"వారు మేయరు!' అన్నాడు.
వెంటనే నేను - ఆ పక్కాయనని చూపిస్తూ ...... "వీరు మేస్తారా?" అన్నాను.
మా మిత్రుడు ఫక్కుననవ్వి, "మేయరు మేయకుండా వుంటే మిగతా వాళ్ళూ మేయరు. ఎవరూ మేయకూడదనే మేయరు అన్నారు" అన్నాడు.
1977లో నేను ఈనాడులో "జ్ఞాననేత్రం"శీర్షిక ప్రారంభించి 1982 వరకు ప్రతివారం రాశాను. ఇదికాక, శ్రీముఖ, విష్ణువర్దన, మోహన్ వంటి పేర్లతో అనేక ఫీచర్స్ రాస్తుండేవాడిని. ఖాళీగా వున్నప్పుడు, అర్జంటుగా రాయాల్సి వచ్చినప్పుడూ 'ఈనాడు' ఆఫీసులోనే కూర్చొని రాసేవాడిని. మాకు ఒక క్యూబికిల్ వుండేది. అందులో ఒకప్రక్క రాంభట్ల కృష్ణమూర్తిగారు, మరోప్రక్క గజ్జల మల్లారెడ్డిగారు, ఇంకో ప్రక్క నేనూ కూర్చునేవాళ్ళం. వాళ్ళిద్దరూ కూడా హాస్యప్రియులే. అయితే ఎవరి తరహావారిది. రాంభట్లగారి మాటల్లో హాస్యంతోపాటు ఎంతో విజ్ఞానం వుండేది. మేం ముగ్గురం చేరినప్పుడు నవ్వుల పండుగే! మరోవైపు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు కూర్చునేవారు. కాని, ఆన మౌనంగా తన పని తాను చేసుకుంటూ వుండేవారు. మధ్య మధ్య సీనియర్ సబ్ ఎడిటర్ కల్యాణ సింగ్ గారు వచ్చి మాతో కలుస్తుండేవారు. సున్నిత హాస్యం పలికించడంలో ఆయన దిట్ట. అసలు "ఈనాడు" కి నన్ను పరిచయం చేసింది ఆయనే! ఆరోజులు నా సాహితీ జీవితంలో స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ నలుగురూ కీర్తిశేషులయి పోయారు. వారు లేని వెలితి ఎప్పుడూ కనిపిస్తూనే వుంటుంది.
ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. నేను ఇతరుల మీద జోక్ చేసి నవ్వించడం, నవ్వడమే కాదు... , నా మీద కూడా జోక్ వేసుకుని ఆనందించేవాడిని.
మా బంధువులు అబ్బాయి ఒకతను వుండేవాడు.
అతనికి నేనంటే పిచ్చ గౌరవం. ఇంటికి వచ్చాడంటే వద్దంటున్నా వినకుండా బలవంతంగా నా కాళ్లు లాక్కుని వళ్ళో పెట్టుకుని పిసుకుతూ"బాబాయిగారూ... మీకు సేవలు చేస్తే పుణ్యం అండీ.. .నేను పైకివస్తాను" అనేవాడు. నేను పైకి వద్దంటూనే హాయిగా పిసికించుకుంటుండేవాడిని.
ఓసారి అలా పాదపీడనం జరుగుతుండగా మా బంధువు మరొకాయన వచ్చాడు.
వస్తూనే ఆయన - "ఏమిటి... బాబిగాడు బాబాయిగారికి కాకాపట్తున్నట్లున్నాడు...?!" అన్నాడు.
నేను వెంటనే "కాకాపట్టడం లేదు. కాళ్ళు పట్తున్నాడు" అన్నాను.
అందరం నవ్వుకున్నాం. ఆ తర్వాత నేను మళ్ళీ -
"పాపం.... బాబి - 'కంచి గరుడసేవ' చేస్తున్నాడు" అన్నా.
దాని భావం జనానికి సరిగా అర్దంకాలేదని అక్కడున్న వాళ్ల ముఖకవళికలు చెప్తున్నాయి. అందువల్ల విడమర్చి చెప్పాను -
"ప్రతిఫలం దక్కని సేవని" కంచి గరుడ సేవ' అంటారు. మా ఇంటిపేరు కంచి. నాకు చేసే సేవకి ప్రతిఫలం దక్కదు. అందువల్ల అతను చేస్తున్నది కంచి గరుడసేవే!' అని చెప్పాను.
ఇంకేముంది... నవ్వులు గలగలా కురిశాయి.
