కృష్ణయార్యుని తండ్రి గబగబా వెంకమాంబని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు.
"నా మనుమరాలు గొప్ప పండితురాలు, కవయిత్రి అవుతుంది. మా వంశంలో ఇంతవరకు కవయిత్రులు లేరు ఎన్నో తరాలకి ముందు ఒక్క కవి ఉన్నాడంతే!" అంటూ మురిసిపోయాడు.
మగవాళ్ళంతా భోజనాలు చేసి, పందిట్లో పరిచిన చాపలమీద కూర్చుని తాంబూల సేవనం చేస్తున్నారు వెంటనే కునుకు తియ్యటానికి వీలుగా ఎవరి దిండువారు దగ్గరగా పెట్టుకుని. ఒక్కొక్క ఆకుమడత నోట్లోకి వెడుతుంటే ఒక్కొక్కమాట నోట్లోంచి వెలువడుతోంది వారికి.
"భోజనాలు బాగున్నాయి" కామావధాన్లు త్రేన్చుతూ అన్నాడు.
"అన్నీ బాగున్నాయ్, మొత్తానికి కృష్ణయ్య చాలా పెద్ద ఎత్తున చేశాడు" పేరిభట్టు మెచ్చుకున్నాడు.
"ఆఁ! వాడి దేముంది? కుర్రకుంక. అంతా వాడి నాన్నది. పెళ్ళిలాగా చేశాడు అన్నప్రాసన. ఎవరైనా ఆడపిల్లకి ఇంత పెద్ద ఎత్తున చేస్తారా? ఏమిటో ఆయనకి అంత మురిపెం? అదే మగనలుసైతే ఇంకెంత గొప్పగా చేసేవాడో? అంతా బడాయి" సోమయాజి రుసరుసలాడాడు, మరొక్క తమలపాకుకి కూడా లోపల ఖాళీలేకపోవటంతో.
"ఆడపిల్లయితే మాత్రం చెయ్యకూడదేమిటీ?" కృష్ణశర్మ సాగదీశాడు.
కృష్ణయార్యుడు మరొక కట్ట ఆకులు, వక్కలు తీసుకుని రావటంతో అందరూ మౌనం వహించారు. కాని కృష్ణయార్యుడు వారి మాటలను విననే విన్నాడు.
లోపల ఆడవారి బంతి సాగుతోంది.
"చాలా బాగా చేశారు వేడుక" రామక్క లడ్డుముక్క తుంచి నోట్లో వేసుకుంటూ అన్నది.
"మరే! పెళ్ళిలాగా..." లక్ష్మిందేవి సాగతీసింది.
"అయినా, ఆడపిల్ల అన్నప్రాసన ఇంత గొప్పగా చేయటం ఎక్కడా చూడలేదు" అంటూ చెయ్యి సంగతి మరిచిపోయి, బుగ్గనవేలు పెట్టింది బుచ్చిలక్ష్మి.
"ఇదంతా తాతగారికి మనసుట. మనవరాలంటే ఏమిటో అంత అబ్బురం" రామక్క మరో లడ్డు వేయించుకుంటూ అంది.
"ఇట్లాంటి వింత లెక్కడా చూడలేదమ్మా?" లక్షిందేవి సన్నాయి నొక్కులు.
"మరీ విచిత్రం ఇప్పుడేగా చూశారు" - బుచ్చిలక్ష్మి చక్రాల్లాంటి కళ్ళుతిప్పుతూ అంది.
"అదేమిటి వదినా?..."రామక్క ఆశ్చర్యంగా అడిగింది.
"ఆడపిల్లకి పట్టుకునేందుకు కత్తులూ, కటార్లూ పెడతారా?...." సోమిదమ్మ చోద్యంగా అంది.
"గంటాలు, గ్రంథాలు కూడా...." లక్ష్మిందేవి సాగతీసింది.
"నయం! బాకులూ, బల్లేలు పెట్టలేదు. విల్లూ బాణాలు, తుపాకులూ, ఫిరంగులూ పెట్టలేదు" బుచ్చిలక్ష్మి కిసుక్కున నవ్వింది.
"ఏదో పెట్టారే అనుకుందాం. ఆ పిల్లవెళ్ళివెళ్ళి తాటాకులూ, గంటం పట్టటమేమిటి?" లక్ష్మిందేవి సందేహం అందరికీ పాకింది.
"అవునుకదూ! ఎర్రని మందారపువ్వుంది...." రామక్క నోరు అలాగే తెరచి ఉండిపోయింది.
"ఎర్రని దానిమ్మపండు కూడ ఉంది" భ్రమరాంబ సందేహం.
"వజ్రాలహారం, జలతారు చీరమెరుపులు కూడ...." పారిజాత కళ్ళలో వాటి మెరుపులే ప్రతిఫలిస్తున్నాయి.
"నిజంగా కవి అవుతుందేమో!" లక్ష్మిందేవి.
"ఆడవాళ్ళని కవి అనరక్కా! కవయిత్రి అంటారు" బుచ్చిలక్ష్మి సరిదిద్దింది.
"ఆఁ ఏదో ఒకటిలే! అయినా ఆడవాళ్ళు హాయిగా సంసారం చేసుకోకుండా ఈ కవిత్వాలెందుకు?..."
