలో నచ్చే గుణం అదే సుమా! మనసులో ఏదీ ఉంచుకోకుండా మాట్లాడటం" అన్నాడు నవ్వుతూ.

    "అలా మాట్లాడకూడదని, అలా మాట్లాడటం గొప్ప కాదనీ నాకు తెలుసు. కానీ ఆ విషయం నాకెప్పుడూ అలా మాట్లాడేసిన తర్వాత జ్ఞాపకం  వస్తూ వుంటుంది" అంది కిరణ్మయి అమాయకంగా. కారు నవ్వులతో  ప్రతిధ్వనించింది.

    "బిజినెస్ మేన్ కి  ఉండగూడని గుణం అది" అంది కౌసల్య.

    చైతన్య చెల్లెలివైపు చూసి "ఆమెకీ బినినెస్ కీ సంబంధం ఏమిటీ" అన్నాడు.

    "ఇప్పుడు ఆడవాళ్ళు  కూడా బిజినెస్ లో పైకొస్తున్నారు. సార్" అన్నాడు డ్రైవర్ తన పరిజ్ఞానం చూపిస్తూ.

    అప్పటివరకూ నవ్వుతూన్న చైతన్య మొహం ఎర్రబారింది. మళ్ళీ కారు  కాటేజి ముందాగే వరకూ అతడు మాట్లాడలేదు. అక్కడ వాళ్ళకోసం ఎదురు చూస్తున్న నౌఖరు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆడవాళ్ళు లోపలికి వెళ్ళేరు.

    చైతన్య కారు దిగేడు. "డ్రైవర్!" కోటు సర్దుకుంటూ అన్నాడు.

    "సర్....."

    "కారుకు వెనుక సీటూ, ముందుసీటూ ఎందుకుంటుదో తెల్సా?" అతడి మొహం సీరియస్ గా వుంది. "ముందు డ్రైవర్ కూర్చుంటానికి-వెనుక యజమానులు కూర్చోటానికి, మైండిట్."

                                *    *    *

    ఇసుకవేస్తే రాలనంత జనం. అందరి మొహలలోనూ లోపలికి వెళ్ళాలనే ఆరాటం, ఏదో కంగారు. ఒక మూల  ఓ గుంపు "గోవిందా" అని  అరుస్తున్నారు. వృద్దులు, పసిపాపల్ని ఎత్తుకుని తల్లులు, రోగులు, కొత్త దంపతులు......రకరకాల మనుష్యులు.

    కారొచ్చి ఆగింది.

    ఇంతమంది జనాన్ని చూసిన ఆడవాళ్ళు నీరుగారి పోయేరు. ఇక ఆ రోజుకు దర్శనం దొరకటం దుర్లభం అనేది నిస్సంశయముగా తేలిపోయింది.

    ఈ రోజు ఏదో పండుగ అనుకుంటా" అంది కౌసల్య  చుట్టూ చూస్తూ.

    "ఇంత వత్తిడిలో బాబును తీసుకెళితే ఎలాగండీ" అంది కాంతిమతి.

    చైతన్య మాట్లాడలేదు.

    స్పెషల్ దర్శనం దగ్గర కూడా జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. గాలిలేక విపరీతంగా ఉక్కబోస్తోంది. ఆ వాతావరణం అలవాటు లేని కౌసల్య కళ్ళు  అప్పుడే అలసట సూచిస్తున్నాయి. జనం మాత్రం ప్రవాహంలా వస్తూనే వున్నారు.

    ఇంతలో డ్రైవర్  వచ్చేడు. అతడితోపాటూ పెద్ద బొట్టు పెట్టుకుని ఒకతను  వచ్చేడు. వస్తూనే  నమస్కారం పెట్టి, తొందర తొందరగా  క్షమాపణలు చెప్పుకున్నాడు.

    "రండి సార్ రండి. జైన్ సాబ్  ట్రంకాల్ చేసి చెప్పినారు. మీ గురించే  చూస్తున్నాము. కొంచెం ఆలస్యమైతే కాఫీ తాగటానికి పోయి వుంటిని" అంటూ  దారి చూపించేడు.

    చైతన్య తలాడించి ముందుకు నడిచేడు. అందరూ అతణ్ణి అనుసరించారు.

