చీఫ్ ఎడిటర్ అయిన లెక్చరర్ ఒకాయన యితన్ని పిలిచి వచ్చిన రచనలన్నీ చదివి, చెత్తగా వున్న వాటిని వొదిలేసి మిగతావి తనకు ఇమ్మని అందులోంచి తను ఫైనల్ గా సెలక్ట్ చేస్తానని అన్నాడు. డిశంబరులో ఒక సంచిక వస్తుంది. ఏప్రిల్ లో పరీక్షల సమయంలో రెండవది వస్తుంది. రెండవదాంట్లో ఎక్కువ భాగం ఫోటోలూ, వివిధ ఎసోసియేషన్ ల రిపోర్టులూ వుంటాయి. రచనలన్నీ అతను యింటికి పట్టుకుపోయాడు. అతనింకా వాటిని చదవటం ప్రారంభించనే లేదు. కొందరు విద్యార్థులు అతను కనిపించినప్పుడల్లా "నా రచన విషయం ఏంచేశారు?" అని వేధించటం మొదలు పెట్టారు. ఒకడొచ్చి "నేనిచ్చిన నాటిక వుంది చూశారూ? అందులో కొన్ని డైలాగులు మోతగా రాశానండి" అనేవాడు. మరొకడొచ్చి "నేనిచ్చిన కథలో ఓ గేయంకూడా రాశానండోయ్. చెప్పుకో కూడదుగానీ శ్రీశ్రీ ఎందుకూ పనికిరాడనుకోండి. అట్లా రాశాను. కొంచెం చూద్దురూ" అనేవాడు.
మధుబాబు ఓపిగ్గా చదవసాగాడు. ఎక్కువభాగం ప్రేమకథలు, లేకపోతే కాపీకొట్టిన బాపతు. అవి అక్కడక్కడా మంచివి..... చాలా మంచివికూడా కనిపించాయి. లేడీస్టూడెంట్స్ దగ్గరనుంచికూడా పది పదిహేనువరకూ వచ్చాయి. వాటిని ఉత్సాహంగా చదివాడు. ఒకమ్మాయి మాతృభక్తినిగురించి రాసింది. ఒకమ్మాయి భర్తగా మొగవాడి దౌర్జన్యాన్ని గురించి రాసింది. కాని రాజ్యలక్ష్మి అనే అమ్మాయి రాసిన కథ చదువుతోంటే, అతనిగుండె గుభేలు మంది. ప్రశంస అంతా కాలేజీ అబ్బాయీలూ గురించే. ఆడపిల్లలు జట్కాల్లో పోతూంటే కుర్రాళ్లు వెంటపడటం, నిక్ నేమ్స్ పెట్టి ఏడిపించటం అదంతా రాసింది. ఓసారి తను (కథలో నాయిక) రైల్లో పోతోందిట. ఎదుటిసీట్లో తన క్లాసుమేటు రఘు, ఊరికినే ఎగాదిగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి విసుక్కుంది. కాసేపటికి నిద్రవచ్చి కునికిపాట్లు పడుతోంది. ఇంతలో స్పర్శ తగిలి ఉలిక్కిపడి లేచేసరికి రఘు కంగారుగా ఆమెచేతిని పట్టుకుంటున్నాడు. మళ్ళీ ఆలోచించకుండా చాచిపెట్టి ఒక్క చెంపకాయ కొట్టింది. అతను తెల్లబోయి బిక్కమొహంతో ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా తిట్లవర్షం కురిపించింది. పెట్టెలోవున్న వాళ్ళంతా యీ పిల్లనే సమర్థించారు. ఆ అబ్బాయి ప్రక్కస్టేషన్ లో తలవంచుకు దిగిపోయాడు. తర్వాత అతడు కాలేజీకి రాలేదు. జ్వరం ముంచుకువచ్చింది. ఆ జ్వరంలో ఈ అమ్మాయినే కలవరిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు వచ్చి యీ పిల్లను బ్రతిమాలారు- ఒకసారి వచ్చి చూడమని. పాపం అని జాలిపడి వెళ్ళింది. అతను ఇట్లా కలవరిస్తున్నాడు. "నేనేమీ దురుద్దేశంతో చేయలేదు లీలా! నువ్వు నన్నపార్థం చేసుకున్నావు. నువ్వు నిద్రపోతోంటే నీ వ్రేలిఉంగరం వదులుగా వుందేమో, జారి క్రిందపడుతోంది. నీ చెయ్యి కిటికీలో వుండటం వల్ల, అది బయట పడిపోతుందేమోనన్న ఆరాటంతో చెయ్యి పట్టుకున్నాను" ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగాయి. తను ఎంత అపోహపడింది? అప్పట్నుంచీ అక్కడేవుండి అతనికి సపర్యలు చేసింది. రక్షించుకుంది. తరువాత వాళ్ళిద్దరి మధ్యా పర్యవసానం పాఠకులే ఊహించుకుందురుగాక. ఇది చివరి వాక్యం.
