"బహుశా వివేక్ అమ్మగారు!"
"అవును! నేను ఎంత వరకూ చదువుకున్నానో చెప్పగలవా?"
"సరిగ్గా డిగ్రీ ఊహించలేను. కానీ బాగా చదువుకున్నారు!"
"గడుసు దానివి! ఎం.ఏ. పాసయ్యాను."
ఉలికిపడింది యశోద.
"ఎందుకంత నివ్వెరపాటు? నేనూ మీ అమ్మగారూ ఒక తరం వాళ్ళమే! మీ అమ్మగారు చదువుకున్నారంటే కలగని ఆశ్చర్యం నేను చదువుకున్నానంటే ఎందుకు కలగాలి?"
"మీరు... మీరు..."
"ఎం.ఏ. పాసయినా ఆర్ధోడాక్స్ గా కనపడుతున్నానని... అంతేనా? డిగ్రీలకీ భావాలకీ సంబంధం లేదు. అదీగాక నేను మరీ ఛాందసురాలినిగాను. మా ఆయనకి మడీ, తడీ ఇష్టం. ఆయనకోసం నేనూ పాటిస్తున్నాను!"
యశోద ముఖం జేవురించింది.
"మీకు ఇష్టం లేని పని మీరెందుకు చెయ్యాలి?"
ఆవిడ నవ్వింది.
"ఆయనకు ఇష్టం లేని పనులు అనేకం... ఆయనకి నచ్చజెప్పి నేను చేయించగలను. కొన్ని సందర్భాలలో ఆయనకి ఇష్టమున్నట్లే ఉంటాను. అదే దాంపత్యమంటే! రెండు జీవితాలు ఒకటిగా పెనవేసుకోవడానికీ, ఉభయపక్షాల నుంచీ కొంత అడ్జస్ట్ మెంట్స్ అవసరం!"
కాదనలేకపోయింది యశోద "వివేక్ ఇంట్లో లేరా?"అడిగింది.
"లేడు! నిన్ను రమ్మన్నట్లు చెప్పాడు. వాడికి ఆడపిల్లలతో మాట్లాడటానికి చాలా బిడియం. నీతో ఇంత స్నేహం ఎలా చేశాడో చాలా ఆశ్చర్యంగా ఉంది! వొస్తాడు. బహుశః ఒక అరగంటలో రావచ్చు. లైబ్రరీకి వెళ్ళాడు! ఇల్లు చూస్తావా? రాణీ! ఇల్లు చూపించు."
పరికిణీఓణీ వేసుకుని నాజూగ్గా ఉన్న పదహారేళ్ళ అమ్మాయి వచ్చింది. శుభ్రంగా ఉంది. వంటిమీద నగలు లేవు. చేతులకి మట్టిగాజులు చెవులకి ఆర్టిఫిషియల్ దుద్దులు! ముఖం పెద్ద అందం లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది.
"రండి!" అంది యశోదని ఉద్దేశించి...
మొదట దేవిశంకర్ గది చూపించింది. అది ఆఫీస్ రూం! పుస్తకాల రేక్స్ నిండా భగవద్గీత, ఉపనిషత్తుల అనువాదాలు ఒకవైపు.
"డిస్కవరీ ఆఫ్ ఇండియా!" లాంటి పుస్తకాలు మరోవైపూ ఉన్నాయి. గోడకి రామక్రిష్ణ పరమహంస తైలవర్ణచిత్రం ఉంది. రెండువైపులా రెండు సోఫా సెట్స్ ఉన్నాయి. తర్వాతదీ రేవతీ, దేవిశంకర్ ల పడకగది. రోజ్ వుడ్ డబుల్ కాట్. డ్రెస్సింగ్ టేబిల్స్. సైడ్ టేబిల్. లైట్ షేడ్ కర్టెన్స్... చూడటానికి చాలా అందంగా ఉంది అటాచ్ డ్ బాత్ ఉంది.
ఆ తర్వాతది వివేక్ గది!
"ఈ గదిలోకి అడుగు పెట్టాలంటేనే నాకు భయం! అంది రాణి కిసుక్కున నవ్వి... రాణీని చూసినప్పట్నుండీ తన మనసులో మెదులుతున్న సందేహాన్ని బయటపెట్టింది యశోద.
