"నిన్న సాయంత్రం వచ్చాను...."
"నిన్న ననగా వచ్చి ఇంతవరకూ...."
"వచ్చినప్పట్నుంచీ టైమేదీ మృదులా" అని "ముందు చేతిలోని పని పూర్తి చెయ్యి.తర్వాత మాట్లాడుకుందాం" అన్నాను మృదువుగా.
"ఊహు. నావల్ల కాదు. ఇప్పటికి ఒక చెయ్యి అంతా తూట్లు పడిపోయింది. మరోసారి పొడిస్తే యుద్ధం ప్రకటించేటట్లు వున్నాడు. నువ్వు ట్రై చెయ్యి" అని ప్రక్కకు తప్పుకుంది.
"ఆ యుద్ధం నామీద ప్రకటించాలనా ?" అంటూ ఆమె చేతిలోని సిరంజి అందుకుని "ఏమిటిది గ్లూకోజా ? ఎంతెక్కించా వేమిటి ?" అనడిగాను.
"హండ్రెడ్ సి.సి."
"మరి ట్వంటీ సి.సి. సిరంజేగా !"
"దానికంతా ఓ పద్ధతి వుందిలే. మొదటి రెండు రోజుల్లోనే బోలెడు సర్జరీ నేర్చేసుకున్నాను. నువ్వు మెయిన్ లోకి పోనివ్వు. తర్వాత చెబుతాను."
అదృష్టం బాగుండి మొదటి ప్రయత్నంలో మెయిన్ దొరికింది. సిరంజిలోని మందు అంతా మెల్లగా ఎక్కించి "ఇప్పుడేం చెయ్యాలి ?" అన్నాను.
నేను యిందాక సెలైన్ ఎక్కించటానికి చేసినట్లు మృదుల సూది మొదట్లో గట్టిగా నొక్కి పట్టుకొని "ఇప్పుడు జాగ్రత్తగా సిరంజి విడదియ్యి. నీడిల్ మెయిన్లోనే వుంటుంది .సిరంజినిండా గ్లూకోజ్ నింపి మళ్ళీ సూదికి బిగించు, అదీ పద్ధతీ" అన్నది.
"ఇది గవర్నమెంటు ప్రొసీజరా ?" అంటూ అలానే చేయటానికి పూనుకున్నాను. గ్లూకోజ్ అంతా పూర్తయ్యేసరికి సిరంజి నాలుగుసార్లుతీసి, పెట్టాల్సి వచ్చింది.
"దొడ్డ చెయ్యి, దొడ్డ చెయ్యి" అంటున్నాడు పేషెంటు _అరవై సంవత్సరాలు పైబడి వృద్ధుడు.
అంతా అయిపోయాక అసిస్టెంట్లు కూర్చునే గదిలోకివచ్చి, యిద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం.
"ఇప్పుడు చెప్పు. ఏ యూనిట్ లో పనిచేస్తున్నావు ? ఇవాళే జాయినింగ్ రిపోర్ట్ యిచ్చావా ?"
చెప్పాను.
ఆమె ముఖం సంతోష సంభ్రమాలతో మరింత విప్పారింది, "అరె! నువ్వు ఎమ్ టూ. నేను ఎన్ టూ. నాకు యివాళ డ్యూటీ, తెలుసా?" అంది.
నేను నవ్వి "నాకూ యివాళ డ్యూటీనే" అన్నాను.
"మైగాడ్" అంది, మృదుల కళ్ళు పెద్దవి చేసి. "స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్."
నవ్వుతూ చూశాను.
"ఎక్కడ దిగావు ?" అడిగింది మళ్ళీ తనే.
"నా రూమ్ లోనే. అదింకా నా క్రిందే వుందిగా."
"ఈ ఏడాదంతా అందులోనే వుంటావా ?"
"ఉహు. హాస్టల్ బయట వుంటే హౌస్ సర్జన్ పీరియడ్ లో ఎక్కువ నేర్చుకోలేమేమో అనిపిస్తుంది .రెండు మూడు రోజుల్లో మార్చేద్దామని వుంది."
"ఒహో! నువ్వు ప్రపంచంలోకల్లా ఆదర్శప్రాయుడవైన వ్యక్తివిగా, ఇంటర్న్ చేసినప్పుడే అందరూ పేకాడుకుంటూ పైలాపచ్చీసుగా కాలం గడుపుతుంటే, నువ్వు ఆ నెలరోజులూ క్వార్టర్స్ కు మకాం మార్చిలేబర్ రూమ్ లోనే జాగారాలు చేసిన ప్రబుద్ధుడు వాయె. ఆడదాన్ని అయి వుండీ కూడా అయిదారు లేబర్ కేసులకంటే కూడా ఎక్కువ చేయలేక మిగతాది కుకప్ చేశాను. ఎప్పుడూ కత్తిపట్టుకున్న పాపాన పోలేదు. నీవేమో నలభై పైగా ఎఫిసియాటమ్ లు చేశావని స్టూడెంట్సంతా ఘనంగా చెప్పుకున్నారు. నీకు ఎఫిసియాటమ్ కింగ్ అని పేరు కూడా వచ్చింది."
