Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 7


    అతనితో ఏకీభవిస్తున్నట్లు తలఊపాడు సదానంద్.
    వెంటనే ఉదయార్కర్ కి ఫోన్ చేశాడు ఎడిటరు.
    అరగంటలో ఉదయార్కర్ వచ్చాడు. అతని మొహం వాడిపోయింది. విష్ చేసి కుర్చీలో కూర్చుని అన్నాడు.
    "మీరు ఊహించినంత సేన్షేషనల్ సీరియల్ ప్లాన్ చేస్తున్నాను" అన్నాడు ఎడిటర్ ఉత్సాహంగా నవ్వుతూ.
    ముభావంగా తల పంకించాడుఉదయార్కరు. "నాకు తెలుసు. ట్రెజర్ హంట్ గురించి సబ్జెక్ట్ ! అవునా?"
    ఆశ్చర్యపోయాడు ఎడిటరు.
    "దిసీజ్ ఫాంటాస్టిక్! హౌ యూ కెన్ యు గెస్ ఐ సే!"
    దానికి సూటిగా జవాబు చెప్పకుండా అన్నాడు ఉదయార్కర్.
    "నన్ను దయచేసి క్షమించండి! ఈ సబ్జెక్టు నేను రాయలేను."
    ఎడిటరు అతనివైపు పరిశీలనగా చూశాడు "వాట్  హప్పెండ్ టూ యూ?"
    తడుముకుంటున్నట్లు మెల్లిగా అన్నాడు ఉదయార్కర్. "ఈ సీరియల్ రాస్తే చంపేస్తామని ఎవరో నన్ను ఫోన్లో బెదిరించారు."
    అతను ఆ మాట అనగానే హటాత్తుగా ఆ గదిలో నిశబ్ధం ఆవరించింది.