    జనం బయటకు వచ్చే గేటులో నుంచి లోపలికి తీసుకెళ్ళాడు. దర్శనం  చేసుకున్నవాళ్ళు ఒక్కొక్కరే బయటకు  వస్తున్నారు. ఆ దారి  ఖాళీగా వుంది.

    రెండు నిముషాల్లో దేవుడి దగ్గరికి చేరుకున్నారు.

    పూజారి నమస్కారం  పెట్టి బొట్టువాడిని పలకరించాడు.

    "ఇదో" అన్నాడు బొట్టువాడు. "మన జైన్ సాబ్ పంపినారు. స్పెషల్  గెస్ట్ లు."

    దాంతో మిగతా క్యూ ఆగిపోయింది.

    పూజారి దేవుడ్ని వర్ణించి చెప్పసాగేడు.

    ఇంకో పూజారి తీర్థం పోయసాగేడు.

    బాబుతో కాంతిమతి దణ్ణం పెట్టిస్తూంది.

    కౌసల్య భక్తితో కళ్ళు మూసుకుని వుంది. శారద మళ్ళీ చూడటం  పడదేమో అన్నట్టు  కళ్ళారా చూస్తూంది. కాంతిమతి బాబు నుదుటిమీద బొట్టు పెడుతోంది.

    దూరంగా ఎత్తుమీద  నిలబడ్డ చైతన్యకు అంతా స్పష్టంగా కన్పిస్తోంది.

    జేగురు రంగులో దేవుడు వెల వెలబోతున్నాడు.

    ముందు దీపాలు వెలగనూ - ఆరనూ అన్నట్లున్నాయి.

    చుట్టూ గోడలు నల్లగా వున్నాయి. లోపలంతా చీకటిగా, క్రింద అంతా  తేమగా వుంది. పైన ఏముందో తెలీడంలేదు.

    పొగవాసన ఉక్కిరి బిక్కిరి చేస్తూంది. బయట క్యూలో ఎవరో ఊపిరి సలపకుండా దగ్గుతున్నారు. ఇంకెవరో భక్తి పారవశ్యంతో అరుస్తున్నారు.

    పూజారి బొట్టువాడ్ని "టైంమెంతయింద'ని అడుగుతున్నాడు. ఇంకో పూజారి దేవుణ్ణి యింకా వర్ణిస్తూనే వున్నాడు. అతడికి చూస్తూ వుంటే తన సరుకును వర్ణిస్తూ బేరంచేసే బెస్తవాడు జ్ఞాపకం వచ్చేడు చైతన్యకి.

    అతడి కెందుకో నవ్వొచ్చింది. ఎందుకో తెలీదు......తెరలు తెరలుగా నవ్వాలనిపించింది. అతడి మనసులో ఏముందో అతడికే స్పష్టంగా తెలీదు. తను  ఎత్తుమీద  వున్నట్టూ, మిగతా వాళ్ళంతా క్రింద వున్నట్టూ భావన....రెండు చేతులూ కట్టుకొని, పక్కకి జొరబడి చూస్తున్నాడు.

    ఇంతలో అతడి వెనుకగా వున్న 'క్యూ'లో కలవరం మొదలుయింది. సహనం చచ్చిపోయిన వాళ్ళని గైడ్లు సరిచేయ బూనటంతో గొడవ జరుగుతూంది.

    చైతన్య అటు చూసేడు. గైడ్ కొద్దిగా బలంగా తొయ్యటంతో  ఒక ముసతను పక్కకు పడిపోయి, బలహీనంగా లేస్తూ అరిచేడు.... "రేయ్! నిన్న రాత్రి నుంచీ 'క్యూ'లో వున్నాన్రా నేను ఇప్పటికి  ఇక్కడి వరకూ  వచ్చేను. ఇప్పుడు  దేవుణ్ణి చూడనివ్వకుండా తోసేస్తావా? సర్వనాశనం అయిపోతావ్?"

    చైతన్య చప్పున తల తిప్పేసుకున్నాడు.

    తన వాళ్ళందరూ అప్పటికే వెళ్ళిపోవటం చూసి, అతడూ బయటికి వడివడిగా  నడిచేడు.


                                *    *    *

    "పరీక్షలు బాగా వ్రాసేవా?" లోపలికి వస్తూన్న రవిని అడిగేడు చైతన్య.

