Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 7


    ఫలితం - మూడోరోజు కల్లా వాళ్ళు తలమునకలయ్యే ప్రేమలో వున్నారు!
   
    టైమ్ అనేది ఎదురుచూసే వాళ్ళకు నెమ్మదిగా నడిచేది. ఆనందంతో వున్నవాళ్ళకు తొందరగా నడిచేది. భయంతో వున్న వాళ్ళకు ఆగిపోయేది. ప్రేమలో పడ్డవాళ్ళకు అసలు ఉనికే లేనిది....

    వారం రోజులు ఎప్పుడు అయిపోయాయో తెలీదు.

    'తిరిగి రాగానే మన వివాహం సంగతి పెద్దల్లో చెపుతాను' అన్నాడు అతడు ఆమెని దగ్గిరకి తీసుకుంటూ. శ్రీజ కన్నులు వేసవిలో హిమాలయాల్లా వున్నాయి. ఆ అమ్మాయి తులసికోట చుట్టూ తిరిగేటంత ఆచారాలు కలది కాకపోయినా, సనాతనాన్ని నమ్మేది. కాస్త  భయస్తురాలు. 'మేనరికం అంటే నాన్నగారు ఏమంటారో' అంది బిడియంగా.

    నిఖిల్ నవ్వేడు. "మన సంభాషణని ఎవరయినా వింటే పందొమ్మిదో శతాబ్దంలో ప్రేమికులు టైమ్ మిషన్ లో ఈ శతాబ్దంలోకి వచ్చారేమిటా అని ఆశ్చర్యపోతారు శ్రీజ! అయిపోయిన దానికి మనం ఏమి చేయలేం. నేను ఆర్కిటికా నుంచి రాగానే మనం వివాహం చేసుకుందాం. అంతకుముందే సరీగ్గా పరిచయం కూడా లేని మనం ఇప్పుడు ఇంత దగ్గరయ్యామంటే- నాకనిపిస్తుంది. ప్రేమ అనేది ఒక ఆక్సిడెంట్ కాదు. అది ఒక ఓ పెనింగ్. మన  వివాహాన్ని ఎవరూ ఆపలేరు."

    ఆ అమ్మాయి కంటి నీటితోనే వీడ్కోలు ఇచ్చింది. ఒక  చిన్న పెయింటింగ్ తన స్వహస్తాల్తో వేసింది జ్ఞాపకంగా ఇచ్చింది. గుండె చుట్టు రెండు చేతులు, 'నీ చిరునవ్వు మిలియన్ డాలర్లయితే మాత్రం ధమనుల్నీ శిరలనీ పెనవేసి పిండి ఇవ్వగలను' అని వ్రాసి వుంది. అతడు కదిలిపోయాడు.

    "ట్రీట్ స్ట్ ఇన్ మోర్గాన్ రాట్ దాహార్, సెహ్ ఇక్ డిక్ ఇన్ స్ట్రాలెన్ మీర్" అనేది స్విట్జర్లాండ్ జాతీయగీతం పర్వతసీమలపై సూర్యుడి దివ్యకిరణాలు ప్రతిబింబించినప్పుడు- అన్నది దాని అర్థం. దాదాపు అయిదు వందల సంవత్సరాలుగా ఎటువంటి యుద్ధ తాకిడీ లేని అదృష్ట దేశాల్లో అది ఒకటి.  అందువల్ల పశ్చిమాన వున్న ఫ్రాన్స్, దక్షిణాన వున్న ఇటలీ సంస్కృతులు ఈ  దేశంలోకి వరదగా ప్రవహించి ఆల్ప్స్ పర్వతాలమీద ప్రసరించే స్వచ్చమైన సూర్యకిరణాల్ని 'ఫ్రీ సెక్స్' తో కలుషితం చేశాయి.

    అటువంటి దేశంలో పెరిగిన అమ్మాయికూడా ఆ పరిస్థితులకి లొంగలేదంటే అది బుషులు పుట్టిన దేశపు రక్తమైనా కారణమై వుండాలి లేక తల్లితండ్రుల పెంపకమైనా అయివుండాలి. అంత బలమైన సంస్కృతి కాబట్టే అది రోదసీలో తిరిగే పురుషుడిని కూడా నిలబెట్టి కదిలించింది.

