.... ఇంతలో సభ మొదలయింది.
సినిమా నటుడు వచ్చే రైలు లేటవటంవల్ల ముందు సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరో రాజకీయవేత్త అరగంట మాట్లాడి జనాన్ని చావబాదాడు. తరువాత గంగాధరాచలంగారికి సన్మానం జరిగింది. ఆయన చెప్పబోయేదానికి ఉత్సాహంతో ముందుకు వంగింది. అయితే ఆయన ఎక్కువ మాట్లాడకుండా కృతజ్ఞతలు రెండు ముక్కల్లో చెప్పి ముగించారు.
సభ ముగిసింది. స్టార్ అట్రాక్షన్ ఒక్కటే మిగిలివుంది. రైలు ఇంకొక గంటవరకూ రాదని తెలిసి నిర్వాహకులు గాత్ర కచేరి ఏర్పాటు చేశారు.
ఆమె స్టేజి వెనక్కి వెళ్ళి ఆ వృద్ధుడిని కలుసుకోవటానికి ప్రయత్నం చేసింది. జనం చీమల్లా లోపలికి తోసుకువస్తున్నారు. వెళ్ళటం కష్టమైంది. అయినా ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళింది. ఆమె మనసు కుతకుతా వుడుకుతూంది. ఇంత కష్టపడివస్తే ఆయన రెండు ముక్కలు మాట్లాడి దిగిపోవటం ఆమెకు అసలు నచ్చలేదు. ఆ విషయమే నిలదీయాలనిపించింది. నేను మీ అభిమానిని - ఆ రోజుల్లో మీరు వ్రాసింది ప్రతిదీ దాదాపు కంఠతా బట్టేదాన్ని- వగైరా ఉపోద్ఘాతం ఏమీ చెప్పలేదు. ఇప్పటికే కొన్ని వేలమంది ఆయన దగ్గిర ఆ మాట అని అంటారు.
"మీ దగ్గిర్నుంచి మేమెంతో ఎక్స్ ఫెక్టు చేసి వచ్చాం. మీరెంతో మాట్లాడతారని వస్తే ఇదా మీరు చేసేది" అంది....! కోపంతో ఎర్రబడ్డ ఆ మొహాన్ని చూసి ఆయన క్షణంలో ఆమె భావాలన్నిటినీ అర్థం చేసుకున్నట్టుగా నవ్వేరు. ఎంతో అభిమానం లేకపోతే ఆ ఆమ్మాయి రాగానే అంతలా అటాక్ చెయ్యదని ఆయన ఒక చూపులో గ్రహించినట్టు- ఆయన చిరునవ్వుతోనే "నేనేం టాపిక్ మాట్లాడతానని అనుకున్నావమ్మా" అని అడిగారు.
ఆమె జవాబు చెప్పబోయింది కానీ, వెంటనే ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.
"సీజర్ గురించి మాట్లాడనా? పీలే గురించి మాట్లాడనా? సర్రియలిజం గురించి మాట్లాడతాననుకున్నావా - అబ్ స్ట్రాక్టునెస్ గురించి మాట్లాడతాననుకున్నావా? బీదోవెన్ గురించా - సాహితీ బోర్ వెల్స్ గురించా, యులిసిస్ గురించా?"
ఆయన మాటల్లో సగం తనకే అర్థంకాలేదు. చూడనంతసేపూ వున్న అభిమానం చూసేక సగం చచ్చిపోయింది. ఆమె నమస్కారం పెట్టింది. ఆయన వెళ్ళిరమ్మన్నట్టు తలూపాడు. చాలా డిస్సపాయింట్ మెంట్ తో ఆమె వెనుదిరిగింది.
హాలు బయటకు వెళ్ళటానికి దారిలేదు. గేటు మూసేశారు. విద్యాధరికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అలాగే చివరి వరస పక్కగా నిలబడింది. జనంలో తొక్కిసలాట... గేటు తెరవమని బయట్నుంచి అరుపులు.
