Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 6


    "ఇది పార్ట్ నర్ షిప్ కన్ సరన్. కేవలం నా ఒక్కడివల్లా  అయ్యే పనికాదు. అందుకని డీప్ గా ఆలోచించి ఒకనిర్ణయానికొచ్చాను."


    శకుంతల తల వంచుకుని వింటోంది.


    "నిన్నుచూస్తే నిజంగా జాలేస్తోంది. సహాయపడాలని కూడా అనిపిస్తోంది.. .ఇంకో పాయింటేమిటంటే నువ్వు అందంగా వున్నావు. మాంచి వయసులో వున్నావు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ప్రపంచంలో నెగ్గుకు రావటం కష్టం..... అందుకని ఒక ఆలోచనకు వచ్చాను."


    శకుంతల మౌనంగా నిలబడింది.


    "ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు."


    ఉన్నట్లుండి ఆమె గుండె గబగబ కొట్టుకోసాగింది.


    "నాభార్యకూ, నాకూ కొన్ని గొడవలున్నాయి. ఎప్పుడూ ఏదో పాయింటుమీద ఘర్షణ పడుతూనే  వుంటాం. నిజం చెప్పాలంటే అదంటే నా కసహ్యం. అయినా కాపరం చేస్తున్నాను - తప్పదు కాబట్టి. అందుకని...."


    ఓ! నానుస్థున్నాడు.


    ఇంకో పెగ్గు నోట్లో వేసుకుంటేగానీ చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోయాడు.

 
    ఒక్క క్షణం నిశ్సబ్దంగా గడిచింది.


    ఆయన మొహంలోకి ఎర్రని జేవురింపు ప్రవేశిస్తోంది.

 
    "చూడూ!" అన్నాడు ఏకవచన ప్రయోగం చేస్తూ.

 
    "సెక్స్ అనేది జీవితానికి చాలా ముఖ్యమైన అంగమని నువ్వు ఒప్పుకుంటావనుకుంటాను. మనిషికి నిద్రా, ఆహారం, నీళ్లు ఎంత అవసరమో సెక్సుకూడా అంతే అవసరం. ఈ పాయింటు పత్రికలూ, సినిమాలూ వగైరాలన్నీ ఎలుగెత్తి  చాటుతున్నాయి.  నువ్వూ మాంచి వయసులో వున్నావు. నేను కోరికలు సరిగ్గా తీరక అనేకావస్థల్లో వున్నాను. నీకు - వేరే యిల్లు చూస్తాను. నా ఆధీనంలో  వుంటావన్న మాట.  రోజూ ఏదో ఓ టైములో వచ్చి. నీ మంచీ చెడూ చూస్తూ (నా కోరికలు తీర్చుకొంటూ) వుంటాను. ఆర్దికంగా నీకు యిబ్బంది వుండదు ఏం?"


    శకుంతల శరీరం భయంతో, బాధతో అణువణువునా వొణుకుతోంది. కళ్లు చీకట్లు క్రమ్ముతున్నాయి. అక్కడ ఓ నిమిషం కూడానిలబడటానికి రోతనిపించి వొంట్లోని శక్తినంతా కూడతీసుకుని బయటపడింది.


                                                                     4


    మధ్యాహ్నం శకుతంల  ఇంట్లో చాపమీద పడుకుని వుంటే బయటనుంచి ఎవరో పిలిచినట్లయింది.

 
    ఆ సమయానికి తోడికోడలింట్లో లేదు. కొత్తగా వచ్చిన తెలుగు సినిమా చూడటానికి మ్యాట్నీ షో కెళ్లింది.


    శకుంతల ముందు గదిలో కొచ్చి తలుపు తీసింది.

 
    బయట ఏ నలభయ్యేళ్ల వ్యక్తి నిలబడి వున్నాడు.


    శకుంతల ప్రశ్నార్దకంగా చూసింది.


    "నేను జనన మరణాల ఆఫీసులో పనిచేసే క్లర్క్ ని. పార్వతీశంగారు......"


    "మావారు......"


    "ఆయన చనిపోయినట్లు యిచ్చిన రిపోర్ట్ లో వివరాలు సరిగ్గా లేవు"


    "అని ఏం వివరాలు కావాలి? హార్ట్ ఎటాక్ వచ్చిపోయారు."


    "అని మీరంటున్నారు. రిపోర్టులో చాలా అవకతవకలున్నాయి."


    "ఏమిటవి?"


