Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 6


    సరిగ్గా ఆ సమయానికి వాయుపుత్ర కంప్యూటర్ ని పని చేయించటం మొదలుపెట్టాడు. అతడి సంభాషణ ఎప్పుడూ సరదాగానే మొదలవుతుంది.

    "హల్లో మిషన్" అన్నాడు.

    "హల్లో మాన్"  జవాబిచ్చింది కంప్యూటర్- "ఏమిటీ రోజు హుషారుగా వున్నట్టున్నావ్."

    "హుషారా పాడా.... ఆ కాగితాన్ని డీకోడ్ చేసి అందులో ఏముందో కనుక్కోమని ప్రాణాలు తీస్తున్నారు మనవాళ్ళు."

    "నిన్నంతా నన్ను ఇబ్బంది పెట్టావ్ చాలదా? ఏ విమానం చప్పుడో, పక్షి రెక్కల చప్పుడో అయి వుంటుంది. దానిని  పట్టుకుని మీ వాళ్ళు నానా  హడావుడి చేస్తున్నారు."

    "కాదులే. సోలార్ ఎనర్జీ విషయంలో కూడా ఏదో గొడవ జరిగింది. మనం డీకోడ్ చెయ్యాలి. తప్పదు."

    "నేను రెడీ-"

    ఈ సంభాషణ జరుగుతూ వుంటే క్రింద యశ్వంత్ భవనం బయటకి నడవబోతున్నాడు. అప్పుడు తట్టింది అతడికి ఆలోచన. అది స్ఫురించగానే అతడు నిటారుగా అయ్యాడు. మరి ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి బయల్దేరాడు. అతడి మనసులో టెన్షన్ నడక వేగాన్ని సూచిస్తుంది.

    పైన గదిలో వాయుపుత్ర ఆ కాగితంమీద వున్న కోడ్ ని తిరిగి కంప్యూటర్ లోకి ఎక్కించాడు. "ఎన్నిసార్లు ఫీడ్ చేస్తావులే- ఇక ప్రారంభించు మైధునాన్ని అంది కంప్యూటరు. వాయుపుత్ర తెల్ల చానల్ మీద ప్రయత్నం మొదలు పెట్టబోయాడు. సరీగ్గా ఆ సమయానికి అనూహ్య ఆ గదిలో అడుగుపెట్టింది.

    ఆమె ఆ సమయంలో వచ్చినందుకు విస్మయంగా చూశాడు. తన ప్రేమ విషయం  ఆమెకి తెలిసీ, ఆమె ఎటూ నిర్ణయం చెప్పకపోవటంతో అతడు ఆమెతో అంత  చనువుగా వుండటంలేదు. కానీ కళ్ళలో ఆరాధనా భావం  మాత్రం  అలాగే  వుంది. రావటం అయితే గదిలోకి వచ్చింది గానీ,  ఈ విషయం ఎలా  ప్రస్తావించాలో ఆమెకి తెలియలేదు. స్త్రీ సిగ్గుని చెరపకుండా చరిత్రలో మిగిల్చి వుంచటం ఒక్కటే మొగవాడికి దేవుడిచ్చిన వరం.

    "నేనూ.....నే....నూ" అని అర్థోక్తిలో ఆపుచేసింది. అతడు ఆమెవైపు చూశాడు. అరుణరంజిత మైన ఆమె మొహం చూడగానే ఆ తొలకరి భావం అతడికి అర్థమైంది. అయినా అర్థంకానట్టు దగ్గరికొచ్చి "మీరు- మీరు?" అన్నాడు. ఆమెకేం చెప్పాలో తోచలేదు.

    "-పంటి నోప్పితో బాధపడుతున్నారా?"

    ఆమె అర్థంకాక తలెత్తింది. అతడి కళ్ళు నవ్వుతూ వుండటం చూసి ఆమెకి కోపం వచ్చింది. అది గమనించి 'సారీ! మీరు మీరు......ఏమిటి చెప్పండి-' అని అడిగాడు.

    "ఏం లేదు" అని విసురుగా ఆమె బయటకు నడవబోయింది.

    "ప్రేమ గురించి చెప్పాలని వచ్చారు. అవునా.....గుమ్మం దాతుతూంటే వెనుకనుంచి వినపడిన మాటలకి ఆమె నెమ్మదిగా వెనుదిరిగింది. కానీ మాట్లాడలేదు. వాయుపుత్ర నవ్వాడు.