నేనేం మాట్లాడకుండా ఆమె వంక చూస్తున్నాను.
"అట్లా చూస్తావేం, ఉలక్కుండా పలక్కుండా ? క్వార్టర్స్ ఏదో తాత్కాలికంగా వుండటానికి ఏర్పాటు చేశారు. అక్కడ నీకేమీ సౌకర్యంగా వుండదు తెలుసా ?"
"పర్వాలేదు. ఎట్లాంటి చోటనైనా సర్దుకుపోగలను."
"నువ్వు చాలా మొండివాడివన్న విషయం ఒప్పుకుని అభినందిస్తున్నాంలే" అని నా వంక పరీక్షగా చూస్తూ 'సెలవులకు యింటికి వెళ్ళి వచ్చాక అమ్మ పెట్టిన గారెలూ, బూరెలూ తిని యిపుడు కాస్త బాగానే తయారయ్యావు, పరీక్ష రోజుల్లో నిన్ను చూస్తే భయమేసేది. బుగ్గలన్నీ పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి గుంటలు పడి, ముఖం నల్లగా మాడిపోయి, పెరిగిన గడ్డంతో ఎలా వుండాలో అలా వుండేవాడిని. అన్నట్లు చివరి రెండు నెలలూ అసలు నిద్ర పోలేదనుకుంటా" అన్నది.
పూర్తిగా కాకపోయినా కొంతవరకూ ఆమె మాటలు నిజమే. చివరి రెండు నెలలూ రాత్రి ఎనిమిదింటికి చదువు మొదలు పెడితే తెల్లవారు ఝామున నాలుగు గంటల వరకూ పుస్తకం వొదిలిపెట్టేవాణ్ణి కాదు. నాలుగు నుంచి ఆరుగంటల వరకూ ఓ కునుకుతీసి, లేచి స్నానాదికాలు ముగించుకొని హాస్పటల్ కి పరుగెత్తేవాడిని.
సర్జరీ, ఓరల్సూ, ప్రాక్టికల్సూ వున్న రోజున నా మతి మతిలో లేదు. ఆ రోజుతో పరీక్షలు ఆఖరు. రోజూ పోయే రెండుగంటల నిద్రకూడా ఆ రోజు కరువై పోయింది. ఉదయం ప్రాక్టికల్ ఎలానో పూర్తి చేశాను. మధ్యాహ్నానికి కళ్ళు మరీ చింతనిప్పుల్లా తయారై, బుర్ర గిరగిరమని తిరిగిపోతోంది. కళ్ళకి ఏమీ కనబడటం లేదు. ఆపరేషన్ సర్జరీ ఏం చేశానో, ఎలా ఆన్సర్ చేశానో నాకు తెలియలేదు. తర్వాత రెండు విభాగాలుగా ఏర్పాటు చేయబడిన ఒరల్సులో ఎగ్జామినర్స్ అడిగేది నాకు వినబడలేదు. నేనిచ్చిన జవాబులు తలుచుకుంటే నాకే ఏడుపొచ్చింది.
"ఛా! అలా దిగులు పడకు. నీ పరీక్షపోతే యిహ మన కాలేజీలో ప్యాసయే వారెవరూ వుండరు" అన్నది మృదుల, ఆ సాయంత్రం కలుసుకున్నప్పుడు.
"కాదు మృదులా ! నేనెంత మిజరబుల్ గా దెబ్బతిన్నానో నీకు తెలియదు" అన్నాను, నేనెదుద్కొనబోయే
పరాజయాన్ని గురించి ఆమెను నమ్మించటానికి ప్రయత్నిస్తూ.
"నేను బెట్ కాస్తాను,నువ్వు ప్యాసవుతావని" అన్నది ఆమె, ఎంతో దృడచిత్తంతో.
ఆమే గెలిచింది. అంతే కాదు, ఆమె కూడా కృతార్ధురాలయింది.
సెలవుల్లో ఒక ఉత్తరం రాసింది మృదుల !
"చూశావా, నేను కూడా ప్యాసయ్యాను. నీలాగా ఫస్టు క్లాసులు, గోల్డు మెడల్సూ రావనుకో. రావాలన్న ఆకాంక్ష కూడా నాకు లేదు. పరీక్షలు కాదు గదా, ప్రపంచం తల్లక్రిందులైనా సరే రాత్రంతా జాగారాలు చెయ్యటం, నావల్ల కాదు. శుభ్రంగా భోజనం చెయ్యటం, కాలక్షేపానికి చదువుకోవడం, ఆడుతూ పాడుతూ కాలం గడపటం నా జీవిత ధ్యేయాలు.
