మొలలోంచి తాళం చెవి తీసి, బల్లకిందనుంచి కొత్త తోలు పెట్టిని బైటికి లాగి మూత తెరిచింది. లోపల సామానుని గుర్తుపట్టలేక పోయినాడు, వెంకన్న పంతులు. అంతా ఎక్కడ వస్తువు అక్కడ సద్ది వుంది. తను చిన్నప్పటినించీ వుపయోగించుకుంటోన్న పెట్టెవలె, దాని వంక చూడకుండానే చెయ్యి లోపల పెట్టి రవణ పుస్తకాన్ని సులభంగా పైకి తీసింది.
"యీ 'సత్యం-శివం-సుందరం' చదువు బాబాయ్! చాలా బావుంటుంది"
"నీకెట్లా..... తెలుసు? నువ్వు..........చదవలేదు కద!"
"చదివాను, నాన్నకి చదివేదాన్ని కూడాను. ఈయన రాసిన 'దైవమిచ్చిన భార్య' చదివారా? నా దగ్గిర వుంది, యిస్తాను, యింకా పుస్తకాలు రాశారు- ఏవేవో.... ఒకసారి ఆయన్ని నాన్న యింటికి పిలుచుకొచ్చారు కూడాను.... నాన్నకీ, ఆయనకి చాలా చర్చ జరిగింది. ఆవాళ ఆఖరికి 'టీ' నీళ్ళతో యిద్దరూ చల్లపడ్డారు"
"దైవమిచ్చిన భార్యా? అంటే?"
"పుస్తకం పేరు"
"సరేలే, దైవమివ్వడమేమిటి?"
"అంటే సాధారణంగా యీ పెళ్ళిళ్ళల్లో మనుషులు కడతారు. భార్యల్ని కాని అతనికి దైవం వుద్దేశించిన భార్య యింకోత్తయి వుంటుంది"
మనుషులు మాత్రం దైవ ఆజ్ఞకు మీరి భార్యాల్ని కట్గగలరా యేమిటి? ఎవరి పూర్వజన్మ సుకృతంకొద్దీ వారికి తగిన భార్యలు దొరుకుతారు."
"ఆయన అనేది అట్లాకాదు."
"ఎట్లా? దైవమిచ్చిన భార్య కనబడగానే, ఈ మనుష్యులు కట్టిన భార్యని వొదిలెయ్యమనేనా?"
"అట్లాకాదు బాబాయ్. ఆయన సంగతి నీకేం తెలీదు. విను, అసలు కథ మొదలేమంటే, ఒక వూళ్ళో...."
వెంకన్న పంతులు వినడం లేదు. ఇట్లాంటి పుస్తకాసన్నీ చదివిన యీ రవణని యింటో భరించడం యెట్లానా అని?....
ఇంటికి వెళ్ళేటప్పటికి, రామమ్మ మూడోపద్ధతి ప్రకారం ప్రవర్తించింది. యింటో ఆమె మేనమామ దిగి వుండడంచేత ఐవుండవచ్చుననుకున్నాడు వెంకన్న పంతులు. ఆ మేనమామ, వెంకట్రావు, జిల్లా జడ్జి. ఆయన్నీ ఆయన కుటుంబాన్నీ చూస్తే, రామమ్మకి అమితమైన గౌరవం. తన కుటుంబం కూడా అంత గొప్పదేనని ఆయనకీ, లోకానికీ తెలపడానికి ప్రయత్నిస్తుంది ఆమె. వెంకట్రావుకి సంఘసంస్కరణాభిలాష హెచ్చు. వెంకన్న పంతులు వెంకట్రావు సమయానుకూలమైన రాకకి ఆయన్ని ఎంతో హృదయంలో స్తుతించుకుంటో, రైలుబడలికవల్ల చాలా అలసి వున్నానని భోజనం దగ్గిర సూచించి, రామమ్మ గదిలోకి రాకముందే దీర్ఘంగా గుర్రకొడుతున్నాడు.