ఇది పబ్లిష్ చేస్తే ఈ రాజ్యలక్ష్మికి పుట్టగతులుంటాయా, అనుకున్నాడు మధుబాబు. ఎట్లా ధైర్యం చేసింది అలా రాయటానికి? మారు మాటాడకుండా దీన్ని ఒకమూలకు నెట్టివేయవచ్చు. కాని అతనికి ఆ అమ్మాయిని చూడాలనీ, వీలైతే మాట్లాడాలనీ కోరిక కలిగింది. ఫస్టియర్ చదువుతోంది. సైన్సు గ్రూపే. మరునాటి ఉదయం ఆడపిల్లలందరూ క్లాసులకి పోతోంటే వరండాలో నిలబడి గమనిస్తూ "రాజ్యలక్ష్మి ఎవరోయి అందులో?" అని ప్రశ్నించాడు ప్రక్కనున్న అతన్ని.
"ఏం దానిమీదకు పోయింది మనసు? అదిగో! అట్నుంచి నాలుగో అమ్మాయి. ఆకుపచ్చరంగు వోణీ వేసుకోలా? అదీ" అన్నాడు ఆ ప్రక్కవాడు.
"పదహారేళ్లకంటే ఎక్కువ వుండవు" అనుకున్నాడు మధుబాబు. పరికిణి, వోణి వేసుకుంది. కొంచెం సన్నగా, తెల్లగా, కోలముఖం, పెద్ద పెద్ద కళ్ళతో చురుగ్గా గోచరించింది. కాని ప్రక్క విద్యార్థి ఆమెను "అది" అని సంబిదించటం అతనికి నచ్చలేదు. అతడు ఒక్కడేకాదు. పరోక్షంలో ప్రతివాడూ అమ్మాయిల్ని గురించి అలానే మాటాడటం గమనించాడు.
మధ్నాహ్నం విశ్రాంతి సమయంలో ధైర్యంచేసి గరల్స్ రూమ్ దగ్గరకు వెళ్లాడు. అతనిగుండె గబగబ కొట్టుకోసాగింది. అతను అక్కడకు ఎందుకు వెళ్లాడో స్పష్టంగా తెలీదు. గుమ్మం ఇవతల నిలబడి బెదురుతూ లోపలకు చూశాడు.
ఆడపిల్లలందరూ లోపల నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఉషారుగా వున్నారు. ఒకళ్ళనొకళ్ళు పరాచికాలు ఆడ్తున్నారు. ఒకళ్ళిద్దరు ఓ మూల గట్టిగా అరుచుకుంటూ మాటలాడుకొంటున్నారు. కొంతమంది టిఫిన్ తింటున్నారు. ఒకమ్మాయి తెలుగునవల ఏదో చదువుతోంది. ఒక్కతె ప్రక్కనున్న నేస్తురాలితో "వాడు లేడూ! జనార్ధనంగాడు ఇందాక నన్ను నోట్సు అడిగాడు సిన్సియర్ గా ఫోజు వేసి" అని మధుబాబు ముఖం కనిపించి ఆగిపోయి, నాలిక కొరుక్కొని నెమ్మదిగా లోపలకు జారుకుంది.
