Previous Page Next Page 
అంకితం పేజి 6


    "తప్పకుండా".

    "ప్రామిస్"

    "పేకాట మానెయ్ డాడీ".

    ఒక శీతల వీచిక శరీరాన్ని జలదరింపచేస్తూ వెళ్ళిపోయిన ఫీలింగ్ మంచు నేలమీద దిగి కుదురుకున్నట్టు, పేరుకున్న నిశ్శబ్దం.... నేను నెమ్మదిగా తలెత్తి వాడివేపు చూసాను. వాడు ఆశగా నావైపే చూస్తున్నాడు. నేను లేచాను.

    "సరే ఈ రోజునుంచీ ఇక ఆడను" అన్నాను దృఢంగా. వాడు ఆర్తిగా దగ్గరికొచ్చి నన్ను వాటేసుకున్నాడు.


                         *    *    *

    జాన్ డేవిడ్ బిగ్గరగా నవ్వేస్తూ- "గుడ్" అన్నాడు. "......చాలా బావుంది- నిజంగా బావుంది".

    "మరీ చిన్నపిల్లల వ్యవహారంలా డ్రమెటిక్ గా వుందా?" ఉక్రోషంగా అడిగాను.

    "లేదే....." అన్నాడు నవ్వాపి. ".......ఇందులో డ్రామా ఏమీలేదు. జీవితం వుంది. ఒక్క విషయం చెపుతాను మళ్ళీ మళ్ళీ విను. అంకిత్ లాటి కొడుకు వుండటం మీ అదృష్టం".

    ఆ తర్వాత మేమిద్దరం చాలాసేపు అంకిత్ గురించే మాట్లాడుకున్నాం. అక్కణ్ణుంచి కారులో జాన్ నన్ను నా హొటల్ దగ్గర దింపటానికి ఆయుత్తమయ్యాడు.

    కార్లో అతడి పక్కనే కూచుని చాలాసేపు జాన్ గురించే ఆలోచించాను. నేనెప్పుడు హైదరాబాద్ వచ్చినా జాన్ డేవిడ్ కంపెనీ గురించే ఆలోచిస్తూ వుంటాను. అతడితో గడిపే సమయం హాయిగా గడిచిపోతుంది. చాలా కొద్దిమంది కంపెనీ మాత్రమే అలా వుంటుంది.

    అతడు పరిచయమైనప్పుడు నేను చాలా లావుగా వుండేవాడిని. తిండి విషయంలోనే కాకుండా, సిగరెట్ల విషయంలో కూడా అతిగా ఉండేవాడిని. బిజినెస్ లోని ఒత్తిళ్ళలో చాలా చిరాకుగా వుండేవాడిని. అప్పుడే జాన్ వ్రాసిన పుస్తకం ఒకటి చదివాను. నాకు జాగింగ్ నేర్పింది అతడే. ఇప్పుడది వ్యసనంగా మారింది. సిగరెట్స్ కన్నా మంచి వ్యసనం.

    ఆ దంపతులకి నేనన్నా, అరుంధతి అన్నా చాలా ఇష్టం. అంకిత్ అంటే మరీ.

    మన జీవితంలో చాలామంది మిత్రులుండవచ్చు! కానీ అందరూ మంచిమిత్రులు కాలేరు. అనుక్షణం నా ఉన్నతినీ.... నా కుటుంబ క్షేమాన్ని కాంక్షించే వాడు జాన్, ఇప్పుడుఅతడున్న పరిస్థితి గుర్తుకురాగానే మనసంతా చేదుగా అయిపోయింది. ఎందుకంటే- జాన్ డేవిడ్ కి బ్రెయిన్ ట్యూమర్.

    అతడి జీవితకాలం మరో సంవత్సరమే వుంది.

