అతడు వెళ్ళిపోయేసరికి తొమ్మిదయింది.
రాత్రి నిశ్శబ్దంగా ఆ గృహాన్ని తన బాహువుల్లోకి తీసుకుంటూంది.
చదువుతూన్న పుస్తకాన్ని పక్కనపెట్టి వళ్ళు విరుచుకుంటూ కుర్చీలోంచి లేచాడు భార్గవ. జిన్ని అతడితోనే పడుకుంటూంది. శ్రీనూకీ ప్రార్థనకీ వేర్వేరు గదులున్నాయి. అన్ని గదుల్నీ కలిపే లింకు తెగిపోయి అయిదు సంవత్సరాలయింది.
అతడు తన గదిలోంచి బయటకొచ్చాడు. కిటికీలోంచి పడే వెన్నెల పక్కమీద- ప్రార్థన మీద ఒకేలా విశ్లేషిస్తోంది. చూస్తుండగానే పన్నెండేళ్ళు నిండాయి. ఇంకో అయిదారేళ్ళలో 'ఆడపిల్ల' అయి వెళ్ళిపోతోంది. అతడి గుండెల్లోనుంచి ఆర్ద్రతతో కూడిన ఆప్యాయత తన్నుకొచ్చింది. వెళ్లి పక్కనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ప్రార్థన నిద్రపోలేదు. మెలకువగానే వుంది. తండ్రిని చూసి నవ్వి మెడచుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది. కూతురి నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు భార్గవ.
"డాడీ"
"ఊఁ"
"ఐ లైక్ యూ డాడీ"
"ఐటూ- పన్నూ"
అతడు లేచి కూతురి మెడవరకూ దుప్పటి కప్పి, బయటకొచ్చేసేడు. ప్రార్థన పైకప్పుకేసి, తిరిగే ఫానుకేసి చూస్తూ అలాగే వుండి పోయింది. ఆ అమ్మాయికెందుకో అప్రయత్నంగా నవ్వొచ్చింది. పళ్ళమధ్య ఇరుక్కున్న జెల్లీని నాలుకతో బయటకిలాగి, చిన్నపిల్లలా నాలుక బయటపెట్టి చూసుకుంది. ఎర్రగా వుంది. మళ్ళీ ఇంకొకసారి చేసింది. మరింత ఎర్రగా.
నవ్వుకుంటూనే పక్కకి వత్తిగిల్లి పడుకుని, మరికొన్ని నిముషాల్లో నిద్రలోకి జారుకుంది.
రక్తాన్ని ఘనీభవింప జేసే ప్లాస్మా సరీగ్గా లేకపోవటంవల్ల ఆ తరువాత చాలా సేపటివరకు ఆ అమ్మాయి చిగుళ్ళనుంచి రక్తం అలా స్రవిస్తూనే వుంది. ఒక పాయ నోటినుండి బయటకొచ్చి తలదిండు మీదకు రెండు మూడు చుక్కలు రాలింది కూడా.
4
"టాన్సిల్స్ అంటే ఏముంది? మూడు నాలుగు నిముషాలకన్నా ఎక్కువ పట్టదు తీసెయ్యటానికి" అన్నాడు పరీక్ష పూర్తిచేసి డాక్టర్.
"వచ్చేనెలలో డాక్టర్ రాబర్ట్ సన్ వస్తున్నాడు. ఆయన నాకు బాగా స్నేహితుడు. ఆయనతో చేయిద్దాం" అన్నాడు కుర్చీలోంచి లేస్తూ భార్గవ. డాక్టరు అతడివైపు విస్మయంతో చూసి "ఈ చిన్న ఆపరేషన్ కి అమెరికా డాక్టర్ రావాలా?" అన్నాడు.
"ఆయనేదో పనిమీద వస్తున్నాడు. నా పని అంటే మరింత ఆనందంతో చేస్తాడు" అంటూ డాక్టర్ చెప్పినదాన్ని సరిదిద్దాడు. డాక్టర్ కుర్చీలోంచి లేచి, "ఏమైనా ఇది మా ఇండియన్ డాక్టర్స్ అందరికీ అవమానకరమైన విషయం" అన్నాడు నవ్వుతూ. భార్గవ కూడా నవ్వి అతనికి షేక్ హేండిస్తూ "పోనీండి, మా అమ్మాయి పెద్ద అయిన తరువాత స్నేహితులందరికీ గర్వంగా చెప్పుకుంటుంది. నాకు చిన్నప్పుడు టాన్సిల్స్ వస్తే మానాన్న అమెరికా నుంచి డాక్టర్ ను తెప్పించాడు", అని అంటూ కూతురివైపు తిరిగి "వెళదామా" అని అడిగాడు. ప్రార్థన కుర్చీలోంచి లేచి "గుడ్ బై అంకుల్" అంది.
"గుడ్ బై".
తండ్రీ కూతుళ్ళు వచ్చి కారులో కూర్చున్నారు. భార్గవ కారు స్కూల్ వైపు పోనిచ్చాడు.
"డాడీ"
"ఊఁ"
"హాయ్... డాడీ- వన్ మినిట్ డాడీ ...కారాపు" కంగారుగా అనటంతో భార్గవ సడన్ బ్రేక్ వేశాడు. ప్రార్థన అద్దంపైనుంచి వెనక్కి చూస్తూ "మాటల్లోనే వస్తూంది, వసూ టీచర్" అని చప్పున డోర్ తీసుకుని దిగి రోడ్డుకి అటువైపు నున్న వసుమతిని పిలిచి, ఆమె చూడకపోవటంతో అటు పరుగెత్తింది. భార్గవ అటే చూస్తున్నాడు. పిల్లలకి టీచర్ రోడ్డు క్రాస్ చేయటం ఎలాగో చెప్పలేదా అనుకొంటూ.
