"జారుడు అవుతాడు. స్వప్నా, నేనలా కనిపిస్తున్నానా? నువ్వు నన్ను అలా అంచనా వేసుకొంటున్నావా?" దెబ్బ తిన్నట్టుగా అడిగాడు.
"పైకి సరదాగా కనిపించినా ఇతడు చాలా సెన్సిటివ్ గా వున్నట్టున్నాడు," అనుకొన్న స్వప్న ఇక అతడిని నొప్పించే మాటలేవీ అనకూడదనుకొంది.
"స్వప్నా చీకటిపడుతోంది. బయల్దేరుదాం" అంటూ మధుర కేక పెట్టే వరకు ఇద్దరిమధ్య చాలా సంగతులు దొర్లాయి.
రెండోసారి స్వరూప్ ఆహ్వానాన్ని తేలిగ్గానే అంగీకరించింది స్వప్న. ఆ తరువలాత దారిలో కలుసుకొన్నప్పుడు కళ్లు సంకేతాలిచ్చుకోవడం, దేవీబాగ్ లో కలుసుకోవడం జరిగింది.
ఒక రోజు మధుర అడిగింది, "అతడి కులం తెలుసుకొన్నావా?"
"సన్నిహితంగా మాట్లాడుకొంటున్నాం. కులం గురించి అడిగే సందర్బం మటుకు రావడం లేదు; కాని, అతడి మాటతీరు, అలవాట్లు తక్కువ కులమని అనుకోడానికి వీల్లేకుండా వున్నాయి!" అని చెప్పింది స్వప్న.
"అలా అని ఊరుకోకు. అడిగెయ్యి, ప్రేమ ముదిరిపాకాన పడకముందే! మీ వాళ్లు నిప్పులు కడిగే ఆచారవంతులు! అతడు బ్రాహ్మడు కాకపోతే నీ పెళ్లి అసాధ్యమైపోతుంది. మీ వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించరు!"
సాగర్ వెళ్లి నాలుగు రోజుల తరువాత ఆ రోజే వచ్చాడు స్వరూప్.
"స్వప్నా, నీ ఫోటో కావాలి. అమ్మ, చెల్లి పంపించమన్నారు," అని చెప్పాడు, దేవీబాగ్ లో ఆ సాయంత్రం స్వప్నని కలుసుకొన్నప్పుడు.
"ఫోటో ఎందుకు?"
"స్వరూప్ వలచిన అమ్మాయి ఎంత అందంగా వుంటుందోనని! మన గురించి అంతా చెప్పేశాను, స్వప్నా! నాన్నకి కొంచెం కట్నం ఆశ ఉండబట్టి నసపెడుతున్నాడు గాని చివరికి ఒప్పుకోక చేసేది లేదు! అమ్మా చెల్లీ చాలా సంతోషించారు"
"మన పెళ్లికి మీ వాళ్ళు అంగీకరిస్తే చాలా?"
"మీ వాళ్ల అంగీకారం కూడా తీసుకొందాం నన్ను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు?"
"సందర్బం చూసి నేనే చెబుతాను. కాని..... కాని?"
"నేనెప్పుడూ మిమ్మల్ని అడగలేదు. మా వాళ్లతో ఈ సంగతి చెప్పినప్పుడైనా....." సంకోచంతో ఆగింది.
"అడుగు స్వప్నా!"
"మీరు బ్రాహ్మలేనా!"
"మిస్ స్వప్నా! బి. ఏ., బి. ఇడి. కి కులం పట్టింపు వుంటుందని తెలియదు!" దెబ్బతిన్నట్టుగా అన్నాడు.
"మా అమ్మా నాన్నా బి. ఏ. చదువుకోలేదు. మా వాళ్లకిలాంటి వాటిలో చాలా పట్టింపులున్నాయి."
"చదువుకొన్నదానివి. సంపాదించుకొంటున్నదానివి. పెద్దవాళ్ల మూర్ఖత్వాన్ని ఎదిరించలేవా?"
స్వప్న ముఖం కళావిహీనమైంది. "అయితే మీరు......"
స్వరూప్ స్వప్న చేయి అందుకొని ఆమె వేళ్లతో తన వేళ్లు పెనవేసి ఆమె కళ్లలోకి విచలితంగా చూశాడు. "మొదటే చెప్పకపోవడం పొరపాటే. చదువుకొన్నదానివి! దానికింత ప్రాముఖ్యత నిస్తావనుకోలేదు. ఆదిలో మనుషులకు కులాలు లేవు. మనుషులంతా ఒకటే. మనిషిలో స్వార్దం వెర్రితలలు వేసి కుల విభజన జరిగింది. ఈనాడు మనం అణుయుగంలో వుండి ఈ కులతత్వాన్ని ఎదిరించలేకపోతే మన చదువులెందుకు? విజ్ఞానమెందుకు?"
"ఈ చరిత్ర తిరగదోడడంవల్ల, ఉపన్యసించడం వల్ల వాళ్లు మారరు. మన పెళ్లికి మా వాళ్లు అంగీకరించడం అసంభవం, స్వరూప్!"