Previous Page Next Page 
వివాహం పేజి 8

   
    "తరవాత మళ్ళీ తిడుదువుగాని, ముందు సంగతేమిటో చెప్పు" అన్నాడు.

    దాంతో శోకమంతా తిరగబెట్టి కొడుకుని ఆయన కాళ్ళమీద పడేసి తన కథ చెప్పుకొని ఆయన తీర్పు అన్యాయమంది. ఆయనకీ అట్లానే తోచింది. కాని సాక్ష్యం రెండోవారి వేపున వున్నప్పుడు ఆయనేం చేస్తాడు? సరే, తల్లినీ కొడుకునీ తన యింటోనే వుండమన్నాడు.

    పెళ్ళి గుళ్ళో జరిగిపోయింది - వెంకట్రావుగారు వెళ్ళిపోయినారు. గోపాలరావు వెంకన్న పంతులుగారి యింటో స్థిరపడ్డాడు - అతను పరీక్షలకి వెళ్ళాడు.

    వచ్చిన మరునాటి నుంచి రవణ వెంకన్న పంతులు గృహ జీవితం బాధ్యత తనదిగా తీసుకుంది. ఆఫీసు కాయితాలు మొదలు పొడుంకాయ వరకూ రవణ స్వాధీనమే. ఇదివరకు వెంకన్న పంతుల్ని చూడ్డానికి వొచ్చిన పెద్ద మనుషులు సరాసరి హాలులోకి రావలసిందే. ఆడవాళ్ళకి తిరగడం కష్టంగా వుండేది. ఉత్తరవేపు గదిలో సామాను వేశారు. తక్కిన స్థలంలో పిల్లలు చదువుకునేవాళ్లు. రవణ తనే, ఆ సామానంతా దొద్దో పాకలో గడమంచి మీదికి మార్చి. ఆ పిల్లలికి చదువుకోడానికి హాలులో స్తలమేర్పరచి గది ఖాళీ చేసింది. దాంటో వెంకన్న పంతులు చమట నలుపు పడకకుర్చీ, యినపకడ్డీల కుర్చీలు నాలుగూ, సొరుగులు పోయిన వ్రాత బల్లా, అలమారూ అన్నీ సద్దింది. ఆ రోజు వెంకన్న పంతులు కచేరినించి వొచ్చి హాలులో తలపాగ తగిలించపోతూంటే.

    "యిట్లా యిట్లా, బాబాయి" అని ఉత్తరపు వీధి గదిలోకి తీసికెళ్ళింది. అంతా చూశాడు వెంకన్న పంతులు, వొంకెకి ఆయన ఆఫీసు బట్టలు తగిలించి చెప్పులు మూల పెట్టి, జవాను చేక ఆఫీసు పెట్టె వూగులాడే బల్లమీద పెట్టించింది. కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు వరండాలో సిద్ధంగా వున్నాయి; యెన్నడూ లేనిది మొహం సబ్బుతో కడిగించి తెల్లటి తువ్వాలుతో కాళ్ళూ మొహం తుడిపించి కొత్తగా తోమిన వెండిగిన్నెలో "టీ" యిచ్చింది. తన పడకకుర్చీలో, నిట్టూర్పు విడిచి, పట్టుకుని, చుట్టూ చూశాడు పంతులు. రోడ్డుమీది కిటికీలకి తెల్లని పరదాలు కట్టి వున్నాయి. తన లా కాలేజీ గ్రూప్ ఫోటో, తన నాన్నగారి మాసిన పటమూ, తన పెళ్ళి గ్రూప్, మూడు సంవత్సరాల క్రింద రాధాకృష్ణ క్యాలెండర్, అన్నీ తగిలించి వున్నాయి. తనిప్పుడు యింటివేపు తలుపు, లోపల గడియ పెట్టుకోవచ్చు. పోలీసు యినస్పెక్టరుతో మాట్లాడుతూ వుంటే, చిన్న కొడుకు వచ్చి, "నాన్నా అమ్మ వెన్న కొంచెమే పెట్టింది" అని, యాడ పక్కరలేదు. జవానుని తను గుక్క తిరక్కుండా గంభీరంగా చీవాట్లు పెడుతోవుండగా మధ్య రావమ్మ, "రాత్రికేం వంట చేయించమంటారు?" అని అడిగే అవస్థ తప్పిపోయింది. తన టేబిల్ లైటు మొహాన్ని చూసు ఎన్నేళ్ళయింది! అదిగో పెద్ద కుర్రాడు యెనిమిది నెలలవాడు చెంచాపెట్టి బద్ధలుకొట్టిన డోము. యీ నాటికి కనపడ్డది మళ్ళీ!

 Previous Page Next Page