ఇప్పుడతనికి ఉన్నట్టుండి జీవితం మీద ప్రేమ, ప్రాణం మీద తీపి పుట్టుకొచ్చాయి! నిండునూరేళ్ళూ బ్రతకవలెననే ఆశ అతనిలో వట వృక్షమయింది.
ఎప్పుడు చస్తానా, చావు ఇంకా రాలేదేమో అనుకునేవారే ఆ మృత్యువుకాస్తా ముంచుకు రాగానే ఇంకా బ్రతకాలని తాపత్రయపడతారు. అది మానవ సహజ నైజం!
ప్రస్తుతం తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడమా లేక ప్రభుత్వానికి లొంగిపోయి క్షమాభిక్ష కోరుకోవడమా అనే సందిగ్ధంలో పడ్డాడు 'శ్రీ'.
అతని మెదడు చెదపురుగుల పుట్ట అయింది. ఎటూ నిర్ణయించుకోలేక ఆలోచనల సుడిగుణ్ణంలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఇంతలో భారత ప్రభుత్వం మరల 'దేశ ద్రోహి శ్రీని పట్టి ఇచ్చిన వారికి ఏబది లక్షల రూపాయల బహుమతి' అంటూ ప్రకటించింది.
ఆ ప్రకటనలో అతని ఫోటో లేదు. కారణం అతనిని చూసిన వారెవ్వరూ లేరు. తెలిసినవారు అసలే లేరు.
అతనికోసం అప్పుడే పోలీసుల వేట ప్రారంభమయింది. అయితే, ఈపాటికే ఆలశ్యం అయింది, మరి !
అజ్ఞాతవాసానికి మొగ్గు చూపాడు 'శ్రీ'. ప్రభుత్వ ప్రకటన విడుదలకు ముందే అంతర్ధానమైపోయాడు!
కథలోకి__
ఆసియా ఖండం! దాని చరిత్ర రాజకీయ హత్యలతో రక్తసిక్త మయింది.
శ్రీలంక అధ్యక్షులు ప్రేమదాస హత్యతో ఇది పునరావృతమయింది. ఇదొక మృత్యుహేల...
'జాతిపిత' మహాత్మాగాంధీ కాలం నుంచి శక్తివంతులైన రాజకీయ నాయకులు దారుణ హత్యలకు గురికావడం భారత ఉపఖండంలో సర్వసాధారణమయింది.
1948 జనవరి 30వ తేదీన జరిగిన మహాత్ముని దారుణ హత్య. అప్పటికి అయిదున్నర నెలల క్రితమే స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న యావత్ భారతీయులను శోక సముద్రాన ముంచివేసింది. అహింసా జ్యోతి ఆరిపోయింది. కన్నీరిడని ప్రాణి లేదు...
1951 అక్టోబరు 16వ తేదీన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో ఆ దేశ ప్రధాని లియాకత్ ఆలీఖాన్ రావల్సింది. బహిరంగ సభలో ఉపన్యసిస్తుండగా హత్యకు గురయ్యారు.
1959 సెప్టెంబరు 25వ తేదీన శ్రీలంకలో ప్రధానమంత్రి సాలమన్ బండారు నాయకే గాంధీ మహాత్ముని తరహాలోనే నిహతులయ్యారు.
1975 ఆగష్టు 15వ తేదీన బంగ్లాదేశ్ అధ్యక్షులు షేక్ ముజిబుర్ రహ్మాన్ ను, ఆయన కుటుంబాన్ని తిరుగుబాటు చేసిన సైన్యం మట్టుపెట్టింది. ఆ తరువాత కొన్ని రోజులకు మేజర్ జనరల్ జియావుర్ రహ్మాన్ ఆ దేశ సాయుధ దళాల ప్రధానాధికారి పదవిని స్వీకరించారు. అదీ మృత్యుపాశమే అయింది...
1981 మే నెల 30వ తేదీన చిటగాంగ్ లో జియావుర్ రహ్మాన్ విడిది చేసిన గెస్ట్ హౌస్ మీద కుట్రదారులైన సైనికులు హటాత్తుగా జరిపిన దాడిలో రహ్మాన్, ఆయన అంగరక్షకులు ఎనమండుగురు మరణించారు.
1984 అక్టోబరు 31 వ తేదీ ఉదయానే జరిగిన భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్వసత్తాక ప్రతిపత్తిగల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక దేశాధినేత హత్యకు గురికావడం అదే ప్రధమం.
1991 మే నెల 21 వ తేదీన ఇందిరాగాంధి తనయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీ పెరంబుదూర్ లో లిబరేషన్ టైగర్స్ ఆత్మాహుతి దళ కార్యకర్త థాను బెల్టు బాంబును పేల్చి హత్యచేసింది. మానవ క్రౌర్యానికి అది పరాకాష్ట.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షులు జనరల్ జియావుర్ హక్ కూడా అంతుచిక్కని విమాన ప్రమాదంలో మరణించారు.
ఇప్పుడు భారతావని మరొక నేతను పోగొట్టుకుంది...అదీ విదేశంలో...
వాషింగ్టన్ లో విషాదం గూడు కట్టుకుంది.
అమెరికా ప్రభుత్వం సంతాపదినాలను ప్రకటించి, తమ జాతీయ జండాను అవనతం చేసింది.
రేడియో, టెలివిజన్ లకు చెందిన అన్ని చానల్స్ లోను ప్రకటిత కార్యక్రమాలను రద్దు చేసుకుని, వాటి స్థానే విషాద సంగీతాన్ని వినిపిస్తున్నారు.
అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం దగ్గర అధికార అనధికార ప్రముఖులు బారులుతీరి వున్నారు.
అమెరికన్ ప్రెసిడెంటు, సెనెట్ సభ్యులు విషణ్ణ వదనులయ్యారు.
శాంతికాముక భారతదేశంలో అతి ప్రతిష్ఠాకరమైన పదివిని అలంకరించిన ప్రధాని శ్రీ అమరేంద్ర తమ దేశంలో అసువులుబాయడం తమకు చెరగని అపకీర్తిగా భావిస్తున్నారు అమెరికన్లు.
అశేష జనవాహిని చూస్తుండగా, భారత ప్రధాని అమరేంద్ర భౌతికకాయాన్ని సర్వ రాజలాంఛనాలలో ప్రత్యేక విమానంలోకి చేర్చారు.