ఈలోపులో ప్రార్థన ఆమెని కారు దగ్గరికి తీసుకొచ్చి తను మధ్యలో కూర్చుంటూ "రండి టీచర్" అని ఆహ్వానించింది. వసుమతి కూడా కూర్చున్నాక కారు కదిలింది.
"బావున్నారా" ఆడిగాడు భార్గవ. ఆమె తలూపింది. ఆమెకిలా కూర్చోవటం ఇబ్బందిగా వుంది. అప్పుడంటే పరిస్థితులు వేరు. ఇప్పుడు స్కూల్లో ఎవరయినా చూస్తే బావోదు. అందులోనూ శారద టీచర్ చూసిందంటే మరీనూ. ఆమెకి ఆపరేషన్ చేసి యుట్రెస్ తీసేసేక ఈ మధ్య ఈ రకమైన పుకార్లు ప్రచారం చెయ్యటం ఎక్కువైంది.
"ఆ రోజు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మర్చిపోయాను" అన్నాడు భార్గవ. ఆమె సిగ్గుపడుతూ "చేసిందేముంది. నిజానికి ఇక్కడికే తీసుకొచ్చేస్తే సరిపోయేది. ఏదో సాధించేదాన్లా తెలివి తక్కువగా అక్కడ ఆస్పత్రికి తీసుకెళ్ళి వర్షంలో చిక్కుపడిపోయేట్టు చేసాను" అంది.
"చేసిన పని గురించి కాదు నేను అంటున్నది, పడిన కంగారు గురించి. పిల్లలపట్ల ఎంతో అభిమానం వుంటే తప్ప ఆ కంగారు రాదు" ఇంతలో స్కూలు వచ్చింది. ముందు వసుమతి, తరువాత ప్రార్థనా కారు దిగారు.
అంతలో మరియమ్మ అక్కడికి వచ్చింది. వసుమతి ఆవిడని చూసి "ఎలా వుంది మరియమ్మా మీ అబ్బాయికి" అంది. ఏసుపాదాన్ని నాల్గురోజుల క్రితమే ఆస్పత్రిలో అడ్మిట్ చేసారు. అతనికి అకస్మాత్తుగా ఎడమవైపు రొమ్ములో నొప్పి వచ్చి క్లాసులోనే విలవిల లాడుతూ పడిపోయాడు. ఆస్పత్రిలో రకరకాల పరీక్షలు చేసి అక్కడే వుండాలన్నారు. ఆ రోగం పేరేమిటో మరియమ్మకు సరిగ్గా అర్థంకాలేదు. కానీ అది మాత్రం చాలా పెద్ద రోగమని తెలుసుకుంది. ఆ వయసులో ఆవిడ ఆశలన్నీ కొడుకు మీదే. అందులోనూ వాడూ అల్లరిచిల్లరగా తిరిగేవాడు కాదు. అటువంటి వాడు ఒక్కసారిగా ఆస్పత్రి పాలయ్యేసరికి ఆవిడ తట్టుకోలేకపోతూంది. స్కూలువాళ్ళూ, ఇంటి చుట్టుప్రక్కలవాళ్ళూ చందాలు వేసుకొని ఇస్తున్నారు. క్లాసుపిల్లలు కూడా తలాకొంత తెచ్చి ఇచ్చారు. కానీ అవి ఏ మూలకి?
వసుమతి ప్రశ్నకి సమాధానంగా "అలాగే వుందమ్మా! అబ్బాయి చాలా నీరసించిపోయాడు" అంది మరియమ్మ చేతులు నులుముకుంటూ, వసుమతి భార్గవవేపు తిరిగి, "మీరేమైనా చెయ్యగలరా? మీరూ డాక్టరేగా" అని అడిగింది.
"ఉహూ. నేను డాక్టర్ కాదు, కానీ చెప్పండి- ఏమిటి సంగతి?" అన్నాడు భార్గవ అసలు విషయం తెలియక.
"మా క్లాస్ మేటు ఏసుపాదం డాడీ! తనకీ నాకే ఫస్టుమార్కులు.... చాలా మంచబ్బాయి" అంది ప్రార్థన కల్పించుకుని. వసుమతి జరిగింది చెప్పింది. భార్గవ మరియమ్మవేపు సానుభూతితో చూస్తూ "నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఆస్పత్రిలో వున్నారమ్మా. తప్పకుండా కనుక్కుంటాను" అన్నాడు. ఆ కొద్దిపాటి సానుభూతికే ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చేతులు జోడించి, "నిన్నూ, నీ పిల్లాపాపల్ని ప్రభువు రక్షిస్తాడు. నీ మేలు మేము మర్చిపోము" అంది.
అంతలో వసుమతి భయపడినంతా జరిగింది. శారద వాళ్ళని చూసి, ఏమీ పనిలేకపోయినా, ఏదో పని వున్నట్టూ అక్కడికి వచ్చింది. వసుమతి మరి తప్పదన్నట్టూ "మన ప్రార్థన తండ్రి, డాక్టర్ భార్గవ" అంది. ఆమె పరిచయం పూర్తికాలేదు-