ఓ ఎర్రటి అమ్మాయి బయటికొచ్చి "ఎవరు కావాలండి?" అనడిగింది సంకోచించకుండా.
"రాజ్యలక్ష్మి" అన్నాడు తడబడుతోన్న కంఠంతో మధుబాబు. "ఎందుకొచ్చాను, బుద్ధి గడ్డితిని ఇక్కడకు?" అని లోలోపల విసుక్కున్నాడు.
"ఏ రాజ్యలక్ష్మి అండి?" అన్నదా పిల్ల కొంచెం ముందుకువంగి, ప్రశ్నార్థకంగా ముఖంపెట్టి.
"ఎన్. రాజ్యలక్ష్మి, ఫస్టియర్, బై.పి.సి."
ఆ అమ్మాయి లోపలకువెళ్లి గట్టిగా "ఓ రాజ్యలక్ష్మి ఎన్. ఫస్టియర్ బై.పి.సి. నీకోసం ఎవరో వేంచేశారు. దయచెయ్యి" అన్నది కొంటెగా.
లోపలనుండి రాజ్యలక్ష్మి కొంచెం కంగారుగా ఇవతలకు వచ్చింది. గుమ్మం ఇవతల నిలబడివున్న మధుబాబుని చూశాక "మీరా?" అన్న తళుక్కుమన్న భావం ఆమె వదనమండలంలో ద్యోతకమైంది.
"ఏమిటండి?" అన్నది దగ్గరకొచ్చి నిలబడి ఎంతో చనువుగా.
మధుబాబు నమస్కారం పెడదామని ఆ సంగతి మరిచిపోయాడు. అంతేగాక తనువచ్చింది వట్టినే ఆషామాషీగా కాదనీ, సకారణయుతంగాననీ ఆమెకు వెంటనే తెలిసేటట్లు చేయాలని తాపత్రయపడసాగాడు.
"మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చానండీ" అన్నాడు తొట్రు పాటుతో.
రాజ్యలక్ష్మి వెనక్కి తెరిచివున్న తలుపుకి భుజాన్ని ఆనించి, చేతులు రెండూ హృదయంమీదుగా కట్టుకుని "చెప్పండి" అన్నది చిన్నగా నవ్వి.
ఈ దృశ్యం చూపరులకు ఎలా వుంటుందా అని ఆలోచించాడు మధుబాబు. తాను దిగువున నిలబడి కొంచెం తలయెత్తి మాట్లాడుతూండటం ఆమె కాస్త ఎత్తులో వయ్యారంగా తలుపుకి భుజాన్ని ఆన్చి నవ్వుతూ మాటలాడుతూండటం...." అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్సు, లేడీ స్టూడెంట్సుతో ఇక్కడ నిల్చుని సంభాషించేటప్పుడు ఇదే భంగిమలో కనబడ్డారు. ఇఅతరుల దృష్టికి ఫలానావిధంగా గోచరించాలని అజ్ఞాతంగా వీళ్లు ఊహిస్తూ వుంటారనటంలో పోరపాటు యేమీ లేదు కదా.
"మేగజైన్ కి కథ ఒకటి ఇచ్చారు చూశారూ....."
లోపల అమ్మాయిల అల్లరి హెచ్చుతోంది. "వాడు లేడూ.....? ఆ అరేబియన్ హార్స్ గాడు" అంటోంది ఎవర్ని గురించో ఓ రాలుగాయి.
"వీళ్ళూ ఇంతే. అబ్బాయిల్ని గురించీ వాడు, వీడూ అనే సంబోధిస్తూ వుంటారు" అని విస్మయం చెందాడు మధుబాబు.
"చదివారా?" అంది రాజ్యలక్ష్మి కొంచెం సిగ్గుపడి.
"చదివాను" అని ఊరుకున్నాడు మధుబాబు. తాను ఏమి చెబుదామని వచ్చాడు? ఇక్కడ బాగుంటుందా ఆ ప్రసక్తి?
