Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 6


    మరణ వార్తను తెలుసుకుని ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ కు వచ్చిన ప్రధాని భార్య, పిల్లలు ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే స్పృహ కోల్పోయారు. వైద్య నిపుణులు వారికి ప్రథమ చికిత్సలు చేసి, విమానంలోకి ఎక్కించారు.

    అప్పటి వరకు ప్రధాని వెంటవున్న భద్రతా సిబ్బంది ముఖాలు మ్లానమయాయి. కొందరు పొంగుకువస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చేశారు. మరికొందరు గుడ్లనీరు గుడ్లకక్కుకుంటూ నోట జేబురుమాళ్ళు కుక్కుకున్నారు. ఇంకొందరు కట్టలుతెగిన దుఃఖాన్ని పంటిబిగువున ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

    సెక్యూరిటీ సిబ్బంది ఎక్కగానే ప్లేన్ టేక్-ఆఫ్  తీసుకుంది...

    భారత ప్రధానికి ముఖ్య భద్రతాధికారిగావున్న రాణాప్రతాప్ ముఖంలో ఆందోళన, కనులలో నీలినీడలు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి.

    రాణాప్రతాప్ మనసంతా మసకేసిపోతున్నది. ఆలోచనల అలజడితో అది అల్లకల్లోలంగా వుంది. ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. అదొక సుడిగుణ్ణం, విషాద వలయం. విలయం...

    జరిగింది పీడకల అయితే బావుణ్ణు అనిపిస్తున్నది. కాని అది నిజం! ప్రధాని మరణం వాస్తవం అని అంగీకరించడంతో అతని శరీరం గగుర్పొడిచింది. గుండె ఝళ్ళు మన్నది. ధీరోదాత్తుని నుదుట దైన్యం చోటుచేసుకున్నది...

    ప్రభుత్వం కోటానుకోట్లను ఖర్చు పెట్టి వి.వి.ఐ.పి.లకు సెక్యూరిటీని ఎప్పటికప్పుడు పటిష్టపరుస్తున్న  నేపథ్యంలో విచ్చిన్నకరశక్తులు భారత ప్రధానినే వ్యూహంప్రకారం ఊహించని రీతిలో పొట్టనపెట్టుకున్నాయి...

    ప్రపంచంలోని పెద్ద రాజకీయ కుట్రలలో ఇదొకటి...

    ప్రధానికి భద్రత విషయంలో తాము ఏ విధంగా విఫలమైనట్టు, తను ఎక్కడ ఎప్పుడు తప్పటడుగు వేసినట్టు ?

    జరిగిన సంఘటనలను సింహావలోకననం  చేసికోవడానికి మరల మరల యత్నిస్తున్నాడు రాణాప్రతాప్. అతని తలను కుమ్మరిపురుగు తొలుస్తున్నది...

    ప్రధాని అమరేంద్ర క్రితం రాత్రి జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉల్లాసంగా కనిపించారు. భారతీయ సంస్కృతిని మూర్తిమంతం చేశారు.

    "మీట్ ద ప్రెస్" ముఖాముఖి ఇంటర్ వ్యూను కూడా చాలా విజ్ఞానదాయకంగా విజయవంతంగా ముగించారు. పత్రికలవారు సయితం సంతృప్తిని వ్యక్తపరచారు. సంతసించారు.

    రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో ప్రధాని నిద్రకు ఉపక్రమించారు. 

    అప్పటి వరకు అంతా సజావుగానే జరిగింది, సక్రమంగానే జరిగింది.

    తెల్లవారే సరికి బడబాగ్ని బ్రద్దలయింది, లావా ఉప్పొంగింది...

    ప్రధాని పడకమీడనే విగత జీవులై పడివున్నారు...

    అది సహజ మరణం అని అనుకోవడానికి వీలులేదు.

    అమెరికాకు బయలుదేరడానికి ముందు ప్రధానికి అన్ని వైద్యపరీక్షలు జరిగాయి. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతోనే వున్నట్టు వైద్య నిపుణుల సర్టిఫికెట్లే చెబుతున్నాయి.

    నిన్న అర్దరాత్రి వరకు అసలు అలసటే ఎరుగని వ్యక్తి అర్తరంగా ఎలా చనిపోయారో అతనికి అంతుపట్టకుండా వుంది.

    "నో డౌట్ ఇట్ ఈజ్ ఎ మిస్టోరియస్ మిస్టరి..."

    ప్రధాని ప్రాణ రక్షణకు తన బాధ్యతను తను ఎంత వరకు సక్రమంగా నిర్వర్తించినట్టు ?

    తన మీద అకుంటితమైన విశ్వాసం వుండే భారత ప్రభుత్వం తనను అత్యంత కీలకమైన ఈ పదివిలో నియమించింది. తను ఆ నమ్మకాన్ని వమ్ము చేసినట్టా ?

    సెక్యూరిటీ విషయంలో తను తీసుకునే ముందు జాగ్రత్తలకు ప్రధాని కుటుంబ సభ్యులే అబ్బురపడి తనను అభిమానిస్తుండేవారు.

    అవన్నీ నేడు... రాణా కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. నీరుగారిపోయాడు.

    ఈ ఘోర వైఫల్యానికి తను బాధ్యత వహించవలసిందే...తనను తను శిక్షించుకోవలసిందే ! అతని ఆలోచనలు అక్కడ ఆగాయి.

    ఔను ! తనను తాను శిక్షించుకోవడమే ప్రస్తుత పరిస్థితులలో ఆ పదవి ఔన్నత్యాన్ని కాపాడడానికి వున్న ఒకే ఒక్క మార్గం...

    కాని... కాని... ప్రధాని హఠన్మరణం  వెనుక ఎవరి హస్తం వున్నదో, ఇంత దారుణం ఎలా జరిగిపోయిందో తెలుసుకోవలసిన బాధ్యత కూడా తన మీదే వుంది !

    దానిని లోకానికి వెల్లడించిన తరువాతనే, తన విద్యుక్త ధర్మంలో వైఫల్యమైనందుకు తనంతట తానుగా శిక్షను విధించుకోవడమో, రాజీనామా చేయడమో చేయాలి !

    దృడ నిర్ణయానికి వచ్చాడు  వజ్రసంకల్పుడు రాణాప్రతాప్.

    నేరం గురించి, నేరస్తుల గురించి క్షుణ్ణంగా అన్వేషించాలిక. ఏమరపాటు లేదు విశ్రాంతి లేదు. విరామం లేదు. విచారణే విచారణ. అన్వేషణే అన్వేషణ...ఫలితం...?

 Previous Page Next Page