వెనక్కి తిరిగి చూసేడు. ఆ అమ్మాయి వెనక్కి చూడలేదు! కదులుతూ...దూరంగా....విధిమలుపు తిరిగి మాయమైపోయింది.
ఇంకో పదడుగులు వేసి మెయిన్ రోడ్ మీదికి వచ్చాడు. తరువాత ఏం చెయ్యాలో తోచలేదు. ఆ మనుష్యులు హడావిడి అతనికి నచ్చదు. రోడ్ క్రాస్ చేసి అవతలివైపుకి వెళ్ళి అప్రయత్నంగా పక్కసందులోకి వెళ్ళేడు. సందులో దూరంగా రకరకాల రంగుల బల్బులు మినుక్కు మినుక్కుమని వెలుగుతూ ఆహ్వానిస్తున్నాయి. పెద్ద పెద్ద బొమ్మలున్నాయి. ప్రకాశం అందులోకి ఎప్పడూ వెళ్ళలేదు. అసలు లోపల ఏముంటుందో కూడా తెలిదు. వెళదామన్న కోర్కెకూడా అతనికి లేదు. తనలో తనే ఏదో ఆలోచించుకుంటూ నడవసాగేడు. అంతలోనే "నమస్కారం బాబూ" అని యెవరో పిలవటంతో ఆగి అటు చూసేడు.
ఇస్మాయిల్ అని, ప్రకాశమ ఆఫీసులోనే ప్యూన్ స్టూలుమీద నుంచి లేస్తూ "ఇలా వచ్చేరేం బాబూ" అడిగాడు.
"అబ్బే, ఏంలేదు? ఏవి తోచక" అన్నాడు ప్రకాశం.
"మిమ్మల్ని ఎప్పడూ యిటువ్తెపు చూళ్ళేదు బాబూ! అందుకని అడిగెను" అన్నాడు ఇస్మాయిల్.
"నేనూ రాలేదు, దానికేం గాని నువ్వేమిటి యిక్కడున్నావ్?" చుట్టూ పరికిస్తూ అడిగేడు.
"రాత్రిళ్ళు యిక్కడ పని చేస్తున్నానండి."
ప్రకాశం ఆశ్చర్యపోయేడు. అతని విస్మయాన్ని గుర్తించినట్టుగా "రాత్రి ఏడింటి నుంచి పదకొండు వరకూ ఆర్రూపాయాలిస్తారు బాబూ! దాదాపు రెండు నేలల్నుంచి పని చేస్తున్నాను" చెప్పాడు.
ప్రకాశం ఆశ్చర్యంగా "పగలంతా ఆఫీసులోనూ రాత్రి ఇక్కడా పన్జేస్తున్నావా?" అన్నాడు.
ఇస్మాయిల్ నవ్వాడు.
"నూటయబైరూపాయలదాకా వస్తాయి బాబూ! యందుకు పోనివ్వాలి?"
అతడు అతనివ్తేపు చూసేడు.
అతని వయసు నలబైయబైకి మధ్య వుండొచ్చు. వయసు అటు ప్రొద్దుకి జారటం మొహంలో తెలుస్తోంది. చెంపల దగ్గర జుట్టు తెల్లబడింది. చలికి ఆగటంకోసం విగుతూ స్వెట్టర్ వేసి, మెడకి మఫ్లర్ చుట్టాడు. మొహంమీద ముడతలు జీవితంలో అతను పడిన కష్టాల్ని అతని అనుభవాల్ని చూపిస్తున్నట్టు ఉన్నాయి.
"నీ కెంతమంది పిల్లలు" అడిగేడు ప్రకాశం.
"అయిదుగరు బాబూ! పెద్దవాడు ఇంటర్మీడియేట్ చదువు తున్నాడు. తరువాత ఇద్దరాడపిల్లలు " అంటూ తలెత్తి దూరంగా సినిమా హాలుపక్క కిళ్ళిబడ్డి దగ్గర నిలబడ్డ కుర్రాణ్ని చప్పన చేయ్యత్తి చూపిస్తూ "అదిగో ఆడే బాబూ మా పెద్దవాడు" చెప్పాడు.