స్టేజిమీద ఒకాయన కూర్చుని గాత్ర కచేరి చేస్తున్నాడు. ఆయన పాట వినకుండా కేవలం తలచూస్తే హెయిర్ కటింగ్ షాపులో మర్దన చేసేవాడు గుర్తొచ్చాడు. ఒక అలౌకికానందంతో ప్రజల నుద్దేశించి కాక, మైకు నుద్దేశించి పాడుతున్నాడు. ఎందుకో తెలీదు కానీ చేత్తో తొడని బాదుతున్నాడు. అప్పుడప్పుడు పక్కనున్న మృదంగం వాడివైపు బావుందా అన్నట్టు చూస్తున్నాడు. వాడు బావుంది అన్నట్టు మృదంగం మీద కొట్టి చూపిస్తున్నాడు. వెనుక కూర్చున్న ఒకావిడ, మరి దాన్ని ఏమని వూహించుకుంటుందో తెలీదుకానీ వళ్ళో తంబూరలాంటిది పెట్టుకొని కళ్ళు మూసుకుని ఈ ప్రపంచంతో నిమిత్తం లేనట్టు మీటుకుంటూంది.
విద్యాధరికి వెళ్ళి ఆ నలుగుర్ని తందామన్నంత కోపం వచ్చింది.
"న...న....న....న....న....ననూ...
ఊఊఊ ఊ..... ననూ ....
బ్రో.... వా .... బ్రోవా ..... బ్రోపవ్ ఆఆఆ .... ఆ....ఆ
నను బ్రోవామని .... నను .... నను ...."
జనం ఒక్క ఉదుటున గోల చేశారు. ఎవరో టమాటా లాటిది విసిరారు. గాత్రం ఆగిపోయింది. అంతలో బైట కలకలం. "మీ ఆవిడకి నేనే మొగుడ్ని" సినిమాలో పోలీసు వేషం వేసిన నటుడు లోపలికి వస్తున్నాడు. ఆర్గనైజర్స్ ఏమీ పనిలేకుండా హడావుడి పడుతున్నారు. జనం ఆ నటుడిని దగ్గరగా చూడాలని పోటీ పడుతున్నారు. తనొచ్చాకే ఎన్టీ రామారావు పడిపోయాడన్న లెవెల్లో ఆ నటుడు నవ్వుతూ చెయ్యి వూపుతున్నాడు. అంతలో అకస్మాత్తుగా కరెంట్ పోయింది.
ఒక్కసారిగా పెద్దగోల బయల్దేరింది. బయట వున్న జనం లోపలికి తీసుకొచ్చారు.
ఆడవాళ్ళు అవసరమైన దానికన్నా ఎక్కువ భయం ప్రదర్శించి మేము కూడా వున్నామన్న సంగతి మర్చిపోయారా అని తెలియజేశారు. రౌడీమూక విజృంభించింది. ఎందరి మెడల్లో గొలుసులు తెగాయో, ఎంతమంది వక్షోజాలు నలిగాయో తెలియలేదు. ఆడవాళ్ళవైపు వెళ్ళటం కోసం జనం, "పడిపోయిన నటుడి మీదనుంచే" పరుగెత్తారు- అవసరం రెలిటివ్ టర్మ్ కదా....
విద్యాధరి పరిస్థితి మరీ ఘోరంగా వుంది. ఆమె మగవాళ్ళ మధ్య ఉంది. ఆమె లోపలికి వెళ్ళి వచ్చాక సీటు కూడా లేకపోవటంతో చాలాసేపు నిలబడవలసి వచ్చింది. ఆమెకు సహజంగా మంచి ఫిజిక్ వున్నది. దాంతో అందరి కళ్ళూ ఆమెమీదే వున్నాయి. అందులోనూ చివరివరస, వెలుతురులో మర్యాదస్తులు చీకట్లో ధైర్యం పుంజుకుని ఆమెకు దగ్గరయ్యారు.