   
                                                   *    *    *

    హొటల్ దగ్గర నన్ను దింపి జాన్ వెళ్ళిపోయాడు. రిసెప్షనిస్టు గది తాళాలు అందజేస్తూ- "వైజాగ్ నుంచి మీకు మూడుసార్లు ఫోన్ వచ్చింది సర్" అన్నాడు.

    "ఏమిటి విషయం?"

    "మిమ్మల్ని వెంటనే ఫోన్ చేయమన్నారు".

    నేను ఫోన్ దగ్గరికి లాక్కొని డయల్ చేసాను. అరుంధతి ఫోన్  పక్కనే కూర్చొన్నట్టు- మొదటి రింగ్ కే తీసింది. నా కంఠం వినగానే "......మీరేనా" అంది ఆందోళనగా, ఆమె కంఠంలో ఆదుర్దా ధ్వనిస్తోంది. "......ఈ రోజు మధ్యాహ్నం అంకిత మళ్ళీ స్కూల్లో పడిపోయాడు- వెన్ను నొప్పితో".

    నేను కంగారుగా. ".......ఇప్పుడెలా వుంది?" అని అడిగాను.

    "బాగా జ్వరంగా వుంది......" అంది అరుంధతి. "........ఉన్నట్టుండి వచ్చింది. డాక్టర్ వచ్చి చూసి ఏవో టెస్టులు చెయ్యాలన్నారు. వైరల్ ఫీవర్ అని చెప్పారు నాకెందుకో భయం...." ఆమె స్వరం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఫోన్లో నిశ్శబ్దం.

    "అరుంధతీ....."పిల్చాను.

    అట్నుంచి సన్నగా రోదిస్తూన్న ధ్వని వినిపించింది. పైట అడ్డుపెట్టుకుని అరుంధతి ఏడుపు ఆపుకొంటోంది.

    "అరుంధతీ....." మళ్ళీ అన్నాను.

    "ఊ.... " వెక్కిళ్ళమధ్య ఆమె కంఠం బలహీనంగా వినిపించింది.

    "రేపు మధ్యాహ్నానికల్లా అక్కడ వుంటాను సరేనా. కంగారు పడకు. నేను వెంటనే బయల్దేరుతున్నాను....." అని ఫోన్ పెట్టేసి వెనుదిరిగాను. ఎందుకో తెలీదుకానీ భరించలేనంత నిస్సత్తువగా అనిపించింది. గుండెల్నిండా దిగులు పేరుకుంటే అలానే అనిపిస్తుందేమో.

    ఒకవైపు ఇంత గాబరాగా వున్నా- మరోవైపు - చిన్న విషయానికి అనవసరంగా కంగారుపడుతున్నానేమో అన్న భావం కదుల్తోంది. వాడిది మామూలు వైరల్ ఫీవరే అయ్యుండవచ్చు.

    కానీ అంత చిన్న పిల్లాడికి వెన్నునొప్పి.....?

    ......ఆలోచన్లని అక్కడతెంపి, నా రూమ్ లోకి హడావుడిగా బయల్దేరాను. వెంటనే వెళితే చివరి బస్ దొరుకువచ్చని నా వుద్దేశ్యం. ఒక వైపు బట్టలు సర్దుతూనే, జాన్ డేవిడ్ కి ఫోన్ చేసాను.

    అయిదునిముషాల్లో అతను నా దగ్గర వున్నాడు.

    నేను క్షమాపణ  చెప్తున్నట్టు..... "రెస్ట్ తీసుకుంటున్నవాడిని అనవసరంగా మళ్ళీ పిలిపించినట్టున్నాను" అన్నాను- విషయమంతా చెప్పి.
   
