Previous Page Next Page 
వివాహం పేజి 7

           
                                                                           3

    రవణకి సంబంధం వొకటి వుందని వెంకట్రావుగారు చెప్పారు, మర్నాడు. ఒక బీద కుర్రవాడికి ఆయన చదువు చెప్పిస్తున్నాడు. తల్లి ఆయన యింటో వంట చేస్తుంది. ఆ కుర్రవాడు బుద్ధిమంతుడూ, తెలివి కలవాడూ. కట్నం లేకుండా యీ పిల్ల నతనికి పెళ్ళి చేస్తాననీ, కాని ఆ గోపాలరావు చదువు బాధ్యత వెంకన్న పంతులు భరించాలనీ అన్నాడు ఆయన. వెంకన్న పంతులికి అసలీ రిఫారం పిల్లని ఎవరు పెళ్ళిచేసుకుంటారా అని భయంగా వుంది గనుక, యీ సంబంధం చాలా సంతోషంగానే వుంది. కాని ఆ పెళ్ళితో ఈ పిల్ల వొదిలిపోక, ఆ కుర్రాడితో కూడా తన మెడని వేళ్ళాడుతుందే - వాడి చదువు ఖర్చోటి భరించాలే, అని బెంగపడ్డాడు. కాని యేం చేస్తాడు? యీ గోలలన్నీ ఆలోచించకుండా ఆ తమ్ముడేమని చచ్చాడు? అని మళ్ళీ కోప్పడుకున్నాడు తమ్ముడిమీద.

    గోపాలరావు రెండురోజుల్లో వొచ్చాడు, అతడు ఛామనఛాయ పొడుగు, సన్నం, కొంచెం నత్తి అనుమానం. పందొమ్మిదేళ్ళుంటాయి. చిన్నప్పటినించి యింకోళ్ళింట్లో పెరగడంవల్ల మర్యాదా, మన్ననా తెలుసుకొని లోకువా, దాస్యమూ అలవాటైనట్లు కనపడతాయి. నడిచినా, మాట్లాడినా, నిరంతర యాచకత్వం కనపరుస్తో వుంటాడు. అతనాయేడే స్కూలు ఫయినల్ పరీక్షకు వెళ్ళాడు. అతని తల్లి కది చాలా గొప్ప పరీక్ష లాగుంది.

    "వీడు బి.యే యట, వాడు బి.యల్. ట కాని మావాడు స్కూ....లు....ఫై....న.....ల్" అన్నట్లు మాట్లాడేది.

    గోపాలరావుకి పెళ్ళి వుద్దేశ్యంలేదు. కాని పైకి తనని చదివించమని వెంకట్రావుగారిని అడగటం బావుండదని అతనికి తెలుసు. కనుక వెంకన్న పంతులు చదువు సహాయం చేస్తాననేటప్పటికి పెళ్ళికి వొప్పుకున్నాడు.

    తల్లి యీ సంబంధం అంటే యిష్టపడలేదు. గోపాలరావు యేదో గొప్ప హోదాగల వుద్యోగం చేస్తోవుంటే పెద్ద కట్నం తీసుకొని, గొప్పింటితో వైభవంగా వియ్యమందాలని కలలు కంటోంది. తన పెనిమిటి చెల్లెలు, యింటోంచి లేచిపోయి, రెండో పెళ్ళి చేసుకున్న తరువాత, మళ్ళీ రెండో భర్త బాధలు పడలేక, పారిపోయి వొచ్చి అన్నకాళ్ళ మీద పడ్డది. తన భర్త చెల్లెలిమీద పూర్వపు కోపం మరిచిపోలేక యింటోంచి గెంటితే, జాలిపడి, యీమె భర్త నెదిరించి, వొప్పించి, ఆమెని తన హృదయానికద్దుకుంది. తరువాత ఆ చెల్లెలెక్కడికో వెళ్ళిపోయింది. కాని ఆమె తెచ్చిన వెలి మాత్రం యీమెని వొదల్లేదు. భర్తపోయినాడు. ఆస్తి వ్యాజ్యాల పాలయింది. బంధువులొకరూ సహాయం చెయ్యలేదు. అక్రమంగా యెదురు ""డిక్రీలైనరోజున" కడుపుమండి, ఆ కోర్టు మునసబు వెంకట్రావుగారింటికి వెళ్ళి, ఆయన్ని ఎదురుగ నోటికి వొచ్చనట్లు తిట్టింది. తనని బైటికి నెట్టిస్తాడనుకుంది. కాని ఆయన నవ్వి,

 Previous Page Next Page