    టేబిల్ కి ఇవతలి పక్క కుర్చీలో కూర్చుంటూ తలూపేడు రవి. "సెకండ్ క్లాసు వస్తుందనుకుంటాను" అన్నాడు.

    "తరువాతేం చేస్తావు?"

    "ఇంకా చదువుదామనుకుంటున్నాను."

    చైతన్య భారంగా శ్వాస వదులుతూ "సరే" అన్నాడు. నిజానికి అతడికి  తమ్ముడు కూడా ఈ పనులు చూసుకుంటే సగం పని తగ్గుతుందన్న  ఉద్దేశ్యం వుంది.

    "చదువుకోనా?" చిన్నపిల్లవాడు అడుగుతున్నట్టు అడుగుతూన్న  తమ్ముణ్ణి చూస్తే అతనికి నవ్వొచ్చింది.

    "అదేమిట్రా అలా అడుగుతున్నావ్? ......." అన్నాడు నవ్వుతూనే.

    "ఏం లేదు ..... నువ్వు సరేనని చాలా క్యాజువల్ గా అంటూంటే -"

    చైతన్య కుర్చీలో వెనక్కి వాలుతూ "నువ్వూ ఈ విషయాలు కొద్దిగా  చూసుకుంటూ  వుంటే బావుంటుందని నా ఉద్దేశ్యం. నాకూ శ్రమ  తగ్గుతుంది. నీకూ పని తెలుస్తుంది" అన్నాడు.

    రవి బెదిరినట్టు కుర్చీలోంచి లేచి, "బాబోయ్! ఈ రొయ్యల బిజినెస్ నేను చెయ్యలేన్నన్నయ్యా..... ఆ మాటకొస్తే అసలు ఏ బిజినెస్సూ చెయ్యలేను" అన్నాడు.

    "ఏం?"

    "నేను శుద్ధ అమాయకుణ్ణి. నా మొహం చూస్తూంటే ఆ సంగతి తెలియటం లేదూ....."

    చైతన్య నవ్వాపుకుని, "సర్లే" అన్నాడు.

    ఇంతలో రంగయ్య వచ్చేడు. "నే వెళ్ళొస్తా" అన్నాడు రవి లేచి. తలూపి, రంగయ్య అందించిన స్టాక్ స్టేట్ మెంట్ చూసేడు చైతన్య. దాదాపు ఎనిమిది లక్షలదాకా పూర్తవుతుంది" అన్నాడు  రంగయ్య.

    "అవ్వాలి. నెలాఖరుకల్లా పంపకపోతే  కాంట్రాక్టు అనవసరంగా పోతుంది. కొంచెం ధర ఎక్కువైనా కొనెయ్యండి. మళ్ళీ  క్రిస్ట్ మస్ వచ్చిందంటే మూడు రోజులు  పనివాళ్ళు దొరకరు."

    అతడు తలూపి వెనుదిరిగేడు.

    "రంగయ్యగారూ......"

    ఆగి "ఏం బాబూ?" అన్నాడు.

    "మీ పాపకెలా వుంది?"

    అతడి మొహం పాలిపోయింది. "అలాగే వుంది బాబూ. రాయవెల్లూరు తీసుకెళ్ళాలన్నారు."

    "మరి ఎప్పుడు తీసుకెళుతున్నారు?"

    రంగయ్య మాట్లాడలేదు. చైతన్య అతడి దగ్గరగా  వెళ్ళి భుజంమీద  చెయ్యి వేశాడు. "డబ్బుకోసం బయట హెచ్చు వడ్డీకి ప్రయత్నాలు చేస్తున్నారట కదూ....." అంటూ జేబులోంచి కొంత డబ్బు తీసి అతడి చేతిలో పెడుతూ "రంగయ్యగారూ! దాదాపు పది సంవత్సరాల్నుంచీ నాతో కలిసి పని చేస్తున్నారు. ఈ రోజు ఈ బిజినెస్  ఇంతగా  డెవలప్ అయిందంటే, దాంట్లో సగం మీ  భాగమూ వుంది. అటువంటప్పుడు నన్ను డబ్బడగటానికి ఎందుకు  మొహమాటపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు" అన్నాడు.

 Previous Page Next Page