ఆ ఇంట్లో క్రింది వాటాల్లో వచ్చినంత ధారాళంగా పైవాటాల్లోకి నీళ్ళురావు. క్రిందివాటాలో వాళ్ళు నీళ్ళు పట్టుకొంటూ ఉంటే పైవాటాలోకి అసలు రావు.
సుశీల ముఖం చిట్లించుకొని, "బాగుందండీ: పొద్దున్నే నేను నల్లా బంద్ చేసుకు కూచుంటే ఎలా? నాకు పనులు కావద్దూ: మీ రొక్కరు - ఏం చేసినా, ఏం చెయ్యకపోయినా గడిచిపోతుంది. కానీ, నా కలా కాదుగా: ఇంటిడు చాకిరీ, నేనొక్కదాన్నీ చేసుకోవాలి, ఇక్కడ చెంబుతీసి అక్కడ పెట్టేవాళ్లు లేరు:" అంది.
జ్యోత్స్న బ్రతిమాలుకున్నట్లుగా "అయిదంటే అయిదు నిముషాలు బంద్ చెయ్యండి. రెండే రెండు బకెట్ల నీళ్ళు పట్టుకుంటాను. టైప్ నేర్చుకోవటానికి వెళ్ళాలి." అంది.
"మీరెక్కడికైనా వెళ్ళండి. ఏమైనా నేర్చుకోండి: ఇప్పుడు నేను నల్లా బంద్ చెయ్యలేను. నాకూ నీళ్ళు కావాలి,: మొండిగా అంది సుశీల.
కాఫీ తాగుతూ భాస్కర్ ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాడు. ఇంట్లో అన్నింటి నిండా నీళ్ళున్నాయి. ఉన్నది తామిద్దరూ. ఇప్పుడు వచ్చారు గనుక మాఁవగారు. అయిదు నిముషాలు ఆవిడని నీళ్ళు పట్టుకోనిస్తే సుశీలకు వచ్చిన నష్టమేమీ లేదు. అందరితోనూ సుశీల ఇలా ఎందుకు పోట్లాడుతుందో అతనికి అర్థం కాదు.
"పోనీ, సుశీలా: ఆవిడని నీళ్ళు పట్టుకోనియ్యరాదూ?" అనేశాడు ఊరుకోలేక.
సుశీల మహంకాళిలాగే భాస్కర్ వైపు తిరిగింది.
"ఏమిటీ: అయితే మీరు మామాటలన్నీ వింటున్నారన్నమాట. 'మా' ఎందుకులెండి: ఆవిడ మాటలన్నీ వింటున్నారన్నమాట: ఆ కోకిల స్వరానికి పరవశించి పోతున్నారన్నమాట? ఇకనేం? ఆవిడకి పాపం, నీళ్ళు పట్టే శ్రమకూడా ఎందుకూ? క్రిందనుంచి బకెట్లతో మోసుకెళ్ళి పైకి పట్టే శ్రమకూడా ఎందుకూ? క్రింద నుంచి బకెట్లతో మోసుకెళ్ళి పైకి అందించండి. పుణ్యమూ, పురుషార్థమూను.... కట్టు కున్న భార్యకి కాఫీ అందించినా మహాపాపం, కాని, పరాయి ఆడదానికి ఎంత చాకిరీ అయినా చెయ్యచ్చు...."
లావుపాటి కళ్ళద్దాలతో, రేగిపోయిన చింపిరిజుట్టుతో, పైకి దోపుకున్న చీరతో.... కావేషం నిండిన కళ్ళతో, తన ఎదురుగా నిలబడ్డ సుశీల అతనికి నాలుక బయటికి చాచి రక్తదాహంతో ఉరిమి చూసే మహంకాళిలాగే కనిపించింది. 'సుశీల' అనే పేరు ఎవరు పెట్టారో కాని....
తమ మాటలన్నీ పైకి వినిపిస్తాయి. తన గొంతుమాట ఏమో కాని సుశీల గొంతు కచ్చితంగా వినిపిస్తుంది. వినిపించాలనే మాట్లాడింది సుశీల.