    "మీరు చెప్పటానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇదిగో ఈ కంప్యూటర్ మిషన్ మీద మీరు చెప్పదల్చుకున్నది టైపు చెయ్యండి. నేను కళ్ళు మూసుకుంటాను" అన్నాడు. మూసుకున్నా కళ్ళ వెనుక కదిలే అల్లరిని ఆమె గమనించలేదు. ఆ మాత్రం  వెసులుబాటు కల్గించినందుకు మనసులోనే  అతడికి కృతజ్ఞత తెలుపుకుంటూ టైప్ బటన్స్ నొక్కింది ఉత్తరం రూపంలో.....ఇంగ్లీషులో.

    "చాలా రోజుల క్రితమే మీకు నా  గతం గురించి పూర్తిగా చెప్పాను క్రమక్రమంగా ఆ గతాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాను. మీరంటే నా కిష్టమే. అది రోజురోజుకీ పెరుగుతూంది. మనం  వివాహం చేసుకుందాం ఒకసారి వివాహం అయిపోతే నాలో మానసిక సంఘర్షణ పోతుంది అని నా  అభిప్రాయం లేదా నేనే పరిపూర్ణంగా మారి, మీ వద్దకు రావాలంటే మరికొంతకాలం ఆగవలసి వుంటుంది. నన్ను అర్థం చేసుకుంటారుగా- ఎలాగూ అంతరిక్షంలోకి మన ప్రయాణం లేదు కాబట్టి మరికొంత కాలం  ఆగటం మంచిదేమో, నేను ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను.

                                                                                                                - మీ అనూహ్య"

    టైప్ చేయటం పూర్తికాగానే ఆమె ఫైనల్ డిస్ కార్డు బటన్ నొక్కింది. లోపల్నుంచి ప్రింటు చేయబడిన కాగితం బయటకి రావటం, అప్పుడే కళ్ళుతెరిచి, దాన్ని చదివిన వాయుపుత్ర "య్యా ఆఆఆఆ.....' అని అరవటం ఒకేసారి జరిగాయి. అతడు అక్కడే డాన్స్ చేయటం ప్రారంభించాడు. అందులో అంత జుట్టు పీక్కుంటూ ఆనందంతో డాన్స్  చేసేటంత విషయం ఏముందో అర్థంకాక ఆమె కాగితం వైపు చూసింది. అతను ఏం ట్రిక్ చేశాడో ఏమోగానీ, ఆమె చేసిన కాగితంమీద ఆమె కొట్టిందిగాక, వేరేది వచ్చింది.

    "I LOVE YOU VAYUPUTRA. I LOVE YOU I LOVE YOU. I LOVE YOU.I LOVE YOU.I LOVE YOU.I LOVE YOU. I WANTTO KISS YOU ON YOUR FACE. I WANTTO KISS ON YOURS LIPS. IWANT TO KISS YOU WHEREVER POSSIBLE. YOURS ANUHYA."

    రోషంతో ముక్కుపుటాలు అదురుథూ వుండగా "నేను వ్రాసింది ఇది కాదు" అనబోయింది. అంతలోనే అతడు ఆనందంతో గుండె పట్టుకుని కూలబడ్డాడు. మరొక్కసారి మోసపోయిన అనూహ్య కంగారుగా అతడి మీదకు వంగింది. కనురెప్పపాటు కాలంలో అతడి చేతులు మిషనుకన్నా చురుగ్గా ఆమె భుజాల చుట్టూ బిగుసుకోవటం, ఆమెని దగ్గిరకు లాక్కొని ముద్దు పెట్టుకోవటంజరిగిపోయింది. ఆమె గింజుకుంటూ వున్న కొద్దీ అవి మరింత బలంగా బిగుసుకున్నాయి. 'నేను వ్రాసింది అదికాదు' అన్ని మళ్ళీ అనబోయింది.

    ఆమె చెవి దగ్గిర నోరు చేర్చి అతడు నెమ్మదిగా అన్నాడు-"ప్రేమని వెల్లాడి చేయటానికి చేతివ్రాతలు అవసరంలేదు అనూహ్యా! కంటిచూపులు చాలు- చెప్పు నేనంటే ఇష్టమనేగా కంప్యూటర్ లో రాశావు."

    ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకుని  అతడు చెంపమీద ముంగురుల్ని పెదవుల్తో నెమ్మదిగా స్పృశించబోతూ వుండగా తలుపు టక్ టక్ మని కొట్టిన చప్పుడు 'ఎక్యూజ్ మి' అన్న కంఠం వినిపించాయి. అతడు చప్పున  ఆమెని వదిలేశాడు.

