Previous Page Next Page 
13... 14.... 15 పేజి 6


    "మీరు ఫోన్ చేస్తారని..... నేను రాత్రంతా ఇలాగే.... ఈ ఫోన్  ప్రక్కనే కూర్చుని వున్నాను తెలుసా...."

    తాను ఆ ప్రయత్నంగా అడిగి ప్రశ్న....."ఎందుకు?"

    "........మీరెప్పుడయినా ఎవరినయినా ప్రేమించి వుంటే తెలిసేది..... రాత్రంతా నిద్రలేని నా కనురెప్పల మీద ఒట్టు....."

    ఏమిటిది? నేనెందుకిలా అయిపోతున్నాను? నాకేమయింది? అనుకుంది ఆమె. కళ్ళ వెంబడి నీళ్ళు మాత్రం ధారాపాతంగా కారిపోతున్నాయి అది విషాదమో, ఉద్వేగమో తెలియటం లేదు.

    ఆమె తేరుకోవటానికి అరగంట పట్టింది. కళ్ళు తుడుచుకుని, మంగళసూత్రం కళ్ళు కుద్దుకుని కిటికీ దగ్గర్నుంచి లేచి ముందుగదిలోకి వచ్చింది.

    రాత్రి సగం వ్రాసిన కాగితాలు బల్లమీద అలాగే వున్నాయి. ఆ రచన పూర్తి చేయటం ప్రారంభించింది కనీసం  రెండు మూడు అధ్యాయాలు పూర్తిచేసి పత్రికకి పంపి వారికి  నచ్చితే మిగతాది పూర్తి చేయాలన్న ఆశ.

    'మొదటి రచన అవటం వలన వాక్య నిర్మాణం, శైలి సరిగ్గా కుదరటం లేదు. అయినా భావం 'జల' లాగా ఉబుకుతోంది. పది సంవత్సరాల ఒంటరితనం, వ్యధ రూపంలో కాలం నుంచి జాలువారుతోంది.  ఆమె తలెత్తకుండా వ్రాసుకుపోతోంది.

    అలా ఎంతసేపు గడిచిందో గుర్తులేదు.

    లోపల విష్ణు నిద్ర లేచినట్టున్నాడు. రేడియో పెట్టాడు. వార్తలోస్తున్నాయి.

     ఆ అధ్యాయపు చివరివాక్యం వ్రాస్తున్నదల్లా......వార్తల్లో ముఖ్యాంశాలు విని.....షాక్ తగిలినట్టు ఆగిపోయింది.

    వార్తలు చదువుతూన్న వ్యక్తి చెప్పుకుపోతున్నాడు.

    ఆమె అలాగే  చిత్తరువులా కదలకుండా వుండిపోయింది. మోహంలో రక్తం ఇంకిపోయింది. కలాన్ని పట్టుకున్న చేతివేళ్ళు సన్నగా కంపించసాగాయి.

    సరీగ్గా కొన్ని గంటల క్రితం ప్రహసిత్ తనతో చెప్పిన మాట.....అప్పుడే ప్రెస్ కి వెళ్ళిపోయింది.

    అనౌన్సర్  చెపుతున్నాడు.

    "డేవిస్ కప్ లో భారతదేశం తరపున ప్రతినిత్యం వహించిన ప్రహసిత్, ఫైనల్స్ లో తాను ఆడే అవకాశం బహుశ లేదని ఈ రోజు ఉదయమే ప్రకటించారు. ఏ నిర్ణయమూ కొద్దిరోజుల్లో తీసుకుంటానని పత్రికా ప్రతినిధులకు చెప్పారు. కారణాలు వెల్లడించటానికి ప్రహసిత్ నిరాకరించారు....."

    ఆమె చేతిలో కలం  జారిపోయింది.

    ఫోన్ లో ప్రహసిత్ మాట్లాడిన మాటలు ఇంకా చెవిలో మ్రోగుతూనే వున్నాయి.....".....నా ప్రేమ చిన్న పిల్లల వ్యవహారం కాదనీ, అందులో సీరియస్ నెస్ వుందనీ మీకు తెలియజెప్పటం కోసం.....ఇక  డేవిస్ కప్ ఫైనల్స్ ఆడను......'ఒకసారి దూరం నుంచి చూసి ప్రేమలో పడ్డాడు. ఇతనిదేం ప్రేమ?' అని మీరనుకుంటే- ఇంతకాలం నా ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన టెన్నీస్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను......"