    ధృవ ప్రాంతాల్నుంచి తిరిగి నిఖిల్ స్విట్జర్లాండ్ వెళ్ళి, ఆమె తల్లితండ్రులతో మాట్లాడి వివాహం సెటిల్ చేసుకుందామనుకున్నాడు. అంతలోనే అర్జెంటుగా  రమ్మని కబురు రావటంతో సైన్స్ సిటీకి రావల్సి వచ్చింది. ఇది జరిగి రెండు నెలలయింది.


                                 *    *    *

    యశ్వంత్ తో కలిసి సైన్స్ సిటీకి వచ్చాక నిఖిల్ పనేమీలేకపోయింది. సెలవు తీసుకుని స్విట్జర్లాండు వెళ్ళిపోవాలనే ఆత్రంలో వున్నాడతను.

    ప్రధానాధికారితో యశ్వంత్ మాట్లాడుతూ వుండగా అతడు ఎరోనాటిక్స్ విభాగంవైపు వెళ్ళాడు. అక్కడవున్న వారందరికీ ఇష్టమే కదా!

    'యార్డ్' లో ప్రవేశించిన అతడిని చూసి అక్కడ పైలెట్ విష్ చేశాడు. అతడి పేరు రాయ్.

    "వస్తారా సార్"

    "ఎక్కడికి?"

    "కొత్త యస్.పి.యస్. వచ్చింది, పరీక్ష కోసం వెళుతున్నాం."

    నిఖిల్ ఉత్సాహంగా తలూపాడు. ఒక పెద్ద గ్రద్ధ ఆకారంలో వుంది యస్.పి.యస్. దానిమీద 'జై భారత్' అన్న అక్షరాలు మెరుస్తున్నాయి. అంతరిక్షంలో భూమిచుట్టూ గ్రహంలాగా తిరగటానికి, ఎప్పుడెప్పుడా అన్నట్టు నిలుచుని వుంది.

    "ఎంతసేపట్లో తిరిగి వస్తాం?"

    "గంట, రెండుగంటలు."

    యశ్వంత్ కి ఆ వార్తపంపి, అతడు చోదకులతో కలిసి దాంట్లో ప్రవేశించాడు ఈ లోపులో రాయ్  మిగతా అనుమతులు తీసుకున్నాడు.

    "ఇంకొంతకాలం పోతే, నేను జూపిటర్ దగ్గరికి వెళుతున్నాను. సరదాగా మీరూ వస్తారా అని అడిగేరోజు కూడా వస్తుందేమో!" నిఖిల్ అన్నాడు.

    "అంత తొందర్లో వస్తుందనుకోను."

    "వంద సంవత్సరాలక్రితం రాకెట్ లో మనిషిని పంపాలంటే చాలా తతంగం వుండేదట. అంతరిక్షపు దుస్తులు, ఆక్సిజన్ మాస్కులూ ఉపయోగించేవారట.News-ship (Natural Environment within space- ship) వచ్చాక మనందరం అయిదు నిముషాల్లో  తయారై బయల్దేరటంలేదూ. అలాగే ఇంకొన్నాళ్ళుపోతే బుధుడు, బృహస్పతుల మీదకు కూడా వెళ్తూవుంటారు."

    "ఏముందక్కడ బూడిద తప్ప" అన్నాడు రాయ్.

    "బూడిదకాదు. ఏముందక్కడ హైడ్రోజన్ తప్ప అనాలి" నవ్వేడు నిఖిల్.

    వారి వాహనం వాతావరణ హద్దులు దాటి ఇంకా పైకి వెళుతూంది. క్రమంగా వారి శరీరాలు బరువుని కోల్పోతున్నాయి. రెండు నిమిషాలు గడిచేసరికి ఆ వాహనం పూర్తిగా బరువు పోగొట్టుకుంది. వారి శరీరాలు తేలిక అవుతూవుండగానే, రాయ్   News-S అన్న బటన్  నొక్కాడు. లోపలి భాగంలో మామూలు వాతావరణం నెలకొంది. ఒక లోపల  ఆక్సిజన్ మాస్క్ అవసరం కూడా లేదు. వాహనం బరువు కోల్పోయినా లోపలున్న వారి శరీరాలు మామూలుగానే వున్నాయి. అదే సహజ వాతావరణం ( News-S ) అంటే.

