సాయంత్రం అయిదయి వుంటుంది. ట్రెయిన్ ఇంకో గంటో, గంటన్నరో లేటన్నారు. లగేజి వెయిటింగ్ రూంలో పెట్టి కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, ఆ తర్వాత హిగిన్ బాదమ్స్ దగ్గరకొచ్చి బుక్స్ చూస్తూ ఉండగా ప్రక్కనుంచి ఏదో మృదు సుగంధం వీచినట్లయి తల త్రిప్పి చూశాడు.
తెల్లటి బట్టల్లో తెల్లగా మెరిసిపోయే అమ్మాయి. మెడమీద నల్లటి పుట్టుమచ్చ.
"ఎంత అందంగా వుం.....ది" అని అనుకోబోయి ఠక్కున మానేశాడు. అంతటి తీరైన చక్కటి ముక్కుకి ముక్కుపుడక.
అతనికి ముక్కుపుడకలు పెట్టుకునే ఆడవాళ్లంటే తగనికోపం. అదో అందానికి అంతరాయం కలిగించేదేగాని, అలంకారమని ఛస్తే ఒప్పుకోడు. ఎవరైనా అందమైనవాళ్ళు ముక్కుపుడకలు పెట్టుకుని కనిపిస్తే ఒళ్ళు మండిపోయేది. తర్వాత బాధపడిపోయేవాడు.
చప్పున అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు.
కాసేపు మళ్ళా అటూ ఇటూ తిరిగి కాళ్లు నొప్పులుపుట్టి ఏం చేద్దామా అని ఆలోచిస్తూవుండగా ప్లాట్ ఫారం చివర ఓ కంపార్టుమెంటు ఆగి వుండటం కనిపించింది. అందులోకెళ్ళి కూర్చుంటే హాయిగా వుంటుంది. అక్కడే కూర్చుని కలలుకంటూ కాలక్షేపం చేయవచ్చు.
అయినా మొత్తం కంపార్టుమెంటులో ఒక్కడే కూర్చునే అవకాశం ఎప్పుడు వస్తుంది గనుక?
దర్జాగా నడిచివెళ్లి లోపలికి ఎక్కి ఓ సీటులో కూర్చోబోతూ నిశ్చేష్టుడయాడు. అటువైపు కిటికీ దగ్గర యిందాక కనిపించిన అమ్మాయి కూర్చుని వుంది.
చేతిలో ఇంగ్లీషు నవల పట్టుకుని, అందులో లీనమైవున్నా అలికిడి విని తల ఎత్తి అతనివైపు అసహనంగా చూసింది.
మొదట వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఆమె చూపులోని అసహనం అతనికి రోషం తెప్పించింది. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునే తత్వం కాదు. కావాలని ఆమెకెదురుగా వున్న సీట్లో బైఠాయించాడు.
ఆమె అంతకన్నా పెంకిఘటంలా వుంది. ఒక్క క్షణంమాత్రం అతనివైపు చూసి తర్వాత పుస్తకంలోకి దృష్టి మరల్చింది.
ఆమె ఏమనుకుంటోంది తన గురించి? ఇంత గొప్ప అందగత్తెను ఇందాకట్నుంచీ నా వెంటబడి తిరుగుతున్నాడని విర్రవీగుతోందా? ఇలాంటి అందగత్తెలని లెక్కజేసే ఘటంకాదని తెలీదా? ముక్కు పుడక పెట్టుకోకుండా వుంటే పోన్లే అని మెచ్చుకుని వుండేవాడు ఇప్పుడెలాగ? ఆ ఛాన్సు పాడుచేసుకుందే!
కాని అతని నోరు ఊరుకోలేదు "ఏమండీ.....మిస్......."
తల ఎత్తి చూసింది. కళ్ళలో కోపంతో కూడిన మెరుపు.
అతనేం లెక్కచెయ్యలేదు. "చూడండి మిస్......"
"పేరెందుకులెండి, చెప్పండి?"
"ఎక్కడిదాకా వెడుతున్నారు?"
