"లేదుప్రియా! ఇక్కడే ప్రయివేటు ప్రాక్టీస్ ప్రారంభిద్దామని..." ఇన్విటేషన్ కార్డు ఆమె చేతికిచ్చాడు.
"అబ్బో-మాస్టర్ ప్లాన్ లోనే వున్నావుగా! హాస్పిటల్ ఓపినింగ్ కి తప్పకుండా వస్తాను__"
వెళ్ళే వుద్దేశం లేకపోయినా ఫార్మాలిటీగా కార్డు తిరగేస్తూ అన్నది.
ఈలోగా రెండు కప్పుల్లో టీ, బిస్కట్స్ తీసుకువచ్చి టీపాయిమీద పెట్టింది పనమ్మాయి.
కుమార్ టీ తీసుకుంటూ టింకూ వైపు అనుమానంగా చూస్తూ "ప్రియా! ఎవరీ బాబు__?" అని అడిగాడు.
"సమయం వచ్చినప్పుడు చెబుతాను కుమార్"
కృష్ణప్రియ సందర్భాన్ని మారుస్తూ అంది.
ఊహించని ఆ సమాధానానికి తాగుతున్న టీ విషంలా ఫీలయ్యి. దానిని టీపాయి మీద పెట్టి లేచాడు కుమార్.
ఇక అక్కడ క్షణం కూడా ఉండబుద్ధికాక గుడ్ బై చెప్పి వెనుదిరిగాడు.
విసురుగా గేటువేసిన చప్పుడు, మరింత విసురుగా స్కూటర్ స్టార్టుచేసిన శబ్దం విని ముసిముసిగా నవ్వుకుంది కృష్ణప్రియ.
ఆంటీ ఎందుకలా నవ్వుతుందో అర్ధంకాని టింకూ ఆమెను అడగాలనివున్నా, ధైర్యం చాలక ఊరుకున్నాడు.
* * * *
హాస్పిటల్ పార్కింగ్ లాబ్ లో ఫియట్ ను పార్క్ చేసి తన వార్డుకు బయలుదేరింది డాక్టర్ కృష్ణప్రియ.
ఏవో గుసగుసలు ఆమె చెవిన పడ్డాయి.
తలఎత్తి చూసింది__ రోజూ తను వస్తుంటే నవ్వుతూ విష్ చేసే సిస్టర్స్ ఇప్పుడు తిరస్కారంగా చూస్తూ వెళ్ళిపోతుంటే ఆమె మనసు చివుక్కుమన్నది.
పరిస్థితి ఇలా మారడానికి కారణం వెదకింది.
నిన్న డాక్టర్ కుమార్ తన ఇంటికి రావడం, టింకూ ఎవరో తను ఖచ్చితంగా చెప్పనప్పుడు అతని ముఖంలో వచ్చిన మార్పు గుర్తుకు వచ్చాయి.
తన గురించి తన కొలీగ్ ఇలా దుష్ప్రచారం చేస్తాడు అని అనుకోలేదామె.
పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న సామెత నిజమేనేమో!
తప్పు తను చేస్తున్నా ఎదుటివాళ్ళ లోపాలను ఎత్తిచూపడం మానవనైజం అనుకున్నది.
ఎంతో కాలంగా ఎంతో నిబ్బరంగా కాలానికి ఎదురీదుతూ వస్తున్న తనకు ఏదయితే జరగకూడదనుకున్నదో ఆ పరిస్థితి ఉత్పన్నం కావడంతో ఆమె మనసు వికలమై పోయింది.
ఆ స్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు.
ఇంకో సందర్భంలో అయితే సిస్టర్స్ ప్రవర్తనకు వార్నింగ్ ఇచ్చి వుండేది...కానీ, యిప్పుడు ఏ మాట అన్నా వాళ్ళను మరింత రెచ్చగొట్టడమే అవుతుంది. అందుకే కోపాన్ని దిగమింగుకుంటూ వార్డుకు వెళ్ళింది కృష్ణప్రియ.
"అన్ని వరాలు పొందిన కుంతీదేవికే నింద తప్పలేదు...భగవంతుడు తనకు ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టాడు?" అనుకుంటూ ఆమె మనసులోనే బాధ పడుతున్నది.
ఉన్న పేషెంట్స్ అందరినీ అన్యమనస్కంగానే పరీక్షలు చేసి, అవసరమైన మందులను వ్రాసి ఇచ్చింది.
ఎలాగో డ్యూటీ అయిందనిపించి హాస్పిటల్ లోనుంచి బయట పడింది కృష్ణప్రియ.
* * * *
"ఆంటీ..."
"షల్ వుయ్ గో ఫర్ స్విమ్మింగ్ ..."
నవల చదువుతున్న కృష్ణప్రియ" టింకు పిలుపుకు ఉలిక్కిపడి తల ఎత్తింది.
"ప్రాక్టీసు పోయి పది రోజుల పైనే అయింది... అసలు టచ్ పోతుంది. వెళ్ళమంటావా ఆంటీ..." మరింత ఆతురతగా అడిగాడు టింకూ.
"ఎస్...ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే వుంది... కానీ ఇవాళ ఎక్కువసేపు స్విమ్ చేయకు... అలసిపోతావు."