    తెరచివున్న తలుపుకేసి, అక్కడ నిలబడివున్న మనిషికేసి చూడకుండా అనూహ్య గాలికన్నా వేగంగా, కంప్యూటర్ వెనక్కి పరుగెత్తింది. ఆమె మొహం అవమానంతో, సిగ్గుతో జేగురురంగుకి మారింది. "ఛా.....ఏమిటిది- ఎందుకిలా జరిగింది" అనుకుంది. అతడిమీద అమితమైన కోపం వచ్చింది. జరిగింది తలుచుకుంటే కంట నీరు కూడా వచ్చింది.

     గుమ్మం దగ్గర నిలబడిన యశ్వంత్ లోపలికి రాకుండానే, "నాకో ఆలోచన వచ్చింది" అన్నాడు. ఈ లోపులో గుండెనొప్పి నెపంతో నేలమీద పడుకుని వున్న వాయుపుత్ర లేచాడు.

    "ఆమె ణా ఫియాన్సీ.....కాబోయే భార్య" అంటూ కంప్యూటర్ వైపు చూపించాడు. యాశ్వంత్ అటుచూసే ప్రయత్నమేమీ చెయ్యకుండా" మీరు డీ- కోడ్ చేయవలసిన భాషలో సోలార్ ఎనర్జీ. విస్పోటనం, ఎలీన్స్ అన్న పదాలున్నాయేమో అని నా అనుమానం. భాషని మనకి అర్థమయ్యేటట్టు తర్జుమా చేయటానికి బేస్ కావాలన్నారుగా, ఇదేమన్నా సాయపడుతుందేమో ప్రయత్నించి చూడండి. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే_" అని చెప్పేసి వెనుదిరిగి వెళ్ళిపోతూ, గుమ్మం దగ్గిర మరొకసారి ఆగి, "ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ కావొచ్చు. ఫియాన్సీ కావొచ్చు. లేదా స్వంత భార్యే కావొచ్చు. కానీ మొత్తం ప్రపంచమంతా మీరు చేయబోయే డీ- కోడ్  గురించి ఎదురు చూస్తూంది. జీతం తీసుకునే సమయంలో రోమాన్స్ చేయటం నైతిక విరుద్ధం. మీరేవరికీ జవాబుదారీ కాకపోవచ్చు. కానీ మనసుకి మాత్రం సమాధానం చెప్పుకోక తప్పదు" అనేసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    వాయుపుత్ర ఇరిటేటింగ్ గా ఏదో  అనబోతూ వుండగా అనూహ్య వెనుకనుంచి వచ్చింది. అతడు ఆమె వైపు చూస్తూ "నువ్వేమీ అనుకోకు. అతడు ఈ ఇన్ స్టిట్యూట్ మనిషి కాదు. యశ్ వం....." అంటూ ఏదో చెప్పబోతుండగా, ఆమె  మరి ఆ గదిలో వుండలేనట్టుగా బయటకు పరుగెత్తింది.

    అతడు ఆమె వెనుకే వెళ్తూ "ఐయామ్ సారీ అనూహ్యా! ఇలా జరుగుతుందనుకోలేదు. అతడు నిన్ను చూడలేదు. చూసినా తప్పేమిటి? మనం తొందర్లో వివాహం చేసుకోబోతున్నాంగా " అన్నాడు.

    "ముందు నీకు అప్పగించిన పని సంగతి చూడు వాయూ. ఆయనెవరో అన్నట్టు- మనం మన మనసుకే జవాబుదారి" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. వాయుపుత్ర పిడికిలి బిగించి అరచేతిలో కొట్టుకున్నాడు.

    సరీగ్గా అయిదు నిమిషాల్లో నిజమైన సైంటిస్టుగా మారి పోయాడు. మిగతా ప్రపంచాన్ని మరిచిపోయాడు.

    "ఇది మనకొక సవాల్. దీన్ని ఎలాగైనా మనం సాధించాలి" అని కంప్యూటర్ ని అడిగాడు.

    "తప్పకుండా! నీదే ఆలస్యం. మొదలుపెట్టు" సమాధానమిచ్చింది కంప్యూటర్.