ఒకసారి నేను 'ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' వారి సమావేశాలలో పాల్గొనడానికి 'రాంచీ' వెళ్లాను. ఆరోజు ఏదో ప్రాబ్లెం వచ్చి అటాచ్డ్ బాత్ రూంలో నీళ్లు రావడం మానేశాయి.
అసలే వుక్క. గదిలోంచి చూస్తే ఎదురుగుండా ఓపెన్ స్పేస్ లో ఐదారు పంపులు వున్నాయి. అక్కడ ఇద్దరు స్నానం చేస్తున్నారు కూడా. ఇంకేం..... 'జై పరమేశ్వరా!' అంటూ నేనూ, నా కక్ష్య సహవాసి (రూం మేట్) భుజాన ( నెత్తిన కాదు) (తుండు) గుడ్డేసుకుని బయలుదేరాం.
పచ్చని చెట్ల మధ్య చల్లనిగాలిలో జలకాలు మొదలుపెట్టాం
మరో పంపు దగ్గర తెలుగాయనే.. ఇంకో గదిలో వున్నాయన స్నానం చేస్తున్నాడు. ఆయన అదేపనిగా నా ఛాతీ వంక చూడసాగాడు.
"నేనేమీ మల్లన్న (మల్లయోధుడు) ని కానే...., కనీసం రొమ్ములు పెంచిన లేదా పెరిగిన మొనగాణ్ణి కూడా కాదే....?! మరి - నా వంక దిష్టి కొట్టేట్లు అలా చూస్తూన్నాడేమిటి?" అనుకున్నాను.
అంతలో ఆయన స్నానం అయింది.
తుండుతో తుడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి సస్పెన్స్ ని బద్దలు కొట్టాడు.
"మాస్టారూ... మరేమీ అనుకోకపోతే ఒకవిషయం అడుగుతాను. నిజానికి అడక్కూడదనుకోండి....." అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు.
"అడగండి... ." అన్నా.
కొంచెం బిడియపడ్తూ - "మీరు బ్రాహ్మలేకదా!" అన్నాడు.
నేను - "చెప్పకూడదనుకోండి - అయినా.... మీరడిగాకు కనుక చెప్తున్నాను. ఇంతకీ మీకెందుకొచ్చింది ఆ సందేహం?" అన్నాను. నిజానికి ఆయనకి ఆ సందేహం ఎందుకొచ్చిందో అర్దమైపోయింది నాకు.
మరి - "మీ మెళ్లో జంధ్యం.... "అంటూ నసిగాడు.
వెంటనే నేను -
"నేను జగమెరిగిన బ్రాహ్మడినండీ. అందుకే నాకు జంధ్యం వుండదు" అన్నా.
వెంటనే ఆయన పగలబడి నవ్వాడు - "భలేవారు మాష్టారూ!" అంటూ.
ఇంక ఆయన టెన్షన్ తగ్గించే ఉద్దేశంతో -
"నాకు ఆచారాలు, సాంప్రదాయాల పట్ల పెద్ద పట్టింపు లేదండీ. జంధ్యం వేసుకుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగక వేసవిలో. జంధ్యం కన్నా మొలతాడుకే ఎక్కువల వుపయోగం వుందనిపిస్తుంది. పిన్నీసులు పెట్టుకోవచ్చు. ..., పాంటు జారిపోతుంటే బెల్టులా చుట్టుకోవచ్చు. నేనెలాగూ సంధ్యావందనం చేయను, గాయత్రి మంత్రం చదవను. ఇంక నాకు జంధ్యంతో అవసరం ఏముంది? అందుకే వేసుకోను" అన్నాను.
"అయితే అవన్నీ తప్పంటారా?" అన్నాడు ఆయన.
"ఎందుకంటాను? ఎవరి అభిప్రాయాలు వారివి..., ఎవరి నమ్మకాలు వారివి. అందుకే నేను వేసుకోకపోయినా ఇతరులని విమర్శించను. అది తప్పనను. వారి అభిప్రాయాలను గౌరవిస్తాను" అన్నాను. అంతటితో 'జంధ్యాల పురాణం' పూర్తి అయింది.
'జంధ్యాల' అనగానే నాకు జంధ్యాలగారు గుర్తుకి వస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఒకసారి ఆయన్ని ఈ హైదరాబాద్ లోనే కలిశాను. అప్పుడు ఆయన - "మీరు నాకు చిన్నప్పట్నుంచీ తెలుసండీ. మీ రచనలు చాలా చదివాను" అన్నాడు. అంత పెద్ద దర్శకుడు, హాస్య రచయిత ఏమాత్రం అతిశయం లేకుండా అంతటి సహృదయంతతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.