"అవునుగానీ ఎట్లా గడుపుతున్నావు కాలం సెలవుల్లో ? మెడికల్ బుక్స్ తినేస్తున్నావా...."
అట్లా నవ్వులూ, పువ్వులతో తేలిపోయింది ఉత్తరం.
"కొంచెం బుగ్గలు కూడా వచ్చాయి" అంది మృదుల, అలాగే కళ్ళార్పకుండా.
"ఊ" అన్నాను లజ్జితుణ్నై.
ఇంతలో సిస్టర్ అక్కడికి వచ్చి, "ఒక పేషెంటుకు యూరిన్ కెథట్రైజ్ చెయ్యాలి డాక్టర్, వస్తారా ?" అంది ఆమెతో.
"చచ్చాను" అని మృదుల నా వంక తిరిగి, "ప్లీజ్ ! నువ్వు చేసి పెట్టవూ" అంది బ్రతిమాలుతున్నట్లుగా.
"ఫర్వాలేదు, చెయ్యి, మృదులా !"
"అబ్బ ! సిగ్గేస్తోంది బాబూ ! ఇదంతా మొగ మళయాళమాయె. ఆడదాన్ని, నన్ను చూస్తే జాలి వేయటం లేదూ ?"
"నేనూ ఎప్పుడూ ట్రై చెయ్యలేదు. ప్రయత్నిస్తాను పద" అని లేచాను. ఆమె నన్ననుసరించింది.
పాపం ఆ రోగి కడుపు వుబ్బిపోయి, అది సహజంగా అవక నరకయాతన పడుతున్నాడు. సన్నని రబ్బర్ కెధిటర్ లోపలకు ఎక్కించగానే, బాధ నుండి విముక్తి పొంది "బ్రతికించారు బాబయ్యా ! చచ్చిపోతానేమో ననుకున్నాను. మీరు చేసేది మనుషులు చేసే పని కాదు. దేముళ్ళు చేసే పని" అంటూ పొగడసాగాడు.
నేను చేతులు సబ్బుతో కడుక్కుని, టైము చూసుకుని, కంగారుపడుతూ "ఇహ వెడతాను మృదులా! ఇంక మెడికల్ వార్ద్సుకు వెళ్ళి అన్నీ చూసుకుని, ఫిమేల్ వార్డుకి వెళ్ళి.... ...."
"పద నేనూ వస్తాను" అంటూ, నా మాట మధ్యలోనే ఆపి, ఆమె తనూ బయల్దేరింది.
"నీకిక్కడ పనిలేదా ?"
"ఉంటే వుందిలే. తర్వాత చూసుకుంటాను"
ఇద్దరం మెట్లు దిగుతున్నాం. సగం వరకూ వచ్చాక అక్కడో మలుపు వుంది మ్ అలుపు తిరుగుతూండగా మృదుల మెల్లిగా నా చెయ్యి పట్టుకుంది. వెంటనే ఆమె ముఖంలోకి చూద్దా మానుకున్న ఊహను అంతలోనే త్రుంచివేసి, ఏమీ గమనించనట్లు మామూలుగానే దిగుతున్నాను మెట్లు. క్రిందవరకూ వచ్చాక మనుషుల సందడి వినబడింది. ఆమె నా చేయిని వొదిలేసి మౌనంగా ప్రక్కన నడుస్తోంది.
మొదట మా ఎమ్. టూ వార్డుకు వెళ్ళా. ఈ రోజున మా ఓ. పి. రోజు కాబట్టి ఎడ్మిట్ అయ్యే కేసులన్నీ మా వార్డుకే వచ్చి చేరుతాయి. అప్పుడే రెండు కొత్త కేసులు వచ్చి వున్నాయి. అయితే రెండూ సీరియస్ కేసులు కావు ఒకటి ఫీవర్ కేసు, రెండవది రెస్పిరేటరీ డిస్ బ్. రామదాసుగారు అంతకుముందే వచ్చి యిద్దర్నీ పరీక్షచేసి, కేసు షీటులో నోట్సు. ట్రీట్ మెంటూ రాసి వెళ్ళారుట. "ఇద్దరికీ ఇంజక్షన్ లు యివ్వాలి" అంది సిస్టర్.
ఇద్దర్నీ ఒకసారి చూసి, యింజక్షను కూడా పూర్తి చేసుకుని, మిగతా మేల్ వార్డ్సుకూడా ఒకసారి చూసుకుని, యివతలకు వస్తూండగా ఫిమేల్ వార్డులో సాయంత్రం యివ్వవలసిన యింజక్షన్ లు యివ్వలేదని గుర్తువచ్చింది. ఆ హార్టు పేషెంటుకు ఎలా వుందో ?
"అరెరె" అని కంగారుపడుతూ అటుకేసి నడవసాగాను. మృదుల నావెంటే వస్తున్నది. "కాస్త నెమ్మదిగా నడు బాబూ ! నీకు పుణ్యముంటుంది" అంటూ.