    వైట్ ఛానల్ గుండా ప్రయత్నించాడు. రెండు నిముషాల్లో ఆ  సంకేతాన్ని డీ-కోడ్ చేసింది కంప్యూటర్.  వాయుపుత్రకి మతిపోయింది. "పిల్లి అంటే మార్జాలం అన్నట్టుగా వుంది నీ తర్జుమా! ఇదేం తర్జుమా?" అన్నాడు. కంప్యూటర్ జవాబు చెప్పలేదు.

    ఈసారి బ్లూ ఛానెల్ ప్రయత్నించాడు. దాదాపు నాలుగు గంటలు ప్రయత్నించినా, ఏమీ రాలేదు. తరువాత గ్రీన్ లో ప్రయాసపడ్డాడు. వెంటనే వచ్చింది. కాని అది మరింత అయోమయంగా వుంది. "నా మొహంలా వుంది. ఇదేమిటి నిచ్చన మెట్లా- లేక అడవిలో నడుస్తున్న లేళ్ళగుంపు కాళ్ళా?"అని విసుక్కున్నాడు.

    "నాకు తెలియని భాష తీసుకువచ్చి నన్ను ఇబ్బంది పెడితేనేనేం చెయ్యను?" అన్నది కంప్యూటర్.

    ఇక ఇది లాభం లేదనుకుని బ్లాక్ ఛానెల్ ప్రయత్నించాడు. ఎంతోసేపు ప్రయత్నం చేశాడు. డీ- కోడ్ అవటం లేదు. టైమ్ చూసుకున్నాడు. వాచీ పదిన్నర చూపిస్తుంది ఉలిక్కిపడ్డాడు.

    గడియారం వెనక్కి తిరుగుతోంది!!! లేకపోతే - పదకొండింటికి పని ప్రారంభిస్తే పది అవ్వటం ఏమిటి అనుకుని కిటికీ లోంచి బయటకు చూస్తే చీకటి వెక్కిరిస్తుంది. తప్పు అర్థమైంది. రాత్రి ప....ది....న్న....ర.....మొత్తం పన్నెండు గంటలనుంచి ప్రయత్నిస్తున్నాడన్నమాట.

    ఆకలీ, నిద్ర అలాటివేమీ లేవు. యశ్వంత్ మాటలే చెవుల్లో మోగుతున్నాయి అటో ఇటో తేల్చుకోవాలని పట్టుదలతో వున్నాడు.

    -సరిగ్గా మూడున్నరకి అతడు ఆ కోడ్ ని సాధించగలిగాడు.  ముందు "కంగ్రాచ్యులేషన్స్" అన్న పదం కనపడింది.

    ఆ తరువాత- సుదూర తీరాల్నుంచి వచ్చి ఆ సంకేతపు నిజమైన అర్థాన్ని కంప్యూటర్ మానవభాషలోకి తర్జుమా చేసి చెప్పింది.

    కంగ్రాచ్యులేషన్స్ అని కనపడగానే, ప్రపంచంలో ఎవరు సాధించలేనిది సాధించినందుకు అతడు చిన్నపిల్లాడిలా గాలిలో గంతులు వేశాడు. తరువాత వచ్చిన ఒక్కొక్క  వాక్యమూ చదువుతూంటే అతడి పెదవుల మీద చిరునవ్వు మాయమైంది.

    తన కళ్ళని తనే నమ్మలేనట్టుగా ఆ కాగితం వైపు చూశాడు.

    దాన్ని అందుకుంటూ వుంటే , జీవితంలో మొట్టమొదటిసారి అతడి చేతులు వణకసాగాయి.


                                  5

    నిఖిల్ ప్రేమించిన అమ్మాయి పేరు శ్రీజ.

    అతడు ఆర్కిటికా వెళ్లబోయేముందు స్విట్జర్లాండులో వారం రోజులున్నాడు అతడి మేనమామ స్విస్ బ్యాంక్ లో ఫైనాన్సు మేనేజరు. శ్రీజ ఆ మేనమామకూతురు.

    రక్త సంబంధం వున్న దగ్గర వాళ్ళని చేసుకుంటే వచ్చే దుష్పరిణామాలు అందరికీ తెలుసు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో మేనకోడల్ని చేసుకుంటాను అంటే అందరూ నవ్వుతారు. కానీ వచ్చిన చిక్కేమిటంటే విజ్ఞానంకంటే, వేదాంతంకంటే, ప్రేమ గొప్పది. దానిముందు ఏ తర్కమూ నిలవదు.

 Previous Page Next Page