"ఎందుకండీ?"
"అహ...తెలుసుకుందామని....."
"తెలుసుకుని ఏం చేస్తారండీ?"
అతనేం తొణకలేదు, "తెలుసుకోవటం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. ఒకటి-ఒకే ఊరికి వెళుతున్నట్లయితే తోడుగా వెళ్ళవచ్చు. రెండవది మీరు ఒంటరిగా వున్నారుకదండీ, నావంటివాడు రక్షణ ఉన్నట్లుంటుంది. మూడోది......."
"చాల్లెండి, ఈ ఉపయోగాలేవీ నా కక్కరలేదు. మీ పని మీరు చూసుకోండి."
"ప్రస్తుతం నాకింకేమీ పనిలేకే కదండీ మీతో మాట్లాడేది?"
"మీకు లేకపోతే నాకు వుందిలెండి."
"ఏమిటి? ఉబుసుపోక నవలలు చదవటమా? ఉబుసుపోక చదవటం పనెట్లా అవుతుందండీ?"
ఆమె అతనివంక కోపంగా చూసింది. అక్కడ్నుంచి లేచి వెళ్లిపోదామా అన్న భావం లీలామాత్రంగా కనిపించకపోలేదు. కానీ అహం ఆమెను ఆపింది.
ఇంతలో ఇద్దరూ ఒక్కసారి గభాలున కదిలినట్లయ్యారు. ఇంజన్ వచ్చి కంపార్టుమెంటును ఢీకొని వుంది.
ఆమె ముఖంలో వ్యాకులపాటు కనిపించింది. అతనూ కొంచెం కంగారు పడకపోలేదు. కానీ పైకి బెట్టుగ, గుట్టుగా ఊరుకున్నాడు.
ఒక్కనిముషం సందిగ్ధంగా, అసహనంగా గడిచింది.
ఇంతలో ఆ కంపార్టుమెంటు కదలనారంభించింది. ఇంజను దాన్ని ఎటో లాక్కునిపోతోంది.
"అయ్యో!" అనుకుంటూ ఆమె చప్పున లేచి తలుపుదగ్గరకెళ్ళింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇంజన్ అ కంపార్టుమెంటుతో సహా ఫ్లాట్ ఫారం దాటి చాలాదూరం సాగి, వేగంగా వెళ్ళిపోతోంది.
అతని ముఖంలో కూడా కొంచెం తొట్రుపాటు కనిపించింది. కానీ వెనువెంటనే గాంభీర్యం తెచ్చుకుని లేచి ఆమె ప్రక్కకివచ్చి నిలబడ్డాడు.
ఆమె తెరచివున్న తలుపుకు కొంచెం లోపలగా నిలబడివుంది. ఇప్పుడామె ముఖంలో స్పష్టంగా భయం గోచరిస్తోంది.
"మరి....ఎలాగ?" అంది తడబడే గొంతుతో.
అతనేం జవాబు చెప్పలేదు.
"మిమ్మల్నేనండి, మాట్లాడరేం?"
"అదే నేనూ ఆలోచిస్తున్నాను."
"నా లగేజి వెయిటింగ్ రూంలో వుండిపోయింది. ఎవరో ఒకామెను చూస్తూ వుండమని చెప్పివచ్చాను."
"చూడండి. మనమిప్పుడు లగేజి గురించి బాధపడదామా? మనగురించి మదనపడదామా?"
"అంటే?" అతని ముఖంలోకి చురచుర చూసింది.
"అంటే......యిలా ముందుకే వెళదామా, ఎక్కడైనా అగుదామా, వెనక్కి వెళదామా........?"
చెట్లూ, చేమలూ దాటిపోతున్నాయి. అటూయిటూ ఎక్కడా మనుషులు గాని, ఇళ్ళుగాని కనబడటంలేదు. ఊరుదాటి చాలాదూరం వచ్చేసినట్లుంది.
"మరి.........ఎలాగ?" అంది మళ్ళీ భయంగా.