    నిఖిల్ సీటు వెనక్కిజారి చెవులకి ఫోన్ లు పెట్టుకుని వాద్య సంగీతం వినసాగాడు. దూరంగా భూమి నారింజపండు రంగులో కనపడుతూంది. ఒకవైపు సూర్యుడు, మరొకవైపు చంద్రుడు ఒకే సరళరేఖలో కనిపిస్తూ, ఆ దృశ్యం అద్భుతంగా వుంది. కానీ అందమైన చిత్రంమీద ఇంకు మరక పడ్డట్టు కొన్ని చిన్న చిన్న  వస్తువులు అక్కడ కూడా తిరుగుతున్నాయి.

    భూమ్మీద వాతావరణాన్ని పాడుచేసినట్లే, భూమిచుట్టూ శూన్య ప్రదేశాన్ని మనుష్యులు పాడుచేయటం కెన్నెడీ కాలంనుంచీ మొదలైనట్టుంది. రోడ్లమీద చెత్తా చెదారం చేరినట్టు ఆ రోదసీలో కూడా రకరకాల వస్తువులు తిరుగుతున్నాయి. అల్యూమినియం, స్టీలుముక్కలు, వయసయిపోయిన సాటిలైటు పరికరాలు అంతరిక్షంలో భూమిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. వాటిని దూసుకుంటూ వారి వాహనం వెళుతూంది. అది వెళుతున్న వేగానికి, దారిలో ఏమాత్రం చిన్న అడ్డంకి తగిలినా పెద్ద విస్ఫోటనంగా మారుతుంది. అయితే వీటినుంచి ప్రత్యేక రక్షణ డానికి కల్పించబడింది కాబట్టి అలాటి విస్ఫోటాన్ని వారు లెక్కచేయటం లేదు.

    అంతలో దూరంగా చిన్న పక్షి ఆకారంలో ఒక వస్తువు కనబడింది. కాస్త దగ్గరికి వెళ్తే ముడుచుకుని వున్న శిశువు ఆకృతిలో వుంది అది . ముందు అతడికి అదేమిటో అర్థంకాలేదు.

    వాళ్ళు వెళుతున్న యస్పీయస్ దాదాపు గంటకి ముప్ఫై ఆరువేల మైళ్ళ వేగంతో వెళ్తూంది. ఒక నిముషం గడిచేసరికి ఆ ఆకారం బోర్లించిన పళ్ళెంలా కనపడింది. అర నిముషం గడిచేసరికి మరింత స్పష్టంగా-

    నిఖిల్ వళ్ళు జలదరించింది. కళ్ళు చిట్లించి అటువైపు చూశాడు.

    యు.ఎఫ్ ఓ! (U.F.O)

    ఫ్లయింగ్ సాసర్!!

    ఎగిరే పళ్ళెం!!!

    అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు.....ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి  చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్ళినట్టున్నారు.

    అతడు చెవులకన్న ఫోన్లు తీయాలన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆ వస్తువు తమకెంత దూరంలో వుందో లెక్కకట్టటానికి ప్రయత్నించాడు.

    దానివైపు ప్రయాణంచేసి, దగ్గరికి వెళ్ళాలంటే గంట పడుతుంది.కాని అక్కణ్ణుంచి తిరిగి భూమ్మీదకు వెళ్ళటానికి సరిపోయే విద్యుత్తు లేదు. ఒకవైపు నిస్పృహ మరోవైపు ఉద్వేగంతో అతడి మనసు అటూ యిటూ లాగుతోంది పరలోక వాసుల వాహనాన్ని చూసి మొట్టమొదటి వ్యక్తి తను! అదిప్పుడు స్పష్టంగా కనబడుతూంది.....దాని దగ్గరకి  వెళ్ళగలిగితే?-మరింత సమీపం నుంచి దాన్నిచూడగలిగితే?

    .....దాన్ని ఫోటో తీయగలిగితే?

    దానిలో ఎవరయినా పరలోకవాసులు వున్న పక్షంలో,  వారితో మాట్లాడగలిగితే? కమ్యూనికేషన్ ఏర్పర్చుకోగలిగితే?