నడుము దగ్గర చెయ్యి పడగానే ఆమె కెవ్వున అరిచింది. కాని అప్పటికే అలాంటి అరుపులు చాలా వినిపిస్తున్నాయి. "జనరేటర్ లేదా - పెట్రమాక్స్ లైట్లు లేవా" లాటి అరుపులు దూరం నుంచి వినపడుతున్నాయి. ఈ లోపులో ఇంకొక చెయ్యి విద్యాధరి మెడమీద నుంచి క్రిందికి జారింది.
ఈసారి ఆమె అరవలేదు.
చల్లగా జడపిన్ను తీసి పట్టుకుంది. రేప్ తప్పనిసరి అయినప్పుడు కళ్ళు మూసుకుని ఆనందించు అన్నది పాత సూక్తి. రేప్ తప్పనిసరి అయినప్పుడు కనీసం రెండు వృషణాలన్నా చితక్కొట్టు అన్నది ఆధునిక స్త్రీ నీతి. ఇంకో రెండు నిమిషాల్లో కరెంటు ఎలాగూ వస్తుంది. ఈలోపులో తన మాంసాన్ని స్పృశించి సంతృప్తి పడదామనుకున్న హీనుడి చేతిమీద లోతుకంటూ పొడిచేస్తే ఆ గుర్తు వాడికి జీవితాంతం గుర్తుంటుంది కదా.
ఇంతలో చెయ్యి మరింత క్రిందకి జారింది.
కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.
విద్యాధరి కుడిచేతిలో పిన్నుని కత్తిలా పట్టుకుని క్రిందికి జారుతూన్న ఆ పురుషహస్తాన్ని పొడవబోతుండగా "అత్యాచారం చేయకండి విద్యాధరి, అది నా చెయ్యి" అని చెవి దగ్గరగా వినిపించింది. ఆమె అదిరిపడింది. ఆ స్వరం ఎక్కడో విన్నట్టుంది. వెంటనే స్ఫురణకొచ్చింది.
అది అనుదీప్ ది!
అతడు అక్కడికెలా వచ్చాడో చీకట్లో తెలియక ఆమె గిగ్భ్రమురాలైంది.
ఈలోపులో జనం కుమ్ములాట ఎక్కువైంది.
అతడామెని మరి మాట్లాడనివ్వకుండా చెయ్యి పట్టుకుని ఇటూ అటూ జనాన్ని పక్కకి తోసుకుంటూ బయటకు పరుగెత్తాడు. ఆమె అతడిని అనుసరించింది. లోపల్నుంచి ఆడవాళ్ళ అరుపులు యింకా వినిపిస్తూనే వున్నాయి. పోలీస్ క్లబ్ వరకూ వచ్చేసరికి ఆమె స్థిమితపడింది. అంతలో కరెంట్ కూడా వచ్చింది.
"మీరెప్పుడొచ్చారు లోపలికి?" అని అడిగింది.
"మీరు వచ్చినప్పుడే"
"మరి పలకరించలేదేం?"
"ఎందుకు?"
ఆమె హర్ట్ అయింది.
"ఏమంటున్నాడు చక్రధర్? ఆఫ్ కోర్స్. మీ జోలికి యిక రాడులెండి.
ఇద్దరూ నడక సాగించారు.
"కొద్ది అవకాశం దొరికితే మనుష్యులు ఇంత మృగాల్లా అయిపోతారనుకోలేదు."
"మొత్తంమీద నా చేతికి కొద్దిదూరంలో పెద్ద ప్రమాదం తప్పింది."
"నేను జడపిన్ను తీస్తున్నట్టు మీకెలా తెలిసింది."
"మీరేం చేసినా నాకు తెలుస్తుంది. అది సరేకానీ రిక్షా ఎక్కుతారా? విద్యాధరపురం వరకూ వెళ్ళాలి కదా!"
ఆమె విస్మయంతో, "మా ఇల్లు యెక్కడో మీకెలా తెలుసు?" అంది.
"నాకు మీ గురించి అంతా తెలుసు విద్యాధరీ. అంతకన్న ఎక్కువ అడక్కండి. ఆ చనువుతోనే అప్పుడప్పుడు ఏకవచనంతో సంబోధిస్తూ వుంటాను. దాని గురించి కూడా ఏమీ అనుకోకండి."