"అది..... చూశాను.... ఆ కథ బాగానేవుంది కానీ.... బాయిస్ గురించి అలా రాయటం, చివర్న ముగింపు కొంచెం ఇదిగా వున్నాయి. అందులో ఫస్టు పర్సెన్ లో రాశారు. అది పబ్లిష్ చేస్తే..... స్టూడెంట్సు సంగతి మీకు తెలియనిది ఏముంది?" అంటూ ముక్కలు ముక్కలుగా విషయం బయట పెట్టేశాడు.
రాజ్యలక్ష్మి కిలకిలమని నవ్వి "మొహమాటపడ్తున్నారే వున్న విషయం చెప్పటానికి" అంది. సిగ్గుతో మధుబాబు ముఖం అరుణరాగరంజితమైంది. చేతులు కిందికిదించి, వోణిఅంచు వ్రేలికి చుట్టుకుంటూ "నిజమేనండి, పిచ్చి దానిలా ఏదో రాశాను. ఎందుకలా రాశానో నాకే తెలీదు. తరువాత ఆలోచించుకుంటే భలే సిగ్గేసింది. అది కర్మంకాలి మీరు అచ్చువేస్తే యీ కుర్రాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. చింపెయ్యండి దాన్ని ప్లీజ్" అన్నది జాలిగా ముఖంపెట్టి.
"ఆ, చింపటమెందుకండి? తిరిగి పంపించేస్తాను. పోనీ ఇంకోటి రాసివ్వండి" అన్నాడు మధుబాబు సంకోచంగా. అతనికి ఆశ్చర్యంగా వుంది ఆమె మాటలకు.
ఆమె పెదవి విరిచి "కథలు తక్కువైనాయా నా బ్రతుక్కి ఎందుకో ఇప్పుడే రాశానంతే. ఏదో గమ్మత్" అని ఆలోచిస్తూ వూరుకుంది.
మధుబాబు నీరస కంఠంతో "మీ ఇష్టం మరి వస్తాను. సెలవు" అంటూ వెనక్కి తిరిగాడు.
"సెలవు కవిగారూ" అన్నది రాజ్యలక్ష్మి మృదుకంఠంతో వెనుకనుండి.
ఒక మృదుసుగంధం వీచినట్లుయింది. అతను ఆగి వెనక్కి చూసి, "నేను కవినిగాను, రచయితను" అన్నాడు.
"ఉహు....అలాగా? నాకు రెంటికీ డిఫరెన్సు తెలీదులెండి. అయితే సెలవు అభిమాన రచయితగారూ" అంది కొంచెం నవ్వి.
అతను పులకితుడైనాడు. ఈ అనుభూతి సరికొత్తది. "నమస్తే" అంటూ మెల్లిగా అక్కడ్నించి కదిలాడు.
ఓ సంధ్యా సమయాన రాజ్యలక్ష్మిమరో స్నేహితురాలితో కాలేజీకి అవతలగా, కాలవ ఒడ్డున షికార్లు కొడుతూ మధుబాబుకు గోచరించింది. అతను రాసుకుందామని క్లాసులయిపోయాక అటుకేసి వెళ్ళాడు. ఆమె చెలికత్తెతో సాక్షాత్కరించింది.
"రండి, రచయితగారూ రండి. ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా గ్రోలు దామని ఇలా వచ్చాం. చూశారా ఈ కాలవ! నిండుగా, గర్వంగా అస్తమిస్తోన్న సూర్యకాంతితో ఎర్రని కాంతులు చిమ్ముతూ, ఎలా ప్రవహిస్తోందో? దూరంగా ఆ సగం విరిగిన కొండ చూడండి. జీవితమే విరిగినట్లు లేదూ దాన్ని చూస్తోంటే? అబ్బ! చుట్టూ రకరకాల యీ మొక్కలు, చెట్లు, అర్థంలేని పువ్వులు! ఈ కాలవలో దూకి చచ్చిపోవాలని వుందండీ" అనేసింది రాజ్యలక్ష్మి తెరిపి లేకుండా.