    .....అతడు తనని తానే తిట్టుకున్నాడు. కేవలం మరికాస్త విద్యుత్తు లేకపోవటంవల్ల, మానవ జాతికి ఒక అద్భుతమైన కానుకని తను  అందివ్వలేక పోతున్నాడు. సుదూర తీర గ్రహాలనుంచి వచ్చిన 'మయాస్'లో  ఒకరినైనా భూలోకవాసులకు పరిచయం చేయలేకపోతున్నాడు.

    అన్నట్టు వీళ్ళేరి? ఇంత అపూర్వమైన దృశ్యాన్ని చూడకుండా లోపల ఏం చేస్తున్నారు?

    అతడు ఇంటర్ కమ్ లో తన వాళ్ళని పిలవసాగాడు. అర నిముషమైన వాళ్ళ నుంచి జవాబు లేకపోవటంతో అతడు గిగావాట్ ఇండికేటర్ వైపు చూశాడు. మరో అయిదు నిముషాలకన్నా ఎక్కువ సేపు వుండటానికి వీల్లేదు. తొందరగా కక్షలోకి దిగకపోతే ఇంధనం అయిపోతుంది.

    అతడు లోపలికి వెళ్ళిన వారి గురించి ఇక మర్చిపోయి, భూమితో కాంటాక్టు పెట్టుకోవటానికి ప్రయత్నించాడు. కనీసం టెలివిజన్ ద్వారా అయినా భూమ్మీదకు ఆ చిత్రాలు పంపితే తన మాటలకు  బుజువుంటుంది. లేకపోతే తన మాటలు ఎవరూ నమ్మరు.

    అతడు చెవులకన్న ఇయర్ ఫోన్స్ తీసి, భూమివైపు వార్తల్ని ట్రాన్స్ మిట్ చేసే పరికరాల్ని చెవులకి తగిలించుకున్నాడు. ఇవి తీసి అవి పెట్టుకుంటున్న మధ్య సమయంలో తల తిరిగినట్టు అయింది. దాని గురించి అంతగా  పట్టించుకోలేదు.

    స్విచాన్ చేసి, "హలో - యస్. పి. యస్. -4 స్పీకింగ్, నిఖిల్ హియర్- హలో" అన్నాడు.

    భూమినుంచి ఏ సంకేతమూ లేదు. అతను నిర్విణ్ణుడయ్యాడు.

    "హల్లో -నిఖిల్ హియర్, కాంటాక్ట్ ఎర్త్- ఇండియా- సైన్స్ సిటీ....."

    జవాబులేదు. ఎక్కడో లోపం ఏర్పడింది.

    మరి టి.వి. ద్వారా ప్రయత్నించకుండా తనే స్వయంగా ఫోటోలు తీయటానికి పూనుకున్నాడు.

    "ఏమిటి భూమిని ఫోటోలు తీస్తున్నాడు?" అని వినిపించింది వెనుకనుంచి, వెనుక రాయ్ నిలబడి వున్నాడు. నిఖిల్ అయోమయంగా అతడివైపు చూసి, "భూమి ఏమిటి? అది ప్లయింగ్ సాసర్ రాయ్! మీ కోసం చాలా సేపటినుంచి ప్రయత్నం చేస్తున్నాను. లోపల ఏం చేస్తున్నారు? అదిగో అటు చూడండి, ఎ....గి...రే ...గాలిపళ్ళెం!! క్విక్. ఫోటోలు తీయండి" అన్నాడు తొందర తొందరగా. ఈ లోపులో వెనుకనుంచి రెండో పైలెట్ వచ్చాడు. అతడు కూడా అంతరిక్ష సూట్ లో వున్నాడు.

    "ఏమిటి సర్ మనం ఇంకా ఇక్కడే తిరుగుతున్నాం? మైగాడ్ ఇంకా రెండు నిముషాలు ఆలస్యమైవుంటే ప్రమాదం జరిగిపోవును" అని తన సీట్లో కూర్చుని, యాస్పీయస్ వేగం హెచ్చించాడు. అయితే అది భూమివైపు కాక, ఆ ఎగిరే పళ్ళెంవైపు దూసుకుపోవటం మొదలు పెట్టింది.

    నిఖిల్ కంగారుగా, "ఏమిటిది స్టాప్.....స్టాప్" అని అరిచాడు.

 Previous Page Next Page