    "ఆ ఫామ్ లో హార్ట్ ఎటాక్ అని రాశారు. దాన్తో డాక్టర్ సర్టిఫికెట్ లేదు. ఆ సంఘటన జరిగింది ఇంట్లో అని రాశారు. హార్ట్ ఎటాక్ మనిషిని ట్రీట్ మెంట్ లేకుండా ఇంట్లో పెట్టుకు కూర్చుంటారా? ఆ టైముకి డాక్టరు అటెండవలేదా?  మాకు వచ్చిన రిపోర్ట్ నిబట్టి అతను లారీలో చనిపోయాడని వచ్చింది. దాన్నిబట్టి మీ స్టేట్ మెంట్ అబద్దమని తేలుతోంది."


    శకుంతలకి కోపమొచ్చింది. "ఆయన చచ్చిపోయిన విషయం అబద్దమంటారా?"


    "ఆ మాట అనలేదు - కాని ఎలా చచ్చిపోయింది అనుమానాస్పదంగా వుందంటున్నాను."


    "ఎలా పోయారో మేము రాసింది మీరు రికార్డు  చేసుకోవాలిగానీ, మీ సొంత అనుమానాలు  అనవసరం"


    "కాని మాకు బయటనుంచి కంప్లయింట్ వచ్చినప్పుడు విచారణ చేసితీరాలి. నిజం తేలేవరకూ  మీ కాగితాన్ని పైకి పంపించటానికి వీల్లేదు. కంప్లెయింట్ ను నిర్లక్ష్యం చేసి మీ స్టేట్ మెంట్ ని యాక్ సెప్టు చేసినట్లయితే మా ఉద్యోగాలు ఊడతాయి.


    ప్రపంచంలోని నీతీ, నిజాయితీ అంతా ఆ ఉద్యోగస్థుడే పుణికిపుచ్చుకున్నట్లు కనిపించాడు.


    శకుంతల ఏం చెయ్యాలో తోచలేదు. మా  బావగారొచ్చాక ఆయన్తో మాట్లాడతాను అన్నది.


                           *    *    *    *

    
    తర్వాత కొన్ని రోజులకు ఎల్. ఐ. సి. ఆఫీసరొచ్చాడు.
    పార్వతీశానికి యింతకుముందే హార్ట్ ఎటాక్ వున్నట్లు తెలిసింది. పాలసీ తీసుకుంటూన్న టైములోనే డయాబటీస్ వున్నట్లు అనుమానంగా వున్నాడు. అప్పుడు మెడికల్ ఎగ్జామిన్ చేసిన డాక్టర్ క్లీన్ సర్టిఫికెట్ యిచ్చాడుకదా అంటే - అప్పటి పరిస్థితుల్ని బట్టి పాలసీ యాక్ సెప్ట్ చేశాం. కాని అనుమానమొచ్చినప్పుడు అంతకుముందు ఇవ్వబడిన మెడికల్ ఎగ్జామినర్ రిపోర్టును కాదనే పవర్స్ మాకున్నాయి. అందుకని "

    
    యిప్పుడేం చేయాలి.  అంటే - ఫైలు పెండింగ్ లో పెట్టాము. దర్యాప్తు చేస్తున్నాం.


    "ఎన్నాళ్లు?"


    "చెప్పలేం. ఎన్నాళ్లయినా పట్టవచ్చు"


                          *    *    *    *        

    
    శకుంతలకు ఇంకో భయంకరమైన సమస్య వచ్చిపడింది. కల్లోకూడా ఊహించని సమస్య.

 
    ఆ కాళరాత్రి.... ఆ వికృతమైన సంఘటన జరిగాక ఆమె ఇంతవరకూ వాకిట చేరలేదు.


    కొన్ని రోజులబట్టి పిశాచపు అనుమానం  మనస్సుని తొలిచివేస్తున్నది. క్రమక్రమంగా నిర్దారణ అయింది.

 
    తన శరీరం తనకు తెలుస్తోంది. గుండె పగిలిపోయినట్లయింది.


    రెండు మూడు రోజులు నిద్రపట్టక రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ గడిపింది. కసితీరా ఏడ్చింది.

 
    నాలుగోరోజు యీమధ్య ఓ చిన్న నగ అమ్మగా వచ్చిన డబ్బులో మిగిలినదాన్ని తీసుకొని లేడి డాక్టరు దగ్గరకు బయల్దేరింది.

 
    "ఎక్కడకు?" అనడిగింది తోడికోడలు.

 Previous Page Next Page