ఎప్పటికైనా నిన్నే పెళ్ళి చేసుకుంటానని మాటివ్వలేని వ్యక్తీకి నా చేయి పట్టుకునే అధికారం లేదు."
"ఓహో! ఆదా? అయితే మాటిచ్చావనుకో! అప్పుడు నాకు అధికారం వస్తుందా?"
మయూర పెదవులపై చిరునవ్వు తోణుకిసలాడింది.
"సరే! మాటిచ్చి తప్పననుకో! అప్పుడేం చేస్తావు? నా మీద దావా వేస్తావా?"
మయూర ముఖం వెలవెలపోయింది. కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి.
రోషంగా "ఇలాంటి ఉద్దేశాలున్న వాడివి నన్నేందుకు పాడుచేసావ్?" అంది.
"నేనా? నిన్ను పాడుచేసానా?"
"గుర్తులేదా? ఆ రోజు రాత్రి అన్నం తింటున్నప్పుడు....."
'అదా? నవ్వాడు యతి. "అంటే ముద్దు పెట్టుకున్నంత మాత్రాన మనుష్యులు పాడయిపోయినట్లే నన్నమాట! మనలో ఇలాంటి అభిప్రాయాలు జీర్ణించుకో బట్టి పాపం, సుజాత నిండు ప్రాణాలు బలిపెట్టింది. ఇకనైనా ఈ ధోరణిలో ఆలోచించటం మనవా నువ్వు?"
మయూర బెదురుగా చూసింది . మయూర చెయ్యి పట్టి గుండెల మీదకు లాక్కుని మయూర చుట్టూ తన చేతులు వేసాడు యతి.
"పిచ్చి మయూరా! నా స్పర్శలో, నా కళ్ళల్లో నా మాటల్లో , నా మనసులో ప్రేమ నీకు అర్ధం కావటం లేదా? అయినా ఒక్క విషయం అర్ధం చేసుకో? ఏ కారణం వల్లనయినా , ఎవరితోనయినా , శారీరక సంబంధం ఏర్పడినంత మాత్రాన శరీరం ఏదో అపవిత్ర మయిపోయినట్లు నువ్వు భావించనక్కర్లేదు . మన జీవితంలో జరిగే అనేక సంఘటనల్లో అదీ ఒక సంఘటన! అంతే! అంతకుమించిన ప్రాధాన్యత దానికియ్యనక్కర లేదు."
అతడు మాట్లాడుతున్నది ఏ భాషో తనను అర్ధం కానట్టు అయోమయంగా చూసింది మయూర. యతి సరదాగా మయూర తలమీద మొట్టి "వేషం మారింది. మనసులు మాత్రం ---అబ్బే! అలనాటి త్రేతయిగంలోనే వున్నాం!"
కొద్దిపాటి తర్జన భర్జనల తర్వాత, మయూర కూడా కాలేజిలో చేరి బి.యస్. సి. చదవటానికి నిర్ణయమయిపోయింది. యతి , మయూర కలిసి వెళ్ళేవారు. కలిసి వచ్చేవారు. వాళ్ళు కాబోయే దంపతులని అందరికీ తెలిసినా వాళ్ళు జంటగా వెళ్తోంటే విడ్డురంగా చూడటం, చెవులు కొరుక్కోవటం మానలేదు ఊళ్ళో అమ్మలక్కలు.. "మనవడు పుట్టాక చేస్తుందేమో రాజ్యలక్ష్మమ్మ కూతురి పెళ్ళి'!" అని కూడా అనేసారు కొందరు. ఈ సమయంలో చేరాడు వేణు కాలేజిలో. అతని తల్లి పక్కనున్న పల్లెటూరిలో వుండేది. బాగా డబ్బున్న వాళ్ళని అతని వాలకం బట్టి తెలుస్తుంది. హాస్టల్లో వుండేవాడు. మెడల క్రింద వరకూ వేలాడుతున్న జుట్టూ, సైడ్ లాక్స్, బెల్ బాటమ్స్ . ఎప్పుడూ చేతిలో సిగరెట్టూ - ఇదీ అతని వేషం! ఆడపిల్లల్ని నిక్ నేమ్స్ పెట్టి ఏడిపించేవాడు. తన మోటార్ సైకిల్ ని వాళ్ళ దారికి అడ్డంగా నడిపించేవాడు, ఈలలు వేసేవాడు. ఆడపిల్లలంతా ఇతడికి కీచకుడు అని పేరు పెట్టారు.