    ఆమె స్తబ్దుగా కూర్చుండిపోయింది.

    సంవత్సరాల తరబడి యుద్ధంచేసి ఒక సామ్రాజ్యాన్ని గెలవొచ్చు. పోరాటం సాగించి మహారాజ్యాన్ని స్థాపించవచ్చు. పట్టుదల పెట్టుబడిగా పెట్టి పర్వతారోహణ చేయవచ్చు. విస్ఫోటనం కావించి  పర్వతాన్ని నేలమట్టం  చేయవచ్చు. మహాసముద్రాల ఆవలితీరం చేరుకోవచ్చు. ఆనకట్టతో నదీ ప్రవాహాన్నీ నిర్దేశించవచ్చు. మనిషి దేన్నైనా సాధించగలడు. కానీ బలవంతంగా  ఒక పువ్వుని వికసింపజేయలేడు.

    అది కేవలం ప్రకృతికే సాధ్యం.


                                       రెండో అధ్యాయం

    తనని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టు వున్న ఆ ఉత్తర్వని చూడగానే మధూహకి భూమి గిర్రున  తిరగలేదు. ఆకాశం విరిగి మీద పడలేదు.

    మూడు వాక్యాలున్నాయి. "........మీ పని సంతృప్తికరంగా లేని కారణంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించటమైనది. ఒక నెల జీతం అడ్వాన్సుగా ఇచ్చి మీ సర్వీసు మాకిక అవసరం లేదని ఇందుమూలముగా తెలియజేస్తున్నాము"

    అదికాదు అసలు కారణం......ఆమెకు తెలుసు. పత్రిక నష్టాల్లో నడుస్తూంది. వీలైనంత మందిని తొలగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదీ కారణం.

    కళ్ళలో తిరుగుతూన్న నీరు చెంపల మీదకు జారకుండా గట్టిగా రెప్పలు మూసుకుంది. ఒక స్టిల్ ఫోటోగ్రాఫ్ లా తన కుటుంబ చిత్రం కళ్ళముందు కదలాడింది. పత్రికాఫీసులో ఇస్తూన్న ఈ ఎనిమిదొందలే తమ జీవనాధారం.......ఇప్పుడిది పోతే......

    ఆ తరువాత ఆమె ఆలోచించలేకపోయింది. అనారోగ్యపు తల్లి, చదువుకుంటున్న చెల్లి గుర్తొచ్చారు. '....ఇప్పుడేం చెయ్యాలి? సంసారాన్నెలా గడపాలి?' అన్న ప్రశ్నలే కళ్ళముందు భయంకరంగా నృత్యం చేస్తున్నాయి.

    ఆ ఉత్తరం పట్టుకుని ఎడిటర్ రూమ్ కొచ్చింది. ఎడిటర్ శాస్త్రి వృద్ధుడు ఇంకో ఆర్నెల్లలో రిటైర్ అవబోతున్నాడు. ఆ ఉత్తరం చూసి చాలా  బాధపడ్డాడు. 'ఇదేమితమ్మా. అనుకోకుండా ఇలా జరిగింది' అన్నాడు.

    "సర్క్యూలేషన్ లేడు కాబట్టి నిన్ను తీసేస్తున్నాం, అని వుంటే నేను కాస్త సంతోషించేదాన్ని సార్.  నా పని సంతృప్తికరంగా లేదన్నారు. అదీ బాధ....."

    శాస్త్రి సమాధానం చెప్పటానికి ఏమీ లేనట్టు కొద్దిసేపు మవునంగా ఉండిపోయాడు. ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టటం మధూహకి ఇష్టం లేకపోయింది. నమస్కరిస్తూ "వెళ్ళొస్తాను సార్. టేబుల్ సర్దుకుని నా వస్తువులు ఏమైనా వుంటే తీసుకువెళ్తాను. అప్పుడే ఆరయింది" అంది.