ప్రకాశం అటు చూసేడు. చెంపలమీదకిబడ్డ జుట్టునీ పైకి తోస్తూ ఏదో మాట్లాడుతున్న కుర్రాడు కనబడ్డాడు.
కొంచెం కోపం మిళితమ్తెన స్వరంతో, "నువ్వేమో రాత్రి చలిలో పని చేస్తుంటే నీ కొడుకు అలా తిరుగుతున్నాడా!" అన్నాడు ప్రకాశం.
ఇస్మాయిల్ నవ్వి, "లేదండి. వాడూ రాత్రి పదింటివరకూ ఆ కొట్లో బ్రాకెట్లు వ్రాస్తూ వుంటాడు" చెప్పాడు ప్రకాశాన్నేవరో కొరడాతో కొట్టినట్లయింది.
"మరిచదువు" అన్నాడు.
"నేను చెప్పెను బాబూ, వాడు వినడు. పదింటికి ఇంటికెళ్ళి పన్నెండింటికి నేను వెళ్ళేవరకూ చదువుతాడు. క్లాస్ లో ఫస్టు మార్కులన్ని వాడివే బాబూ " అంటూ ఎందుకో లేచి లోపలికి వెళ్ళేడు.
అతడు మళ్లి కొట్టువైపు చూసేడు. చెంపలదాకా పెరిగిన జుట్టూ నేరోకాట్ ఫేంటూ.... మనిషి బాహ్య స్వరూపం యెంతమోసం చేస్తుంది... అంత చిన్న వయసు లోనే తను పెద్ద కుటుంబం గురించీ బాధ్యత...
అతడు జాలిగా ఇస్మాయిల్ వెళ్ళినవ్తెపు చూసేడు. అంత చలిలో అంత రాత్రి వరకూ తండ్రి కొడుకులు కష్టపడితే వచ్చేది తొమ్మిది రూపాయలు.... ప్రాకాశానికి తమ ఆఫీసు నోటిస్ సర్వర్ రాజు జ్ఞాపకం వచ్చాడు. ఏ క్లయింటూ వాడి బారినుంచి తప్పించుకు పోలేడు. ఎవరిదగ్గరా పదికి తక్కువ తీసుకోడు వాడు.
ఒక తండ్రి కొడుకుల న్తేతిక విలువలకి గౌరవం యిచ్చి చలిలో రాత్రంతా కష్టపడితే వచ్చే డబ్బు-చిన్న ఆత్మవంచన చేసుకుని (కొంత కాలానికి అది వుండదు) యింకొకరి దగ్గిర చేయిచాచితే క్షణములో వచ్చే డబ్బుకి సమానం మనిషి పతనం కాకుండా యీ వ్యవస్ధ యేది రక్షిస్తుంది?
ఇస్మాయిల్ కి ఆఫీసులో గౌరవం వుంది. చివరికి ఆఫీసరు కూడా అతన్ని గౌరవంగా చూస్తాడు. అతని నిజాయితి అందరికి తెలుసు. కానీ రాజు యిప్పటికే స్ధలంకొని ఇళ్ళుకట్టే సన్నాహల్లో వున్నాడు. రిటైరయ్యే సరికి అతని భవిష్యత్తు నిరాటంకంగా సాగాలన్నా డబ్బు కావాలి. మన జివితాల్తో డబ్బు యింతలా ముడిపడిన ఈ వ్యవస్ధలో డబ్బు ఎప్పడూ నిజాయితినీపరీక్షిస్తూనే వుంటుంది.
అల చెయ్యకుండా వుండాలంటే మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ఆ మార్పు రావటంకోసం రక్తపాతం కావాలా? అక్కర్లేదా? అన్ని సందేహాలే.... ఎదిగి ఎదగని మనిషి తను. అన్ని సిద్దాంతాలూ బాగానే వుంటాయి. మార్క్స్ ... బిర్లా... గాంధీజీ... రాజాజీ- అందరూ గొప్పవాళ్ళే! కానీ సమస్య మాత్రం మనిషిని వదలదు. చెంగిజ ఖాన్ కాలంలోనూ సమస్య వుంది. గౌతమబుద్దుని కాలంలోనూ వుంది. ఎన్నో సాదిస్తోన్న మనిషి సాటి మనిషి దగ్గర కొచ్చేసరికి సంకుచితమై పోతున్నాడు.