ఇతని మీద ప్రిన్సిపాల్ కి చాలా రిపోర్ట్స్ పోయాయి. కానీ, చర్య ఎందుకు తీసుకోలేదో, అందరికీ ఆశ్చర్యమే!
ఒకసారి లైబ్రరీలోకే సిగరెట్ కాల్చుకుంటూ వచ్చాడు. లైబ్రరియన్ అడ్డు చెప్పాడు. వేణు వినిపించుకోలేదు.
"నా యిష్టం! నువ్వెవడివి చెప్పటానికి?" అన్నాడు నిర్లక్ష్యంగా పొగ వదులుతూ. ఆ సమయంలో యతి కూడా రీడింగ్ రూంలోనే ఉన్నాడు. ఏదో రిఫరెన్స్ బుక్ తీసుకుని నోట్స్ వ్రాసుకుంటున్నాడు. ఈ గలాటాకు తలెత్తి చూసి సంగతి తెలుసుకున్నాడు. వేణు దగ్గరకు వచ్చాడు. "మిస్టర్ వేణూ! ఇది నీ ఇల్లు కాదు- నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి! కాలేజిలో , ముఖ్యంగా రీడింగ్ రూంలో కొన్ని నియమాలు పాటించి తీరవలసిందే! లైబ్రరీలో సిగరెట్ కాలిస్తే , ఒకవేళ ఏ అగ్ని ప్రమాదమైనా సంభవిస్తే అన్ని విధాల ఎంత నష్టమో ఆలోచించావా?"
యతి ఇంత అనునయంగా మాట్లాడినా వేణులో పొగరు తగ్గటానికి బదులు మరింత హెచ్చింది. దర్జాగా మరో సిగరెట్ వెలిగించి "ఐ డోంట్ కేర్! మా ఫాదర్ తలుచుకుంటే ఇలాంటి లైబ్రరీలు పది కొనగలడు...." అన్నాడు.
యతికి మండిపోయింది. ప్రతిదానికి "మా ఫాదర్ తలుచుకుంటే ...." అని గొప్పలు చెప్పుకోవటం వేణుకి అలవాటై పోయింది. వేణు చెయ్యి పట్టుకుని బరబర లైబ్రరీ బయటికి ఈడ్చుకుపోయి గుమ్మానికి అడ్డంగా నిలబడి "మీ ఫాదర్ తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు కాని పశువులా మారిన నిన్ను మనిషిలా చెయ్యలేడు. ముందు మనిషిలా ప్రవర్తించడం నేర్చుకో!" అన్నాడు. "యూ బ్రూట్" అంటూ చెయ్యి ఎత్తబోయాడు వేణు. ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు యతి. అంతలో నలుగురయిదుగురు స్టూడెంట్స్ యతికి బాసటగా చొక్కా చేతులు పైకి ముడుచుకుంటూ యతికి అటూ ఇటూ వచ్చి నిలబడ్డారు.
తన తన డబ్బుతో హోటళ్ళకూ, సినిమాలకు తీసికెళ్ళిన స్నేహితులకంటే, యతి కున్న స్నేహితుల అండ తక్కువేమీ కాదని అర్ధం చేసుకున్న వేణు అప్పటికి తగ్గిపోయి, "చూస్తాను నీ సంగతి" అంటూ ధనా ధనామని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. యతి, అతని మిత్రులు. ఒకరి ముఖం మరొకరు చూసుకుని నవ్వుకున్నారు.
"పిరికి దద్దమ్మలాగా పారిపోతున్నాడు. కాని, తరువాత చూస్తాట్ట! సంగతి ఏమిటో!" అన్నాడు ఒకడు. మిగిలిన వాళ్ళు నవ్వారు.
సాధారణంగా యతి, మయూర కలిసి వెళ్ళి కలిసి రావటం వల్ల మయూరని ఏడిపించే అవకాశం రాలేదు . అక్కడికీ, యతీ పేరూ, యతి పేరూ కలిసి అన్ని గోడల మీదా వ్రాయించాడు, బోలెడు ఖర్చు పెట్టి . కానీ జంటగా ఉన్న తమ పేర్లను చూసి యతి, మయూర బాధపడటానికి బదులు నవ్వుకుంటూ పోవడంతో , అతని ప్రయోజనం నెరవేరలేదు.