    ఎడిటర్  ఆమెవైపు చూడకుండానే, "మంచిదమ్మా" అన్నాడు. ఆమె వెళ్ళిపోవటం అడుగుల చప్పుడు ద్వారా తెలుస్తోంది. ఆయన మనసు వికలమైంది.

    మధూహ చాలా తెలివైన అమ్మాయి. అంతేకాదు. చేస్తున్న పనిపట్ల అంకితభావం వున్న అమ్మాయి. అలాటివాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువమంది వుంటారు. ఆమెని కోల్పోవాటం పత్రికకి ఎలావున్నా తనకి మాత్రం నష్టం!

    యాజమాన్యం కూడా ఏమీ  చేయలేదు. ఇప్పుడున్న సర్క్యులేషన్ దృష్ట్యా తన ఉద్యోగమె సందిగ్ధంలో పడేలా వుంది. పత్రిక మూసేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.

    స్వింగ్ డోర్ చప్పుడయితే తలెత్తి చూసేడు. మధూహ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కాగితాలున్నాయి.

    "కొన్ని రోజులక్రితం స్కిప్టు పోస్టులో వచ్చింది సార్.  రచయిత్రి ఎవరో లక్ష్మి. ఆట. ఇది మన పత్రికకు సరిపోదని నాలెవల్లోనే తీసి పక్కన  పెట్టేసాను. కానీ రచన చాలా బావుంది. సర్".

    "నన్కొకసారి చదవనీ...."

    ఆమె తటపటాయించి "చదువుతే మీరు వేయరు" అంది. అతడు విపరీతమైన ఆశ్చర్యంతో ఆమె వంక చూశాడు. 'అవునండీ. ఇందులో కథ లేదు కామెడి....ట్విస్టులు....సెక్స్..హింస....ఏమీ లేవు. ఒక స్త్రీ మనసుంది. అంతే'

    ఎడిటర్ పేపర్ల వ్రాతప్రతి తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. ఇలాటి మాటల మీద ఆయన ఆధారపడడని మధూహకి తెలుసు. అయినా అన్నది- 'సర్' 

    ఆయన తలెత్తాడు.

    "ఇన్నాళ్ళు పనిచేసినా నేను మిమ్మల్ని ఏమీ  అడగలేదు. ఇలా నేను మీకు చెప్పటం కూడా సాహసమే....." అని అగి, ".....వీలైతే ఆ రచన వేయండి సార్" అంది.

    "ఇది వ్రాసిన వాళ్ళు నీకు తెలుసా?"

    'లేదండీ. పోస్టులో వచ్చింది. వ్రాత ఎక్కడో చూసినట్టు వుంది. కానీ ఎవరో తెలియటం లేదు. అయినా నేను దీన్ని ప్రచురించమంటోంది......రచయిత్రి ఎవరో తెలిసి కాదు....."

    "ఛా.... ఛా.... నా ఉద్దేశం అది కాదు......" అని ఆగి, "......నేను చదువుతాన్లే అమ్మా" అన్నాడు.

    ఆమె నమస్కరించి , వెళ్ళొస్తానని చెప్పి బయటకు నడిచింది.

    ఎడిటర్ శాస్త్రి ఆ రోజు పత్రికలో వెళ్ళవలసిన అడ్వర్టయిజ్ మెంట్స్ చూసాడు. రకరకాల ప్రకటనలు....
 
                                   "మైండ్ హిప్నో మాగ్నో థెరపీ"