    "-దాన్దేముంది. ఇప్పుడే పడుకోబోతున్నాను. ఇంకా నిద్రపోలేదు. మనిద్దరం హొటల్ భోజనం చేసేసినా సంగతి చెప్పగానే దయ క్లాసు తీసుకుంది. ఆఫ్ కోర్స్.....బీరు తాగినందుకు కాదు. హొటల్లో అర్థరాత్రి వరకూ గడిపినందుకు ఒక క్లాసు. నిన్ను తీసుకురాకుండా ఇంటికి వెళ్ళినందుకు ఒక క్లాసు. ఆ పాఠాలు వింటుండగా నీ ఫోన్ వచ్చి రక్షించింది". కారు బస్ స్టాండ్ వైపు పోనిస్తూ అన్నాడు. నేనతడివైపో క్షణం చూసాను. నేనింత టెన్షన్ లో వుంటే అతడు అంత క్యాజువల్ గా మాట్లాడటం అంత బాగా అనిపించలేదు. అయినా నేనా ప్రస్తావన తీసుకురాలేదు. నా మనసంతా అంకిత్ పైనే వుంది. ఈ లోపులో కారు బస్ స్టాండ్ చేరుకుంది.

    నేను భయపడినట్టుగానే ఆఖరి బస్ కూడా వెళ్ళిపోయింది. టాక్సీలు కూడా ఏమీలేవు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూండగా "....నా కారు తీసుకువెళ్ళు" అన్నాడు జాన్. నేనతడివైపు ఆశ్చర్యంగా చూసాను. అతడేమంటున్నాడో నాకోక్షణం అర్థంకాలేదు.

    "ఇప్పుడు పన్నెండయింది. వెంటనే బయల్దేరితే ప్రొద్దున ఆరింటికి విజయవాడ చేరుకుంటావు. మెయిల్ దొరకొచ్చు. కారు మాత్రం విజయవాడలో క్లబ్ దగ్గర వదిలెయ్. విశాఖపట్నం వరకూ డ్రయివ్ చెయ్యకు...." అంటూ నా జవాబుకోసం ఎదురుచూడకుండా........"ఆటో" అంటూ పిల్చాడు.

    నేను కంగారుగా, "నిన్ను దింపి వెళ్తాను" అన్నాను.

    "ఆలస్యం అయితే నీకు విఅజయవాడలో ట్రయిన్ దొరక్కపోవచ్చు. నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాలే. తెల్లవారుఝామున డ్రయివింగ్ మాత్రం జాగ్రత్త. అరుంధతికి ప్రొద్దున్నే ధైర్యం చెపుతా. నువ్వు బయల్దేరు" అంటూ తొందరపెట్టాడు.

    నా మనసంతా అదోరకమైన గిల్టీభావంతో నిండిపోయింది. కారు వూరి పొలిమేరలు దాటుతోంది.

    రాత్రి ఒంటిగంట దాటుతోంది.

    నా ఆలోచనలు మాత్రం గత సంఘటనని దాటటం లేదు.

    జాన్ డేవిడ్ ని నేను ఎప్పటికి అర్థం చేసుకోగలను? ఒకవైపు అంకిత్ గురించి నేను కంగారుపడుతూంటే  మరోవైపు అతడు హొటల్ లో డిన్నర్ గురించి మాట్లాడుతున్నాడని గంట క్రితమేకదా అనుకున్నాను. నేనింత తక్కువగా ఎందుకు అంచనా వేసాను? కేవలం కంగారుపడటం వల్ల లాభంలేదనీ, చేయవలసిన పనిని నిర్దుష్టంగా ఆలోచించి అమలు జరపటం ఒక్కటే మనిషికి కష్టకాలంలో కావల్సింది- అని అతడెన్నిసార్లు చెప్పాడు.

    ఇప్పుడు అదే చేసి చూపించాడు కూడా!

    పెద్దసాయం చేస్తున్నట్టు కాకుండా, చాలా మామూలుగా చేసాడు. తన కారు విజయవాడలో ఎక్కడ వుంటుంది- అని ఆలోచించలేదు. "తిరిగి నువ్వు హైద్రాబాద్ వస్తావా?" అని నన్ను అడగలేదు. ఒకవేళ నేను రాకపోతే- ఆ కారుని వెనక్కి ఎవరు తీసుకొస్తారు- అని తర్కించలేదు. పైగా - నా కంగారుని తగ్గించటానికి మామూలుగా సంభాషించే ప్రయత్నం చేసాడు. తన భార్య పెట్టిన చివాట్ల గురించి చెప్పాడు.