ఆ రోజు మయూర ఎక్స్ పెరిమెంట్ త్వరగా అయిపొయింది. "యతీ! నా కివాళ ఇంట్లో కొంచెం పనుంది. నేను త్వరగా వెళ్తాను" అంది. యతికి రిజల్టు రావటం లేదు. అతను ఎక్స్ పెరిమెంట్ లో మునిగిపోయి తల కూడా ఎత్తకుండానే "వెళ్ళు!" అన్నాడు. మయూర ఒంటరిగా బయలు దేరింది. దారిలో వేణు తారసిల్లాడు. హడలిపోయింది. మయూర భయపడట్టుగానే వేణు హుషారుగా ఈల వేశాడు. చాలా రోజులకి ఒంటరిగా కనబడ్డ మయూరని ఎడిపించకుండా అతడు వదిలిపెట్ట దలుచుకోలేదు. తన మోటార్ సైకిల్ ని మయూర దారికి అడ్డంగా ఆమె ముందుకు పోవటానికి వీలు లేకుండా పాములాగా మెలికలు తిప్పుతూ నడిపిస్తూ "మయూరీ! నాట్య మయూరీ! నను కనుకరించవే వయారీ!" అని వెకిలి నవ్వుతో కవిత్వం చెప్పటం మొదలుపెట్టాడు. అతని మిత్ర బృందం అతనికి కొంత దూరంలో వెకిలినవ్వుతో కోతుల్లా పిచ్చి గెంతుల్లాంటి నాట్యాలు చేస్తున్నారు. మయూర పెదవులు బిగపట్టి కన్నీళ్ళాపుకుంటూ ఎలాగైనా అతడిని తప్పించుకుని ముందుకు పోవాలని చూస్తోంది . అరగంట గడిచినా మయూర అరదగులు కూడా ముందుకు వేయలేకపోయింది.
అంతలో సుడిగాలిలా ఎగిరిపడ్డట్టు మోటారు సైకిల్ తో సహా వేణు రోడ్డు పక్క గుంటల్లోకి ఎగిరి పడ్డాడు. అదృష్టవశాన మోటారు సైకిల్ అతని పైన పడలేదు. కాని, గుంటలో పడ్డ అతను వెంటనే లేవలేకపోయాడు. బైర్లు కమ్మిన అతని కళ్ళు చూడగలిగే సరికి ఎదురుగా యతి నిలబడి వున్నాడు. ఆ పరిస్థితిలో సహితం వేణు పళ్ళు నూరుతూ "నీ సంగతి......" అనబోయాడు. యతి నిరసనగా నవ్వి "నా సంగతి తరువాత చూద్దువుగానీం ముందు డాక్టర్ దగ్గిర కెళ్ళి నీ సంగతి చూసుకో" అని మయూర చెయ్యి పట్టుకుని చకచక ముందుకు తీసుకుపోయాడు. యతిని ఎదుర్కోవాలో, వేణుకి సాయం చెయ్యాలో తెలియక అటూ ఇటూ చూస్తూ నిలబడ్డ స్నేహితులు "వెధవల్లారా! నన్ను లేవతియ్యండిరా!" అన్న వేణు అరుపుకి అదిరిపడి అతడిని లేవదీయడానికి వెళ్ళారు.
ఇంటికి వెళ్ళేవరకూ యతి, మయూర ఒకరి నొకరు మాట్లాడుకోలేదు. ఇల్లు చేరుకోగానే మయూర ఇక నిగ్రహించుకోలేక తల్లిని కౌగలించుకుని ఏడ్చేసింది.
"ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది రాజ్యలక్ష్మి గాబరాగా. మయూర ఏడుస్తూనే జరిగింది చెప్పింది. రాజ్యలక్ష్మి తానెన్నడూ చూడని ఆ వ్యక్తిని శాపనార్ధాలు పెడుతూనే "ఆ మొగవాళ్ళ కాలేజీలో చదువులోద్దె అంటే విన్నావు?' అని దెప్పి పొడిచింది. యతి నవ్వి "అలా బుద్ది చెప్పు అత్తయ్యా!" అన్నాడు. మయూర కన్నీళ్ళ మధ్య కోపంగా చూసింది.
"లేకపోతే ఎందుకా చేతకాని ఏడుపులు? అసలు మీ ఆడపిల్లల పిరికితనమే మీ అవస్థలన్నిటికీ కారణం. మీరంతా కలిసి ఆ రోగ్ మీద ప్రిన్సిపాల్ కి రిపోర్టు ఇవ్వకూడదూ."