Previous Page Next Page 


    చిన్నగా నవ్వుకుని ఒకసారి టింకూ బుగ్గలు నులిమి ఎత్తుకుని నర్సింగ్ హోమ్ లోకి వెళ్ళింది కృష్ణప్రియ.


                     *    *    *    *


    విజయనగర్ కాలనీలో  కుమార్ స్కూటర్ మీద ప్రదక్షిణ చేస్తున్నాడు.

    ఎదురయిన వాళ్ళందరినీ  తనకు కావలసినవాళ్ళ అడ్రస్ అడుగుతున్నాడు.

    లైన్ నంబరు, డోర్ నంబరు తెలియదు__అయితే చేస్తున్న వృత్తినిబట్టి  అడ్రస్ తెలుసుకోవడం ఏమంత కష్టమైన పని కాదనుకున్నాడు.

    "పేరూ, చేస్తున్న పనినిబట్టి అడ్రస్ తెలిస్తే... ఈ లైన్ నంబర్లు, డోర్ నంబర్లు ఎందుకు?" అని ఒకళ్ళిద్దరు అతని మొహంమీదే అన్నారు.

    కాలనీ చివర మెయిన్ రోడ్డు మలుపు తిరిగింది.

    కుమార్ మలుపు దగ్గరకు రాగానే రోడ్డుపక్కన పార్క్ చేసివున్న ఫియట్ కారు కనిపించింది. అతని ముఖంలో తను గెలిచానన్న భావం వ్యక్తమయింది.

    స్కూటర్ ను కారువెనకే పార్క్ చేసి కాంపౌండ్ గేటుకువున్న బోర్డ్ చూశాడు.

    డా|| కృష్ణప్రియ...ఏం.డి...

    సైక్రియాట్రిస్ట్.

    భవనం కాంపౌండ్ వాల్ మరీ ఎత్తుగా లేదు. వరండా స్పష్టంగా కనబడుతున్నది.

    కాపౌండ్ వాల్ మీద అక్కడక్కడ పూలకుండీలు  వున్నాయి. అప్పుడే విచ్చుకుంటున్న రంగురంగుల గులాబీ మొగ్గలు నిద్రిస్తున్న కోరికలను మేల్కొలిపేలా క్రొంగ్రొత్త అందాలను విరజిమ్ముతున్నాయి.

    వరండాలో టీపాయ్... దానిచుట్టూ నాలుగు కుర్చీలు...

    వరండా బయట కట్టేసివున్న జర్మన్ షెపర్డు అరవడంతో పని అమ్మాయి బయటకు వచ్చి కాలింగ్ బెల్ నొక్కకుండా  అక్కడే నుంచునివున్న కుమార్ ను వింతగా చూసింది.

    "ప్రియా వున్నదా?"

    కుమార్ సంబోధనకు క్షణం అనుమానంగా చిరాగ్గా చూసి... "వున్నారు...ఇంతకూ మీరెవరు?" అన్నది.

    "నేనెవరయితే  నీకెందుకు?" విసుగ్గా అంటూ ఇంట్లోకి వెళ్ళబోయాడు.

    "పిల్చుకు వస్తాను, కూర్చోండి..." ఖంగారుగా దారికి అడ్డుపడుతూ అన్నది పనమ్మాయి.

    "నువ్వేమీ పిలవక్కరలేదు...ఏ గదిలోవున్నది?" తను ఆమెకు కావలసిన వాడినన్న  భావం అతని మాటలలో స్పురించింది.

    క్షణం సంశయించి "బెడ్ రూమ్ లో వున్నారు..." అని చెప్పి అడ్డు తప్పుకున్నది ఆ అమ్మి.

    అప్పుడే టింకూకి టెంపరేచర్ చూసింది కృష్ణప్రియ. నార్మల్ గా వుంది. రోజూ చేస్తున్న కోర్సు ఆపి, ఈసారి బికాంప్లెక్స్ ఇంజెక్షన్ చేసింది.

    అంతకుముందు కోర్స్ అయిపోయినందుకు  టింకూ చిన్నగా నవ్వాడు.

    డోర్ దగ్గర ఎవరో వచ్చినట్టు శబ్దం అవ్వడంతో తలతిప్పి చూసింది.

    ఎదురుగా కనిపిస్తున్న కుమార్ ను చూడగానే తన అడ్రస్ ఎలా తెలిసిందాఅన్న ఆశ్చర్యం. మేనర్స్ మరచి సరాసరి తన బెడ్ రూంలోకే వచ్చినందుకు కోపం, తను గుర్తించేంతవరకు అతని ఉనికిని తెలియజేయనందుకు అసహ్యం ఒక్కసారిగా కలిగాయి కృష్ణప్రియకు.

    "గుడీవినింగ్ ప్రియా! బాగున్నావా? నిన్ను చూసి రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఏమిటి విశేషాలు?"

    ప్రశ్నమీద ప్రశ్నవేస్తూ హడావుడి చేశాడు కుమార్.

    "నీ ప్రశ్నలన్నింటికీ సావధానంగా సమాధానం చెబుతాను "ముందుకూర్చో కుమార్" అంటూ కుర్చీ చూపించింది.

    పరిస్థితిని గ్రహించి కూర్చున్నాడు కుమార్.

    టింకూ చేత జ్యూస్  తాగించి చేతులు కడుక్కుని వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది కృష్ణప్రియ.

    "ఇప్పుడు చెప్పు కుమార్! బాగానే వున్నాను! ఖాళీగా కూర్చోవడం దేనికని ఎం.డి. అవ్వగానే ప్రాక్టీసు పెట్టాను. బైదిబై... నువ్వు హైదరాబాద్ ఎప్పుడు  వచ్చావు. స్టేట్స్ లో సెటిల్ అవుతావని విన్నాను!__" ఆశ్చర్యంగా అడిగింది.

 Previous Page Next Page