"కానీ..."
"ప్లీజ్..."
ఆమె ఇంకేం మాట్లాడలేకపోయింది.
అతడు టాపిక్ మారుస్తూ "లోపలికి వెళ్ళారుగా. గంగాధరచలం ఏమన్నారు?"
ఆమె నవ్వి "మీరు నన్నే గమనిస్తున్నట్టున్నారే" అంది.
"కొద్ది దూరంలో నిలబడి మిమ్మల్ని చూస్తూ వున్నాను. నిజానికి మీ కోసమే నేనీ ప్రోగ్రాంకు వచ్చాను."
స్టేజిలోపల కలుసుకున్నప్పుడు ఆయన ఏమన్నారో చెప్పింది. "నేను చాలా డిస్సపాయింట్ అయ్యాను. ఆయన చాలా మాట్లాడతారనుకున్నాను. ఏదో సంజాయిషీ యిచ్చారు కానీ... నేనంతగా కన్విన్స్ అవలేదు."
అతడు రెండు చేతులూ ఫాంటు జేబులో పెట్టుకుని నడుస్తూ తాపీగా ప్రశ్న వేశాడు. "అరుణస్వామి మొదలియార్ ఎవరో తెలుసా మీకు?"
"లేదే!"
"ఆ గాత్ర కచేరి చేసినాయన"
"మైగాడ్! ఆయనా... ఎడా పెడా వాయించేశాడు మమ్మల్ని" అంటూ నవ్వసాగింది. అతడు నవ్వలేదు.
"తమిళనాడులో ఆయన నడుస్తూ వుంటే కాళ్ళ క్రింద పువ్వులు జల్లుతారు. మీ ఆడిటోరియంలో కనీసం పదిమంది అయినా ఆయనంటే ప్రాణాలిచ్చేవాళ్ళు వుండి వుంటారు. ఇప్పుడు చెప్పండి విద్యాధరీ! మీరు పెద్ద "బోర్" అనుకున్న ఆయన గాత్రం, ఆ పదిమందికీ ప్రాణప్రదం. అలాగే మీకు ప్రాణప్రదమైన గంగాధరాచలంగారి ఉపన్యాసం కొజ్జా నటుడిని చూడటానికి వచ్చిన వాళ్ళకి పెద్ద బోర్. అవునా?"
ఆమె దిగ్భ్రమతో అతనివైపు చూసింది. అతడామెవైపు చూడటం లేదు. తారు రోడ్డుమీద తమతోపాటే పాకుతున్న నీడల్ని చూస్తూ అన్నాడు-
"ఆయనకి ఎవరూ విలువ ఇవ్వలేదే అని మీరు బాధపడ్డారు. కానీ మొదలియార్ గాత్రానికి ఆ కొజ్జా జనంతోపాటూ మీరూ నవ్వేరని గుర్తించలేదేం? వాళ్ళకన్నా ఒక మెట్టు పైనున్నారని మీరనుకున్నారు. మీపైన ఇంకో మెట్టు వుందని గమనించలేదు."
విద్యాధరి వివర్ణమైన మొహంతో... "ఐయామ్ సారీ" అంది. "నేనంత దూరం ఆలోచించలేదు."
"ఆలోచించుకుంటూ దూరం వెళ్ళగలిగితే మనిషికందని సుదూర తీరాల్లో సత్యం కనపడుతుంది విద్యాధరీ."
విద్యాధరికి గంగాధరాచలం మాటల్లో సత్యం బోధపడింది. "సీజర్ గురించి మాట్లాడనా? యులిసిన్ గురించా" అన్నారు. ఎవరో యాక్టర్ ని చూడటానికి వచ్చిన వాళ్ళముందు తన పాండిత్య ప్రకర్ష ఎందుకని అనుకుని వుంటారు. లేకపోతే ఆ మేధావికి మాట్లాడాలంటే సబ్జెక్టు దొరకదా?