సిగ్గుపడి మాట్లాడకుండా ఊరుకున్నాడు భాస్కర్. అతడలా మాట్లాడకుండా ఊరుకున్న కొద్దీ సుశీల రెచ్చిపోయి ఏదో సణుగుతూనే ఉంటుంది. ఆ సణుగుడు వినటం పట్టించుకోవటం ఏనాడో మానేశాడు భాస్కర్. 'నా జీవిత గానానికి నేపధ్య సంగీతం' అనుకుంటాడు దిగులుగా నవ్వుకుంటూ....
జ్యోత్స్నకి సుశీల సంగతి కొంత కొంత అర్థమవుతోంది. ఎవరి సంగతీ పట్టించుకోని జ్యోత్స్న సుశీల విషయం కూడా ఎక్కువగా ఆలోచించకుండా ప్లాస్టిక్ బకెట్ తీసుకుని క్రింద మాజీ తహసీల్దారుగారి వాటాలోకి వచ్చింది నీళ్ళకోసం....
ఐరావతమ్మ ఇడ్లీలు చేస్తోంది. జ్యోత్స్న చూసి పలకరింపుగా నవ్వి "నీళ్ళ కొచ్చావా? పాపం పట్టుకెళ్ళు. ఇంత పొద్దున్నే ఎక్కడికి? టైప్ కి వెళ్తున్నావు గదూ? ఇక త్వరలోనే నీకు పెళ్ళయి పోతుందన్న మాట:" అంది.
జ్యోత్స్న తెల్లబోయి "అదేమిటండీ: నేను టైప్ నేర్చుకోవటానికి, నా పెళ్ళికీ సంబంధమేమిటీ?" అంది.
"ఎవరో అన్నారులే: అక్కడ టైప్ ఇన్ స్టిట్యూట్ లో నీకెవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారట: అందుకే ఇన్ స్టిట్యూట్ మొదలయ్యేది తొమ్మిదింటికయినా నువ్వు పడి పడి ఎనిమిదింటికే పోతావుట:"
జ్యోత్స్న నిర్ఘాంతపోయి "ఎవరన్నారు? బస్ లు దొరకవని ఎనిమిదింటికే బయలుదేరతాను. అంతేకాని...."
"ఏమోలే: ఆ మధ్య ఎవరో అన్నారు. అయ్యో: స్టౌ మీద ఇడ్లీలున్నాయి...."
వంటింట్లోకి పరుగుపెట్టింది ఐరావతమ్మ.
ఆవిడతో నిలబడి వాదించటానికి టైం లేదు జ్యోత్స్నకి - అయినా అలాంటివాళ్ళతో, వాదించీ ప్రయోజనం లేదు. ఏముందీ, వాదించటానికి?
నీళ్ళు పట్టుకుని పైకి పోతున్న జ్యోత్స్నకి దారి కడ్డుగా నిలబడి మింగేసే కళ్ళతో చూస్తూ "పాపం క్రిందనుంచి పైకి మోస్తున్నారు. సుకుమారమైన మీ చెయ్యి, పాపం ఎంతగా కందిపోయిందో:" అన్నాడు కవిత్వధోరణిలో మాజీ తాహసీల్దారుగారు.
జ్యోత్స్న శాంతంగా "అడ్డు లేవండి:" అంది. ఇలాంటి ప్రకృతులతో ఎలా మెలగాలో జ్యోత్స్నకి బాగా అలవాటయిపోయింది.
జ్యోత్స్న స్వరం ఎంత శాంతంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది. అణువణువునా విలాసం తొణికిసలాడే ఆ మూర్తిలో అత్యంత గాంభీర్యం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విలాసాన్ని చూసి ఆకర్షితమయి సమీపించే పురుష ప్రపంచం ఆ గాంభీర్యానికి చెదిరి ఆమడదూరం పారిపోతుంది.
ఒక వెకిలినవ్వుతో దిటవులేని మనసును బయట పడేసుకుంటూ పక్కకు తప్పుకున్నాడు మాజీ తహసీల్దారు.
హడావుడిగా తయారయి గుమ్మానికి తాళం వెయ్యబోతుండగా ఎదుటి గుమ్మందగ్గిర నిలబడ్డ మచ్చల డాక్టరు ఎంతో ఆరాటంగా "మీ తలనొప్పి ఎలా ఉందీ?" అని అడిగాడు.
"తలనొప్పా? తలనొప్పి ఎవరికి?" వెళ్ళిపోవాలనే కంగారులో ఆశ్చర్యంగా అడిగింది.