Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 6


    వేసవి సెలవులు గడిచి, కాలేజి తెరిచారు. మధుబాబు రెండోఏటలో ప్రవేశించాడు. కొన్నాళ్లకు యధావిధిగా ఎలక్షన్ లు జరిగాయి. కాలేజి మేగజైన్ పోటీ పరీక్ష జరిగింది. అతను మళ్ళీ పాల్గొన్నాడు. అంశము! "ఇంగ్లీషులో విద్యాభ్యాసం సమంజసమా" అని. ఆలోచించి శక్తికొద్దీ బాగా రాశాడు. దాని తర్వాత ఇంటర్వ్యూకి కొంతమందిని సెలక్ట్ చేసి పిలిచారు. వాళ్లలో మధుబాబు కూడా వున్నాడు. త్వరత ఫలితాలు తెలిశాయి. అతను సెలక్ట్ అయ్యాడు.

    "హమ్మయ్య" అనుకున్నాడు. తను అనుకున్నది నెరవేరింది. మంచి మేగజైన్ తీసుకురావాలి. ఇదివరకు ఎవరూ తీసుకురానట్లు కొత్తకొత్తగా ఆకర్షణలతో తయారుచెయ్యాలి.

    భారతిలో అతనికథ అచ్చుకావటం చుట్టూ మంచి వాతావరణాన్ని సృష్టించింది. "అందులో ఏముంది చెత్త" అని కొంతమంది ప్రబుద్దులు అన్నా, కొంతమంది విద్యార్ధులు దగ్గరకు వచ్చి అభినందించసాగారు. కొన్నాళ్లలో మరి రెండు మూడు కథలుకూడా భారతిలో అచ్చయినాయి. నిజానికి అవి చాలా మంచికథలు. ఎంతోమంది హృదయాలను కదిపాయి. మధుబాబు దాకా రాలేదుకాని, మిగతా రచయితలలో చైతన్యవంతమైన చర్చలకు కారణభూతమైంది. అందులో ఒక కథలో చనిపోయేముందు ఆ విషయం తెలిసి తపనపడ్డ ఒకడి మనస్తత్వం హృదయవిదారకంగా చిత్రింపబడింది. అది అచ్చయినాకనే రేడియోవాళ్ల దగ్గర్నుంచి నాటిక రాయమని ఆహ్వానం వచ్చింది. మధుబాబు పులకాంకితుడయాడు. ఇదివరకు రేడియోకు ఎన్ని నాటికలు పంపినా తిరిగివచ్చాయి. రెండురోజులు కష్టపడి పదిహేను నిముషాలకు సరిపోయే ఒక నాటిక రాసి పంపాడు.

    కాలేజీలో ఓ మహాకవి వున్నాడు. ఆయనంటే మధుబాబుకు చాలా భక్తిశ్రద్ధలు మహాకవి నిజంగా గొప్పవాడు. సాహిత్య సామ్రాజ్యంలో ఆయన స్పృశించని విభాగంలేదు. గొప్ప వక్తకూడా. కాని పెడసరం మనిషి మనసు మృదువయినదే గాని, మాట కఠినంగా వుంటుంది. దేశమంతా ఆయనకు బోలెడంత శిష్యబృందముంది. ఆయనంటే గిట్టనివాళ్ళూ సమయం వస్తే పరాభవిద్డామని కాచుకు కూర్చున్నవాళ్ళూ అనేకులు వున్నారు. అయితే ఆయన ముందు ఆ పప్పులేవీ వుడకవు. ఎంతటివాడినైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా చీమని దులిపిపారేసిట్లు దులిపేస్తాడు.

    ఆయన వ్యక్తిత్వం చాలాగొప్పది. ఏం రాసినా, ఏంచెప్పినా పరిపూర్ణమైన విశ్వాసంతో, మరో ఇరవయ్యేళ్ళ తర్వాతనైనా అదేమాట చెప్పగలిగే స్థయిర్యంతో చెబుతాడు. ఆయనతో ఎట్లాగైనా పరిచయం కలిగించుకోవాలని మధుబాబు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆయన తనక్లాసుకి రాడు. అందుకని తనగురువుగా సంబంధం వుంచుకునే అవకాశం అతనికి కలగలేదు. ఓరోజు ధైర్యంచేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆదివారం ఉదయం తొమ్మిది అవుతుంది. పడక్కుర్చీలో కూర్చుని మహాకని ఏదో గ్రంథం పఠిస్తున్నాడు. "నమస్కారంమండీ!" అన్నాడు మధుబాబు వోణికే కంఠంతో.