                                   ౩
    పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారడం గమనించాడు సదానంద్. ఎడిటర్, ఉదయార్కర్ కాసేపు ప్రవైట్ గా మాట్లాడికోడానికి వీలుకల్పిస్తూ అతను లేచి నిలబడి అన్నాడు. "క్షమించండి సార్! పాన్ నమలడం బాగా అలవాటు నాకు. పాన్ లేకుండా ఎక్కువసేపు ఉండలేను. మీరు మాట్లాడుతూ ఉండండి. నేనిప్పుడే వచ్చేస్తాను" అని బయటికి వెళ్ళిపోయాడు."
    సదానంద్ బయటికి వెళ్ళగానే ఉదయార్కర్ వైపు తిరిగాడు ఎడిటర్.
    "టెలిఫోన్ లోఎవరో బెదిరించగానే మీరు భయపడిపోయారా ఆశ్చర్యంగా, వుంది. నాకు తెలిసినంత వరకూ ఎవరికీ భయపడే మనస్తత్వం కాదు మీది." అన్నాడు. "ఈగోని' ఉదయార్కర్ సున్నితంగా టాకిల్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ -
    "ఒకరికి భయపడటం వేరు, మన జాగ్రత్తలో మనం ఉండటం వేరు. నో! నేను భయపడటం లేదు. జాగ్రత్తపడుతున్నాను" అన్నాడు ఉదయార్కర్.
    నవ్వుతూ తల వూపాడు ఎడిటర్. తనకి కూడా బెదిరింపు వచ్చిందని అల్లాంటి బెదిరింపులు తనకి సగటున వారానికి ఒకటి చొప్పున వస్తూనే ఉంటాయని అయినా తను బెదరడనీ ఉదయార్కర్ కి చెబుదామా అని ఒక్కక్షణం అలోచించి తర్వాత ఆ ఆలోచనని మనసులో నుంచి పక్కకి నెట్టేశాడు.
    అలా చెప్పడం వల్ల ఉదయార్కర్ కి పౌరుషం వచ్చి అతను  ఈ అసైన్ మెంట్ కి ఒప్పుకోవచ్చు.
    లేదా అలా చెప్పడం వల్ల ఉదయార్కర్ మరింత భయపడిపోవచ్చు. తన ప్రయత్నం వికటించి అసలుకే మోసం రావచ్చు.
    ఉదయార్కర్ మళ్ళీ అన్నాడు. "నో ఇది భయం కాదు. సర్టేన్లీ వాట్! బట్ ఐయామ్ బీయింగ్ వెరీ కాషన్, మీకు తెలుసు నాకు హిస్టరీ , ఆర్కియాలజీ అంటే ప్రాణమని. తీరిక ఉన్నప్పుడల్లా చరిత్ర పుస్తకాలు తిరగేస్తుంటాను నేను. సమయం దొరికినప్పుడల్లా ఏ హంపీ కో, కనీసం గోల్కొండకో వెళ్ళి చరిత్రపుటల్లో నడుస్తున్నట్టు ఫీలవుతూ నన్ను నేను మర్చిపోతాను. వీలైనప్పుడల్లా సాలార్ జంగ్ మ్యూజియం కెళ్ళి ఆ చారిత్రాత్మక విశేషాలనూ, అవశేషాలనూ చూస్తూ పరవశించి పోతుంటాను."
    ఎడిటర్ వెంటనే అన్నాడు.
    "యస్! ఐనో దట్! అందువల్లనే మిమ్మల్ని ఈ పనికి ఎంచుకున్నది. మిస్టర్ ఉదయార్కర్ ఐ థింక్ యు ఆర్ ద ఫిట్టెస్ట్ పర్సన్ టు టేకప్ దిస్ టాస్క్!"
    ఉదయార్కర్ నెమ్మదిగా తల ఆడించాడు "ఐ యామ్ సారీ" ప్రతి నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయి. అలాగే నేను హిస్టారికల్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటూనే వాటికి బొరుసులాంటి మరో విషయం గురించి కూడా బాగా తెలుసుకున్నాను."
    "ఏమిటది?"
    "ట్రెజర్ హంట్! నిధి నిక్షేపాల కోసం వేట!"
    ఎడిటర్ ఆసక్తిగా ముందుకి వంగాడు. "సో ఇప్పటికే మీకు నిధి నిక్షేపాల గురించి ఇన్ ఫర్మేషన్ తెలుసన్నమాట!"
    "అవును, రాజులూ రాణులు ఇవన్నీ ఎంత నిజమో వాళ్ళు పాతరవేసి ఉంచిన నిధులూ, నిక్షేపాలు కూడా అంతే నిజం! దానికి కారణం వుంది. అప్పట్లో బ్యాంకులు ఉండేవి కావు. శత్రువుల దండయాత్రలు జరిగినప్పుడు , మరెన్నో సందర్భాల్లో కూడా రాజులు తమ ధనరాశులను కోటల్లో, కొండల్లో కోనల్లో దాచి ఉంచడం ఒక్కటే మార్గం ఉండేది. ఆ ధనం అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమందికి దొరుకుతూ ఉండడం అబద్దమూ కాదు. అసంబద్దమూ కాదు.
    అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. దొరికే నిధులు ఎప్పుడూ కూడా అనుకోని సమయంలో, అనుకోని ప్రదేశంలో , అనుకోని విధంగా దొరుకుతాయే గాని, ఫలాని చోట నిధి ఉంది అని ఊహించి వెదికితే దొరకడం అరుదు" అని ఆగి తర్వాత చిరునవ్వు నవ్వి అన్నాడు" అసలు మనం నిధి నిధి అని తేలిగ్గా అనేస్తుంటాం. చిన్న ఇత్తడిచెంబులో నాలుగు బంగారు కాసులు దొరికినా దాన్ని నిధి అనేస్తుంటాం. కనీ నిధి అంటే అర్ధం వేరే ఉంది."
    "ఏమిటి?" అన్నాడు ఎడిటరు కుతూహలంగా. ఉదయార్కర్ మెల్లి మెల్లిగా సబ్జెక్టు తాలూకు మూడ్ లోకి వచ్చేస్తుండటం అతను గమనించాడు. అతను కోరుకుంటున్నదీ అదే. ఈ సబ్జెక్టుపై రచయితకు ఎంతవరకు అవగాహన ఉన్నదీ తెలుసుకోవడానికి కూడా కావచ్చు!

 Previous Page Next Page