    మీరు పరీక్షలో మార్కులు సరీగ్గా రావటం లేదా! నిద్రలేమితో బాధపడుతున్నారా? కాంప్లెక్సులు మిమ్మల్ని సతాయిస్తున్నాయా? మీలో అంతర్గతమైన శక్తి బయటపడటం లేదని  భావిస్తున్నారా? నత్తి, నరాల బలహీనత, జ్ఞాపకశక్తిని పెంచి మీలో వ్యక్తిత్వాన్ని నింపుతుంది. కాన్సర్ నుంచి కాలేయవ్యాధుల వరకూ తగ్గిస్తుంది.... మైండ్ హిప్నో మాగ్నో థెరపీ..... స్టేజి ఫియర్ పోగొట్టుకోవాలనుకున్న. నలుగురితో మాట్లాడటానికి భయపడుతున్నా, మీ శ్రీమతి మీకు పూర్తి సుఖం ఇవ్వటానికి, మీ శ్రీవారికి పరస్త్రీ సంబంధాలు తగ్గించటానికి మమ్మల్ని సంప్రదించండి. మా థెరపీ మీ 'ఏకాగ్రత' పెంచటానికి తోడ్పడుతుంది. మీ శత్రువుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు. వ్యాపారంలో నష్టాల్ని తగ్గిస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయితో ధైర్యంగా మాట్లాడే శక్తిని అందజేస్తుంది మీ గతం బాధాకరమైనదయితే దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మీరు గతంలో ఏదైనా మర్చిపోతే దాన్ని గుర్తు తెచ్చుకునేలా  చేస్తుంది. వెంటనే సంప్రదించండి.


                               డాక్టర్ విశాల్స్ హిప్నో థెరపీ

    ఎడిటర్ శాస్త్రి గాఢంగా నిశ్వసించి అడ్వర్టయిజ్ మెంట్ కి ఫోన్ చేసి "ఈ  మైండ్ హిప్నో మాగ్నో థెరపీ క్లినిక్ ఏమిటి?" అన్నాడు.

    "ఏమైంది?"

    "వీళ్ళు ప్రపంచంలో చేయలేనిదంటూ లేదా?"

    "డబ్బిచ్చారు. మనం వేస్తాం. అంతవరకే."

    "ఇందులో తప్పులున్నాయి"

    "ఆ క్లినిక్ తాలూకు మనిషి ఇక్కడే వున్నాడు. ఇంకో ప్రకటన తీసుకొచ్చాడు. పంపిస్తానతన్ని. మాట్లాడండి...."

    .....రెండు నిమిషాల తరువాత ఒక బక్కపలచటి వ్యక్తి లోపలికి వచ్చాడు. కాస్త మాసిన 'టీ షర్టు' వేసుకున్నాడు. అతడిని చూడగానే అంత మంచి అభిప్రాయం కలుగలేదు శాస్త్రికి.

    "నా పేరు రాజు. ఏవో తప్పులున్నాయన్నార్ట"

    శాస్త్రి, కాగితాన్ని ముందుకుతోస్తూ"....నత్తి నరాల బలహీనత, జ్ఞాపకశక్తిని పెంచి.....అని వ్రాసారు. నత్తినీ, నరాల బలహీనతని కూడా పెంచుతుందా మీ క్లినిక్ ?" అని అడిగాడు.

    రాజు నాలిక్కర్చుకుని, "తప్పయిపోయింది. మీరే కాస్త మార్చండి" అన్నాడు.  శాస్త్రి దాన్ని మారుస్తూ "ఎలా  వుందీ బిజినెస్?" అని అడిగాడు.

    "ఇప్పుడే ప్రారంభం అయింది కదండీ. ఇంకా చెప్పలేం" అంటూ రెండో ప్రకటన ఇచ్చి "ఇది కూడా చూడండి" అన్నాడు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ.

    శాస్త్రి దాన్ని అందుకుంటూ "నిన్న రాత్రి మా ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. చీకట్లో అతడిని గుర్తుపట్టులేకపోయాను. నేను అరిచి కేకపెట్టేసరికి పారిపోయాడనుకో. వెళ్తూ వెళ్తూ టేబిల్ మీదున్న వాచీ తీసుకుపోయాడు" అంటూ ఇంకా చెప్పబోతూ వుండగా.....'మీరు మా క్లినిక్ కి రండి. అతడిని పట్టుకోవచ్చు' అన్నాడు రాజు.

    శాస్త్రి అదిరిపడి "ఎలా?" అన్నాడు.

    "నిద్రలో కూడా మీ కనుపాపల మీద ఆ దొంగ రూపం ముద్రించబడి వుంటుంది. మీ మైండ్ ని మేము హిప్నటైజ్ చేస్తాం. అది మీలో శక్తిని బయటకు తీసుకువస్తుంది. ఆ దొంగని చూడగానే మీరు గుర్తుపట్టగలరు....దాన్నే ఏజ్....రిగ్రెషన్ అంటారు".    

 Previous Page Next Page