    మహాకవి తలయెత్తి "ఎవర్రా అబ్బాయి? నా స్టూడెంటువా" అని ప్రశ్నించాడు.

    మధుబాబు తడుముకుని "కానండీ. నేను ఫస్టియర్ చదివే రోజులలో మీరు సెకండియర్ కి వెళ్ళేవారు. ఇప్పుడు నేను సెకండియర్ కి వచ్చేసరికి మీరు ఫస్టియర్ కి వెడుతున్నారు. మీరు మాకు రావటంలేదు" అన్నాడు.

    "మీకా అదృష్టం లేదురా" అన్నాడు మహాకవి.

    కొంచెం ఆగి ఆయనే "ఏం చెయ్యనురా అబ్బాయి? మీ క్లాసే తీసుకుందా మనుకున్నాను గాని ఆరోగ్యం బాగుండటంలేదు. ఫస్టియర్ వాళ్ళకవుతే ఎక్కువ శ్రమ తీసుకోనక్కరాలేదని వాళ్లకి పోతున్నాను" అన్నాడు.

    మధుబాబు జవాబు చెప్పకుండా నిలబడినాడు.

    "అన్నట్లు ఎందుకొచ్చావు? నీ పేరేమిటి? ఆ కుర్చీ ఇలా లాక్కుని కూర్చో."

    అతను కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుని తనపేరు చెప్పి "సాహిత్యమంటే అభిలాష వుందండీ" అన్నాడు.

    ఆయన చిత్రంగా కళ్ళెగరేసి "ఏమిటి? నీకూ ఆ పైత్యం వుందన్నమాట" అన్నాడు.

    మధుబాబుకి నవ్వు వచ్చింది. "కథలు రాస్తుంటానండీ" అన్నాడు మెల్లగా.

    "అచ్చయినాయా?"

    మధుబాబు తలవూపి ఈ మధ్యనే భారతిలో అచ్చయిన కథపేరు చెప్పాడు.

    మహాకవి ముఖంలో రవంత ఆశ్చర్యం పొడచూపింది. గుర్తుతెచ్చుకుంటున్నట్లుగా "ఏమిటీ? అది నేను చదివినట్లున్నానే, వుండు" అని లేచి అల్మారా దగ్గరకు వెళ్లి ఆ నేల భారతి తీసుకొచ్చి ఓ పేజీ తీసి "ఇదేకదూ" అన్నాడు.

    మధుబాబు ఉత్సాహంగా "అవునండీ అన్నాడు.

    ఆయన మళ్ళీ కుర్చీలో కూర్చుని పేజీలు త్రిప్పుతూ "నేను చదివానురా అబ్బాయి ఇది. కథకూడా గుర్తుంది. నేను నేటి నవీన సాహిత్యం చదవనని అంతా అనుకుంటారు. అది అబద్ధం. కొత్తవాళ్లు రాసేది చాలావరకూ చదువుతూనే వున్నాను. నీ కథ నాకు నచ్చింది. నీకు మంచి అభివృద్ధి వుంది. పైకి వస్తావు. అవునుగాని ఇంత పెసిమిస్టుగా ఎందుకు తయారయ్యావురా?" అన్నాడు.

    మధుబాబు నీళ్లు నములుతూ "నేను.... అట్లాగే...." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.

    "పెసిమిజం ఈనాటి ఫ్యాషన్ అయిందిలే. అట్లా రాస్తేనేగాని పేరురాడు కూడా. నీకు శిల్పం ఇంకా అమరలేదు. పర్యాలు రాయటం వచ్చునా?"

    "రాదండి."

    "బ్రతికించావు. నువ్వు ఎన్నటికీ కవివి అవటానికి ప్రయత్నించకు. పైకి రావటం సులభమేగాని, రెండుకావ్యాలు రాసేసరికి కాలం ఇంకిపోతుంది. అప్పుడు నీకు గతమేగాని భవిష్యత్ వుండదు" అన్నాడు మహాకవి.

    కొంచెం ఆగాక మధుబాబు "కాలేజి మేగజైన్ కు నేను స్టూడెంటు ఎడిటర్ని. రచన ఏమైనా ఇవ్వరూ?" అని అడిగాడు కొంచెం ఆగి.

    "కష్టం తీరికలేదు. ఇటు విమర్శలూ, అటు కావ్య పరంపరలు తలమునిగి వున్నాను. అయినా ప్రయత్నిస్తాను. కొన్నాళ్ళు పోయాక కనిపించు ద్రౌపదిమీద ఓ వ్యాసం రాస్తాను."