"ఏమో! మనకెందుకు? తాతగారు మురిసిపోతున్నారు"
"నాయనమ్మ కేమన్నా తక్కువా? కోడలినే ముద్దు చేస్తుంది"
"తల్లీతండ్రీ మరీను"
"లేకలేక పుట్టిన సంతానం కదూ! ఎవరెట్టా పోతే మనకేం!" అంది లక్ష్మిందేవి వేడివేడి పులుసు చేతిమీద చురుక్కుమనటంతో.
"బుద్దిలేదుటర్రా! ఏం మాటలు తినండి మాట్లాడకుండా! ఎక్కడేం మాట్లాడాలో తెలియదూ ఇంత వయసొచ్చింది! తీపి తింటూ చేదు మాటలెందుకు? నాలుగు మంచి మాటలనండి. పిల్లకి శుభం జరుగుతుంది" నాంచారమ్మ మందలించే ధోరణిలో కొంచెం గట్టిగానే అంది.
"ఇదుగో పెద్దమ్మకి కోపం వచ్చింది. ఒక్కపాట పాడి పోగొట్టవే బుచ్చీ! భోజనకాలే గోవిందనామ స్మరణ...." సోమిదమ్మ చమత్కారంగా మాట్లాడింది.
"ముద్దుగారే యశోద..." బుచ్చిపాడుతుంటే అందరూ తన్మయులై విన్నారు."
* * *
మంగమ్మ కృష్ణయ్యల ముంగిటి ముత్యం తప్పటడుగులు వేస్తూ ముద్దులొలికిపోతోంది. పసుపులో గులాబిరంగు కలిసినట్టుగా చాయ. కెంపుల కాంతులీనే చెక్కిళ్ళు, నల్లని ఒత్తైన ఉంగరాల జుత్తు, చురుకైన కళ్ళు, తీక్షణమైన చూపులు, ఎటువంటివారినైనా ఆకట్టుకొనే చిరునవ్వు లొలికే ముఖం తాతగారు, నాయనమ్మ కాలుకింద పెట్టనీయలేదు. అడుగుల కింద తమ అరచేతులు పరిచారు. ఉదయం తాతగారి వీపునో, మూపునో ఎక్కి, సాయంత్రం నాయనమ్మ చంకనెక్కి నృసింహస్వామి దేవాలయానికి వెళ్ళటం తప్పనిసరి కార్యక్రమం.
గుడిలో అంతా, తన స్వంత ఇంట్లో తిరిగినట్లు స్వతంత్రంగా తిరుగుతుంది. ఆంజనేయస్వామి ఎదుట కదలకుండా కూర్చుని కళ్ళు మూసుకుంటుంది. నృసింహస్వామి ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోతుంది. గుడిలో పెట్టే ప్రసాదంకోసం అంత ఇష్టంగా గుడికి వస్తుందని అందరి భావన. "యధ్బావం తద్భవతి."
* * *
వెంకమాంబ వయసు ఒకటిన్నర సంవత్సరాలు తొక్కుపలుకుల స్థాయినుండి ఎదుగుతున్నది. ఆ వయసులో మనస్సులో పడిన బీజాలు ఆఖరి క్షణం వరకు సజీవంగా ఉంటాయి. మంగమాంబకి తనకు బిడ్డను ప్రసాదించిన వేంకటేశ్వరునిపై అనన్యమైన భక్తి ప్రపత్తులు. బిడ్డ పెంపకం కూడ తనకి ఎంతో ఆనంద దాయకంగానే ఉంటోంది. తనకి ఇష్టమైన పనులే తన బంగారు తల్లికి కూడా ఇష్టం. నిరంతరం దైవ సంకీర్తనం తనకి ఆనందాన్ని, తన ముద్దుబిడ్డకి సంతోషాన్ని కలిగిస్తోంది. పైగా దేవుడి మందిరంలో శుభ్రం చేస్తూ, నిర్మాల్యం తీస్తూ, అలంకారంచేస్తూ, పూజకి ఏర్పాట్లు చేస్తూ తనున్నంతసేపూ కిమ్మనకుండా పక్కనే కూర్చుని చూస్తూ వుంటుంది. ఒక్క వస్తువు తియ్యటంకాని, లాగటంకాని, ఒలకపోయటంకాని, పాడుచేయటంకాని చెయ్యదు. పోనీ, పిల్లలో చురుకుతనంలేక స్థబ్దుగా ఉంటుందా అంటే, పూజగది బయట చూడాలి ప్రతాపం. చైతన్యం రూపుదాల్చిందా అన్నట్టు ఉంటుంది. ఒకటే అల్లరి. ఇల్లుపీకి పందిరేస్తుంది. నిద్రపోతున్న కాసేపూ ఇంట్లోవాళ్ళకి ఏం తోచదు. కాళ్ళూ చేతులూ ఆడవు. ఎప్పుడు లేస్తుందా? అని ఎదురు చూస్తూ ఉంటారు. మంగమాంబ అయితే మరీను. కూతురు పక్కన లేకపోతే ఒక్కక్షణం ఉండలేకపోతోంది. ఎప్పుడూ ఏదో ఒక పాటపాడుతూ ఉంటుంది కూతురి సంతోషం కోసం. తల్లితో పాటు తనూ పాడే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య ఇప్పుడిప్పుడే మాటలు నేర్చిన ముద్దుపలుకుల వెంకమాంబ. అందుకే మంగమాంబ చిన్నచిన్న పద్యాలు, పాటలు నేర్పే ప్రయత్నం చేస్తోంది. మంగమాంబ కూతురుని ఎదురుగా కూర్చోబెట్టుకుని పద్యం నేర్పిస్తోంది.