    ఈ రకంగా అతడి గురించి ఆలోచిస్తూనే నేను విజయవాడ చేరుకున్నాను. ఆ ఆలోచనల్లో కూడా అంకిత్ గురించి మర్చిపోలేదు. అది మనసులో ఒక మూల కదలాడుతూనే వుంది.

    విజయవాడ చేరుకునేసరికి ఆరయింది.

    అదృష్టవశాత్తు మెయిల్ దొరికింది.

   
                                                 *    *    *


    ఇంటి పరిసరాలు సమీపిస్తూంటే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. వైరల్ ఫీవర్ మనిషిని పిప్పి చేస్తుంది. వాడికేమో తొందర్లోనే పరీక్షలు.

    ఒక సంవత్సరం కోల్పోతే తట్టుకోలేడు.

    అయినా అసలెలా వుందో- అనుకుంటూ కంపౌండ్ వాల్ గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాను.

    ముందు హాలు నిర్మానుష్యంగా వుంది.

    అంకిత్ గది కూడా.

    ఏం జరిగిందో నా కర్థం కాలేదు. తలుపులు ఇలా బార్లాతీసి అరుంధతి ఎక్కడికి వెళ్ళింది.

    నా ఆలోచన్లని భగ్నంచేస్తూ పెరట్లో అలికిడి అయింది. చప్పున అటు నడిచాను.

    పెరట్లో అరుంధతి చెట్లకి నీళ్ళు పోస్తోంది!

    నేను నా కళ్ళని నమ్మలేనట్లు అటే చూస్తూ వుండిపోయాను. నన్ను గమనించగానే అరుంధతి మొహం విప్పారింది. చేతిలో పైపు వదిలేసి ముందుకు వస్తూ, "వచ్చారా" అంది.

    "అంకిత్ ఎక్కడా?" నా గొంతు కీచుగా ధ్వనించిందా? ఏమో.....

    "స్కూల్ కి వెళ్ళాడు".

    "స్కూ......ల్......కి......వె......ళ్ళా....డా?"

    "ప్రిలిమ్స్ వున్నాయట. ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు. జ్వరం పూర్తిగా తగ్గిపోయిందనుకోండి. కానీ రెస్ట్ తీసుకొమ్మని చెప్పాను. వినలేదు. పరీక్షలు వ్రాయాలంటూ పరుగెత్తాడు....." ఆమె చెప్పుకుపోతోంది. నాకు విపరీతమైన కోపం ఒకవైపు నుంచి తన్నుకొస్తోంది. మరొకవైపు భరించలేనంతటి అలసట.

    రాత్రంతా డ్రయివ్ చేసి రైలు అందుకుని- కంగారు కంగారుగా వచ్చినప్పుడు ఈ ఆలసట తెలియలేదు. ఇంత కష్టపడివస్తే-

    ఇక్కడంతా సవ్యంగా వుంది!

    అది తెలియగానే ఒక్కసారిగా అలసట ఆవరించింది. దానికితోడు కోపం.....చెట్లకి నీళ్ళు పోస్తోంది! అంతలోనే మరో ఆలోచన....! ఏదైనా జరిగితే. జరిగితే నాకు సంతృప్తిగా వుండేదా?  ఎంత స్టుపిడ్ ని నేను! ఎంత వెధవలా ఆలోచిస్తున్నాను!

    ఈ ఆలోచన రాగానే......

    ......నేను బిగ్గరాగా నవ్వేసాను.

    ఉన్నట్టుండి అలా నవ్వేసరికి అరుంధతి బిత్తరపోయి "ఏమైందండీ" అంది.

 Previous Page Next Page