    "మరి వస్తాను. సెలవండీ" అన్నాడు మధుబాబు లేచి నిల్చుని.

    "పోయిరా" అన్నాడు మహాకవి.

    అతను బయటకు వచ్చేశాడు.

    కాలేజీలో తెలుగు అధ్యాపకులందరి దృష్టినీ మధుబాబు ఆకర్షించాడు. వాళ్లలో ప్రతిఒక్కరూ భారతిలో రాయటానికి ప్రయత్నించినవాళ్లే. ఒకాయనివి మట్టుకు నాలుగయిదు విమర్శలు ప్రచురించబడినై. మిగతావాళ్లకు అది గగనకుసుమం అయింది. మరీ గట్టిగా ప్రయత్నించగా ఒకటి రెండు కలగూరగంపలో వేసుకున్నారు.

    ఒకరోజు మధుబాబు వాళ్ళ స్టాఫ్ రూమ్ మీదుగా పోతుండగా "ఇలా ఓసారి రా నాయనా" అని లోపలకు పిలిచారు.

    అతను లోపలకు వెళ్ళి "ఎందుకండీ?" అన్నాడు.

    "భారతిలో కథలు రాసింది నువ్వే కదూ?"

    అతనికి అర్థమైంది. "అవునండీ" అన్నాడు నెమ్మదిగా.

    అవధాన్లుగారు గట్టిగా పొడుంపీల్చి "ఎలా వేసుకుంటున్నారోయి నీవి?" అని అడిగాడు.

    అతనికి యీ మాటలకు కష్టంవేసింది. జవాబు చెప్పకుండా వూరుకున్నాడు.

    బల్లమీద కాళ్లు జారజాచిన శాస్త్రిగారు "నువ్వు కథ పంపితే ఎన్నాళ్ళలో వేసుకుంటారు?" అని అడిగాడు.

    ఈ ధోరణి మధుబాబుకి నచ్చలేదు. "మొన్న కథ పదిహేనురోజులలో వేసుకున్నారు" అని చెప్పాడు, చెప్పాలని లేకపోయినా.

    గుప్తాగారు కళ్లజోడు సవరించుకుని "మేటర్ లేకపోతే అట్లాగే వేసుకుంటారు ఒక్కోసారి. కథకు ఎంత ఇస్తున్నారేమిటి?" అని అడిగాడు ఓరగా చూస్తూ.

    మధుబాబుకి  నిజం చెప్పాలనిపించలేదు. "ముప్పయి" అన్నాడు.

    "ఆ" అని అక్కడున్నవాళ్ళంతా ఒక్కసారి నోరు ఆవలించారు. వాళ్లకు చాలా కొద్దిమొత్తాలు వచ్చివున్నాయి యిదివరకు.

    మధుబాబుకు అక్కడ వుండబుద్ధిగాక "వస్తాను" అని అక్కడినుంచి కదిలాడు.

    "పెద్దవాళ్లు వీళ్ళు."

    కొన్నాళ్ళు గడిచాయి. ఓ ఆదివారం రాత్రి అతను రాసిన నాటిక ప్రసారమైంది. రేడియోముందు అతనూ, తల్లీ, తండ్రీ, తమ్ముడూ చెల్లెలూ అంతా కూర్చుని విన్నారు. సంభాషణలు ఎవరోగాని అక్కడక్కడ మార్చేశారు. కొంతభాగం కత్తిరించారు. మధుబాబుకి బాధ అనిపించింది. కాని అతను రాసిన సంభాషణలు వాళ్ళెవరో చదువుతుంటే హాయిగా వుంది.

    నాయిక వేసిన అమ్మాయి ఒకచోట "నా ప్రాణానికి జిగురులా దాపురించావు" అన్న సంభాషణ పలుకుతూ నవ్వు ఆపుకోలేక ఓ అరనిముషంపాటు కిలకిలమని నవ్వేసింది. నాటకం ముందూ, తర్వాతా అతని పేరు చదువుతూ వుంటే చెల్లెలు చిలిపిగా ముఖంలోకి చూసి నవ్వింది. తల్లి బాగుంది అన్నది. తండ్రి ఏమీ అభిప్రాయం వెలిబుచ్చలేదు.

    కాలేజి మేగజైన్ కి రచనలు వచ్చి పడుతున్నాయి. మధుబాబుతో పాటు ఇంకో విద్యార్థికూడా సంపాదకుడిగా వున్నాడు. కాని అతను ఏమీ పట్టించుకోడు. బాధ్యత అంతా మధుబాబు నెత్తిన పడింది.

 Previous Page Next Page