"వివేక్ కి నువ్వు ఏమవుతావు?"
"ఏమికాను... నేను ఈ ఇంట్లో పనిచేస్తాను."
"పనిమనిషివా?"
"భలే వారండి! ఎందుకంత ఆశ్చర్యం? పనిమనిషి అనగానే పుల్లమ్మ, మల్లమ్మ లాంటిపేర్లు ఉండాలనీ, ముతకచీరలు పైకి ఎగకట్టియాసగా మాట్లాడాలనీ మీ భావన. అవునా? అమ్మగారూ! మీవన్నీ ఆధునిక భావాలనీ చెప్పారు - నిజమనుకున్నాను. నన్ను చూసి అమ్మలక్కలంతా ఆశ్చర్యపోయినట్లే మీరూ ఆశ్చర్యపోయారు. మా అమ్మగారే నయం. పనిచేయించుకుంటూ నన్ను చదువు చెప్పిస్తున్నారు!"
సిగ్గుపడింది యశోద వివేక్ తల్లిమీద క్షణ క్షణానికీ గౌరవం పెరుగుతోంది. దేవిశంకర్ ఎలాంటి వాడో?
"మీరాగదిలోకి వెళ్ళి చూడండి! నేను లోపలికి రాను. ఇంటికెవరో వచ్చారు. బెల్ మోగింది చూసి మళ్ళీ వస్తాను."
వెళ్ళిపోయింది రాణి. ఆ అమ్మాయి నడకలోనూ విలాసం ఉంది.
వివేక్ గదిలోకి వచ్చింది. గదినిండా పుస్తకాలే! నాలుగు గోడలకీ పుస్తకాల రేక్స్ ఉన్నాయి. అవన్నీ నిండి టేబిల్ మీదా సైడ్ టేబిల్స్ మీదా కూడా బుక్స్ ఉన్నాయి. చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లుగా మంచం మీద కూడా పుస్తకాలు ఉన్నాయి.
అవన్నీ చూస్తూ కూర్చుంది. ఫిలాసఫీ. సైన్స్. ఫిక్షన్. చాలా వైవిధ్యం ఉంది ఆ పుస్తకాల్లో!
"నేను లోపలికి రావచ్చునా?"
వివేక్ గొంతు... గుమ్మం దగ్గర నిలబడి అడుగుతున్నాడు.
"మీ గదిలోకి మీరు రావడానికి నేను పర్మిషన్ ఇవ్వాలా?"
"ప్రస్తుతం మీరు ఉన్నారు కదా?"
"రండి! కొంపదీసి నన్ను వెళ్ళిపొమ్మనరు కదా?"
అతడు సిగ్గుపడ్డాడు. అది గమనించింది యశోద.
"ఏమి అనుకోవద్దు -- జోక్ చేశాను."
"అమ్మతో మాట్లాడారా?"
"ఆ! ఫలహారం కూడా చేశాను. ఆవిడ స్వయంగా నాకు ఇచ్చినది."
"అమ్మ మీకు నచ్చిందా?"
"చాలా నచ్చారు!"
"అయితే.... మీ అమ్మగారూ నాన్నగారూ ఒప్పుకుంటే. మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను!"
తెల్లబోయింది యశోద. పెళ్ళి ప్రస్తావన వస్తుందని అనుకుంటోంది కానీ. ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇంతసూటిగా అడుగుతాడని అనుకోలేదు. మరికొన్ని సమావేశాల తర్వాత ఎన్నెన్నో స్వీట్ నథింగ్స్ తర్వాత అతడు తనచుట్టూ చేతులువేసి లాలనగా దగ్గరగా తీసుకుని చెవిలో ఈ ప్రస్తావన తెస్తే బాగుండేది!
"మీ అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా, మా అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా లోకాన్నంతా ఎదిరించైనా మనం పెళ్ళి చేసుకుందాం!" అని రొమాంటిక్ గా చెప్తే బాగుండేది. కనీసం ఈ ప్రస్తావన తెచ్చాకయినా నువ్వు నా దానివి అని దగ్గరికి తీసుకుంటే బాగుండేది!